భారత్, చైనా ఘర్షణల తరువాత లేహ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి: గ్రౌండ్ రిపోర్ట్

లేహ్

ఫొటో సోర్స్, ARIF RADHU/BBC

    • రచయిత, అమీర్ పీర్జాదా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణంగా పర్యటకులతో రద్దీగా ఉండే లేహ్ ప్రాంతం కరోనావైరస్ వల్ల నిర్మానుష్యంగా మారిపోయింది.

చదరపు కిలోమీటరుకు సగటున ముగ్గురు జనాభా ఉండే లేహ్‌లో జూన్ 21 నాటికి 212 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారతదేశం - చైనా మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు ఈ ప్రాంతవాసుల భయాలను మరింత పెంచాయి.

వాస్తవాధీన రేఖ వద్ద ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించడానికి గురువారం లేహ్‌లోని లద్దాఖ్ బుద్దిస్ట్ అసోసియేషన్ ప్రయత్నించింది. అయితే కోవిడ్ 19 నిబంధనలు అమలులో ఉండటం కారణంగా అధికారులు వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

లేహ్ నుంచి గల్వాన్ లోయ, పాంగాంగ్ ప్రాంతానికి వెళ్లే దారులన్నిటినీ మూసివేశారు. కోవిడ్ కారణంగా ఈ నిర్బంధాన్ని విధించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతానికి మీడియాకి చెందిన వారిని మాత్రమే పంపించటం లేదని లేహ్ ప్రాంత బిజెపి అధ్యక్షుడు దోర్జీ ఆంగ్చుక్ ‘బీబీసీ’కి చెప్పారు.

లేహ్‌లో చాలా మంది స్థానికులకు గల్వాన్ లోయలో ఏమి జరిగిందో తెలియదు.

గత కొన్ని వారాల నుంచి భారతదేశం వైపు ఉండే వాస్తవాధీన రేఖ దగ్గర సమాచార వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశారు.

లేహ్

ఫొటో సోర్స్, ARIF RADHU/BBC

భారత ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత అనిశ్చితి నెలకొంది

ప్రధాన మంత్రి మోదీ “భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని” చెప్పిన తర్వాత దేశమంతా ఒక చర్చ మొదలైంది.

"చైనా సేనలు భారత భూభాగంలోకి అడుగు పెట్టకపోతే ఇంత మంది సైన్యం బలగాలను ఇక్కడెందుకు మెహరిస్తున్నారని” గల్వాన్ లోయ పక్కనే ఉన్న దుర్బోక్ ప్రాంతంలో కౌన్సిలర్ గా పని చేసిన నాంగ్యల్ దుర్బోక్ ప్రశ్నించారు.

“ప్రధాని ఇక్కడ ఎవరూ అడుగు పెట్టలేదని చెప్పవచ్చు కానీ, అడుగు పెట్టారని మా గ్రామస్థులకు అయితే తెలుసు. గల్వాన్ లోయలో మా గుర్రాలను మేతకి తీసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చైనీయులు నియంత్రిస్తున్నారు. దీనర్థం ఏమిటి?”

"భారత్, చైనాల మధ్య ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో సరిహద్దుల నిర్ణయం జరగకపోవటం వలన భారత్, చైనా సేనలు రెండూ ఎల్ఏసి వద్ద కాపలా కాస్తూ ఉంటాయి. కొన్ని సార్లు మన సైనికులు వారి వైపు వెళ్తే, ఇంకొన్ని సార్లు చైనా సేనలు మన వైపు వస్తాయని” ఆంగ్ చుక్ అన్నారు.

అలాంటి సమయాల్లోనే ఘర్షణలు తలెత్తుతాయని అన్నారు. "గాల్వాన్ లో మనం 20 మంది సైనికులను కోల్పోయాం. ఏ ఘర్షణా, కలహము లేకపోతే వీరి ప్రాణాలు ఎలా పోయాయని”, 1999 లో పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు కల్నల్ సోనమ్ వాంగ్ ఛుక్ ప్రశ్నించారు.

ప్రధాని వ్యాఖ్యల పట్ల అనిశ్చితి, ఆగ్రహం, నెలకొన్న తరువాత ఆ మరుసటి రోజే ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

చైనా సేనలు ఎల్ఏసీ వద్ద భారీ సంఖ్యలో మోహరించాయని, భారత ప్రతిస్పందన కూడా అంతే స్థాయిలో ఉందని కూడా అఖిల పక్ష భేటిలో చెప్పారని ఈ ప్రకటన వెల్లడించింది. ‘‘ఎల్ఏసీ ఉల్లంఘనల విషయానికి వస్తే, జూన్ 15న చైనా తన భూభాగంలో ఎల్ఏసీ వెంబడి నిర్మాణాలు చేపడుతోందని, ఆ చర్యలను నిలిపివేయడానికి వారు తిరస్కరించడం వల్ గల్వాన్ హింస జరిగిందని కూడా ప్రధాని స్పష్టం చేశారని” ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

వాస్తవాధీన రేఖ వద్ద నివసించే అధిక ప్రజలు పశువుల పెంపకం పై ఆధారపడి జీవిస్తారు. చైనా ఈ ప్రాంతంలోకి చొరబడటం వలన, వారి పశువులను మేపుకునే భూభాగాన్ని కోల్పోతామేమోననే విచారంలో ఉన్నారు.

"గత కొన్ని సంవత్సరాలుగా చైనా భారత భూభాగంలోకి చొరబడుతోంది. చాంగ్ తాంగ్ తెగకి చెందిన మేము ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. మా మాటని ఎవరూ వినలేదని" దుర్బోక్ అన్నారు.

లేహ్

ఫొటో సోర్స్, ARIF RADHU/BBC

ఇక్కడ ప్రతీ ప్రాంతం కౌన్సిలర్లుగా ఎన్నికయిన ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సభ్యుల కౌన్సిల్ ని లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, (ఎల్ ఏ ఎచ్ డి సి) అని అంటారు.

ఈ ప్రాంతంలో జరిగే అన్ని అభివృద్ధి పనులకు ఈ కౌన్సిల్ బాధ్యత వహిస్తుంది.

గాల్వాన్, పాంగాంగ్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు, ఈ ప్రాంతంలో సమాచార వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతూ లద్దాఖ్ డివిజనల్ కమీషనర్ కి రాసిన లేఖని బీబీసీ పరిశీలించింది.

"ఇండియా చైనా సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఆ ప్రాంతమంతా సమాచార వ్యవస్థని పూర్తిగా స్తంభింపచేసినట్లు” ఆ లేఖలో రాశారు.

గత 20 రోజులుగా బిఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేశారని , దీంతో ఈ ప్రాంతంలో ఉన్న 17 గ్రామాలలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఈ లేఖలో పేర్కొన్నారు.

కోవిడ్ లాక్ డౌన్ వలన విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు హాజరవ్వడానికి సమాచార వ్యవస్థ అవసరమని రాశారు.

ఈ అంశాన్ని సైనికాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు లద్దాఖ్ డివిజనల్ కమీషనర్ సౌగత్ బిస్వాస్ చెప్పారు.

ఈ ప్రాంతాలలో సమాచార వ్యవస్థని బి ఎస్ ఎన్ ఎల్ అందిస్తున్నప్పటికీ సేవలను అందించే అధికారాలు సైన్యం అధీనంలో ఉందని తెలిపారు.

టెలికమ్యూనికేషన్ల పునరుద్ధరణ కోరుతూ లేఖ

ఫొటో సోర్స్, LEH ADMINISTRATION

ఎలిహాడ్ జార్జ్ 1962 లో చైనా భారత యుద్ధంలో పోరాడిన లద్దాఖ్ ప్రాంత వాసి. ఆయన చిన్న కొడుకు కూడా భారత సైన్యం లో పాంగాంగ్ ప్రాంతంలో పని చేస్తున్నారు.

"చైనా కి ఇండియా కి ఉద్రిక్తతలు నెలకొన్న వెంటనే మా అబ్బాయిని ఆ ప్రాంతంలోకి పంపించారు. సమాచార వ్యవస్థ ఆగిపోవడంతో మా అబ్బాయితో మాట్లాడలేదు.

గాల్వాన్ లోయ, పాంగాంగ్ నదీ తీరంలో నివసించే కొంత మంది గ్రామస్థులను సరుకుల కోసం లెహ్ వచ్చినప్పుడు వారిని కలిశానని స్థానిక వ్యాపారి సెరిన్గ్ నాంగ్యల్ చెప్పారు. ష్యోక్ నుంచి దుర్బోక్ వెంబడి సైన్యాన్ని భారీగా మెహరించారని గ్రామస్థులు చెప్పినట్లు తెలిపారు.

ఇండియా చైనా ఘర్షణల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన దగ్గర నుంచి భారత సైన్యానికి చెందిన ఫైటర్ జెట్లు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ తలెత్తే పరిస్థితికి స్థానికులు సంసిద్ధం గా ఉన్నట్లు తెలిపారు. వారు భారత సైన్యానికి మద్దతిస్తామని చెప్పారు.

లేహ్

ఫొటో సోర్స్, ARIF RADHU/BBC

"ఇలాంటి పరిస్థితులను మేమెన్నో సార్లు చూసాం. మేము సైన్యానికి మద్దతిస్తాం. గాల్వాన్ లోయలో మా ప్రాంతానికి చెందిన కార్మికులు సైన్యంతో కలిసి పని చేస్తున్నారని” దుర్బోక్ చెప్పారు.

1999 లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా లద్ధాక్ ప్రాంత వాసులు సైన్యానికి సహాయం చేశారని తెలిపారు.

స్థానిక పత్రకారుడు నిస్సార్ అహ్మద్ ఆ సమయంలో పని చేసిన ఒక స్వచ్చంద సంస్థతో కలిసి పని చేశారు.

"మేము 25 మంది సైన్యానికి స్వచ్చందంగా సహాయం చేసాం. వారికి కావాల్సిన సరుకులు, ఆహార పదార్ధాలు, ఆయుధాలు ఎత్తైన ప్రాంతాలలో ఉండే సైనిక పోస్టుల దగ్గరకు తీసుకుని వెళ్లేవారిమని చెప్పారు.

ఆ సమయంలో సైన్యానికి సహాయం చేయడానికి ప్రతి గ్రామం నుంచి ప్రజలు వచ్చేవారని తెలిపారు.

భారత చైనా వాస్తవాధీన రేఖ నదులు, మంచు పర్వతాలు, హిమానీ నదాలతో కూడుకుని ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

అలాంటి ప్రాంతాలలో పని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం ఉంటుంది. ఈ ప్రాంతాలకు సైన్యాన్ని పంపే ముందు ఈ వాతావరణానికి వారు అలవాటు పడాలి. ఈ శిక్షణ మూడు స్థాయిలలో ఇస్తారు.

ఆ తర్వాత సైనికులు నెల రోజుల పాటు శిక్షణ కి వెళ్ళాలి. ఆ తర్వాతే ఆ ప్రాంతానికి పంపిస్తారు.

మైదాన ప్రాంతాలలో యుద్ధం జరిగితే యుద్ధ భూమి విశాలంగా ఉండటం వలన యుద్ధ సామాగ్రిని, ట్యాంకులను తేవడం సులభమవుతుంది, కానీ, ఇలాంటి ఎత్తైన పర్వత ప్రాంతాలలో యుద్ధం చేయడం వలన యుద్ధ పరికరాలు తెచ్చుకోవడం చాలా కష్టమైపోతుందని అలాంటి ప్రాంతాల్లో అనేక సార్లు చిన్న చిన్న యుద్ధాలలో పాల్గొన్న సోనమ్ అన్నారు.,

ఇక్కడ వాతావరణం పొడిగా, గాలి తేలికగా ఉండి, త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పారు.

ఈ ప్రాంతాలలో యుద్ధానికి ప్రత్యేకమైన యుద్ధ సామగ్రి అవసరమవుతుందని తెలిపారు.

"మన దగ్గర సరైన యుద్ధ సామగ్రి, తగినంత మంది సైనికులు లేకపోవడం వలనే 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఒక కారణమని” అన్నారు.

"20 మంది భారతీయ సైనికులు మరణించడం చాలా దురదృష్టకరమని, ఇది తనకెంతో విచారాన్ని కలిగిస్తోందని అన్నారు. భారతదేశం ఇప్పటికైనా తగిన విధంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని, లేదంటే చైనా భారత భూభాగంలోకి చొరబడుతూనే ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)