పాకిస్తాన్‌లో మహిళల మార్చ్.. హింసాత్మక బెదిరింపులు

ఫొటో సోర్స్, AAmir Qureshi
'చదర్ ఔర్ చార్ దివారీ'.. అంటే దుప్పటి ముసుగు, నాలుగు గోడలే మహిళలకు సరైన స్థానం అనేది పాకిస్తాన్‌లోని ఛాందసవాదులు తరచూ చెప్పే మాట.
కానీ, ఇలాంటి నమ్మకాన్ని ధిక్కరిస్తూ అక్కడి మహిళలు హింసా ముప్పు, న్యాయపరమైన వ్యాజ్యాల నడుమ తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న పాకిస్తాన్‌లోని వివిధ నగరాల్లో 2018 నుంచి ఔరత్ మార్చ్ (మహిళల మార్చ్) నిర్వహిస్తున్నారు.
ముస్లిం దేశమైన పాకిస్తాన్‌లో నిత్యం వేధింపులు ఎదుర్కొనే మహిళలకు అక్కడ బహిరంగ ప్రదేశాలకు రావడమే చాలా పెద్ద విషయం.
గత ఏడాది ఇలాంటి ర్యాలీలో పాల్గొన్న మహిళలు తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో హెచ్చరికలు వచ్చాయని.. చంపేస్తామని, రేప్ చేస్తామని బెదిరించారని వారు చెబుతున్నారు.
ఈ ఏడాది ఈ ర్యాలీకి అనుకూలంగా మాట్లాడేవారు, వ్యతిరేకించేవారు ఇద్దరూ తమతమ స్వరాలు పెంచారు.
ఈ మార్చ్ ఇస్లాంకు వ్యతిరేకమని పాకిస్తాన్‌లో ఛాందస రాజకీయ వర్గాలు అంటుండగా మధ్యేవాదులూ ఈ మార్చ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
''మహిళలు బయటకు రావడం, ఎక్కడికైనా వెళ్లడానికి సంబంధించి తమ హక్కుల గురించి ప్రశ్నించడంపై మా సమాజంలో తీవ్రమైన సంఘర్షణ ఉంది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని 38 ఏళ్ల కరాచీవాసి ఒకరు అన్నారు.
మహిళలపై వేధింపులు, హింస ఆపేయాలని కోరుతూ కొద్ది మంది మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కరాచీలోని ఒక పార్కులో సమావేశం కావడంతో ఈ మార్చ్ మొదలైంది. ఆ తరువాత క్రమంగా ఇది పెద్దదైంది.
అమెరికాలోని ఇలాంటి కార్యక్రమాల స్ఫూర్తిగా ఈ మార్చ్ మొదలైంది. కానీ, పాకిస్తాన్‌లో జరిగిన కొన్ని ఘటనలు దీన్ని మరింత రగిలించాయి.
సోషల్ మీడియా స్టార్ కందీల్ బలూచ్‌ను ఆమె సొంత సోదరుడే హతమార్చడం, మరికొన్ని ఇలాంటి ఘటనలు అక్కడ మహిళలపై జరుగుతున్న హింసను వెలుగులోకి తెచ్చాయి.
''మేం ఇలాంటి పరిస్థితిని సవాల్ చేస్తున్నాం.. మా సమాజంలోని ఇలాంటి తిరోగామి అంశాలనూ సవాల్ చేస్తున్నాం'' అని ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Arif ali
హక్కులను తెంచుకుపోండి
ఈ ఏడాది కార్యక్రమంలో ప్రధాన డిమాండ్ మహిళలకు ఆర్థిక న్యాయం. అయితే, గత ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో నినాదాలు, చిహ్నాలు అందరి దృష్టిని తిప్పుకొన్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రధాన ప్రసార మాధ్యమాలు, ఆన్‌లైన్‌లోనూ తీవ్రమైన విమర్శలు, దూషణలు ఎదుర్కొన్నారు.
''నా దేహం నా ఇష్టం' అనే నినాదాలతో నిరుడు నిర్వహించిన ర్యాలీ వివాదాస్పదమైంది. ఈసారి ర్యాలీపైనా ఆ ప్రభావం ఉంది.
తమ శరీరంపై నియంత్రణ హక్కు తమకే ఉండాలన్న ఉద్దేశం ఈ నినాదంలో ఉందని ర్యాలీ నిర్వాహకులు చెబుతుండగా విమర్శకులు మాత్రం ఇది బూతు అర్థాన్నిస్తోందని, అశ్లీలంగా ఉందని అంటున్నారు.
ఈ ఉద్యమం భావజాలం పూర్తి పాశ్చాత్యంగా ఉందని ఆరోపించేవారికి ఈ నినాదం ప్రధానాస్త్రంగా మారింది.

ఫొటో సోర్స్, Aurat march
గత ఏడాది మార్చ్ సందర్భంగా 'నా దేహం.. నా ఇష్టం' క్యాప్షన్‌తో నూర్ (అసలు పేరు కాదు) ఒక పోస్టర్ తయారుచేశారు. వేధింపులు, అత్యాచార భయం లేకుండా తన సొంత శరీరంపై నచ్చిన దుస్తులు ధరించే, నచ్చిన పని చేసే హక్కు ఉందని చెబుతూ ఆమె పోస్టర్ తయారుచేశారు.
దీనిపట్ల వచ్చిన ప్రతికూల స్పందనలు తనను బాగా భయపెట్టాయని.. తన సొంత పేరు బయటపెట్టుకుని మాట్లాడలేనని 'బీబీసీ'తో ఆమె అన్నారు.
ఈ కార్యక్రమ ఏర్పాటులో ప్రమేయం ఉన్నవారూ ఈ నినాదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అంగీకరిస్తూనే సామాజిక నిబంధనలను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ స్థాయి అవసరమని వాదించారు.
ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాలను వివరించడానికి నిర్వాహక బృందంలోని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ పాకిస్తానీ సమాజంలో దీనిపై నెలకొన్న సంఘర్షణను ఆపలేకపోయాయి.
ఈ వివాదం లాహోర్ కోర్టుకూ చేరింది. ఈ మార్చ్‌ను ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇస్లాంకు వ్యతిరేకంగా అసభ్యత, అరాచకత్వం, దూషణ వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమంటూ పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు కానీ, నిర్వాహకులు హుందాతనం, నైతిక విలువలు పాటించాలని కోర్టు సూచించింది.
మార్చ్ సమీపిస్తున్నకొద్దీ దీనిపై ఘర్షణ తీవ్రతరమవుతోంది. మహిళా వ్యతిరేకిగా పేరుపడిన ఓ నాటక రచయిత తాజాగా ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని అదే కార్యక్రమంలో ఉన్న మరో మహిళా హక్కుల కార్యకర్తను దూషించారు.
ఆయన చర్యను పలువురు ఖండించినప్పటికీ అదే వ్యక్తులు ఈ కార్యక్రమ నిర్వాహకులను హెచ్చరిస్తూ సందేశాలు పంపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ నటి మాహిరా ఖాన్ దీనిపై స్పందిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తున్నానని.. అయితే, రెచ్చగొట్టే ప్లకార్డులు వినియోగించరాదని ట్వీట్ చేశారు.
అయితే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కొన్ని ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ ముందుకొస్తున్నాయి.
కాగా ఈ కార్యక్రమ వలంటీర్లు తమపై యాసిడ్ దాడులు, బాంబు దాడులు జరగొచ్చని ఆందోళన చెందుతున్నారు.
'మేం భయపడుతున్నాం. అయితే, మాకు భయం లేకపోతే మార్పు వస్తుందని ఎలా కోరుకోగలం'' అంటున్నారు వారు.
ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ముసుగులు తీసి, నాలుగు గోడలు దాటి మహిళలు రావాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- ‘దేవుణ్ణి పూజించాలి, గే వివాహాలను నిషేధించాలి’ - రాజ్యంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పుతిన్
- శశిథరూర్ మెడలో వేలాడుతున్న గాడ్జెట్ ఏమిటో తెలుసా?
- అమరావతి ఉద్యమంలో పెరుగుతున్న కేసులు... జైళ్ళలో ఉద్యమకారులు
- వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు 93,000 కోట్లు చెల్లించడంలో విఫలమైతే ఏమవుతుంది?
- కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం.. లక్షలాది ఉత్పత్తుల్ని తొలగించిన అమెజాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









