ఆంధ్రప్రదేశ్: అమరావతి ఉద్యమంలో పెరుగుతున్న కేసులు... జైళ్ళలో ఉద్యమకారులు

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలుగా సాగిస్తున్న ఉద్యమంలో పోలీసుల కేసులు పెరుగుతున్నాయి. పలువురు రైతులు, మహిళలు కోర్టులు చుట్టూ తిరగక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
ఇప్పటివరకు ఉద్యమం సందర్భంగా 2,800 మందికి పైగా నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు 70 మందిని వివిధ జైళ్లకు తరలించారు. కొందరు బెయిలుపై విడుదలయ్యారు. ఇంకా కొందరు జైళ్లలోనే ఉన్నారు.
శాంతిభద్రతలకు ఆటంకం కలిగించినప్పుడే కేసులు పెట్టామని పోలీసులు చెబుతున్నారు.
నిరసనకారులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పలు సందర్భాల్లో ఉద్రిక్తత ఏర్పడుతోంది. పోలీసులు లాఠీచార్జీలు, అరెస్టులు, కేసుల నమోదు చేస్తున్నారు.
అమరావతిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. సెక్షన్ 144, సెక్షన్ 30 కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అయినా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు.
మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొంటున్నారు. పాదయాత్రలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, ట్రాక్టర్లపై ప్రదర్శనలు, చలో అసెంబ్లీ, రాస్తారోకోలు, సకల జనుల బంద్ లాంటి ఆందోళనలు చేపట్టారు. పండుగల సమయాల్లో సంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన చిత్రపటాలతో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసన తెలిపారు.

2019 డిసెంబరు 17న అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావించిన తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. తర్వాత జీఎన్ రావు కమిటీ నివేదిక వెలువడగానే ఉధృతమయ్యాయి. కేబినెట్ భేటీ సందర్భంగా మరింత తీవ్రమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో సభలో విపక్ష నేతల, బయట అమరావతి ఆందోళనకారుల నిరసనలు సాగాయి.
మూడు రాజధానుల ఏర్పాటుతోపాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీసీఆర్‌డీఏ) రద్దుకు సంబంధించి రెండు బిల్లులను అసెంబ్లీ జనవరి 21న ఆమోదించింది. మరుసటి రోజే రెండు బిల్లులకు బ్రేకులు పడ్డాయి. వాటిని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించడం, వెంటనే మండలి రద్దు ప్రతిపాదనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అసెంబ్లీ ఆమోదం తెలపడం లాంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు విపక్షాల నుంచి సభ్యుల ప్రతిపాదనలు వచ్చినా, అధికార వైసీపీ నిరాకరించింది. చైర్మన్ నిర్ణయాన్ని మండలి కార్యదర్శి తిరస్కరించారు. సెలక్ట్ కమిటీ వ్యవహారం నేటికీ సందిగ్ధంలోనే ఉంది.

రైతులను వేధిస్తున్నారు: జేఏసీ కన్వీనర్ శివారెడ్డి
పోలీసు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూ, అమరావతి కోసం ముందుకు సాగుతామని అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి బీబీసీకి తెలిపారు.
"పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తున్నారు. అయినా ఉద్యమంలో వెనకడుగు వేయం. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' నినాదంతో ముందుకు సాగుతాం. మాకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మద్దతు ఉంది. జేఏసీ నేతల మీద కేసులు మోపి జైల్లో పెట్టారు. రైతులను కూడా వేధిస్తున్నారు" అని ఆయన చెప్పారు.

ప్రధాన కేసులు ఇవీ
డిసెంబర్ 27న అమరావతి ఉద్యమ కవరేజ్ లో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడినట్టు కేసు నమోదయ్యింది. విలేఖరి ఎన్.దీప్తి ఇచ్చిన ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్ట్ ఆదేశాలతో రిమాండ్‌లో భాగంగా డిసెంబర్ 29న గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత వారికి బెయిల్ దొరకడంతో విడుదలయ్యారు.
జనవరి 2న కృష్ణా జిల్లా నందిగామ పర్యటనకు వెళ్లిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను అమరావతి ఉద్యమకారులు కొందరు అడ్డుకున్నారు. ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు- ఆయనపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారంటూ 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 301,303, 427, రెడ్ విత్ 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. వారిని నందిగామ సబ్ జైలుకు తరలించారు. వారు 17 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
జనవరి 7న చినకాకాని వద్ద జాతీయ రహదారి-16పై అమరావతి ఆందోళనకారులు బైఠాయించారు. ఐదు గంటలపాటు హైవేను దిగ్బంధించారు. అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి జరిగింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చినకాకాని వీఆర్వో కొండవీటి దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 120బీ, 143, 341,353,501 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రిమాండ్‌లో భాగంగా గుంటూరు సబ్ జైలుకు తరలించిన వారికి తర్వాత బెయిల్ లభించింది.
జనవరి 10న విజయవాడలో మహిళా ర్యాలీ సందర్భంగా 479 మందిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 341,143,188తోపాటు సెక్షన్ 32 కింద కేసులు నమోదు చేశారు. వారిలో 18 మందిపై ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
జనవరి 20న అమరావతి జేఏసీ పిలుపుతో జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్బంగా పలువురు ఆందోళనకారులు సచివాలయం సమీపం వరకు చొచ్చుకొచ్చి, నిరసనలు తెలిపారు. ఆ సమయంలో వారికి సంఘీభావంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉద్యమంలో పాల్గొన్నారు. పలువురు టీడీపీ నేతల ముందస్తు అరెస్టులతో గృహ నిర్బంధం చేసినప్పటికీ జయదేవ్ మాత్రం వెలగపూడి వరకు వచ్చారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంక్షలు ఉల్లంఘించడం, పోలీస్ విధులకు ఆటంకం కల్పించడం లాంటి కేసులు నమోదయ్యాయి. జయదేవ్‌తోపాటు ఆయన అనుచరులు 12 మంది ఈ కేసుల్లో ఉన్నారు. ఆయన్ను పోలీసులు బెయిలుపై విడుదల చేశారు.

జనవరి 23న ముగ్గురు మీడియా ప్రతినిధులపై ఐపీసీ 354సీ, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ దురాగతాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మందడం హైస్కూల్లో తమకు కేటాయించిన వసతిలో బట్టలు మార్చుకుంటున్న మహిళా కానిస్టేబుల్‌ను వీడియో తీశారన్నది పోలీసుల అభియోగం. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది.
ఫిబ్రవరి 16న సీఆర్‌డీఏ పరిధిలోని భూముల సర్వే కోసం వెళ్లిన దాచేపల్లి తహశీల్దార్‌ను అడ్డుకున్నారనే ఫిర్యాదుతో 426 మందిపై కేసు నమోదైంది. అమరావతి ఉద్యమం సందర్భంగా అత్యధికులు నిందితులైన కేసు ఇదే. వీరిపై ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కృష్ణాయపాలెం వద్ద తన కారును అడ్డుకుని, దిగ్బంధించారంటూ తహశీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. పోలీసులు విచారిస్తున్నారు.
ఫిబ్రవరి 20న అమరావతి పరిధిలో పలు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఆమెను పలు చోట్ల నిరసనకారులు అడ్డగించారు. మందడం వద్ద సుమారు గంటకు పైగా ఆమె కారును నిలువరించారు. ఈ నిరసనకు నాయకత్వం వహించిన 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గుంటూరు జైలుకు తరలించారు. తర్వాత వారు బెయిల్ పై విడుదలయ్యారు.
ఇటీవల పోలీసులు డ్రోన్లు వినియోగిస్తున్న తీరుపై కొందరు నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రోన్లను అడ్డుకున్నారు. డ్రోన్ ఆపరేటర్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. 43 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ఈ నలుగురిలో అమరావతి జేఏసీ నాయకుడు ఆలూరి వెంకటేశ్వరరావు ఒకరు. ఈ నలుగురూ బెయిలుపై ఈ రోజే(మార్చి 2) విడుదలయ్యారు.
ఫిబ్రవరి 23 అమరావతి రథోత్సవం సందర్భంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో మహిళా ఆందోళనకారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎంపీ అనుచరుడు మేకల సురేష్‌పై దాడి కేసులో 30 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. లింగాపురం ఘటనలో పోలీస్ కానిస్టేబుళ్ల విధులకు ఆటంకం కల్పించారంటూ మరో 10 మందిపై కేసు పెట్టారు. వాటితోపాటు ఎంపీ వాహనం ఢీకొట్టడంతో రైతు హనుమంతరావు గాయపడిన కేసులో ఎంపీ కారు డ్రైవర్‌పైనా కేసు నమోదైంది. అమరావతి జేఏసీ మహిళల ఫిర్యాదుతో ఎంపీ సురేష్‌పై, ఆయన అనుచరులపై కేసు నమోదైంది. మొత్తం ఈ ఘటనలో ఆరు కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Ravi
"ఎన్నిసార్లు జైలుకు పంపినా ఉద్యమంలోనే ఉంటా"
ఇప్పటివరకు ప్రస్తావించిన కేసులతోపాటు, అనుమతి లేకుండా రోడ్లకు అడ్డుగా టెంట్లు వేశారని, ప్రదర్శనలు చేశారని కూడా వివిధ సందర్భాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. వాటిలో జైలుకు వెళ్లి వచ్చిన అనేక మంది మళ్లీ ఉద్యమాల్లో భాగస్వాములవుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 21 కేసులు నమోదు కాగా, 2,892 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
వారిలో కొందరు ముఖ్య నేతలు రెండు, మూడు కేసుల్లో ఉన్నారు. వారిలో అత్యధికులు మందడం, తుళ్లూరు గ్రామాలవారే.
నిర్ణయం తగదన్నందుకు జైలుకు పంపుతున్నారు: రైతు
మూడుసార్లు అరెస్ట్ అయిన, గుంటూరు సబ్ జైలుకు వెళ్లి వచ్చిన రైతు కె.వెంకటేశ్వరరావు మందడం శిబిరంలో బీబీసీతో మాట్లాడుతూ- "అమరావతి కోసం భూములు ఇవ్వాలని అడిగినప్పుడు చాలా సందేహించాం. రాష్ట్రానికి మేలు జరుగుతుందని అందరూ ముందుకొచ్చాం. అయినా, ఇప్పుడు మళ్లీ మా భూములు ఏంచేస్తారో స్పష్టత లేకుండా రాజధాని మారుస్తామంటున్నారు. కనీసం రైతులతో మాట్లాడకుండా, మా అభిప్రాయాలు తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయం తగదని చెప్పినందుకు మమ్మల్ని జైలుకు పంపుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధించినా, వెనక్కి తగ్గబోం. మా పిల్లలు, నేను అందరం అమరావతి కోసమే పోరాడుతున్నాం" అని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణకే: ఎస్‌పీ విజయరావు
జనజీవనానికి ఆటంకం లేకుండా ప్రశాంతంగా నిరసన తెలిపితే తమకు అభ్యంతరం లేదని గుంటూరు రూరల్ ఎస్‌పీ విజయరావు బీబీసీతో చెప్పారు. పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించకుండా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నారు.
"శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన సందర్భంలోనే కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 10 సందర్భాల్లోనే కేసులు పెట్టాం. అది కూడా నిరసనలు హద్దు మీరిన కారణంగానే. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొందరు హద్దులు దాటిన సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారు బాధ్యత తీసుకుని పోలీసుల విధులకు ఆటంకం లేకుండా చూడాలి" అని ఆయన సూచించారు.
కేసులపై డీజీపీని కలుస్తామని, కోర్టులో పోరాడతామని జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- అమెరికాలో కరోనావైరస్... వాషింగ్టన్లో 50 ఏళ్ల వ్యక్తి మృతి
- ఇవాంకా ట్రంప్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషాప్ ఎడిట్ ఫొటోలు..
- ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజీల్‌పై వ్యాట్ పెంపు.. ప్రజలపై భారమెంత
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









