భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ ఘర్షణలపై వ్యాపిస్తున్న ఫేక్ వార్తలివే...

భారత్ - చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లో చైనా వ్యతిరేక నిరసనల్లో వెల్లువెత్తుతున్న భావోద్వేగాలు
    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇదే వారం హిమాలయాల్లోని వివాదిత గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత సోషల్ మీడియాలో తప్పుదారిపట్టించే వార్తలు, వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

గల్వాన్ లోయలో తాజాగా దాడులకు సంబంధించివిగా చెబుతూ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఎన్నో పొటోలు, వీడియోలకు అసలు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని మేం గుర్తించాం.

1.గొడవ పడుతున్న సైనికుల వీడియో

ఫేక్ వీడియో

గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల 'అసలు' వీడియో ఇదేనంటూ యూట్యూబ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ రిపోర్ట్ రాసేవరకూ ఈ వీడియోను యూట్యూబ్‌లో 21 వేల మందికిపైగా చూశారు. దీన్ని చాలామంది ట్విటర్‌లో కూడా షేర్ చేశారు.

కొందరు ఆ వీడియోతోపాటూ భారత సైనికులు చైనా సైనికులను నెడుతున్నారు అని చెప్పారు. అయితే, ఈ వీడియో పగలు తీసింది. కానీ గల్వాన్ లోయ దగ్గర ఘర్షణ రాత్రి జరిగింది.

ఇదే వీడియోను 2017 ఆగస్టులో, 2019 సెప్టెంబర్‌లో కూడా పోస్ట్ చేసినట్లు మేం గుర్తించాం. ప్రతిసారీ దీనిని చైనా, భారత్ దళాల మధ్య జరిగిన ఘర్షణగా చెప్పారు.

ఫేక్ వీడియో

2.మృతుల దగ్గర విషాదంలో భారత సైనికులు

సోషల్ మీడియాలో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో భారత సైనికులు భావోద్వేగంతో కనిపిస్తారు. ఈ వీడియోలో ఒక బాడీ బ్యాగ్ కూడా కనిపిస్తుంటుంది.

కొంతమంది దానిని గత వారం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలకు లింకు పెట్టి షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియో కశ్మీర్‌లో ఏడాది క్రితం జరిగిన ఘటనకు సంబంధించినది. సాయుధ మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి కూడా నష్టం జరిగింది. ప్రస్తుత ఘటనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు.

ఫేక్ వీడియో

3.సైనికాధికారుల మధ్య వాగ్వాదం

భారత-చైనా ఆర్మీ అధికారుల మధ్య వాగ్వాదం వీడియో ఒకటి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీన్ని ఇప్పటికే కొన్ని వేల మంది చూశారు.

ఈ వీడియోలో చైనా అధికారి భారత అధికారితో ‘మీరు వెనక్కు వెళ్లండి’ అని చెబుతుంటాడు.

దీనిని చైనీస్ టిక్‌టాక్ వెబ్‌సైట్‌లో కూడా పోస్ట్ చేశారు. అక్కడ దీనిని 33 వేల మందికి పైగా లైక్ చేసారు.

ఈ వీడియోను విపక్ష కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు కూడా రీట్వీట్ చేశారు. అయితే, ఈ వీడియోను అంతకు ముందు మే నెలలో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇదే వీడియోను ఈ ఏడాది జనవరిలో యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని బట్టి అది లద్దాఖ్ కాదని స్పష్టంగా తెలుస్తోంది.

మేం ఈ వీడియోను ఏ ప్రాంతంలో తీశారో కచ్చితంగా చెప్పలేం. కానీ ఇది లద్దాఖ్‌కు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అరుణాచల్ ప్రదేశ్‌లో తీసినట్లు తెలుస్తోంది.

ఫేక్ వీడియో

4.భారత జవాన్ అంత్యక్రియలు

భారత సైనికుడి అంత్యక్రియల వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో సైనికులు నినాదాలు చేయడం కూడా వినిపిస్తోంది.

40 వేలకు పైగా చూసిన ఈ వీడియోను కూడా గల్వాన్‌ లోయ ఘర్షణకు సంబంధించినదిగా చెబుతున్నారు. ఇందులో భారత సైన్యాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే, ఈ వీడియోకు జూన్ 16న గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు ఎలాంటి సంబంధం లేదు.

రివర్స్ సెర్చ్ ద్వారా ఇదే ఏడాది మేలో యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోను పోస్ట్ చేసినట్టు మేం గుర్తించాం.

ఈ వీడియోలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడి పేరు కూడా వినిపిస్తోంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఆ సైనికుడు లేహ్-లద్దాఖ్‌లో మే నెలలో జరిగిన ఒక ప్రమాదంలో చనిపోయినట్లు తెలిసింది.

ఆ సైనికుడి మృతదేహానికి మహారాష్ట్రలోని అతడి స్వస్థలంలో అంత్యక్రియలు జరిగాయి. అక్కడ అతడికి సైనికులు సెల్యూట్ చేస్తున్న సమయంలోదే ఈ వీడియో.

ఫేక్ వీడియో
ఫొటో క్యాప్షన్, దేశం పేరు తప్పుగా వేసిన వీడియా స్క్రీన్ షాట్

5.శవపేటికలు, శవాలు కనిపిస్తున్న ఫొటోలు

చైనా భాషలో ప్రచురించిన ఒక కథనంలో ఇటీవల గల్వాన్ లోయలో చైనా-భారత్ ఘర్షణలో చనిపోయిన భారత సైనికుల మృతదేహాలుగా చెబుతూ కొన్ని ఫొటోలను ప్రచురించారు.

ఆ ఆర్టికల్‌ను లక్ష మందికి పైనే చదివారు. ఇలాంటి ఆర్టికల్ ఒకటి పాకిస్తాన్ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించారు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కూడా షేర్ అవుతున్నాయి. అయితే గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ ఫొటోలు 2015లో నైజీరియాలో జరిగిన దాడికి సంబంధించినవిగా గుర్తించాం. ఆ దాడిలో బోకో హరామ్ మిలిటెంట్లు నైజీరియా సైనికులను చంపేశారు.

ఇదే ఆర్టికల్‌లో ప్రచురించిన మరో ఫొటోలో ఆర్మీ శవపేటికలు కనిపిస్తుంటాయి. ఈ ఫొటో 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో భారత సైనికులపై జరిగిన దాడికి సంబంధించినది.

Banner
Reality Check branding

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)