కరోనావైరస్ ప్రభావంతో విమానయాన సంస్థలు దివాలా తీయనున్నాయా...

ఫొటో సోర్స్, Getty Images
ఐరోపాలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లైబీ దివాలా తీయడం ఇలాంటి మరిన్ని సంస్థల పతనానికి నాంది కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కరోనావైరస్ వల్ల ఆర్థికంగా కలిగే నష్టం 11,300 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ విమానయానరంగ సంస్థ ఒకటి గురువారం అంచనా వేసింది.
బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ఫ్లైబీ ఎయిర్‌లైన్స్ దివాలా తీసిన రోజునే ఈ అంచనా వెలువడింది.
ఫ్లైబీ పతనం ''2020లో ఇలాంటి మరెన్నిటికో ఆరంభం'' అని రవాణా రంగ విశ్లేషకుడు జేమ్స్ గుడ్‌ఆల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''కోవిడ్-19 కారణంగా డిమాండ్ తగ్గి ఫ్లైబీ పతనమైంది, రానున్న కొద్ది నెలల్లో మరిన్ని విమానయాన సంస్థలూ దివాల తీయడం చూస్తాం'' అన్నారాయన.
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గడం వల్ల విమానయాన సంస్థలు 6,300 కోట్ల డాలర్ల నుంచి 11,300 కోట్ల డాలర్ల వరకు నష్టపోవచ్చని 'ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ)'' గురువారం అంచనా వేసింది.
''ఈ పరిణామాలతో అప్పుల్లో కూరుకుపోయే విమానయాన సంస్థల సంఖ్య పెరుగుతుంద''ని 'ది ఎయిర్‌లైన్ అనలిస్ట్' ఎంపీ మైఖేల్ డఫ్ అన్నారు.
తమ సంస్థ సూచీల్లో అనేక విమానయాన సంస్థల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నట్లు తేలిందని.. చైనా, హాంకాంగ్, థాయిలాండ్, దక్షిణకొరియా, నార్వే, మెక్సికోలకు చెందిన సంస్థలు ఇందులో ఉన్నాయని చెప్పారు.
''విమానయానరంగానికి ఇది అత్యంత క్లిష్ట సమయం, ముఖ్యంగా నగదు పొదుపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంద''ని ఫ్లైట్ గ్లోబల్ మ్యాగజీన్ అసియా మేనేజింగ్ ఎడిటర్ గ్రెగ్ వాల్‌డ్రన్ అన్నారు.
నగదు నిల్వలు తక్కువగా ఉన్న సంస్థలు, ముఖ్యంగా ధరల యుద్ధంలో మునిగితేలున్నవాటికి ఇది కష్టకాలమని చెప్పారు.
చైనా ప్రయాణికులపై ఎక్కువగా ఆధారపడే ఆసియాలోని ప్రాంతీయ విమానయాన సంస్థలకు గడ్డుకాలమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చాలా సంస్థలు ఇప్పటికే ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. విమానాలు తిరగకుండా ఖాళీగా ఉన్నందున వేతనం లేకుండా సెలవు తీసుకోవాలని.. జీతాలు తగ్గించుకోవాలని సంస్థలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి.
నెల రోజులు వేతనం లేని సెలవు తీసుకోవాలని ఎమిరేట్స్, మూడు వారాలు వేతనం లేని సెలవు తీసుకోవాలని కేథే పసిఫిక్ ఇప్పటికే తమ ఉద్యోగులకు సూచించాయి.
కరోనా దెబ్బకు కలిగిన నష్టం నుంచి కోలుకోవడానికి సంస్థను ఆదుకునే క్రమంలో అందులో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లు 10 నుంచి 15 శాతం జీతాలు తగ్గించుకున్నారు.. మరోవైపు కొత్త నియామకాలూ ఆగిపోయాయి.
విహారయాత్ర ప్రయాణాలే కాదు.. కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల ప్రయాణాలూ తగ్గడంతో డిమాండ్ భారీగా తగ్గింది. కార్పొరేట్ సంస్థలు తమ సమావేశాలు వాయిదా వేసుకోవడం, బిజినెస్ ట్రిప్‌లు తగ్గించుకోవడం వల్ల ఆ రంగం నుంచి ప్రయాణాలు తగ్గుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు ఉన్నాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- దిల్లీ హింస: తప్పి పోయిన పది రోజుల తర్వాత తిరిగి ఒడికి చేరిన మూడేళ్ల చిన్నారి సఫియా
- రేవంత్ రెడ్డి అరెస్ట్: డ్రోన్లతో ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించారనే కేసులో 14 రోజుల రిమాండ్
- కరోనావైరస్ తెలంగాణలో లేదన్న మంత్రి ఈటల... యూపీలో మరో కోవిడ్-19 కేసు... భారత్‌లో 30కి పెరిగిన బాధితుల సంఖ్య
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









