భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: 'అఖిలపక్షంలో ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు' -పీఎంఓ

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు జరిగిన అఖిల పక్ష సమావేశంలో చెప్పిన మాటలను దురుద్దేశంతో వక్రీకరిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎల్ఏసీని ఉల్లంఘించే ఎలాంటి ప్రయత్నాలనైనా భారత్ ధృఢంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేయడమే కాకుండా ఈ రకమైన సవాళ్ళు ఎదురైనప్పుడు గతంలో మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, భారత సైన్యం ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి(ఉన్హే రోక్తే హైఁ, ఉన్హే టోక్తే హైఁ) ఇప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించే స్థితిలో ఉందని ప్రధాని చెప్పారని ఈ ప్రకటనలో తెలిపారు.
చైనా సేనలు ఎల్ఏసీ వద్ద భారీ సంఖ్యలో మోహరించాయని, భారత ప్రతిస్పందన కూడా అంతే స్థాయిలో ఉందని కూడా అఖిల పక్ష భేటిలో చెప్పారని ఈ ప్రకటన వెల్లడించింది. ఇక ఎల్ఏసీ ఉల్లంఘనల విషయానికి వస్తే, జూన్ 15న చైనా తన భూభాగంలో ఎల్ఏసీ వెంబడి నిర్మాణాలు చేపడుతోందని, ఆ చర్యలను నిలిపివేయడానికి వారు తిరస్కరించడం వల్ గల్వాన్ హింస జరిగిందని కూడా ప్రధాని స్పష్టం చేశారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
గల్వాన్ లోయ ఘర్షణల్లో మృతి చెందిన 20 మంది భారత సైనికుల ధైర్య సాహసాలను ప్రశంసించిన ప్రధాని మోదీ, వారి పోరాటం వల్లే ఎల్ఏసీ వెంబడి నిర్మాణాల కోసం చైనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. అంతేకాకుండా, చైనా సైనికులు రేఖను ఉల్లంఘించకుండా భారత సైనికులు అడ్డుకున్నారని ప్రధాని చెప్పారని పీఎంఓ తన ప్రకటనలో తెలిపింది.
మన సైనికులు ఎంతో సాహసంతో ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ వ్యవహారంపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ జాతీయ సమస్యను ఎదుర్కొవడానికి అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయని కూడా అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
'గల్వాన్ లోయ మొత్తం మాదే.. భారత సైనికులు బారికేడ్లు నిర్మించారు'
భారత సైనికులెవ్వరూ తన అదుపులో లేరంటున్న చైనా, గల్వాన్‌లోయ మాత్రం పూర్తిగా తమ అదుపులోనే ఉందని స్పష్టంగా చెబుతోంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ రోజువారీ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆ శాఖ ప్రతినిధి చావో లిజియన్ "నాకు తెలిసినంతవరకు చైనా అదుపులో భారత సైనికులు ఎవరూ లేరు" అని అన్నారు. భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ఆయన ధృవీకరించలేదు. అయితే జూన్ 15-16 రాత్రి హింసాత్మక ఘర్షణ తరువాత భారత్‌కు చెందిన నలుగురు అధికారులను, ఆరుగురు జవాన్లను చైనా తన అదుపులోకి తీసుకున్నట్లు భారతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
ఒకపక్క చైనాపై భారత్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు, గల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా వస్తువులను బహిష్కరించాలని చేస్తున్న ప్రకటనలపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధిని ప్రశ్నించగా " గల్వాన్‌లోయలో ఏమి జరిగిందో దానికంతటికీ బాధ్యత భారతదేశానిదే'' అన్నారు. రెండుదేశాలు సైనిక, దౌత్యమార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నాయని, ఉద్రిక్తతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు."భారతదేశంతో సంబంధాలు చాలా విలువైనవిగా చైనా భావిస్తుంది. ఇరుదేశాల అభివృద్ధికి, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి భారత్‌తో కలిసి పని చేస్తాం'' అని ఆయన అన్నారు. అయితే గల్వాన్ వ్యాలీ ఘర్షణలో పొరపాటు భారత్‌దేనని, భారత సైనికులు తమ దేశ పరిధిలోకి చొరబడ్డారని, గాల్వన్ యావత్తు తమ ఆధీనంలోనే ఉందని తేల్చి చెప్పారు లిజియన్.

ఫొటో సోర్స్, EPA
గల్వాన్ వ్యాలీపై చైనా ఏం చెప్పింది?
చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ ప్రకారం.. మొత్తం గల్వాన్ లోయ భారత-చైనా సరిహద్దు పశ్చిమభాగంలో చైనావైపు ఎల్‌ఏసీ రేఖ పరిధిలో ఉంది. చాలా సంవత్సరాలుగా, చైనా సైనికులు ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి, వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ లోయలో, భారత సైన్యం ఏకపక్షంగా రోడ్లు, వంతెనలు, స్థావరాలను నిర్మించింది. ఈ విషయంపై చైనా చాలాసార్లు ఫిర్యాదు చేసింది. కాని భారతదేశం రెచ్చగొట్టేలా వ్యవహరించింది. భారత సైనికులు ఎల్‌ఏసీని దాటి వచ్చారు. మే 6 ఉదయం ఎల్ఏసీ వద్ద సరిహద్దులో నిలబడిన భారత దళాలు, రాత్రి ఎల్ఏసీని దాటి చైనా భూభాగంలోకి వచ్చి అక్కడ బారికేడ్లను నిర్మించాయి. భారత సైనికులు సరిహద్దులో నిలబడిన చైనా దళాల పెట్రోలింగ్‌కు అడ్డంకులు సృష్టించారు.
భారత దళాలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలు చేపట్టారని, అక్కడున్న యథాతథ స్థితిని చెడగొట్టాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి చావో లిజియన్ చెప్పుకొచ్చారు. వీటిని ఎదుర్కోడానికి చైనా సైన్యం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందని, తమ భూమిని కాపాడుకోవడానికి చొరబడి వచ్చిన భారత సైనికులతో బాహాబాహీకి దిగాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉద్రిక్తతను తగ్గించడానికి భారత్-చైనాలు సైనిక, దౌత్య మార్గాలపై చర్చలు జరిపాయని చావో వెల్లడించారు. చైనా డిమాండ్లకు ప్రతిస్పందనగా, ఎల్ఏసీని దాటిన తన దళాలను వెనక్కి పిలవడానికి, నిర్మించిన కట్టడాలను కూలగొట్టడానికి భారత్ అంగీకరించిందని కూడా మీడియాకు చెప్పారు లిజియన్. జూన్ 6న ఇరుపక్షాలు కమాండర్ స్థాయిలో చర్చలు జరిపి, ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. తాము ఇక గల్వాన్ నదిని దాటబోమని భారత్ చెప్పినట్లు, చర్చల ద్వారా ఇరుపక్షాలు దశల వారీగా దళాలను ఉపసంహరించుకోవడానికి భారత్ అంగీకరించినట్లు వెల్లడించారు చావో లిజియన్.
గల్వాన్ లోయలో భారత్ పదేపదే నిబంధనలు ఉల్లంఘించిందని చైనా వాదిస్తోంది. జూన్ 15 రాత్రి, కమాండర్ స్థాయి సమావేశంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దులోని భారత దళాలు మళ్లీ ఎల్‌ఏసీని దాటాయని, ఉద్రిక్తతలు తగ్గుతున్న సమయంలో ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని చైనా చెబుతోంది. చర్చల కోసం వచ్చిన చైనా సైనికులు, అధికారులపై కూడా భారత సైనికులు దాడి చేశారని చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ అన్నారు. అదే తీవ్ర హింసకు కారణమై భారత సైనికులు మరణించారని వెల్లడించారు.
భారత సైన్యం చేసిన ఈ దుందుడుకు చర్య సరిహద్దు ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతిని బలహీనపరిచిందని, భారత్ తన సైనికుల జీవితాలను దెబ్బతీసుకుందని, సరిహద్దు వివాదంపై ఇరుపక్షాల మధ్య ఒప్పందాన్ని, అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక సూత్రాలను భారత్ ఉల్లంఘించిందని చైనా ఆరోపించింది. భారత వైఖరిని చైనా తీవ్రంగా ఖండించింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయ శంకర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా ఇవే ఆరోపణలు చేశారు. గల్వాన్ లోయ సంఘటనపై దర్యాప్తు చేయాలని, బాధ్యులను శిక్షించాలని, సరిహద్దులో ఉన్న భారత దళాలను క్రమశిక్షణలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రౌండ్‌లెవెల్లో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కమాండర్ల మధ్య రెండవ సమావేశం కూడా ఉంటుందని వాంగ్ వెల్లడించారు. గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత పరిస్థితులను ఎదుర్కోవటానికి ఇరు పక్షాలు న్యాయమైన రీతిలో పనిచేయాలని, కమాండర్ స్థాయి సమావేశంలో కుదిరిన ఒప్పందాలను అనుసరించాలని, వీలైనంత త్వరగా పరిస్థితిని శాంతింపజేయాలని ఆయన కోరారు.

ఫొటో సోర్స్, AFP
భారత్ ఏమంటోంది?
ఇండో-చైనా సరిహద్దులో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదని, భారత పోస్టులలో ఏ ఒక్కదానిని స్వాధీనం చేసుకోలేదని ఆయన వివరించారు. భారతదేశం శాంతి, స్నేహాన్ని కోరుకుంటుందని, అయితే అది తన సార్వభౌమత్వం విషయంలో రాజీ పడదని ప్రధాని మోదీ అన్నారు.
"ఇప్పటి వరకు వారిని ఎవరూ ప్రశ్నించలేదు, ఎవరూ ఆపలేదు. ఇప్పుడు మన సైనికులు వారిని అనేక రకాలుగా అడ్డుకుంటున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు" అని ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశంలో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనాతో ఘర్షణలో భారత్ సైనికులు ఆయుధాలు వాడకపోవడానికి కారణమైన ఆ ఒప్పందంలో ఏముంది? ప్రాణాపాయ పరిస్థితుల్లో సైనికులు ఆయుధాలు వాడొచ్చా? లేదా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









