గల్వాన్ లోయ ఘర్షణలో ప్రాణాలు వదిలిన 20 మంది భారత సైనికులు, వారి కథలు ఇవే..

భారత్, చైనా సైనికుల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో జూన్ 15వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు.
మొదట ముగ్గురు సైనికులు మరణించినట్లు సమాచారం వెల్లడైంది. తీవ్ర గాయాలపాలైన మరో 17 మంది కూడా మరణించినట్లు ఆ తర్వాత భారత సైన్యం స్వయంగా ప్రకటించింది.
ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల వివరాలివే...

కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు, తెలంగాణ
16-బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్ సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు.
సంతోష్ బాబుది తెలంగాణలోని సూర్యాపేట. పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన అంతిమ సంస్కారాలకు 50 మంది మాత్రమే హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, సంతోష్ బాబుకు అంతిమ వీడ్కోలు పలికేందుకు వందల సంఖ్యలో జనం ఆయన నివాసానికి వచ్చారు.
సంతోష్ బాబు వయసు 37 ఏళ్లే. 1982లో ఆయన జన్మించారు.
రాబోయే సెప్టెంబర్‌లో సంతోష్ బాబు సూర్యాపేట రావాల్సి ఉందని ఆయన తండ్రి ఉపేందర్ చెప్పారు.
అనుకోకుండా జరిగిన ఈ ఘటన గురించి సంతోష్ బాబు భార్యకు ఫోన్ ద్వారా సైన్యం నుంచి సమాచారం అందింది. వారి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.
సంతోష్ బాబుకు భార్య మంజుల, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు.
సంతోష్ బాబు చైనా సరిహద్దుల్లో ఏడాదిన్నరగా విధుల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, Ankur Tiwari
గణేశ్ రామ్ కుంజామ్, ఛత్తీస్‌గఢ్
2011లో గణేశ్ కుంజామ్ సైన్యంలో చేరారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లో సైన్యం భర్తీ శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎంపికయ్యారు.
బస్తర్‌లోని కొంకెర్‌లో ఉన్న కుకుర్‌టోలాలో కుంజామ్ ఇల్లు ఉంది. ఆయన పెళ్లి జనవరిలో ఖాయమైంది. ఆయన సెలవుపై ఇంటికి రావాల్సి ఉంది.
కుంజామ్‌కు ఇద్దరు తోబుట్టువులు. వారిలో ఒకరికి వివాహమైంది.
కుంజామ్ మరణం సమాచారం ఆయన చిన్నాన్న తిహాడూకు ఫోన్ ద్వారా అందింది.
నెలల రోజులుగా ఇంట్లోవారితో కుంజామ్ ఫోన్‌లో కూడా మాట్లాడలేదు.

కే పలనీ, తమిళనాడు
పలనీది తమిళనాడులోని మధురైలో ఉన్న కడూకలూరు గ్రామం. కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి ఆయన సైన్యంలో చేరారు. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్లే.
ఆ తర్వాత కరెస్పాండెన్స్ కోర్సులో బీఏ డిగ్రీ పూర్తి చేశారు.
పలనీ కుటుంబం కొత్త ఇల్లు కట్టుకోవడంతో ఇటీవల గృహ ప్రవేశం కార్యక్రమం చేసుకుంది. దీనికి పలనీ రాలేకపోయారు.
ఇదే నెలలో పలనీ పుట్టిన రోజు ఉందని, చివరి సారిగా ఆయన ఆ రోజే ఇంట్లోవారితో మాట్లాడారని పలనీ తమ్ముడు ఇదయకనీ చెప్పారు.
ఇదియకనీ కూడా సైన్యంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజస్థాన్‌లో విధుల్లో ఉన్నారు.
తాను సైన్యంలో చేరేందుకు సోదరుడే స్ఫూర్తి అని ఇదయకనీ చెప్పారు.
‘‘చివరగా మాట్లాడినప్పుడు లద్ధాఖ్ సరిహద్దు వైపు వెళ్తున్నామని, అక్కడ నెట్‌వర్క్ సమస్య ఉంటుందని చెప్పారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని నష్టం. మా వదిన, వాళ్ల ఇద్దరు పిల్లల పరిస్థితి తలచుకుంటే బాధగా ఉంది’’ అని అన్నారు.
(సాయిరామ్, బీబీసీ ప్రతినిధి)

ఫొటో సోర్స్, Ravi Prakash
కుందన్ ఓఝా, ఝార్ఖండ్
మూడేళ్ల క్రితమే కుందన్‌కు వివాహమైంది. 20 రోజుల క్రితమే ఆయనకు కూతురు జన్మించింది. ఆ పాపను ఇంకా కుందన్ చూడనేలేదు.
కుందన్‌ది ఝార్ఖండ్‌లోని సాహెబగంజ్ జిల్లాలోని శాహ్‌పుర్. 2011లో ఆయన సైన్యంలో చేరారు.
గణేశ్ హాంసదా, ఝార్ఖండ్
22 ఏళ్ల గణేశ్ హాంసదా సైన్యంలో చేరిన వెంటనే లేహ్‌లో విధుల్లో నిర్వర్తించాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు ఆయన బదిలీ కావాల్సి ఉంది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ బదిలీ నిలిచిపోయింది.
గణేశ్‌ది ఝార్ఖండ్‌లోని తూర్పు సింహభూమ్ జిల్లాలోని బహరాగోడాలో ఉన్న కోసాపాలియా గ్రామం.
గత ఫిబ్రవరిలో గణేశ్ సెలవుపై తమ ఊరికి వచ్చారని ఆయన సోదరుడు దినేశ్ హాంసదా చెప్పారు.
(రాంచీ నుంచి రవిప్రకాశ్)

ఫొటో సోర్స్, Mantu kumar
అమన్ కుమార్ సింగ్, బిహార్
25 ఏళ్ల అమన్‌కు గత ఫిబ్రవరి 27న వివాహమైంది.
‘‘త్వరలోనే తిరిగివస్తా అని చెప్పారు. ఆయనకు లేహ్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎప్పటికీ తిరిగి రారు’’ అంటూ అమన్ భార్య మీనూ దేవి రోధించారు.
‘‘మాకు ప్రభుత్వంపై ఎలాంటి ఫిర్యాదూ లేదు. దేశ సేవలో మా కొడుకు ప్రాణ త్యాగం చేశారు. ఇంతకన్నా గర్వించే విషయం ఏముంటుంది? మా కొడుకు కాబట్టి, బాధ ఎలాగూ ఉంటుంది’’ అని అమన్ తండ్రి సుధీర్ అన్నారు.

ఫొటో సోర్స్, Lal Bahadur
కుందన్ కుమార్ యాదవ్, బిహార్
కుందన్‌ది సహర్సాలోని ఆరణ్ గ్రామం. ఆయన తండ్రి ఒక రైతు.
కుందన్‌కు భార్య బేబీ దేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో ఒకరి వయసు ఆరేళ్లు, ఇంకొకరికి నాలుగేళ్లు.
కుందన్ నాలుగు రోజుల క్రితమే తమతో ఫోన్‌లో మాట్లాడారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
సునీల్ కుమార్, బిహార్
సునీల్ కుమార్ పట్నా జిల్లాలోని సికరియాలో ఉన్న తారాపూర్ గ్రామం.
2002లో ఆయన సైన్యంలో చేరారు.
సునీల్ తండ్రి బాధతో ఏమీ మాట్లాడే స్థితిలో లేరు. లాక్‌డౌన్ కారణంగా సునీల్ ఇంటికి రాలేకపోయారని ఆయన తల్లి అన్నారు.
సునీల్ భార్య రీతీ దేవి, వారి ముగ్గురు పిల్లలు దానాపుర్‌లో ఉంటున్నారు.
సునీల్, రీతీల కూతురు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇద్దరు కుమారుల్లో ఒకరు ఆరో తరగతి, ఇంకొకరు యూకేజీ చదువుతున్నారు.

ఫొటో సోర్స్, Prashant Kumar
చందన్ కుమార్, బిహార్
చందన్ కుమార్ వయసు 24 ఏళ్లు. రెండేళ్ల క్రితమే సైన్యంలో చేరారు.
ఆయనది జగదీశ్‌పుర్‌లోని జ్ఞానపుర్ గ్రామం.
నాలుగు నెలల క్రితమే గ్రామానికి వచ్చి వెళ్లారు.
చందన్ తండ్రి హృదయానంద్ సింగ్ రైతు.
ఆరు రోజులుగా కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడలేదు.
చందన్ మరణం గురించి మంగళవారం రాత్రి సైన్యం నుంచి హృదయానంద్‌కు ఫోన్ వచ్చింది. కానీ ఆయన ఆ ఫోన్ ఎత్తలేదు. మరుసటి రోజు ఉదయం వారికి సమాచారం తెలిసింది.

ఫొటో సోర్స్, Yashwant Chauhan
జయ్ కిశోర్ సింగ్, బిహార్
జయ్ కిశోర్ సింగ్‌ది వైశాలి జిల్లాలోని చకఫ్తహ్ గ్రామం. ఆయన అవివాహితుడు. తండ్రి పేరు రాజ్ కపూర్ సింగ్.
‘‘ఓ నెల క్రితం అతడి నుంచి ఫోన్ వచ్చింది. ఎత్తైన ప్రాంతంలోకి వెళ్తున్నానని, అక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదని చెప్పాడు. తిరిగి వచ్చాక ఫోన్ చేస్తానని అన్నాడు’’ అని రాజ్ కపూర్ సింగ్ చెప్పారు.
మళ్లీ జయ్ కిశోర్ నుంచి ఇంటికి ఫోన్ రాలేదు. బుధవారం ఉదయం 9 గంటలకు వారికి ఆయన మృతి వార్త తెలిసింది.
2018లో జయ్ కిశోర్ సైన్యంలో చేరారు. ఆయన సోదరుడు నంద కిశోర్ కూడా సైన్యంలోనే ఉన్నారు. సిక్కింలో విధులు నిర్వర్తిస్తున్నారు.
(పట్నా నుంచి సీటూ తివారీ)
బిపుల్ రాయ్, పశ్చిమ బెంగాల్
బిపుల్ రాయ్ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్. కొన్నేళ్ల క్రితమే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు మారారు.
ఓ నెల క్రితమే లేహ్‌లో బిపుల్‌కు పోస్టింగ్ వేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. చివరగా డిసెంబర్‌లో ఆయన సెలవుపై ఇంటికి వచ్చారని తెలిపారు.
బిపుల్‌కు భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.

ఫొటో సోర్స్, Sanjay Das
రాజేశ్ ఓరంగ్, పశ్చిమ బెంగాల్
రాజేశ్ ఓరంగ్ 2015లో సైన్యంలో చేరారు. ఆయనది బీర్‌భూమ్ జిల్లా.
కుటుంబ సభ్యులు ఆయనకు ఈ ఏడాది పెళ్లి చేయాలనుకున్నారు. దాదాపు పెళ్లి ఖాయం చేసుకున్నారు. ఇంతలోనే రాజేశ్ మరణవార్తను వాళ్లు వినాల్సి వచ్చింది.
గత వారం రాజేశ్ తనకు ఫోన్ చేశారని ఆయనకు వరుసకు సోదరుడయ్యే అభిజీత్ చెప్పారు.
‘‘పైకి వెళ్తున్నా అని నాతో చెప్పాడు. పర్వతాల పైకి వెళ్లడం గురించి అలా మాట్లాడాడు. కానీ, పైనున్న స్వర్గానికి వెళ్తాడని ఎవరికి తెలుసు’’ అని ఆయన చెప్పారు.
‘‘కొడుకు చనిపోయాడని బాధ ఉన్నా, దేశం కోసం అమరుడయ్యాడని గర్వంగానూ ఉంది. ప్రభుత్వం చెంపపెట్టు లాంటి బదులు ఇవ్వాలి. అప్పుడే అమరుల కుటుంబాలకు మనశ్శాంతి’’ అని రాజేశ్ తండ్రి సుభాష్ అన్నారు.
(కోల్‌కతా నుంచి ప్రభాకర్ మణి తివారీ)

దీపక్ కుమార్, మధ్యప్రదేశ్
దీపక్ కుమార్ సెలవుపై రీవాలోని తన ఇంటికి రావాల్సి ఉంది. కానీ, కరోనావైరస్ వ్యాప్తి వల్ల ఆయన సెలవు రద్దైపోయింది.
చివరగా తనతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు లాక్‌డౌన్ ముగియగానే ఇంటికి వస్తానని దీపక్ చెప్పారని ఆయన నానమ్మ అన్నారు.
దీపక్‌కు తల్లి లేరు. ఆయన్ను నానమ్మే పెంచి పెద్ద చేశారు.
‘‘ఇప్పుడు లాక్‌డౌన్ ముగిసింది. మా దీపక్ కూడా కనుమరుగయ్యాడు’’ అని ఆమె బాధపడ్డారు.
చంద్రకాంత ప్రధాన్, ఒడిశా
చంద్రకాంత ప్రధాన్‌కు 28 ఏళ్లు. ఆయనది కంధ్‌మాల్ జిల్లాలోని బైరపంగా గెన్ గ్రామం.
2014లో ఆయన సైన్యంలో చేరారు.
చంద్రకాంత ఆదివాసీ వర్గానికి చెందినవారు.
ఆయనకు తల్లి, తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు, ఓ అక్క ఉన్నారు. కుటుంబంలో సంపాదించేది చంద్రకాంత ఒక్కరే.
ఇప్పుడు ఆయన మరణంతో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది.
నందురమ్ సోరెన్, ఒడిశా
నందురామ్ సోరెన్ సైన్యంలో చేరి చాలా ఏళ్లు గడుస్తోంది.
12వ తరగతి పాస్ అయిన వెంటనే 1997లో ఆయన సైన్యంలో జవానుగా చేరారు.
ఆయనది మయూర్‌భంజ్ జిల్లాలోని రాయరంగపుర్‌లో ఉన్న చంపువాడ గ్రామం.
నందురామ్ వయసు 43 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
(భువనేశ్వర్ నుంచి సందీప్ సాహూ)
గుర్విందర్ సింగ్, పంజాబ్
గుర్విందర్ సింగ్ వయసు 22 ఏళ్లే. ఆయన సంగరూర్ జిల్లాలోని లోలేవాలా గ్రామానికి చెందినవారు.
గుర్విందర్ రెండున్నరేళ్ల కిందటే సైన్యం చేరారు. ఆయనది 3-పంజాబ్ రెజిమెంట్.
గుర్విందర్‌కు పెళ్లి చేసేందుకు ఇంట్లో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అనుకోకుండా ఆయన ప్రాణాలు కోల్పోయారు.
గుర్విందర్‌ది వ్యవసాయ కుటుంబం. గత నవంబర్‌లో ఆయన స్వగ్రామానికి వచ్చి, మూడు రోజులు ఉండి వెళ్లారు.
20 రోజుల క్రితం చివరగా ఆయన ఇంట్లోవారితో ఫోన్‌లో మాట్లాడారు.
(బీబీసీ పంజాబీ కోసం సుఖ్‌చరణ్ ప్రీత్)
సత్నమ్ సింగ్, పంజాబ్
సత్నమ్ సింగ్ 3-పంజాబ్ రెజిమెంట్‌కు చెందినవారు. ఆయనది గురుదాస్‌పుర్.
సత్నమ్‌కు తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సత్నమ్ తండ్రి కూడా ఇదివరకు సైన్యంలో పనిచేశారు. ఆయన సోదరుడు సుఖ్‌చైన్ సింగ్ ఇప్పుడు సైన్యంలోనే ఉన్నారు.
తాను ఎక్కడ విధులు వేస్తున్నారో సత్నమ్ సింగ్ కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
(బీబీసీ పంజాబీ కోసం గురుప్రీత్ చావ్లా)
మన్‌దీప్ సింగ్, పంజాబ్
మన్‌దీప్ సింగ్ 1998లో సైన్యంలో చేరారు. ఆయన పటియాలా సమీపంలోని సీల్ గ్రామానికి చెందినవారు.
మన్‌దీప్ సింగ్‌కు తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వితంతువులైన ఇద్దరు సోదరీమణులు భారం కూడా మందీప్‌పైనే ఉండేది.
మన్‌దీప్ మరణంతో ఇప్పుడు వారంతా ఆధారం కోల్పోయారు.
(బీబీసీ పంజాబీ కోసం, అరవింద్ ఛాబ్డా)
గురుతేజ్ సింగ్, పంజాబ్
గురుతేజ్ మనసా సమీపంలో బెర్రేవాల్ డోగ్రా గ్రామానికి చెందివారు. ఆయన వయసు 20 ఏళ్లే.
జూన్ 15న గురుతేజ్ అన్న పెళ్లి జరిగింది.
చైనాతో సరిహద్దుల్లో ఘటనల నేపథ్యంలో ఆయన సెలవు రద్దైంది.
ఇంటి ముందు ఒక సోదరుడి కోసం వేసిన టెంట్, మరో సోదరుడి అంత్యక్రియలకు అలాగే వాడాల్సి వస్తుందని ఆ కుటుంబంలో ఎవరూ ఊహించలేదు.
సంబరాల్లో ఉన్న ఆ కుటుంబం సంతోషం అంతా ఒక్క ఫోన్ కాల్‌తో దూరమైపోయింది.
(బీబీసీ పంజాబీ కోసం సురిందర్ మానన్)

ఫొటో సోర్స్, Ashwini Sharma
అంకుశ్ ఠాకుర్, హిమాచల్ ప్రదేశ్
అంకుశ్ వయసు 21 ఏళ్లు. వారి కుటుంబంలో ఆయన మూడో తరం సైనికుడు. అంకుశ్ తండ్రి, తాత కూడా సైన్యంలో పనిచేశారు.
ఏడాదిన్నర క్రితమే అంకుశ్ సైన్యంలో చేరారు.
సియాచిన్‌లో పోస్టింగ్ పూర్తైన తర్వాత ఆయన హహీర్ పుర్‌లోని తన ఇంటికి సెలవుపై రావాల్సి ఉంది.
కానీ, కొన్ని రోజుల క్రితమే ఆయన లద్ధాఖ్ వెళ్లారు. అక్కడి నుంచి తొందర్లోనే ఇంటికి వస్తానని తన తండ్రికి ఫోన్‌లో చెప్పారు.
అంకుశ్ తండ్రి సైన్యం నుంచి ఇటీవల రిటైరయ్యారు. సియాచిన్‌లో అంకుశ్ తొలి పోస్టింగ్ ముగిసి ఇంటికి చేరుకున్నాక, అన్నీ కలిపీ విందు చేసుకుందామని ఆ కుటుంబం ప్రణాళికలు వేసుకుంది.
ఇంతలోనే వారు ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది.
(అశ్వినీ శర్మ, బీబీసీ హిందీ కోసం)
(కూర్పు: సల్మాన్ రవీ)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









