రేవంత్ రెడ్డి అరెస్ట్: డ్రోన్లతో ప్రైవేట్ ఆస్తులను చిత్రీకరించారనే కేసులో 14 రోజుల రిమాండ్

ఫొటో సోర్స్, www.facebook.com/revanthofficial
మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి అరెస్ట్ అయ్యారు. గతంలో ఆయన ఒకసారి నామినేటెడ్ ఎమ్మెల్యేకి డబ్బు ఆశ చూపిన కేసులో ఏసీబీకి చిక్కి అరెస్టు కాగా, తాజాగా నార్సింగి పోలీసులు డ్రోన్ కెమెరాకు సంబంధించిన వివాదంలో అరెస్ట్ చేశారు.
రేవంత్ గురువారం సాయంత్రం దిల్లీ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి, అక్కడ నుంచి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆపై రాజేంద్ర నగర్ లోని జడ్జి నివాసంలో హాజరుపరచగా... న్యాయమూర్తి రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు .
డ్రోన్ గొడవేంటి?
హైదరాబాద్ శివార్లలోని మియాఖాన్ గూడ సమీపంలో ఒక ఫాంహౌస్‌ను కేటీఆర్ లీజుకు తీసుకున్నారు. నీటి వనరుల దగ్గర నిర్మాణాలను నిషేధించే జీవో 111 ని ఉల్లంఘించి, 25 ఎకరాల విశాల స్థలంలో కేటీఆర్ ఆ ఫాంహౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ వంటి నేతలు రేవంత్ ఆరోపణల్ని ఖండిస్తూ వచ్చారు.
ఇటీవల, స్థానిక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలసి ఆ ఫాంహౌస్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఫాంహౌస్ దగ్గర కొందరు వ్యక్తులు డ్రోన్లు ఉపయోగించారు.
ప్రైవేటు వ్యక్తుల ఆస్తులపై అనుమతిలేకుండా డ్రోన్ ఉపయోగించడం చట్ట విరుద్ధం. దీంతో డ్రోన్ ఉపయోగించినట్టుగా భావించిన ప్రవీణ్ పాల్ రెడ్డి , విజయసింహా రెడ్డి, జైపాల్ రెడ్డి, శివ, ఓంప్రకాశ్ రెడ్డిలతో పాటూ రాజేశ్ అనే డ్రోన్ ఆపరేటర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఏ1గా చూపించారు పోలీసులు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారనడానికి తమ వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని చెబుతున్నారు.
దాంతో పాటూ ప్రస్తుతం ఆయన భూకబ్జా కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో అనధికారికంగా, తప్పుడు రికార్డుల ద్వారా భూమి కొన్నారంటూ ఆయనపై ఆర్డీవో స్థాయి అధికారి నిర్వహించిన విచారణలో తేలింది.

ఫొటో సోర్స్, www.facebook.com/revanthofficial
రేవంత్ రెడ్డి భూమి వివాదం:
ఈ డ్రోన్ వివాదం కంటే ముందు నుంచీ, మరో వివాదంలో రేవంత్ ఇరుక్కున్నారు. హైదరాబాద్‌లోని గోపన్నపల్లిలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి కలసి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
ఆపై టీఆర్ఎస్ నేతలు రేవంత్ సోదరుల్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు మొదలు పెట్టారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో రేవంత్ కి 10.21 ఎకరాల పట్టా భూమి ఉంది.
అందులో 6 ఎకరాల 7 గుంటల భూమిని రేవంత్ సోదరులు అక్రమంగా సొంతం చేసుకున్నారనేది ఆరోపణ. ఆ ఆరోపణకు మరింత బలం చేకూరుస్తూ ఆ సర్వే నెంబర్లలో అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది.
దాంతో రాజేంద్ర నగర్ ఆర్డీవో చంద్రకళను విచారణ అధికారిగా నియమిస్తూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఒక కమిటీ వేశారు. రేవంత్ వోల్టా చట్టాన్ని ఉల్లంఘించి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని అందుకు ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో చంద్రకళ నివేదిక ఇచ్చారు.
ఎలా చేశారంటే?
గోపనపల్లి గ్రామం సర్వే నంబర్ 127 కు సంబంధించి భూ రికార్డులు స్పష్టంగా లేవు. 1977 వరకు వడ్డె హనుమ, మల్లయ్య పేర్లున్నాయి. 1978-79 నుంచి 1990-91 వరకూ రికార్డుల్లో ఇంటి పేరు లేకుండా కేవలం 'మల్లయ్య' పేరుతో పహాణీ ఉంది.
1993-94 వంత్సరానికి వచ్చేసరికి ఈ భూమి పట్టాదారుగా కొత్తగా 'దబ్బ' మల్లయ్య అనే పేరు రికార్డుల్లో చేరింది. తిరిగి 2001-02 పహాణీల్లో కొత్తగా 'ఇ. మల్లయ్య' అన్న పేరు నమోదయింది. 2005లో ఇ లక్ష్మయ్య అనే వ్యక్తి, తాను ఇ.మల్లయ్యకు వారసుడినని ప్రకటించుకున్నారు.
దీంతో అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్ అతని పేరిట 2 ఎకరాల 21 గుంటల రికార్డుల్లో ఎక్కించారు. తరువాత ఏమైందో కానీ, మళ్లీ 31 గుంటలకు తగ్గించారు. ఇలా భూమి చేర్చడానికి ఆపై తగ్గించడానికి కానీ, వాళ్ల పేర్లూ ఇంటి పేర్లూ ఎందుకు మారాయన్నదానికి కానీ ఎలాంటి ఆధారమూ లేదు.
కానీ, ఆ సదరు మల్లయ్య నుంచి రేవంత్ భూమి కొన్నారు. ఆ రికార్డుల్లో 2005లో రేవంత్ పేరు చేరింది. తరువాత అదే ఇ. లక్ష్మయ్య మరో 1.29 ఎకరాన్ని రేవంత్ సోదరుడికి అమ్మారు. ఇది 2015లో మ్యుటేషన్ అయింది. ఇక డి.మల్లయ్య అనే వ్యక్తి అదే సర్వే నంబరులో 2.20 ఎకరాలను కళావతికి అమ్మగా, ఆ కళావతి ఆ భూమిని తిరిగి రేవంత్ సోదరునికి అమ్మారు.
ఇంకో 1.24 ఎకరాలను ఒక నలుగురు వ్యక్తులు కొనుక్కుని వారు కూడా తిరిగి రేవంత్ కే ఆ భూమి అమ్మారు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే రేవంత్ లేదా, ఆయన సోదరులకు భూమి అమ్మిన వాళ్లు కానీ, వాళ్లకు భూములు అమ్మిన మల్లయ్య, లక్ష్మయ్యలు కానీ ఎవరు? వారెక్కడ ఉన్నారు? వారికి సంబంధించిన ఐడెంటిటీ ఏంటనేది స్పష్టంగా లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే గోపనపల్లిలోని 127వ సర్వేనంబరులో రేవంత్ కి ఉన్న భూమిలో ఉన్న 5.21 ఎకరాల భూమికి యజమాని ఎవరన్నది రెవెన్యూ రికార్డుల్లో కూడా స్పష్టంగా లేదు. సరిగ్గా ఈ లోపాలను ఉపయోగించుకొని ఆ భూమిని తమ సొంతం చేసుకోవడానికి రేవంత్ కుటుంబం ప్రయత్నించిందనేది అభియోగం. దీనికి అదనంగా తనకున్న భూమే కాకుండా, సర్వే నంబరు 34 లోని 1.11 ఎకరాల ప్రభుత్వ భూమి, సర్వే 127లోని 0.09 ఎకరాల బండ్లబాట ఆక్రమించుకున్నారని ఆయన వచ్చిన ఆరోపణ. అలాగే శిఖం భూముల్లో శాశ్వత నిర్మాణాలు చెయ్యకూడదన్న నిబంధనను కూడా రేవంత్ సోదరులు పాటించలేదు. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి రేవంత్, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై పలు కేసులు ఉన్నాయి.
హైకోర్టుకు రేవంత్:
దీనిపై రేవంత్ సోదరులు హైకోర్టుకు వెళ్లారు. 2005 నుంచీ తమ అధీనంలో ఉన్న భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకోవాలని చూస్తోందనీ, అలా జరగకుండా అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు శుక్రవారానికి వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి
- రేవంత్‌రెడ్డి: ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకూ
- పొత్తూరి వెంకటేశ్వర్రావు (1934-2020): 'వృత్తి ధర్మాన్ని నిష్ఠగా పాటించిన సంపాదకుడు'
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్... మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ తెలంగాణలో లేదన్న మంత్రి ఈటల... యూపీలో మరో కోవిడ్-19 కేసు... భారత్‌లో 30కి పెరిగిన బాధితుల సంఖ్య
- వెనెజ్వెలా: మహిళలు ఒక్కొక్కరు ఆరుగురు పిల్లల్ని కనాలని చెప్పిన అధ్యక్షుడు మదురో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









