ఉత్తర కొరియా: కొత్త సంవత్సరంలో రెండు క్షిపణుల పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా రెండు గుర్తు తెలియని క్షిపణి పరీక్షలు నిర్వహించిందని దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఇది కొత్త సంవత్సరంలో ఉత్తర కొరియా చేసిన మొదటి ఆయుధ పరీక్ష.
వీటిని జపాన్ సముద్రం వైపు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది.
ఇవి తక్కువ రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు కావచ్చని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) పేర్కొంది.
18 నెలల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఉన్న ఉత్తర కొరియా గత మే నెలలో క్షిపణి పరీక్షలు చేసింది. చివరగా నవంబర్‍లో కూడా ఓ పరీక్ష నిర్వహించింది.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిచెందుతున్న తరుణంలో అమెరికాతో కలసి దక్షిణ కొరియా చేపట్టిన సంయుక్త విన్యాసాలను వాయిదా వేస్తున్నామని ప్రకటించిన కొన్ని రోజులకే ఉత్తర కొరియా ఈ పరీక్ష చేసింది. ఈ విన్యాసాలపై ప్యాంగ్‌యాంగ్ ఆగ్రహంతో ఉంది.
అమెరికాతో చర్చలు నిలిచిపోవడంతో.. అణు, దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈ సంవత్సరం ప్రారంభంలో కిమ్ ప్రకటించారు.
అంతేకాదు, అతి త్వరలో ఓ వ్యూహాత్మక ఆయుధ ప్రయోగాన్ని చూస్తారని ప్రపంచాన్ని హెచ్చరించారు.
2019 నవంబర్‌లో మిసైల్ టెస్ట్ నిర్వహించినప్పుడు.. "సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్"ను పరీక్షిస్తున్నామని ఉత్తర కొరియా ప్రకటించింది.

కానీ, ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిందని జపాన్ ప్రధాని షింజో అబే ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఉత్తర కొరియా మీడియా ఆయన్ను 'పిచ్చివాడు' అని పిలిచింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేయడంపై నిషేధం ఉంది. తమ వద్ద అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగల సామర్థ్యం ఉన్న క్షిపణులున్నాయని గతంలో ఉత్తర కొరియా ప్రకటించింది.
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణుకార్యక్రమాలపై చర్చల ప్రక్రియ స్తంభించింది.
2018లో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ల మధ్య సింగపూర్‌లో చరిత్రాత్మక సమావేశం జరిగింది. కానీ, దీని ప్రయోజనాలేంటనేది ఇప్పటికీ చర్చనీయమే.
2019 ఫిబ్రవరిలో కిమ్ వియెత్నాంలో ట్రంప్‌తో మరోసారి సమావేశమైనా ఎలాంటి అంగీకారం కుదరకుండానే చర్చలు నిలిచిపోయాయి.
వారిద్దరూ జూన్‌లో మరోసారి డీమిలిటరైజ్డ్ జోన్ (ఉభయ కొరియాల సరిహద్దు) దగ్గర చర్చలు జరిపారు. కానీ ఆ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
2019 చివర్లో ఉత్తరకొరియా అనేక స్వల్ప శ్రేణి ఆయుధ పరీక్షలు నిర్వహించింది. ఇది అమెరికాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా భావించారు.
కానీ, ఆంక్షలను తొలగించేందుకు అమెరికా నిరాకరించింది. ఉత్తర కొరియా ముందుగా తమ అణు కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి.
- కరోనా వైరస్: భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం ఎన్ని కోవిడ్ కేసులు బయటపడ్డాయి?
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- దేశ విభజన: "ఆ ముస్లింలు ఇక్కడే ఉండిపోవడం దేశానికి మేలు చేసినట్టేం కాదు" - యోగి ఆదిత్యనాథ్
- మహిళలను భారత సైన్యంలో కమాండర్లుగా అంగీకరించే పరిస్థితి లేదా?
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









