కరోనావైరస్: ఏపీలోని కొన్ని జిల్లాల్లో కేసులు ఎక్కువ, డాక్టర్లు తక్కువ... ఎందుకిలా? చంద్రబాబు విమర్శలపై ప్రభుత్వం ఏమంటోంది?

జగన్
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనావైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలూ కొనసాగుతున్నాయి. తాజాగా కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. క‌రోనా నియంత్ర‌ణ కోసం వైద్య సేవ‌లందిస్తున్న సిబ్బంది కేటాయింపులో జిల్లాల మధ్య వ్య‌త్యాసాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

కేటాయింపుల్లో ఎక్కువ కేసులు ఉన్న జిల్లాలకు తక్కువ మంది సిబ్బందిని కేటాయించి, విశాఖ జిల్లాకు మాత్రం ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కానీ, చంద్రబాబునాయుడు వ్యాఖ్య‌ల‌ను అధికార ప‌క్షం త‌ప్పుబ‌డుతోంది. స‌మ‌గ్ర దృక్ప‌థంతోనే సిబ్బందిని కేటాయించామ‌ని చెబుతోంది.

ఈ నేపథ్యంలో అసలు ఏ జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయో, ఎంత మంది సిబ్బంది ఉన్నారో చూద్దాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇవీ ఆ వివరాలు:

కరోనా

వైద్య సిబ్బందికి సంబంధించిన లెక్క‌ల‌న్నీ ఏప్రిల్ 14న ప్ర‌భుత్వం అధికారికంగా విడుద‌ల చేసిన కోవిడ్ 19 మీడియా బులిటెన్ 122లో పేర్కొన్న‌వే.

కేసులు సంఖ్య విషయంలో గుంటూరు, కర్నూలు జిల్లాలు ముందున్నా, వైద్య సిబ్బంది విషయంలో మాత్రం విశాఖ ముందుంది.

ఏప్రిల్ 17 ఉద‌యానికి కర్నూలు, గుంటూరు జిల్లాలో చెరో 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. ఇప్ప‌టికే వాటిని కేంద్రం కూడా గ్రీన్ జోన్లుగా గుర్తించింది.

ఆ త‌ర్వాత తూర్పు గోదావ‌రి, విశాఖ జిల్లాల్లో అత్య‌ల్ప కేసులు న‌మోద‌య్యాయి. కానీ సిబ్బంది ప‌రంగా చూస్తే విశాఖ‌లో అత్య‌ధికంగా వైద్యుల‌(2,771)తో పాటుగా, ఇత‌ర సిబ్బంది(9624) కూడా ఉన్నారు. అదే స‌మ‌యంలో క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాల్లో అత్య‌ల్పంగా ఉన్నారు.

క‌డ‌ప‌లో కేవ‌లం 8 మంది వైద్యులు ఉన్న‌ట్టు నివేదిక‌లో పేర్కొన్నారు. ఇత‌ర స‌హాయ‌క సిబ్బంది సంఖ్య 6 అని పేర్కొన్నారు. కానీ, కడపలో 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

క‌ర్నూలులో కూడా 50 మంది వైద్యులు, 50 మంది సిబ్బంది సేవ‌లందిస్తున్నార‌ని ఆ నివేదిక‌లో పేర్కొన‌డ‌మే ఇప్పుడు వివాదంగా మారుతోంది. ఆ సంఖ్య మొత్తం కలిపినా అక్కడ నమోదైన కేసుల సంఖ్య అంత కూడా లేదు.

విజయవాడ

విశాఖలో క్వారంటైన్ కేంద్రాలు తక్కువే

క్వారంటైన్ కేంద్రాల సంఖ్య రీత్యా చూసినా ఏపీలో అత్య‌ధికంగా నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఆ జిల్లాలో 50 కేంద్రాలు నిర్వ‌హిస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 34, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 39, అనంత‌పురంలో 35 కేంద్రాలు న‌డుపుతున్నారు. ఇక తూర్పు గోదావ‌రిలో 2, విశాఖ‌లో 7 కేంద్రాలను మాత్ర‌మే క్వారంటైన్‌కు వినియోగిస్తున్నారు.

అనుమానితుల‌కు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు చూస్తే అత్య‌ధికంగా గుంటూరులో 1373 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 1279 మందికి, నెల్లూరులో 1058 మందికి, చిత్తూరులో 1051 మందికి చేశారు. విజ‌య‌న‌గ‌రంలో 261 మందిని, శ్రీకాకుళంలో 479 మందిని, విశాఖ‌లో 783 మందిని ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌రీక్షించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కోవిడ్ ఆస్పత్రులు... ఏ జిల్లాలో ఎన్ని?

ఏపీలో 4 జిల్లాల్లో రాష్ట్ర‌స్థాయి కోవిడ్ హాస్పిట‌ల్స్ ఉన్నాయి. అందులో కృష్ణా జిల్లాలో 600 బెడ్స్, విశాఖ‌లో 520 బెడ్స్, నెల్లూరులో 500 బెడ్స్, చిత్తూరులో 504 బెడ్స్ అందుబాటులో ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వాటితో పాటుగా జిల్లా స్థాయి కోవిడ్ హాస్పిట‌ల్స్‌ను ప్ర‌తీ జిల్లాలోనూ ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం మీద 8950 బెడ్స్ ఏర్పాటు చేసిన‌ట్టు ప్రభుత్వం తెలిపింది. అత్య‌ధికంగా గుంటూరులో వెయ్యి పడకలు ఉన్నాయి. నెల్లూరులో 250, అనంత‌పురంలో 300 బెడ్స్ మాత్ర‌మే ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook

ప్ర‌భుత్వ వైఫల్య‌మే అంటున్న చంద్ర‌బాబు

కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న చోట దానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బందిని నియ‌మించ‌క‌పోవ‌డం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మేన‌ని చంద్ర‌బాబు విమ‌ర్శిస్తున్నారు. తాజా ప‌రిణామాల‌పై టీడీపీ నేత‌ల‌తో ఆయ‌న మాట్లాడుతూ.. ''కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉన్న విశాఖ‌లో 58 శాతం మంది వైద్యులున్నారు. మిగిలిన రాష్ట్ర‌మంతా క‌లిపి 42 శాత‌మే ఉన్నారు. అస‌లు కేసులే లేని జిల్లాల్లో కూడా ఎక్కువ మంది డాక్ట‌ర్లు ఉన్నారు.

క‌ర్నూలులో ఎక్కువ కేసులు ఉంటే చాలా త‌క్కువ మంది డాక్ట‌ర్లున్నారు. ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణా లోపానికి, అస‌మ‌ర్థ‌త‌కు ఈ లెక్క‌లే నిద‌ర్శ‌నం. క‌ర్నూలు, గుంటూరు , కృష్ణా జిల్లాల్లో మ‌ర‌ణించిన వారి వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌డం లేదు. క‌రోనా మృతుల వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా అంత్య‌క్రియ‌ల త‌ర్వాత పాజిటివ్ అంటూ బ‌య‌ట‌పెడుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అంత్య‌క్రియ‌ల‌కు హాజరైన వారు కూడా ఆందోళన‌ చెందాల్సి వ‌స్తోంది'' అంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

మంత్రులు ఏపీ

'వైద్యులకు కొరత లేదు'

ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం కరోనా నియంత్ర‌ణ విధుల్లో ఉన్న వైద్యుల సంఖ్య 50 మందిగా పేర్కొన్న‌ప్ప‌టికీ అది స‌రికాదంటున్నారు క‌ర్నూలు డీఎం అండ్ హెచ్ఓ రామ‌సుబ్బ‌య్య‌. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వైద్యులు, సిబ్బంది పూర్తిగా క‌రోనా విధుల్లోనే ఉన్నారు.

అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌భుత్వ‌, ప్రైవేటు వైద్యులు కూడా ఇత‌ర సేవ‌లకు వెళ్ల‌డం లేదు. పీజీలు కూడా ఇదే ప‌నిలో ఉన్నారు. క‌ర్నూలు జిల్లాలో పీహెచ్ సీ స్థాయి నుంచి పోల్చుకుంటే వెయ్యి మందికి పైనే వైద్యులున్నారు. కోవిడ్ ఆసుప‌త్రుల్లో కూడా స‌రిప‌డా సంఖ్య‌లో విధులు నిర్వ‌హిస్తున్నారు. మూడు షిఫ్టుల్లోనూ సిబ్బంది గానీ, వైద్యులకు గానీ లోటు లేదు. సంఖ్య ఎంత అనేది వివ‌రాలు అందుబాటులో లేవు గానీ 50మంది మాత్ర‌మే సేవ‌లందిస్తున్నార‌న‌డం స‌మంజ‌సం కాదు'' అని ఆయ‌న తెలిపారు.

డీఎంఅండ్ హెచ్‌ఓ వివ‌ర‌ణ‌పై స్పంద‌న కోసం కోవిడ్ 19 నోడ‌ల్ ఆఫీస‌ర్‌గా ఉన్న అర్జా శ్రీకాంత్ వివ‌ర‌ణ కోసం బీబీసీ ప్ర‌య‌త్నించింది. కానీ ఆయ‌న స్పందించ‌లేదు.

అద‌నంగా డాక్ట‌ర్ల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్

ఏపీలో ప్ర‌స్తుతం వైద్య సేవ‌ల‌కు ఎటువంటి ఆటంకాలు లేవ‌ని వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ 'రాష్ట్రంలో వైద్య స‌దుపాయాలకు గానీ, వైద్య సిబ్బందికి గానీ కొర‌త లేదు. అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా అద‌న‌పు సిబ్బంది కోసం కూడా ప్ర‌య‌త్నిస్తున్నాం.

ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ ఇచ్చాం. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నాం. స్పెష‌లిస్టులు, జ‌న‌ర‌ల్ డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కాలు చేప‌ట్టాం. ఇప్ప‌టికే టెస్టింగ్ కిట్లు సిద్ధ‌మ‌వుతున్నాయి. పీపీఈలు అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా త‌యార‌వుతున్నాయి. మాస్కుల పంపిణీ కూడా చేప‌ట్టాం. క‌రోనా నియంత్ర‌ణ విష‌యంలో చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు అర్థం లేదు. రాష్ట్రంలో జ‌న‌సాంద్రత ప్రాతిపదికన వైద్యులున్నారు. మెడిక‌ల్ కాలేజీలు , ఇత‌ర ప‌రిస్థితుల రీత్యా కొన్ని చోట్ల ఎక్కువ‌గా ఉంటారు. వైద్యులు ఎక్కువ‌గా ఉంటే నేరం అన్న‌ట్టుగా మాట్లాడ‌డం స‌రికాదు. అన్ని జిల్లాల్లోనూ స్వ‌యంగా స‌మీక్షలు చేశాం. అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాలు అందిస్తున్నాం' అని వివ‌రించారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)