'రాజధాని కోసం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం... ఇప్పుడు పిల్లా పెద్దా అంతా రోడ్డున పడ్డాం"

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
మూడు రాజధానులు, సచివాలయం తరలింపు ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అలజడి రేపుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఇక్కడ 20 రోజులుగా నిరంతరాయంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
వివిధ రూపాల్లో కొనసాగుతున్న ఆందోళనల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తుండగా, శాంతిభద్రతల పరిరక్షణకే తాము చర్యలు తీసుకొంటున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఆందోళనల్లో ఇప్పటివరకు అరెస్ట్ అయిన రైతుల, వారి కేసుల వివరాలను సేకరించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
డిసెంబరు 17న అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ డిసెంబరు 20న నివేదిక ఇచ్చింది. రాష్ట్ర సచివాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సూచిస్తూ 'బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ)' ఇటీవల నివేదిక ఇచ్చింది.
ఈ రెండు నివేదికలను పరిశీలించేందుకు ప్రభుత్వం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ జనవరి 7న తొలి సమావేశం జరుపుతోంది.
కీలకమైన పాలనా వ్యవహారాలన్నింటినీ ప్రభుత్వం అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించనుందనే ప్రచారం నేపథ్యంలో రాజధాని అమరావతి ఏర్పాటుకు భూములిచ్చిన రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో గత నెలలో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలకు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. అమరావతి పరిరక్షణ వేదిక పేరుతో వివిధ సంఘాల ప్రతినిధులతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ సాగుతున్న ఉద్యమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. గతంలో ఎన్నడూ ఆందోళనలో పాల్గొనని వారు కూడా ఈసారి రోడ్డెక్కారని మందడం గ్రామానికి చెందిన నూతక్కి సుజాత బీబీసీతో అన్నారు.
రాజధాని కోసం తాము భూమిలిచ్చామని, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సగం కట్టి వదిలేశారని, జగన్ పూర్తిచేస్తారని ఆశించామని ఆమె చెప్పారు.
"ఏడు నెలలుగా ఏమీ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. కానీ, రాజధాని తరలిస్తారని అనుకోలేదు. ప్రభుత్వాన్ని నమ్మి మా జీవనాధారాన్ని ఇచ్చిన మేం ఇప్పుడు ఏంకావాలి? రైతులకు అన్యాయం జరగదని అంటున్నారే తప్ప ఎలా న్యాయం చేస్తారన్నది చెప్పడం లేదు. అదే మహిళలకు మనోవేదన కలిగిస్తోంది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అంతా రోడ్డున పడ్డాం. ఇరవై రోజులవుతున్నా మాకు ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు. పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మొన్న ఒకరోజు మమ్మల్ని వ్యాన్ లో ఎక్కించి వేధించారు. కొందరిని గాయపరిచారు. అయినా మేం వెనక్కు తగ్గం" అని ఆమె స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, FB/JanaSena Party
వారిని అడ్డుకొన్నందుకే కొందరు మహిళలను అదుపు చేశాం: ఎస్‌పీ
రాజధాని ఆందోళనల్లో అదుపు తప్పి వ్యవహరించినవారిని నియంత్రించడమే తప్ప ఎవరిపైనా కేసులు పెట్టలేదని గుంటూరు రూరల్ ఎస్‌పీ సీహెచ్ విజయారావు బీబీసీతో చెప్పారు.
ఆందోళనకారులపై కేసుల వివరాల గురించి ఎస్‌పీని బీబీసీ ప్రశ్నించగా- "మేం ఎవరి మీదా కేసులు పెట్టలేదు. సకల జనుల సమ్మె పేరుతో కొందరు బ్యాంకులు మూసివేయించే ప్రయత్నం చేశారు. సచివాలయానికి వెళ్లే వారి విధులకు ఆటంకం కలిగించారు. ఆ సమయంలో కొందరు మహిళలను అదుపు చేసే ప్రయత్నం చేశాం. ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు" అని ఆయన సమాధానమిచ్చారు.

జీఎన్ రావు కమిటీ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుందనే వార్తల నేపథ్యంలో డిసెంబరు 27న రాజధాని ప్రాంతంలో కొన్ని చోట్ల ఆందోళనలు అదుపు తప్పాయి. కొందరు ఆందోళనకారులు ఎస్.ఆర్.ఎం.యూనివర్శిటీ బస్సుపై రాయపూడి సమీపాన దాడి చేశారు. అద్దాలు ధ్వంసమయ్యాయి.
అదే సమయంలో ఉద్దండరాయునిపాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష కవరేజ్‌కు వెళ్లిన కొందరు మీడియా సిబ్బందిపై దాడి జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌పీ విజయారావు వెల్లడించారు.
ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశామని, కోర్టు ఆదేశాలతో వారిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించామని ఆయన తెలిపారు.
"వీడియో క్లిప్పింగ్స్, ఇతర ఆధారాలు అన్నీ పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. మీడియా సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, భయభ్రాంతులకు గురిచేసేలా బెదిరించడమే కాకుండా తీవ్రంగా గాయపరచడంతో ఆందోళనకారులపై విజయవాడకు చెందిన నల్లమోతు దీప్తి అనే జర్నలిస్ట్ తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొందరు నిందితులపై హత్యాయత్నం సహా పలు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 307, 342,324,506 కింద కేసులున్నాయి" అని ఎస్‌పీ వివరించారు.
మోదుగులింగాయపాలెం గ్రామస్థులు బండారు నాగరాజు, ధనశ్రీ నరేష్, వెంకటాయపాలెం నివాసితులు గోగులపాటి సురేంద్ర, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, నెక్కల్లు వాసి రామినేని నరసింహస్వామి, వెలగపూడి వాసి భూక్యా లోకనాయక్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా, కోర్ట్ రిమాండ్ విధించిందని, తర్వాత మరో నిందితుడిని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
"ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేయవచ్చు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తప్పవు" అని ఎస్‌పీ చెప్పారు.

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official
మహిళలపై దాడులు దుర్మార్గం: చంద్రబాబు
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు విమర్శించారు. మీడియా సిబ్బందిపై, పోలీస్ సిబ్బందిపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులతో గుంటూరు జిల్లా జైలులో ఆయన మాట్లాడి వచ్చారు.
"రైతులు వారి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కానీ ప్రభుత్వం నిర్బందాన్ని ప్రయోగిస్తోంది. పోలీసులను ఉసిగొల్పుతోంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులనడం సబబేనా? మీడియా కూడా హద్దులు దాటకూడదు. మీడియా సంస్థల యాజమాన్యాల ప్రయోజనాల కోసం భూములిచ్చిన రైతులను కించపరచడం తగదు. రైతులపై హత్యాయత్నం కేసులు పెడతారా.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వారిని భయపెట్టాలని చూస్తున్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. మహిళల పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గాయపరుస్తారా? మహిళలపై దాడులు దుర్మార్గం" అని ఆ సందర్భంగా చంద్రబాబు విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, fb/Sucharitha
హద్దు మీరితే సహించేది లేదు: హోం మంత్రి
అమరావతిలో కొందరు రెచ్చగొట్టి ఉద్యమాలు నడిపిస్తున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. రైతుల ఉద్యమాల్లో కొందరు బయటి వ్యక్తులు కూడా వెళ్లి అనవసర సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ప్రభుత్వం దీనిని సహించదని ఆమె బీబీసీతో చెప్పారు.
"రాజధాని ప్రాంతంలో అపోహలున్నాయి. కొందరికి ఏదో జరిగిపోతోందనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం వారికి ఎలాంటి అన్యాయం చేయదు. రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నాం. అయినా కొందరు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. హద్దు మీరితే సహించేది లేదు. చంద్రబాబు హయాంలో రాజధాని కోసం భూములు ఇవ్వబోమని రైతులు చెబితే పోలీసులతో బెదిరించి బలవంతంగా అనేక మంది దగ్గర భూములు లాక్కున్నారు. తప్పుడు కేసులతో వేధించారు. మేం మాత్రం ఆందోళనకారుల మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని సుచరిత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?
- నిత్య వివాదాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- JNU: క్యాంపస్ హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- మహిళలకు భావప్రాప్తి కలిగిందో లేదో పట్టించుకోనవసరం లేదా - అభిప్రాయం
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









