మారుతీ రావు ఆత్మహత్యపై అమృత స్పందన.. ‘తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు’

ఏ1 నిందితుడు మారుతిరావు

ఫొటో సోర్స్, NAlgonda police/fb

ఫొటో క్యాప్షన్, ఏ1 నిందితుడు మారుతిరావు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 24 ఏళ్ల యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన తిరునగరు మారుతీరావు మృతి చెందారు.

తన కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన మారుతీరావు హత్య చేయించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో జైలుకు వెళ్లి, ఆరు నెలల కిందట బెయిల్‌పై విడుదలైన మారుతీరావు.. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఖైరతాబాద్ పోలీసులు తెలిపారు.

అయితే, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌కు వచ్చి గది అద్దెకు తీసుకున్నారని పోలీసులు చెప్పారు.

ఆదివారం ఉదయం మారుతీ రావు భార్య ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. సెల్‌ఫోన్‌కు ఫోన్ చేస్తే స్పందించకపోవటంతో ఆర్యవైశ్య భవన్ రిసెప్షన్‌కు ఫోన్ చేసింది. అలాగే, అనుమానంతో పోలీసులకు కూడా ఆమే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.

భవన్ సిబ్బంది మారుతీరావు బస చేసిన గదికి వెళ్లినా ఆయన స్పందించలేదు. ఈలోపు భవన్ వద్దకు చేరుకున్న పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా ఆయన మంచంపై విగతజీవిగా కనిపించారు.

మారుతీరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

'తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు'

దీనిపై అమృత స్పందిస్తూ.. మీడియా ద్వారానే తనకు విషయం తెలిసిందని, అంతకు మించి మరే వివరాలూ తెలియవని అన్నారు.

‘‘బహుశా పశ్చాత్తాపపడి ఉండొచ్చు. చేసినతప్పు తెలుసుకుని (ఇలా ఆత్మహత్య) చేసుకుని ఉండొచ్చు. మరే ఇతర కారణాలు ఉన్నాయో, మాకైతే ఇంకా తెలీదు. ప్రణయ్‌ని చంపేసిన తర్వాత నేను అతనితో మాట్లాడలేదు, అతడిని చూడలేదు. ఆయన ఇక్కడికి రాలేదు. చూడలేదు. అసలు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆయనతో ఎలాంటి కాంటాక్ట్ లేదు నాకు. ఆయన చనిపోయింది నిజమో కాదో కూడా మాకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈరోజు ఏమీ చెప్పలేం. రేపు ఏమైనా చెప్పగలిగితే చెబుతాం’’ అన్నారు.

అమృత, ప్రణయ్

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook

ఫొటో క్యాప్షన్, ప్రణయ్, అమృత

గతంలో ఏం జరిగిందంటే..

ప్రణయ్‌, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ది షెడ్యూల్డ్‌ కులానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. అమ్మాయిది ఉన్నత సామాజిక వర్గం. ఆమె తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి.

తమ మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతిరావే కిరాయి హంతకులతో ప్రణయ్‌ని హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తూ మారుతీరావును ఏ1గా, అతని తమ్ముడు శ్రవణ్‌ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, అలా చెబితే ఆస్తి మొత్తం రాసిస్తానంటూ తన తండ్రి ఒత్తిడి చేస్తున్నారని గతంలో అమృత ఆరోపించారు.

ప్రణయ్ చనిపోయేప్పుడు గర్భవతిగా ఉన్న అమృత తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చారు..

(మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుడిని సంప్రదించండి. One Life +91 7893078930, Roshni Trust: +914066202000, +914066202001, Makro Foundation - Suicide Prevention Helpdesk +9104046004600లను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)