కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
- రచయిత, వందన
- హోదా, బీబీసీ భారతీయ భాషల టీవీ ఎడిటర్
కరనావైరస్ దెబ్బకు కుదైలన రంగాల్లో వినోద రంగం కూడా ఒక్కటి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో మళ్లీ థియేటర్లు తెరిచేలా కనిపించడం లేదు. ఆడిటోరియంల్లో సంగీత విభావరులకు అవకాశం లేదు. అదే సమయంలో వినోద పరిశ్రమ ప్రేక్షకుల్ని చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ వినోదరంగం రూపు రేఖలు ఎలా ఉండబోతున్నాయి?
భారత్‌లోనే అతి పెద్ద క్విజ్ షో.. కౌన్ బనేగా కరోడ్ పతి మళ్లీ మనల్ని టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టబోతోంది. అయితే ఈ సారి సరికొత్త డిజిటల్ అవతారంలో. అందుకు కారణం కరోనావైరస్, భౌతిక దూరం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
గడిచిన 20 ఏళ్లుగా అత్యుత్తమమైన టీవీ కార్యక్రమాల్లో కేబీసీ కూడా ఒకటి. అందులో పాల్గొనే సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రావడం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆ క్విజ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ఇదంతా ఓ పెద్ద తతంగం.
అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇందులో పాల్గొన్న వాళ్లంతా టీవీ ఛానెల్ యాప్ ద్వారా ఆడిషన్స్ ఇచ్చారు. ఇక చివరి రౌండ్ ఇంటర్వ్యూ వీడియో కాల్ ద్వారా జరుగుతుంది. చివరకు కేబీసీకి అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్న అమితాబ్ తన ప్రోమోను తానంతటతనే షూట్ చేసుకున్నారు.
దీనంతటికీ కారణం కరోనావైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లు. పరిమితికి మించి ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేకపోవడంతో వినోదరంగం రూపు రేఖలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి.
డిజిటల్ & ఓవర్ ది టాప్(ఓటీటీ) ప్లాట్ ఫాంలు
వీరాభిమానులకు తమ ఇష్టమైన హీరోలు, దర్శకుల సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలన్న ఉత్సాహం ముందు ఏదీ సరిపోదు.
కానీ ఈ సారి అమితాబ్ అభిమానులకు ఈ నెలలో విడుదలైన గులాబో-సితాబో సినిమాను చూసేందుకు థియేటర్ల ముందు పెద్ద పెద్ద క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేకపోయింది.
ఇంత కాలం వేచి చూసిన దర్శక, నిర్మాతలు మున్ముందు మరి కొన్ని నెలల వరకు థియేటర్లలో సినిమాలను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో గులాబో-సితాబో చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. విద్యాబాలన్ లేటెస్ట్ మూవీ శకుంతలాదేవి చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే త్వరలో విడుదల కానుంది. ఇటీవల తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన కీర్తి సురేష్ చిత్రం పెంగ్విన్ కూడా ఆ కోవకు చెందినదే.
“మేం మా వినియోగదారుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం. వారి ఇంటి ముంగిటకు అత్యుత్తమ సినిమా అనుభవాన్ని అందించడంలో ఇదో ముందడుగు” అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణ్యం బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
మొత్తంగా మన భవిష్యత్తు వినోదరంగం ఇప్పటికే మన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ టీవీల వరకు వచ్చేసింది.
భారత్‌లో వినోదరంగం అంటే సినిమాలే. సినిమా హాల్లో అందరూ కలిసి కూర్చొన్ని నవ్వడం, కలిసి చప్పట్లు కొట్టడం, అభిమాన హీరో వస్తే ఈలలు వేయడం, భావోద్వేగ సన్నివేశాలు ఎదురైనప్పుడు చేతి రుమాళ్లు తడసిపోయేలా నిశ్శబ్దంగానే కన్నీళ్లు పెట్టడం ఇలా అన్నింటికీ సినిమా హాలే వేదిక. వందలమంది ఉండే థియేటర్లో ఒకరికి ఒకరు తెలియకపోయినా ఆ రెండున్నర గంటల పాటు సినిమా అందర్నీ ఒక్కటి చేస్తుంది.
ఇప్పుడు కేవలం దర్శక, నిర్మాతలే కాదు ప్రేకక్షకులు కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొత్త దారులు వెతుకడం మొదలుపెట్టారు.
21 ఏళ్ల హర్షిత మెహతా లాక్ డౌన్ కారణంగా దిల్లీలో చిక్కుకొని పోయారు.
తన స్నేహితులతో కలిసి థియేటర్లలో సినిమాలు చూడలేకపోయిన ఆమె నెట్ ఫ్లిక్స్ పార్టీ ఆప్షన్ సాయంతో ఎంజాయ్ చేస్తున్నారు.
నెట్ ఫ్లిక్స్ కేవలం స్ట్రీమింగ్ మాత్రమే కాకుండా తమ చందాదారులు తమకు ఇష్టమైన షో లేదా సినిమాను వారు ఇష్టపడే వ్యక్తులతో కలిసి చూసేందుకు వీలుగా ఒకేసారి చూడటమే కాదు... అలా చూస్తూ లైవ్ ఛాట్ చేసే అవకాశం కూడా కల్పించింది.
అయితే అందరం కలిసి థియేటర్లో సినిమా చూస్తుంటే వచ్చే సంతోషానికి ఇది ప్రత్యామ్నాయం కాకపోయినా దాదాపు అదే ఎంజాయ్‌మెంట్ ఉంటోందని హర్షిత అభిప్రాయపడ్డారు. ‘‘థియేటర్లో కలిసి చప్పట్లు కొడతాం నవ్వుతాం, ఇక్కడైతే మన అభిప్రాయాన్ని టైప్ చేయ్యాలి లేదా, ఎమోజీల రూపంలో పంపించాలి అంతే తేడా’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
వినోద రంగంలో సరికొత్త శకం
గులాబో-సితాబో చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ ‘భారతీయ వినోద రంగంలో ఇది సరికొత్త శకానికి ఆరంభం’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఇక్కడ ప్రశ్నల్లా ఒక్కటే.. ఓటీటీ ప్లాట్ ఫాంల ద్వారా సినిమాను విడుదల చేయడం వల్ల ఆ చిత్రానికి.. థియేటర్లలో విడుదల చేయడం వల్ల ప్రేక్షకుల నుంచి వచ్చేంత ఆదరణ, ఆదాయం రెండూ వస్తాయా అని.
గులాబో చిత్రాన్ని ప్రైమ్ వీడియో ప్లాట్ ఫాంల ద్వారా దాదాపు 200 దేశాల్లో విడుదల చేశారు. తద్వారా గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యిందన్నది అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ వాదన.
బాలీవుడ్ ధైర్యానికి ఇది నిదర్శనమంటూ ప్రముఖ సినీ విమర్శకులు శుభ్ర గుప్త ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
దీర్ఘకాలంలో మల్టీప్లెక్స్‌ల తీరు తెన్నుల్ని డిజిటల్ నిజంగానే మారుస్తుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు మరో సినీ విమర్శకులు నమ్రతా జోషి.
మంచి, చెడుల విషయాన్ని పక్కనబెడితే ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం.
మరోవైపు థియేటర్ల యజమానులు భవిష్యత్తు ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. సీట్ల సంఖ్యను పరిమితం చేయడం, అలాగే పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకుల్ని కూడా అనుమతించేందుకు తగిన ఏర్పాట్లను చేయడం, పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన ఏర్పాట్లు, డిజిటల్ పేమెంట్ విధానాలు ఇవన్నీ ఇకపై సర్వ సాధారణం కానున్నాయి.
అలాగే ప్రొడక్షన్ హౌజ్‌లు, చిత్ర నిర్మాణాల విషయంలో కూడా గణనీయమైన మార్పులు రానున్నాయి.
ఉదాహరణకు దక్షిణాఫ్రికాలో లాక్ డౌన్ హైట్స్ పేరుతో చేసిన ఆన్ లైన్ ఓపెరా షో కోసం నటీ నటులు, తమ సీన్లను తామే ఐసోలేషన్లో ఉంటూనే తమ ఫోన్లతో చిత్రీకరించుకున్నారు. ఆ తర్వాత ఎడిటింగ్‌లో అవసరానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నారు.
సెట్‌లో కేవలం 33శాతం మంది మాత్రమే సిబ్బంది ఉండాలన్న సరికొత్త గైడ్‌లైన్స్ ప్రకారం షూటింగ్‌లను ప్రారంభించేందుకు బాలీవుడ్ కూడా తగిన సమయం కోసం వేచి చూస్తోంది.
ఇకపై రియాల్టీ షోలు ప్రేక్షకులు లేకుండానే మొదలుకావచ్చు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కరోనావైరస్ గురించి జనాల్లో అవగాహన కల్గించడంలో భాగంగా ఇటీవల రూపొందించిన వీడియో అందరం చూసే ఉంటాం.
క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే వినూత్న పరిష్కారాలు పురుడు పోసుకుంటాయి. లేదా కొన్ని సార్లు అందర్నీ గతానికి తీసుకెళ్తాయి.
ఉదాహరణకు కరోనా కారణంగా అమెరికాలో థియేటర్లు మూతబడ్డాయి. అయితే అక్కడ ఎలాగూ ప్రత్యామ్నాయంగా డ్రైవ్ ఇన్ సినిమా ఉంది. ఇక భారత్ వంటి దేశాల్లో ఒక నాటి ఓపెన్ ఎయిర్ సినిమాలకు మళ్లీ మంచి రోజులు వస్తాయేమో.

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
సంగీత విభావరులు
కరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న మరో రంగం మ్యూజిక్ ఇండస్ట్రీ. సాధారణంగా లైవ్ కాన్సర్ట్‌లు వేలాది మందిని ఆకర్షిస్తాయి. ఇక ఇప్పుడు వాటికి అవకాశం లేదు. సంగీత ప్రియులంతా లైవ్ కచేరీలు చూడాలంటే సుదీర్ఘకాలం వేచి చూడక తప్పదు.
అలాంటప్పుడు సంగీత ప్రియుల పరిస్థితి ఏంటి? అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత కళాకారుడు, ఇండియా బ్యాండ్ పరిక్రమ సృష్టికర్త చింతన్ కర్ల ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.
“రియల్ టైమ్‌లో కచేరీలను నిర్వహిస్తూ ప్రేక్షకుల్లోనూ అదే అనుభూతిని కల్పించేందుకు వర్ట్యువల్ రియాలటీని ఉపయోగించాలనుకుంటున్నాం. ఈ విషయంలో సాంకేతిక పరంగా ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు మన దేశంలో కొంత సమయం పట్టవచ్చు” అని చెప్పారు.
అలాగే కళాకారులకు ఇప్పుడు తగిన సమయం ఉంటుందని, ప్రేక్షకులతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
“ఇకపై సంగీత ప్రియులు తమకు ఇష్టమైన ఆర్టిస్టుల కచేరీల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సినవసరం ఉండదు. వాటిని హాయిగా ఇంట్లోనే కూర్చొని ఆన్ లైన్లో చూడవచ్చు” అని చింతన్ అన్నారు.
మొత్తంగా మున్ముందు అటు ప్రేక్షకులకు, ఇటు దర్శక, నిర్మాతలకు, నిర్వాహకులకు, కళాకారులకు మధ్య సరికొత్త సంబంధాలు ఏర్పడనున్నాయి.
సౌండ్ క్లౌడ్ వంటి ఆన్ లైన్ ఆడియో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ ఫాం.. నేరుగా ప్రేక్షకుల నుంచే తమకు అవసరమైన ఆర్థిక సాయాన్ని, కిక్ స్టార్టర్, పేపాల్ ద్వారా తీసుకునే సౌకర్యాన్ని కూడా కళాకారులకు కల్పించింది.
కళాకారులు తమ ఫేస్ బుక్ పేజీలో జియో సావన్ లైవ్ స్ట్రీమ్‌ను సెట్ చేసుకొని ఆడియో రికార్డింగ్‌లను చేసుకోవచ్చు. వాటిని జియో సావన్ సేవల్లో అందుబాటులో ఉంచుతుంది. అలా వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నూటికి నూరు శాతం కళాకారులకే అందజేస్తుంది.

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
థీమ్ పార్కులు, మాస్కులతో సెల్ఫీలు
సినిమా థియేటర్లు, సంగీతాన్ని పక్కనబెడితే వినోదం కోసం జనాలు గుంపులు, గుంపులుగా చేరే ప్రాంతాలు.. మాల్స్, థీమ్ పార్కులు.
కరోనావైరస్ కారణంగా మూడు నెలల పాటు మూతబడ్డ డిస్నీ ల్యాండ్ పార్క్ మే నెలలో షాంఘైలో తిరిగి ప్రారంభమైనప్పటికీ, సందర్శకుల సంఖ్యను కేవలం 24వేలకు కుదించింది. వచ్చిన వారి శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించడం, సందర్శకుల మధ్య, అలాగే ఉద్యోగుల మధ్య భౌతిక దూరాన్ని తప్పనిసరి చేసింది.
బహుశా మరి కొద్ది రోజుల తర్వాత మీరు మీ కుటుంబసభ్యులు మీకు ఇష్టమైన వాటర్ పార్క్‌కు వెళ్లవచ్చు. అయితే అప్పుడు కూడా మీరు అదే భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించుకోవడం వంటి నియమాలను పాటించడం తప్పనిసరి అవుతుంది.
ఆ థీమ్ పార్క్‌లో మీరు ఓ చోటా భీమ్ లేదా మిక్కీ మౌస్ క్యారెక్టర్ పక్కన మాస్క్ వేసుకొని సెల్ఫీ తీసుకోవడాన్ని ఒక్కసారి ఊహించండి. పరిస్థితి ఎలా ఉండబోతోందో మీకే అర్థమవుతుంది..

ఫొటో సోర్స్, Nikita Mandhani/BBC
అబీ పిక్చర్ బాకీ హై మేరే దోస్త్!
కోవిడ్-19 కారణంగా టీవీ, డిజిటల్, గేమింగ్, ఓటీటీ ప్లాట్ ఫాంలు అద్భుతమైన ప్రగతిని సాధించగా, సినిమాహాళ్లు, ఈవెంట్లు, థీమ్ పార్కులు మాత్రం నష్టాలబాట పట్టాయని ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ వెల్లడించింది.
కోవిడ్-19 వంటి మహమ్మారి విజృంభించిన ఈ సమయంలో తీవ్రమైన మానవీయు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్ వంటి దేశాల్లో వినోదరంగం అనేది ఎంత మాత్రమూ తప్పనిసరి అవసరం కాదు.
అయినప్పటికీ మనలో చాలా మంది ఎంతో కొంత అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే లాక్ డౌన్ సమయంలో ఓటీటీ, టీవీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా మనకు ఇష్టమైన హీరోల సినిమాలు, నచ్చిన కళాకారుల సంగీత విభావరులు చూసే అవకాశం లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించండి.
ఈ సమయంలో మీకు ఒక్కసారి గతంలో బ్రిటన్లో జరిగిన ఓ సంఘటనను జ్ఞాపకం చెయ్యాలనుకుంటున్నాను. బ్రిటన్ మాజీ ప్రధాని, వివాదాలకు మారు పేరుగా నిలిచిన చర్చిల్‌ను రెండో ప్రపంచ యుద్ధాన్ని పురస్కరించుకొని కళలపై ఖర్చు పెట్టే నిధుల్లో కోత విధించాలని కొందరు అడిగినప్పుడు.. అందుకు సమాధానంగా ఆయన “అలాంటప్పుడు ఇక మనం దేని కోసం పోరాడాలి?” అని ప్రశ్నించారట.
వినోదరంగం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అయితే లాక్ డౌన్ తర్వాత దాని రూపు రేఖలు మాత్రం మారుతాయి. “అభీ పిక్చర్ బాకీ హై మేరే దోస్త్”.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: మాస్కు లేకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు జరిమానా విధించిన కోర్టు
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం.. ఎవరికి లాభం
- కరోనావైరస్: పూజలు చేస్తే కరోనా మాయమవుతుందా.. ప్రార్థనలు చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందా
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








