కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం పిసినారితనం చూపిందా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు సరిగా పరీక్షలు చేయలేదని, ఆరోగ్య సిబ్బందికి తగినన్ని పీపీఈ కిట్‌లు అందించలేదని, వారికి వేతనాలు కూడా ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఇవి భారత ఆరోగ్య రంగంలో సంక్షోభాన్ని మరోసారి అందరి ముందుకు తీసుకొచ్చాయి.
అయినా, భారత్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎవరికీ తెలీనిది కాదు. వాటిలో డాక్టర్లు, పడకలు, సౌకర్యాలు, మందుల కొరత సర్వ సాధారణం. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో దురుసుగా ప్రవర్తిస్తారనేది కూడా ఉంది. ఈ పరిస్థితి రెండు మూడేళ్ల ముందు నుంచే కాదు, మొదటి నుంచీ ఉంది.
దీనికి ముఖ్య కారణం ఆరోగ్య రంగంలో పెట్టుబడుల లోటు. అయితే గత ఏడాది ప్రభుత్వ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అంతకుముందుతో పోలిస్తే ఎక్కువే కేటాయించారు. ఆ కేటాయింపులు 2016-17లో సుమారు రూ. 37 వేల కోట్ల నుంచి ఇప్పుడు రూ. 65 వేల కోట్లకు పైనే చేరింది. కానీ అది ఇప్పటికీ భారత్ మొత్తం జీడీపీలో రెండు శాతం కంటే తక్కువే ఉంది.
కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా 2013-14లో ఈ గణాంకాలు 1.15 శాతం ఉండగా, అది ఇప్పుడు 1.8 శాతం అయ్యిందని చెప్పారు. ఆయన సభకు గత ఏడాది ఇచ్చిన లిఖిత జనాబులో ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఈ గణంకాలే ఉన్నాయని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యంపై జీడీపీలో రెండు శాతం కూడా లేదు
ఆరోగ్య రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ వైపు నుంచి ఖర్చు చేస్తాయి. పైన ఇచ్చిన గణాంకాలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినవి. ఇటీవల కొంతకాలంగా భారత ఆరోగ్య రంగంలో ప్రైవేటు కంపెనీల జోక్యం కూడా చాలా వేగంగా పెరిగింది. కానీ, అక్కడ లభించే సౌకర్యాలకు చార్జీలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే, దేశ జనాభాలో ఎక్కువ శాతం మందికి అవి అందకుండా పోతున్నాయి.
ఐదు అభివృద్ధి చెందిన దేశాల సమూహం - బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా)లో ఆరోగ్య రంగంలో చేసే ఖర్చు విషయంలో భారత్ మిగతా అన్ని దేశాల కంటే దిగువన ఉంది.
బ్రెజిల్ తన మొత్తం జీడీపీలో 9.2 శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయిస్తుంది. ఇక భారత్‌తో పోల్చి చూసే చైనాలో అది 5 శాతం ఉంది. అంటే భారత్ కంటే రెండున్నర శాతం అధికం.
భారత్‌లో ఎవరి ప్రభుత్వం వచ్చినా ఆరోగ్యంపై ఎప్పుడూ 2 శాతం కంటే తక్కువ వ్యయమే ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం అది 5 శాతానికి దగ్గరగా ఉండాలి. భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం రెండు పదవీకాలాలతో పోలిస్తే ఆరోగ్యంపై ఎక్కువే ఖర్చు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ గణాంకాలను పోల్చి చూస్తే తన ఆరేళ్ల పదవీ కాలంలో ఎన్డీయే ప్రభుత్వం ఆరోగ్య రంగానికి చేసిన ఆర్థిక కేటాయింపులు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. అంతే కాదు, ఎన్డీయే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ను ఆరోగ్యం అందించే దిశగా అత్యంత ప్రతిష్టాత్మక పథకంగా చూస్తున్నారు.
కానీ, ఆరోగ్య బీమా పథకాన్ని యూపీఏ పదవీ కాలంలోనే ప్రారంభించారని, ఆరోగ్యానికి ఆర్థిక కేటాయింపులు మాత్రం ఎన్డీయే పదవీకాలంతో పోలిస్తే తక్కువే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆరోగ్యం అనేది రాష్ట్రాల అంశం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు దక్షిణ భారత రాష్ట్రాలు, ఛత్తీస్‌గడ్‌లో తమదైన ఆరోగ్య విధానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజనకు బదులు తమ సొంత పథకాలు రూపొందించాయి.

ఫొటో సోర్స్, ANI
ప్రైవేట్ - పబ్లిక్ భాగస్వామ్యం ప్రతిపాదన
జన్ స్వాస్త్య అభియాన్ (పబ్లిక్ హెల్త్ మిషన్) పేరుతో ప్రభుత్వేతర సంస్థలు భారత్‌లో ప్రజారోగ్య సమస్యలపై పనిచేస్తూ వస్తున్నాయి. “యూపీఏ పాలనలో ఆరోగ్య బీమా మొదలైనప్పుడు, దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక మార్పులు ప్రారంభమయ్యాయి” అని ఆ సంస్థకు చెందిన దీపికా జోషి చెప్పారు.
ఆ తర్వాత కూడా రాష్ట్రాలు చాలా రకాల మోడల్స్ స్వీకరించాయి. కొన్ని పూర్తిగా ప్రభుత్వ ద్వారా నడిస్తే, కొన్నింటికి ప్రభుత్వమే నిధులు అందించింది. వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థలు చూసుకునేవి.
ఇటీవల నీతి ఆయోగ్ కూడా ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యం, అంటే పీపీపీ లాంటి ప్రయోగాన్ని ప్రతిపాదించింది. అందులో ప్రైవేటు రంగంలోని గ్రూపులు ప్రభుత్వంతో కలిసి ఆధునిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ 2015లో ప్రవేశపెట్టింది. దేశంలో మొదటి బడ్జెట్ నుంచీ ప్రతి బడ్జెట్లో ఆరోగ్య రంగానికి దాదాపు 30 శాతం నిధులు కేటాయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. యూపీఏ తమ పదవీకాలం చివరి ఏడాదిలో పెట్టిన బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం 33 వేల కోట్లు కేటాయించింది.
ఇక ఎన్డీయే ప్రభుత్వం విషయానికి వస్తే, అధికారంలోకి రాగానే అది తమ మొదటి బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 29 వేల కోట్లు కేటాయించింది. తర్వాత ఆర్థిక సంవత్సరంలో దానిని 37 వేల కోట్ల రూపాయలకు పెంచింది. తర్వాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యానికి బడ్జెట్లో 52 వేల కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులను దాదాపు 65 వేల కోట్లకు పెంచారు.
దీనిపై మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ అష్లిన్ మాథ్యూ “యూపీఏ పదవీకాలంలో సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల కొరత ఉన్నప్పటికీ, ఆరోగ్యం కోసం కేటాయించిన మొత్తం నిధులను ఖర్చు చేయలేకపోయారు. ఆ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం రికార్డు ఇప్పటివరకూ బాగానే ఉంది. కేటాయించిన మొత్తం నిధులను ఆది పూర్తిగా ఖర్చు చేస్తోంది” అన్నారు.
కానీ, కొంతమంది నిపుణులు మాత్రం “గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులను ప్రభుత్వం పెంచినా, అందులో చాలా రంగాలు దూరంగా ఉండిపోయాయి. అంటే, కాన్సర్ నియంత్రణ కార్యక్రమం, గుండె జబ్బులు, మధుమేహ నియంత్రణ కార్యక్రమం లాంటి వాటి కేటాయింపులు పెరగలేదు” అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








