భారతదేశంలో కరోనా వైరస్ వల్ల మహిళలే ఎక్కువగా చనిపోతున్నారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వల్ల మహిళల కన్నా పురుషులు ఎక్కువగా చనిపోతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఉదాహరణకు ఇటలీ, చైనా, అమెరికాల్లో ఎక్కువగా పురుషులకే కరోనావైరస్ సోకుతోంది. పురుషులే ఎక్కువ శాతం చనిపోతున్నారు.
‘‘కరోనావైరస్ విషయంలో వృద్ధులకు ఎంత ముప్పు ఉందో.. పురుషులకు కూడా అంతే ముప్పు ఉంది’’ అని వైరల్ ఇన్‌ఫెక్షన్లలో లింగ బేధాలపై అధ్యయనం చేస్తున్న జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్త సబ్రా క్లీన్ చెప్తున్నారు.
కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
ఇండియా, అమెరికాలకు చెందిన ఒక పరిశోధకుల బృందం తాజాగా నిర్వహించిన అధ్యయనంలో.. కరోనావైరస్ సోకుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. వారికన్నా మహిళలే చనిపోతున్నారని వెల్లడైంది.
ఈ ఏడాది మే 20వ తేదీ వరకూ దేశంలో కోవిడ్-19 మరణాలు ప్రాతిపదికగా నిర్వహించిన ఈ అధ్యయనంలో క్రోడీకరించిన ప్రాథమిక అంచనాలను బట్టి.. భారతదశంలో కరోనావైరస్ సోకిన పురుషుల్లో 2.9 శాతం మంది చనిపోతుంటే.. ఆ వైరస్ సోకిన మహిళల్లో 3.3 శాతం మంది చనిపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనం నిర్వహించే సమయానికి భారతదేశంలో మొత్తం 1,10,000కు పైగా నిర్ధారిత కేసులు ఉండగా.. 3,433 మంది చనిపోయారు. అప్పటికి మరణాల రేటు 3.1 శాతంగా ఉంది.
వైరస్ సోకిన వారిలో 40-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు 3.2 శాతం మంది చనిపోతే.. పురుషులు 2.1 శాతం మంది మరణించారు. అయితే.. 5-19 సంవత్సరాల వయసున్న వారిలో కేవలం బాలికలు, యువతులు మాత్రమే చనిపోయారు.
ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన నిపుణుల్లో ఒకరైన హార్వర్డ్ యూనివర్సిటీలో జనాభా ఆరోగ్యం ప్రొఫెసర్ ఎస్.వి.సుబ్రమణియన్.. మోర్టాలిటీ రిస్క్ (మరణ ముప్పు), మోర్టాలిటీ బర్డెన్ (మరణ భారం) అనే రెండు కీలక అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించినట్లు నాతో చెప్పారు.
నిర్దిష్ట వయసు వారిలో మరణం సంభవించే ముప్పును ‘మోర్టాలిటీ రిస్క్’ అంచనా వేస్తుంది. కరోనావైరస్ సోకినట్లు నిర్ధారించిన మహిళల కేసుల సంఖ్యతో.. మరణాల సంఖ్యను భాగించారు.
ఇక మోర్టాలిటీ బర్డెన్ అంచనా కోసం.. మొత్తం కరోనావైరస్ మరాణాల్లో మహిళల శాతం ఎంత ఉందనేది లెక్కించారు.
ఇప్పటివరకూ ఎక్కువగా మొత్తం కరోనావైరస్ మరణాల గణాంకాలను చూసేవారని.. అలా చూసినపుడు మరణాల్లో ఎక్కువ శాతం పురుషులే (భారతదేశంలో 63 శాతం – ప్రపంచ గణాంకాలకు అనుగుణంగానే ఉంది) ఉన్నారని ప్రొఫెసర్ సుబ్రమణియణ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మొత్తం మీద.. భారతదేశంలో కరోనావైరస్ సోకిన మహిళలకు.. ఆ వ్యాధిని తట్టుకుని ప్రాణాలతో బయటపడటానికి ఎటువంటి ప్రత్యేక సానుకూలతలూ లేవని మేం నిర్ధారణకు వచ్చాం’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఇందులో శారీరక అంశాల పాత్ర ఎంత ఉండొచ్చు, సామాజిక అంశాల పాత్ర ఎంత ఉండొచ్చు అనేది అస్పష్టం. భారతదేశ పరిస్థితుల్లో లింగం అనేది క్లిష్టమైన అంశం కావచ్చు’’ అని చెప్పారు.
కానీ.. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో గుర్తించిన పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి.
ఉదాహరణకు హృద్రోగాలు, రక్తపోటు వంటి అంతర్లీన అనారోగ్య పరిస్థితులతో బాధపడటం పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ కునిహిరో మాట్సుషిటా పేర్కొన్నారు. చాలా దేశాల్లో మహిళల కన్నా పురుషులే అధికంగా ధూమపానం చేస్తారు. అలాగే తరచుగా చేతులు కడుక్కోవటం కూడా మహిళలకన్నా పురుషుల్లో తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.
తీవ్ర కోవిడ్-19 సోకే ప్రమాదం కూడా పురుషు రోగులకే ఎక్కువగా ఉందని తాను పాలుపంచుకున్న పలు అధ్యయనాల్లో వెల్లడైందని ప్రొఫెసర్ మాట్సుషిటా తెలిపారు.
మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలు బలంగా ఉండటం వల్ల వారు చనిపోయే ముప్పు తక్కువగా ఉందని కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్లు ‘‘వారి శ్వాసనాళాల మీద ప్రయోజనకరమైన ప్రభావం చూపుతాయని.. శ్వాసనాళాల ఇన్‌ఫెక్షన్లపై రోగనిరోధక వ్యవస్థ ఉత్ప్రేరకంతో వీటికి సంబంధం ఉంది.’’
‘‘ఈ విధంగా చూసినపుడు.. పురుషుల కన్నా మహిళల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండటం నిజంగా విశిష్టమైన విషయమే’’ అని మాట్సుషిటా నాతో పేర్కొన్నారు.
అయితే.. ఈ అధ్యయనం గణాంకాలను.. భారతదేశంలో కోవిడ్-19 కేసులను ఎలా పరీక్షిస్తున్నారు అనేది పరిగణనలోకి తీసుకుని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఉదాహరణకు.. పరీక్ష చేయించుకునే అవకాశం పురుషులకు, మహిళలకు సమానంగానే అందుబాటులో ఉందా?’’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ అంతుచిక్కని మిస్టరీలో మన కళ్లకు కనిపించేదానికన్నా లోతైన విషయాలు ఉండొచ్చు.
భారతదేశంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ కాలం జీవిస్తారు. దేశంలోని వృద్ధుల్లో మగాళ్ల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు. కోవిడ్-19 ముప్పు వృద్ధులకు తీవ్రంగా ఉంటుంది కాబట్టి.. మహిళల్లో ఎక్కువ మరణాలకు ఇది కారణమా?
అలాగే.. భారతదేశంలో మహిళలు అనారోగ్యంగా ఉన్నపుడు వైద్యులను సంప్రదించటంలో ఎక్కువగా జాప్యం చేస్తుంటారు. ఇంట్లో మహిళ ఆరోగ్యాన్ని ఎక్కువగా విస్మరిస్తుంటారు కూడా. కాబట్టి.. పరీక్షలు చేయించుకోవటానికి, చికిత్స కోసం మహిళలు ఆలస్యంగా వస్తున్నారా?
1918 నాటి స్పానిష్ ఫ్లూ సమయంలో.. ఇంట్లో అన్ని బాధ్యతలూ చూసుకునే మహిళలు, అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకునే మహిళలకు ఈ వైరస్ ఎక్కువగా సోకింది. ఈ మమిళలకు పురుషులతో పోలిస్తే పౌష్టికాహారం తక్కువగా ఉండటం, అపరిశుభ్ర వాతావరణంలో మగ్గుతుండటం, గాలీవెలుతురు సరిగాలేని ఇళ్లలో నివసిస్తుండటం, జబ్బుపడ్డ వారికి చికిత్స చేస్తుండటం దీనికి కారణం.
‘‘అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి లింగ గణాంకాలు, సమాచారాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌కి చెందిన మాజీ వైరాలజీ ప్రొఫెసర్ టి. జాకబ్ జాన్ పేర్కొన్నారు.
పరిశోధకులు ఏకీభవిస్తున్నారు. ‘‘మేం నిశితంగా గమనిస్తుంటాం. ఈ అధ్యయనం ఫలితాలను ఎప్పటికప్పుడు కొత్త అంశాలతో నవీకరిస్తుంటాం’’ అని ప్రొఫెసర్ సుబ్రమణియన్ చెప్పారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









