అమృత, ప్రణయ్, మారుతీరావులపై సినిమాలో రాంగోపాల్ వర్మ ఏం చూపించబోతున్నారు

ఫొటో సోర్స్, AMRUTHA.PRANAY.3/FACEBOOK
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద సినిమాను ప్రకటించారు. ప్రణయ్ అనే యువకుడు మిర్యాలగూడలో కుల అహంకార హత్యకు గురైన ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తానని ఆదివారం ఆయన ట్విటర్‌లో ప్రకటించారు.
ప్రణయ్ హత్య అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రణయ్ దళిత వర్గానికి చెందిన యువకుడు. అమృత అనే అమ్మాయిని 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అమృత తండ్రి మారుతీ రావు ఆ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారి.
ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు మాటువేసి ఆయన్ని నరికి చంపాడు. ఇది సీసీ కెమెరాల్లోనూ రికార్డైంది. 2018 సెప్టెంబర్‌లో ఈ హత్య జరిగింది.
కూతురు దళిత యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మారుతీరావు కిరాయి హంతకుడితో ఈ హత్య చేయించారన్న అభియోగంతో నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఉదంతం తర్వాత కుల అహంకారానికి వ్యతిరేకంగా, తన తండ్రికి వ్యతిరేకంగా అమృత చాలాసార్లు మాట్లాడారు.
కానీ, కొన్ని నెలల కిందట మారుతీ రావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు తిరిగి తమ ఇంటికి రావాలని కోరుతూ ఓ లేఖ రాసి ఆయన చనిపోయారు.
మారుతీ రావు బతికి ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత ఆయనకు మద్దతుగా మాట్లాడినవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కూతురు మీద ప్రేమతోనే ఆయన ఆ నేరం చేశారంటూ వ్యాఖ్యానాలు వినిపించాయి. అమృత వ్యక్తిత్వంపైనా దాడి జరిగింది.
మొత్తానికి ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలో జూన్ 21న ‘ఫాదర్స్ డే’ సందర్భంగా వర్మ ఈ ఘటన ఆధారంగా సినిమా తీయనున్నట్లు ప్రకటించారు.
దీనికి ‘మర్డర్: కుటుంబ కథా చిత్రమ్’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. అమృత, మారుతీరావుల ఫొటోను గుర్తుకుతెచ్చేలా ఉన్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఫొటో సోర్స్, RGVzoomin/twitter
‘నిజమైన కథ ఆధారంగా తీస్తున్నా’
ఈ సినిమాపై తొలుత అమృత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారని, వర్మ ప్రకటన చూశాక ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందంటూ అందులో రాశారని మీడియాలో కథనాలు వచ్చాయి.
కానీ, అమృత ఈ సినిమాపై స్పందించలేదని, ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ విషయంపై వర్మ మళ్లీ ట్విటర్‌లోనే స్పందించారు.
లేఖ ఎవరూ రాసినా స్పందించాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నట్లు చెప్పారు.
‘‘నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాని నేను స్పష్టంగా చెప్పాను. ఇదే నిజమైన కథ అని చెప్పలేదు. ఇక ఈ వ్యవహారం గురించి సమాచారం అంతా బహిరంగంగానే ఉంది. ఇందులో భాగమైన వ్యక్తులే అంగీకరించిన విషయాలు అవి’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, AMRUTHA.PRANAY.3/FACEBOOK
అమృత, మారుతీరావుల ఫొటోను తలిపించేలా పోస్టర్ ఉండటం గురించి కూడా స్పందించారు.
‘‘పోస్టర్‌కు ఆధారమైన ఫొటోలు విస్తృతంగా ఇంటర్నెట్‌లో ప్రచారమైనవే. అవి ఎవరో నాకు వ్యక్తిగతంగా ఇచ్చినవో, రహస్యంగా ఉంచమని ఇచ్చినవో కాదు’’ అని వర్మ అన్నారు.
చిత్రంలో తాను చూపించే కోణం అది విడుదలయ్యాకే తెలుస్తుందని, ముందుగా దాని గురించి అభ్యంతరం చెప్పడం తెలివితక్కువతనమని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘నేను ఎవరినో చెడ్డగా చూపిస్తానని అనుకుంటే అది మూర్ఖత్వమే. ఎవరూ చెడ్డవారు కాదని నేను గట్టిగా నమ్ముతా. చెడ్డ పరిస్థితులే మనుషులను చెడ్డగా చూపిస్తాయి. చెడు పనులు చేసేలా చేస్తాయి. ‘మర్డర్’లో నేను అదే చూపించాలనుకుంటున్నా’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘శివ’తో మొదలు
వివాదాస్పదమైన అంశాలపై వర్మ చాలా సినిమాలే తీశారు.
తన మొదటి చిత్రం ‘శివ’ను కూడా విజయవాడలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్‌లను ఆధారంగా చేసుకుని తెరకెక్కించానని ఆయన చాలా సార్లు చెప్పారు.
ముంబయిలోని మాఫియా ఆధారంగా ‘సత్య’, ‘కంపెనీ’, ‘డీ’ లాంటి చిత్రాలను వర్మ తీశారు.
పరిటాల రవి, మద్దెలచెరువు సూరిల జీవితాల ఆధారంగా వర్మ ‘రక్త చరిత్ర’ సిరీస్ తీయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
విజయవాడలో రౌడియిజంపై ‘బెజవాడ’... వంగవీటి రంగా, రాధాల జీవితాల ఆధారంగా ‘వంగవీటి’ సినిమా తీశారు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఆయన భార్య లక్ష్మీ పార్వతి కోణంలో చూపిస్తున్నానంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీశారు. ఈ చిత్రంపై టీడీపీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని చిత్రాన్ని వర్మ ప్రకటించారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కూడా టీడీపీ నాయకులు కొందరు డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO
కొన్ని ప్రకటనలే... సినిమాలు లేవు
అణు యుద్ధం, వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, ఆఖరికి కరోనావైరస్... ఇలా వార్తల్లో ఉన్న అంశాలపై సినిమాలు ప్రకటించడం వర్మకు అలవాటు.
అయితే, అలా ప్రకటించిన సినిమాల్లో చాలా వరకూ ఫస్ట్ లుక్‌లు, పోస్టర్‌లతోనే ఆగిపోతుంటాయి.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించినప్పుడు ఆమె సన్నిహితురాలు శశికళ జీవితంపై సినిమా చేస్తానని వర్మ ప్రకటించారు. మళ్లీ ఆ చిత్రం ఊసే లేదు.
కేసీఆర్‌పై సినిమా
తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. ‘రెడ్డి గారు పోయారు’ అనే సినిమా కూడా ప్రకటించి వదిలేశారు.
తాజాగా మహాత్మ గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సేపై కూడా సినిమా తీస్తానని వర్మ ప్రకటించారు.
ప్రకటించిన ఆ సినిమాలన్నీ ఎప్పుడు తీస్తారని ప్రశ్నించినవారికి... ‘నా ఇష్టం వచ్చినప్పుడు’ అని సమాధానం ఇస్తుంటారు వర్మ.
ప్రణయ్ హత్య ఆధారంగా తీస్తానంటున్న సినిమా ఏం చేస్తారనేది వర్మ చేతుల్లోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ - చైనా సరిహద్దు ఘర్షణ: భారతదేశం ఎల్ఏసీని ఎలా సంరక్షించుకుంటుంది?
- గల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు వదిలిన 20 భారత సైనికులు, వారి కథలు ఇవే..
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: గల్వాన్ లోయ ఘర్షణలపై వ్యాపిస్తున్న ఫేక్ వార్తలివే...
- కరోనావైరస్ 'జీరో' అని ప్రకటించుకోవడానికి ఆ దేశాలకు ఎందుకంత తొందర?
- ఎల్ఓసీ, ఎల్ఏసీ, అంతర్జాతీయ సరిహద్దు... ఈ రేఖలకు అర్థం ఏంటి?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- ఇక టిక్ టాక్ పాఠాలు.. విద్యారంగంలోకి అడుగుపెడుతున్న చైనా యాప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








