కాసిం సులేమానీ మృతి: ‘అమెరికా నశించాలి’ అంటూ అంతిమయాత్రలో నినాదాలు, దిల్లీలో కూడా దాడులకు కుట్ర పన్నారంటున్న డోనల్డ్ ట్రంప్

సులేమానీ అంతిమయాత్ర
ఫొటో క్యాప్షన్, సులేమానీ భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం ఇరాన్ తరలిస్తారు

అమెరికా వైమానిక దాడుల్లో చనిపోయిన ఇరాన్ సైనిక కమాండర్ కాసిం సులేమానీ అంతిమయాత్రలో భారీ ఎత్తున జనం పాల్గొంటున్నారు. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఈ అంతిమయాత్ర జరుగుతోంది.

ఇరాన్ మధ్యప్రాచ్య కార్యక్రమాల రూపశిల్పి కాసిం సులేమానీ. ఆయన మరణానికి ''తీవ్ర ప్రతీకారం'' తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన బూనింది.

గురువారం అమెరికా దాడుల్లో చనిపోయిన సులేమానీ భౌతిక కాయానికి శనివారం బాగ్దాద్‌లో అంతిమయాత్ర నిర్వహించారు. దీంతో సులేమానీ సంతాప దినాలు మొదలయ్యాయి.

ఆయన మృతదేహాన్ని ఆయన స్వస్థలంలో సమాధి చేయటం కోసం ఇరాన్‌కు పంపించాల్సి ఉంది.

ఇరాన్ మద్దతు గల కతైబ్ హిజ్బుల్లా గ్రూపు కమాండర్, ఇరాక్ పౌరుడు అబు మహదీ అల్-ముహందిస్ మృతికి సంతాపం తెలుపుతూ కూడా ప్రజలు బాగ్దాద్‌లోని అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఇరాన్‌కు మిత్రపక్షాలుగా ఉన్న మిలీషియా బృందాలతో పాపులర్ మొబిలైజేషన్ విభాగాలకు ఆయన విజయవంతంగా సారథ్యం వహించారు.

సులేమానీ అంతిమయాత్ర

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్‌లో సులేమానీ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు

అంతిమయాత్రలో పాల్గొనటానికి బాగ్దాద్‌లో వేకువజామునే జనం పెద్ద సంఖ్యలో గుమిగూడటం మొదలైంది. ఇరాక్, మిలీషియా జెండాలను ప్రదర్శిస్తూ.. ''అమెరికా నశించు'' అని నినదించారు. అంతిమయాత్ర బాగ్దాద్ వీధుల వెంట సుదీర్ఘంగా సాగింది. కొందరు సులేమానీ ఫొటోలు, మరికొందరు ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ ఫొటోలు ప్రదర్శించారు.

ఇరాన్ జాతీయుల మృతదేహాలను శనివారం సాయంత్రం ఆ దేశానికి విమానాల్లో పంపిస్తారని వార్తలు వచ్చాయి. హతుడైన సైనిక జనరల్ కోసం ఇరాన్ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మధ్య ఇరాన్‌లోని కెర్మాన్ పట్టణంలో మంగళవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఇదిలావుంటే.. సులేమానీ మరణ వార్తలతో కొందరు ఇరాకీ పౌరులు బాగ్దాద్ వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. బాగ్దాద్‌లో ఇటీవలి నెలల్లో శాంతియుతంగా జరిగిన ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనల మీద హింసాత్మక అణచివేతకు సులేమానీ కారణమని కొందరు ఆరోపిస్తున్నారు.

కాసిం సులేమానీ

ఫొటో సోర్స్, AFP/GETTY

కాసిం సులేమానీ ఎవరు?

మేజర్ జనరల్ కాసిం సులేమానీ 1998 నుంచి ఇరాన్ కడ్స్ దళానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో అత్యున్నత విభాగం అయిన ఇది విదేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

లెబనాన్‌, ఇరాక్, సిరియా లేదా ప్రపంచంలో మరెక్కడైనాగానీ ఇరాన్‌ ప్రాబల్యాన్ని పెంచడంలో సులేమానీ కీలక పాత్ర పోషించారు.

అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఒక చిన్న వివాదం నాటకీయ పరిణామాల మధ్య ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌ - కడ్స్ దళ కమాండర్‌ కాసిం సులేమానీ మరణానికి దారి తీసింది.

సులేమానీని చంపేయడం అంటే 'ఇరాన్‌పై అమెరికా ఒక రకంగా చిన్నపాటి యుద్ధం ప్రకటించడమే' అని ఒబామా హయాంలో పశ్చిమాసియా, పర్షియన్ గల్ఫ్‌ వ్యవహారాల సమన్వయకర్తగా పనిచేసిన ఫిలిప్ గోర్డన్ అభిప్రాయపడ్డారు.

అమెరికా డ్రోన్ దాడులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా డ్రోన్ దాడుల తర్వాత మంటలు

అమెరికా ఎందుకు చంపింది?

అమెరికా దృష్టిలో 'సులేమానీ అమెరికన్ల రక్తం కళ్లజూసిన వ్యక్తి'. కానీ ఇరాన్‌లో ఆయన చాలా ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా టెహ్రాన్‌ ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహించారు.

ఇరాక్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై వరసగా జరిగిన అనేక చిన్నపాటి రాకెట్ దాడులు ఇరానే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో ఒక అమెరికన్ కాంట్రాక్టర్ చనిపోయారు.

ఈ దాడుల వెనుక ఇరాన్ అనుకూల దళాలు ఉన్నాయని పెంటగాన్ అనుమానిస్తోంది. ఇప్పటికే వాటిని తిప్పికొట్టింది. అది బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ కాంపౌండ్‌పై దాడికి దారి తీసింది.

సులేమానీని చంపేయాలన్న నిర్ణయం తీసుకోవడం వెనక గతంలో జరిగిన సంఘటనలను మాత్రమే పెంటగాన్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ దాడితో ఒకరకంగా హెచ్చరిక పంపించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దిల్లీలో కూడా దాడులకు కుట్ర: ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా నా దేశాన్ని, పౌరులను కాపాడుకోవడం నా బాధ్యత. నా ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నెంబర్ 1 టెర్రరిస్ట్ కాసిం సులేమానీని హతమార్చింది. సులేమానీ అమెరికా దౌత్యాధికారులు, మిలిటరీ అధికారులపై దాడులకు కుట్రలు పన్నారు. ఆయన్ని మేం పట్టుకుని, మట్టుబెట్టాం.

అమెరికాకు, అమెరికా పౌరులకు హాని చెయ్యాలని ఎవరు తలపెట్టినా, వారు ఎక్కడున్నా పట్టుకుంటాం, అంతం చేస్తాం.

ఎన్నో ఏళ్లుగా సులేమానీ నేతృత్వంలోని కడ్స్ ఫోర్స్ ఎంతోమంది అమెరికా పౌరులను, సైనికులను హతమార్చింది. బాగ్దాద్‌లోని మా ఎంబసీపై దాడికి కూడా ఈయనే సూత్రధారి.

భారత్‌లోని న్యూ దిల్లీ, లండన్‌లలో కూడా టెర్రరిస్ట్ దాడులకు సులేమానీ కుట్ర పన్నారు.

పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించే పయత్నాలు సులేమానీ చేశారు. ఆయనను ఎప్పుడో అంతం చేసి ఉంటే ఎన్నో ప్రాణాలు నిలిచి ఉండేవి.

ఇరాన్ ప్రజలంటే నాకెంతో గౌరవం ఉంది. ఇప్పుడు భవిష్యత్ అంతా వారిదే. ఇంతవరకూ రక్తపాతాన్ని చూసిన వారు ఇకనుంచి శాంతియుతంగా జీవించొచ్చు.

ఇటీవలే మేం బగ్దాదీని అంతం చేశాం. ఇలాంటి వాళ్లు లేనప్పుడే ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్

ఇకపై ఏం జరుగుతుంది?

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక రకంగా ఇరాన్‌ను భయపెట్టి, తన చేతలకు వాడి తగ్గలేదని- ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటిచోట పెరుగుతున్న అమెరికా వ్యతిరేక శక్తులకు హెచ్చరిక పంపించామని ట్రంప్ భావిస్తూ ఉండొచ్చు.

కానీ అమెరికా చర్యకు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇరాన్‌ నుంచి ఎలాంటి ప్రతిచర్య ఉండదని ఎట్టిపరిస్థితుల్లో అనుకోవడానికి వీలు లేదు.

ఇరాక్‌లో ఉన్న 5000 మంది అమెరికా సైనికులే కచ్చితంగా లక్ష్యంగా మారుతారు. ఇరాన్, దాని ప్రతినిధులు గతంలో చేసిన దాడులు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. ఈ ఉద్రిక్త వాతావరణంతో మొదటగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

కానీ ఇరాన్ ప్రతిదాడి చేయకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఇరాన్‌కున్న అనూహ్య మద్దతుతో అది వ్యూహాత్మకంగా ప్రవర్తించొచ్చు. ఈ ప్రాంతంలో సులేమానీ పెంచి పోషించిన ఎన్నో శక్తులు ఇరాన్‌కు అండగా నిలవొచ్చు.

ఉదాహరణకి బాగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇరాక్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం, అక్కడ అమెరికా బలగాల మోహరింపును ప్రశ్నించడం.. ఇతర దాడుల కోసం ఎక్కడైనా నిరసన ప్రదర్శనలను ప్రోత్సహించడం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)