యూపీ పోలీస్, మోదీ ప్రభుత్వంపై మరో ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్

ట్వీట్ చేసి, వెంటనే డెలిట్ చేసిన ఇమ్రాన్‌ఖాన్

ఫొటో సోర్స్, Reuters

యూపీ పోలీసులు, భారత ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఒక ట్వీట్ చేశారు.

అందులో "జాతి హింస ఉద్దేశంతో ఫాసిస్టు మోదీ ప్రభుత్వం భారత ముస్లింలకు వ్యతిరేకంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది. దీని ప్రకారం భారత పోలీసులు విధ్వంసంలో ఒక కొత్త కోణాన్ని సృష్టించారు" అని రాశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనకారులు, పోలీసుల మధ్య జరిగిన గొడవల్లో 18 మందికి పైగా మృతి చెందారు.

యూపీ పోలీసుల దర్యాప్తు గురించి ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ 'న్యూస్ 18' ఒక వార్త ప్రచురించింది. అందులో "యూపీ పోలీసులు బన్నే ఖాన్ అనే చనిపోయిన వ్యక్తికి, 90, 93 ఏళ్ల మరో ఇద్దరు వృద్ధులకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరై 10 లక్షల రూపాయల బాండ్ రాయాలని నోటీసులు పంపారు" అని రాశారు.

ఈ వార్తను కూడా ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్వీట్ చేస్తూ "భారత పోలీసులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారు" అని ఆరోపించారు.

ట్వీట్ డిలీట్ చేసిన ఇమ్రాన్

ఇమ్రాన్ ఖాన్ అంతకు ముందు యూపీ పోలీసుల విధ్వంసం అంటూ ట్విటర్‌లో ఒక వీడియో షేర్ చేశారు.

ట్వీట్ చేసి, వెంటనే డెలిట్ చేసిన ఇమ్రాన్‌ఖాన్

ఫొటో సోర్స్, SM VIRAL POST

ఈ వీడియోతోపాటూ "భారత పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై హింసకు పాల్పడుతున్నారు" అని పెట్టారు.

కానీ యూపీ పోలీసులు వెంటనే ఇమ్రాన్ ఖాన్ వాదనను ఖండించారు.

"ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ది కాదు, ఇది 2013 మే నెలలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించినది. వీడియోలో కనిపిస్తున్న సైనికుల యూనిఫాం మీద RAB అని ఉంది. అంటే రాపిడ్ యాక్షన్ బెటాలియన్, ఈ సైనికులు బంగ్లాలో మాట్లాడుతున్నారు" అని పోలీసులు తమ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ఈ వీడియోతోపాటు మరో రెండు వీడియోలు కూడా షేర్ చేశారు. కానీ తన వాదన తప్పని తేలడంతో ఆయన తన ట్విటర్ అకౌంట్ నుంచి ఆ మూడు వీడియోలను డిలీట్ చేశారు.

ట్వీట్ చేసి, వెంటనే డెలిట్ చేసిన ఇమ్రాన్‌ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఇమ్రాన్ ఖాన్ ట్వీట్లు చేసి తర్వాత వాటిని డిలీట్ చేయడంపై సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.

తప్పుడు సందర్భంలో అలాంటి వీడియోను షేర్ చేసి వదంతులు వ్యాప్తి చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి సిగ్గుపడాలని కొంతమంది రాశారు.

కొంతమంది "పాకిస్తాన్ ప్రధానమంత్రి వాట్సాప్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నట్టుంది. ఎందుకంటే ఆయన షేర్ చేసిన వాటిని అస్సాం, యూపీ పోలీసుల అరాచకాలుగా చెబుతూ వాట్సాప్‌లో కూడా సర్కులేట్ చేస్తున్నారు" అని ట్వీట్ చేశారు.

ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నందుకు ఇమ్రాన్ ఖాన్ అకౌంటును సస్పెండ్ చేయాలని కూడా ట్విటర్‌ను మరికొందరు కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)