వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు.. మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త

ఫొటో సోర్స్, SAMSUNG
ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు పొంచివుందని.. అందుకు కారణం వాటికి సెక్యూరిటీ అప్‌డేట్లు అందించకపోవటమేనని 'విచ్?' అనే పరిశోధన సంస్థ పేర్కొంది.
ఈ లోపం కారణంగా ఆయా డివైజ్‌ల యూజర్లు తమ డాటా చోరీకి గురవటం, బెదిరింపు వసూళ్లు, మాల్‌వేర్ దాడులు వంటి ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉందని తెలిపింది.
2012 సంవత్సరంలో కానీ, అంతకుముందు కానీ విడుదల చేసిన ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ ముప్పు ఉందని చెప్పింది.
ఈ విషయమై గూగుల్ ప్రతిస్పందన భరోసా ఇస్తున్నట్లు తమకు కనిపించలేదని 'విచ్?' పేర్కొంది.
దీనిపై వివరణ తెలియజేయాలని బీబీసీ కోరినా గూగుల్ స్పందించలేదు.
గూగుల్ సొంత డాటా ప్రకారమే.. ప్రపంచ వ్యాప్తంగా 42.1 శాతం ఆండ్రాయిడ్ డివైజ్‌లు.. ఆ సంస్థకు చెందిన 6.0 వెర్షన్ లేదా దానికన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో నడుస్తున్నాయని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Google
ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బులెటిన్ ప్రకారం.. ఆండ్రాయిడ్ సిస్టమ్ 7.0 కన్నా పాత వెర్షన్లకు 2019లో సెక్యూరిటీ ప్యాచ్‌లు విడుదల చేయలేదు.
ఈ సమాచారాన్ని విశ్లేషిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఆండ్రాయిడ్ యూజర్లలో ఇద్దరికి ఇప్పుడిక సెక్యూరిటీ అప్‌డేట్లు అందటం లేదని 'విచ్?' నిర్ధారించింది.
ఐదు ఫోన్లను కూడా ఆ సంస్థ పరిశీలించింది:
- మోటరోలా ఎక్స్
- శాంసంగ్ గెలాక్సీ ఎ5
- సోనీ ఎక్స్‌పీరియా జడ్2
- ఎల్‌జీ/గూగుల్ నెక్సస్ 5
- శాంసంగ్ గెలాక్సీ ఎస్6
వీటిని మాల్‌వేర్‌తో ఇన్‌ఫెక్ట్ చేయాలని యాంటీ-వైరస్ ల్యాబ్ ఏవీ కంపారేటివ్స్‌ను 'విచ్?' కోరింది. ఆ ఐదు ఫోన్లనూ ఆ సంస్థ విజయవంతంగా ఇన్‌ఫెక్ట్ చేసింది. కొన్ని ఫోన్లలో అయితే అనేక ఇన్‌ఫెక్షన్లు చొప్పించగలిగింది.

ఫొటో సోర్స్, Getty Images
తాము గుర్తించిన విషయాలను గూగుల్‌కు తెలియజేశామని.. కానీ ''ఇప్పుడు సాఫ్ట్‌వేర్ మద్దతు అందని డివైజ్‌ల యూజర్లకు సాయం చేసేందుకు ప్రణాళిక ఉందనే భరోసా ఇవ్వటంలో ఆ సంస్థ విఫలమైంది'' అని 'విచ్?' తెలిపింది.
స్మార్ట్ డివైజ్‌లకు ఎంత కాలం పాటు అప్‌డేట్‌లు అందిస్తారనే విషయంలో గూగుల్, తదితర సంస్థలు మరింత పారదర్శకత అందించాలని కోరుతోంది.
మొబైల్ పరిశ్రమ.. సెక్యూరిటీ అప్‌డేట్లు అందుబాటులో లేనపుడు కస్టమర్లకు ఉన్న అవకాశాల విషయంలో మద్దతునిస్తూ మెరుగైన సేవలు అందించాల్సిన అవసరముందని ఆ సంస్థ చెప్పింది.
''ఖరీదైన ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఇంత తక్కువ మన్నిక ఉండటం, అతి త్వరగా సెక్యూరిటీ సపోర్ట్ ముగిసిపోవటం ఆందోళనకరం. కోట్లాది మంది యూజర్లు హ్యాకర్ల బాధితులుగా మారి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది'' అని 'విచ్? కంప్యూటింగ్' ఎడిటర్ కేట్ బేవాన్ పేర్కొన్నారు.
''సెక్యూరిటీ అప్‌డేట్లు ఎంత కాలం వరకూ కొనసాగుతాయి, అవి నిలిచిపోయినపుడు వినియోగదారులు ఏం చేయాలి అనే విషయంలో గూగుల్, ఇతర ఫోన్ తయారీదారులు మరింత స్పష్టత, సూటి సమాచారం అందించాలి'' అని చెప్పారు.
''ప్రభుత్వం కూడా స్మార్ట్ డివైజ్‌లకు సెక్యూరిటీ అప్‌డేట్ల విషయంలో, వినియోగదారులపై వాటి ప్రభావం విషయంలో తయారీదారులు మరింత పారదర్శకంగా ఉండేలా చూడటానికి ఉద్దేశించిన చట్టాన్ని త్వరగా అమలులోకి తీసుకురావాలి'' అని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
మీ ఫోన్‌కు హ్యాకింగ్ ముప్పు ఉందేమో చెక్ చేసుకోవటం ఎలా? ఆ ముప్పు ఉంటే ఏం చేయాలి?
- మీ ఆండ్రాయిడ్ డివైజ్ రెండు సంవత్సరాల కన్నా పాతది అయినట్లయితే.. దానిని కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌డేట్ చేయగలరేమో తనిఖీ చేయండి.
- మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 7.0 నాట్ కన్నా ముందు వెర్షన్ అయినట్లయితే.. Settings> System>Advanced System update ద్వారా అప్‌డేట్ చేయటానికి ప్రయత్నించండి.
- ఇలా అప్‌డేట్ చేయలేకపోయినట్లయితే.. మీ ఫోన్‌కి హ్యాకింగ్ ప్రమాదం ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 4 కానీ, అంతకన్నా పాత వెర్షన్‌ను కానీ ఉపయోగిస్తున్నట్లయితే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
- ఈ పరిస్థితిలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా వేరే చోటు నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకునేటపుడు జాగ్రత్తగా ఉండండి.
- అనుమానాస్పద ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మెసేజీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి.
- మీ డాటాను కనీసం రెండు చోట్ల (ఒక హార్డ్ డ్రైవ్, ఒక క్లౌడ్ సర్వీస్) బ్యాకప్ చేసుకోండి.
- ఒక యాప్ ద్వారా మొబైల్ యాంటీ-వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. కానీ పాత ఫోన్లకు పరిమితమైన అవకాశాలు మాత్రమే ఉన్నాయనేది గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి:
- ఫేస్‌బుక్‌కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- మీకు ఇలాంటి వాట్సాప్ కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- యస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మారటోరియం: ఇప్పుడు ఏమవుతుంది? ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- కరోనావైరస్: తెలంగాణలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఎక్కడికి వెళ్లాలి?
- కరోనావైరస్ ప్రభావంతో విమానయాన సంస్థలు దివాలా తీయనున్నాయా...
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా, కాలేదా.. ఈ 7 సంకేతాలే చెబుతాయి!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








