కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం.. లక్షలాది ఉత్పత్తుల్ని వెబ్‌సైట్ నుంచి తొలగించిన అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని అలాగే ఆ వ్యాధిని నివారిస్తాయంటూ భారీ ధరలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న సుమారు 10 లక్షల ఆరోగ్య ఉత్పత్తులను తమ వైబ్‌సైట్ నుంచి తొలగించింది ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సంస్థ అమెజాన్.
ఆ ఉత్పత్తులు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయంటూ ఫిబ్రవరి నెల ప్రారంభంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈ పని చేసింది అమెజాన్. కరోనావైరస్ విషయంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో జనం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, ఇలాంటి తప్పుడు సమాచారంపై సాంకేతిక దిగ్గజాలు యుద్ధం ప్రకటించాలని డబ్యూహెచ్ఓ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం అమెజాన్ యూకేలో కరోనావైరస్ అని సెర్చ్ చేయగానే ఫేస్ మాస్క్‌లు, హెర్బల్ క్యాప్యుల్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌పై కొత్తగా ప్రచురించిన పుస్తకాలు ఇలా ఈ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్థులు ఎలా ప్రయత్నిస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.
వెబ్ సైట్ జాబితా నుంచి ఏ ఏ ఉత్పత్తుల్ని తొలగించామన్న విషయాన్ని అమెజాన్ అందుబాటులో ఉంచలేదు. కానీ కరోనావైరస్ అని అమెజాన్ యూకే వెబ్ సైట్లో సెర్చ్ చేయగా ఇప్పటికీ ఉత్పత్తులు అధిక ధరల్లో దర్శనమిస్తున్నాయి.

ఫొటో సోర్స్, AMAZON
ఉదాహరణకు 50 సర్జికల్ మాస్క్‌ల ధర ఓ అమ్మకం దారుడు ఏకంగా 170 పౌండ్ల ధర చూపిస్తుండగా.. అదే తరహా మాస్క్‌లను వేరే అమ్మకం దారు కేవలం 36 పౌండ్లకే అమ్ముతున్నారు . నిజానికి 2020 జనవరి నాటికి వాటి ధర పది పౌండ్లకన్నా తక్కువే ఉండేది.
ఇటు ఇండియన్ వెబ్ సైట్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా వైరస్ సెర్చ్ చేసినప్పుడు పుస్తకాలతో పాటు కొన్ని హోమియోపతి మందులు, లేపనాలు కనిపించగా... కొంత మంది అమ్మకందారులు వాడి పారేసే వంద సర్జికల్ మాస్క్‌ల ధర సుమారు రూ. 2,495గా చూపిస్తున్నారు. హోల్ సేల్ మార్కెట్లో ధరలకు అమెజాన్ వెబ్ సైట్ ధరలకు సుమారు 20 నుంచి 30 శాతం వరకు తేడా ఉంటోంది.
నిజానికి కొన్ని మాస్కులు ప్రస్తుత అవసరాలకు ఏ మాత్రం సరిపోవు కూడా. వైద్యులు సూచించిన మాస్కులతో పోల్చితే వాటి నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి.
అలాగే ప్రముఖ బ్రాండ్లకు చెందిన శానిటైజింగ్ జెల్ మూడు సీసాల ప్యాక్ ధర జనవరి వరకు 10 నుంచి 15 పౌండ్లు మాత్రమే ఉండేది. ఒకానొక సమయంలో 50 పౌండ్ల ధర పలకగా ప్రస్తుతం 30 పౌండ్ల పలుకుతోంది.
డిమాండ్ పెరగడం వల్లే
అయితే అమెజాన్‌లో ధరల పేరుతో దోచుకోవడం ఉండదని ఆ సంస్థ అమెజాన్ యూకె అధికార ప్రతినిధి తెలిపినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పెరిగిన ధరల పరిస్థితేంటని ప్రశ్నించినప్పుడు డిమాండ్ ఎక్కువైన కారణంగానే ధరల్లో తేడా వచ్చిందని ఆయన చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది .
అంతేకాదు కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేసే ఉత్పత్తులను తొలగిస్తామని అలాగే తాజా మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు అనుహ్యంగా పెరుగుదల కనిపించినా అదే పని చేస్తామని అమెజాన్ అధికార ప్రతినిధి రాయిటర్స్‌కు చెప్పారు . అలాగే ధరలను నిరంతరం పర్యవేక్షిస్తుంటామని కూడా స్పష్టం చేశారు .

ఇవి కూడా చదవండి
- దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..
- దిల్లీ హింస: రాజకీయ జోక్యానికి దిల్లీ పోలీసులు బలిపశువులయ్యారా? - అభిప్రాయం
- ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టారు - ప్రెస్ రివ్యూ
- ఉత్తర కొరియా: కొత్త సంవత్సరంలో రెండు క్షిపణుల పరీక్ష
- "అడవి మా అమ్మ.. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాం"
- నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా
- 'నా బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను' -అంకిత్ శర్మ తల్లి
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









