'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిపై తుది నిర్ణయం ప్రకటించాకే కేంద్రం స్పందిస్తుంది' -కిషన్ రెడ్డి :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/Bharatha Matha Foundation
రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఏదైనా ప్రకటన వెలువరించిన తర్వాతే తాము స్పందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు స్మృతివనాన్ని కిషన్‌రెడ్డి సోమవారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ- రాజధాని అమరావతిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం స్పందించబోదని తెలిపారు.
రాజధాని విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, స్పష్టమైన నిర్ణయం వెలువరించిన తర్వాత కేంద్రం కచ్చితంగా స్పందిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.
అనంతపురంలో మూడు రోజులపాటు సాగిన అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 38వ రాష్ట్రస్థాయి మహాసభలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 'గౌరీశంకర్' యువ పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేతా శ్రీనివాస్‌కు అందజేసి సత్కరించారు.
కిషన్‌రెడ్డిని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి ఆలింగనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, TELANGANA CMO
తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోని ఏపీ
ఆంధ్రప్రదేశ్ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ శాఖ రిలీవ్ చేసిన 653 మంది ఉద్యోగులకు విజయవాడలో చుక్కెదురైందని, అయితే, వారిని విధుల్లోకి తీసుకోవడానికి ఏపీ అధికారులు నిరాకరించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మూకుమ్మడిగా చేరడానికి వారంతా సోమవారం ఉదయం విజయవాడ విద్యుత్‌సౌధకు, తిరుపతిలోని సదరన్ డిస్కం కార్యాలయానికి వచ్చారు. వారిని విధుల్లో చేర్చుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీంతో ఉద్యోగులు ధర్నాకు దిగారు.
తెలంగాణ నుంచి వచ్చిన విద్యుత్ శాఖ ఇంజనీరు బాబూరావు మాట్లాడుతూ- జస్టిస్ ధర్మాధికారి తీర్పు ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 653 మంది ఉద్యోగుల్ని రిలీవ్ చేశాయని, వారి వివరాలను ఏపీ జెన్‌కోకు అందించారని తెలిపారు. కొందరం విద్యుత్ సౌధకు వచ్చామని, తమను విధుల్లోకి తీసుకునేందుకు ఇక్కడి అధికారులు నిరాకరించారని, చేర్చుకోవడానికి పోస్టులు లేవంటూ సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లినట్లు చెప్పారని పేర్కొన్నారు.
తమను రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, YSRCONGRESS
'వైఎస్ వివేకా హత్య కేసులో 1,461 మందిని విచారించాం' - ఏపీ హోం శాఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందని ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కిషోర్ కుమార్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలుచేశారని ఈనాడు తెలిపింది.
ఈ కేసులో 1,461 మంది అనుమానితులను విచారించామని ప్రమాణపత్రంలో చెప్పారు. అంతేగాక 62 మంది సాక్షులను విచారించి వాంగ్మూలాలు నమోదు చేశామని పేర్కొన్నారు.
కేసును సీబీఐకి అప్పగించాలనేందుకు పిటిషనర్/టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్ రవి) బలమైన కారణాలు పేర్కొనలేదని, కేసులో ఆయన్ను ఇరికించే యత్నం చేస్తున్నామన్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. రవి వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు.
వివేకా హత్య కేసును సీబీఐ లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ రవి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, కడప ఎస్‌పీ వేర్వేరుగా ప్రమాణపత్రాలు దాఖలు చేశారు.
"దర్యాప్తు క్రియాశీలంగా సాగుతోంది. ఈ కేసులో నిందితులకు పాలిగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్ష, బ్రెయిన్ మ్యాపింగ్ చేశారు. నిందితుడు పరమేశ్వర్‌రెడ్డికి వైద్యుల సలహా మేరకు నార్కో పరీక్ష నిర్వహించలేదు. సీఆర్‌పీసీ చట్ట నిబంధనలు అనుసరించి అనుమానం ఉన్నవారందర్నీ ప్రశ్నిస్తున్నాం. పిటిషనర్‌ను ప్రశ్నించాం" అని ప్రమాణపత్రాల్లో చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
విధులకు హాజరుకాని 14 మంది టీచర్ల తొలగింపు
తెలంగాణలో విధులకు గైర్హాజరవుతున్న 14 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రాథమిక విద్యాశాఖ తొలగించిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
వీరిని తొలగిస్తూ విద్యా శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్ సోమవారం ఆదేశాలు ఇచ్చారు.
మొత్తం 106 మంది ఉపాధ్యాయులు విధులకు సరిగా హాజరుకావడం లేదని ఆయన తెలిపారు. కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్(సీసీఏ) నిబంధనల ప్రకారంగా వీరిలో 14 మందిని తొలగించామని చెప్పారు. మిగతా 92 మంది తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- పాకిస్తాన్లో ప్రతి హత్యా నేరానికీ ఓ రేటు
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020: ఎన్నికల సంఘ కొత్త కాన్సెప్ట్.. పోలింగ్ కేంద్రానికి రాలేనివారికి పోస్టల్ బ్యాలెట్
- చదివింది కెమికల్ ఇంజినీరింగ్.. చేస్తున్నది బూట్లు తుడిచే పని
- పోర్న్ వీడియోలు తీసి 22 మంది అమ్మాయిల్ని మోసం చేసినందుకు 919 కోట్ల జరిమానా
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- కాసిం సులేమానీ మృతి: దిల్లీలో కూడా దాడులకు కుట్ర పన్నారంటున్న డోనల్డ్ ట్రంప్
- అమెజాన్‌కు రిలయన్స్ జియోమార్ట్ పోటీ ఇవ్వగలదా
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








