రెండు రోజులుగా ఇంటి ముందే మృతదేహం.. కరోనా ఉందని ఖననం చేయకుండా అడ్డుకున్న కాలనీవాసులు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేందుకు వీల్లేదని స్థానికులు అడ్డుకోవడంతో రాజమండ్రిలో ఓ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంటి ముందే ఉంచాల్సి వచ్చిందని ఈనాడు కథనం ప్రచురించింది.
ఈ కథనం ప్రకారం రాజమండ్రి శాటిలైట్ సిటీలో ఎ-బ్లాక్‌లో ఇటీవల ఓ వ్యక్తి కరోనాతో చనిపోయారు. ఆయనను ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది డి-బ్లాక్ స్మశాన వాటికలో ఏర్పాట్లు చేస్తుండగా, ఎ-బ్లాక్‌కు చెందిన వ్యక్తి కరోనాతో చనిపోతే ఇక్కడెలా ఖననం చేస్తారంటూ అక్కడివారు ఆందోళనకు దిగారు.
పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో సోమవారం ఉదయం మృతి చెందిన ఆ వ్యక్తి మృతదేహం రెండు రోజులుగా అతని ఇంటి ముందు ఫ్రీజర్‌లోనే ఉంచాల్సి వచ్చింది.
సమస్యకు పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ స్థానికులతో చర్చలు జరుపుతున్నారని ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT
అమెజాన్‌తో తెలంగాణ ఆర్టీసీ చర్చలు
టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకునే ఆలోచనలో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోందని ఈనాడు కథనం రాసింది.
‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాలకు ఉత్పత్తులను రవాణా చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ ఇప్పటికే ఆ సంస్థను కోరింది.
ఈ మేరకు ఒప్పందం కోసం తొలిదశ చర్చలు త్వరలో జరగబోతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా ప్రజారవాణాలో ఆదాయం తగ్గినా, కార్గో ద్వారా ఆదాయన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా అమెజాన్‌తో చర్చలు జరపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
వివిధ పండగ సీజన్లకు అనుగుణంగా ఆఫర్లు ప్రకటిస్తున్నామని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించిన’’ట్లు ఈ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, AP high court
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా? ఏపీ పోలీసులకు హైకోర్టు ప్రశ్న
ప్రజల హక్కులను కాపాడేందుకు పని చేస్తున్నారా, ఖద్దరు బాస్‌లను సంతృప్తి పరిచేందుకు పని చేస్తున్నారా అని ఏపీ హైకోర్టు పోలీసులను నిలదీసినట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.
‘‘రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని ఈ సందర్భంగా న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.
ఓ న్యాయవాది అరెస్టు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, అర్ధరాత్రి తలుపులు బద్ధలు కొట్టి ఆ న్యాయవాది కోసం వెతకాల్సిన అవసరం ఏముందని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
నేతలకు సేవ చేయాలనుకుంటే యూనిఫాం తీసేసి రాజకీయాల్లోకి వెళ్లవచ్చని, యూనిఫాంలో ఉన్నంత కాలం ప్రజల హక్కులను కాపాడాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.
రాజకీయ నాయకుల మెప్పుకోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవని, మీపై చర్యలు తీసుకుంటే రక్షించడానికి ఆ నేతలెవరూ రారని హెచ్చరించింది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.
‘‘ఆదివారం అర్ధరాత్రి తన భర్త, న్యాయవాది సుభాష్ చంద్రబోస్‌ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా తీసుకెళ్లారని పేర్కొంటూ పీ వెంకటప్రియదీప్తి హైకోర్టులో సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. సుభాష్ చంద్రబోస్‌ను తమ ముందు హాజరుపరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హైకోర్టులో నేరుగా హాజరై వివరణ ఇచ్చారు. న్యాయవాది కోసం ఇంటికెళ్లగా ఆయన పారిపోయారని, పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారని జిల్లా ఎస్పీ హైకోర్టుకు వివరించార’ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, TELANGANA INTERMEDIATE BOARD
తెలంగాణలో 1456 ప్రైవేట్ జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దయ్యే ప్రమాదం
ఫైర్ సేఫ్టీ నిబంధనలు కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 1456 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
అగ్నిమాపక శాఖ ఇటీవల నిబంధనలు మార్చడంతో ఈ కాలేజీలన్నింటికీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదని, అది లేనిదే గుర్తింపు కొనసాగించే పరిస్థితి ఉండదని ఈ కథనం పేర్కొంది.
‘‘ఈ కాలేజీల భవితవ్యం అయోమయంలో పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు.
రాష్ట్రంలో మొత్తం 1586 జూనియర్ కాలేజీలుండగా కేవలం 130 కాలేజీలు మాత్రమే ఫైర్‌సెఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని తేలింది.
ఈ కాలేజీలకు మాత్రమే ప్రస్తుతం అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. గతంలో 15 మీటర్లలోపు ఎత్తున్న భవనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అక్కర్లేదన్న నిర్ణయాన్ని, కోర్టు ఆదేశాల కారణంగా సవరించిన అగ్నిమాపక శాఖ, భవనం ఎత్తును 6 మీటర్లకు కుదించింది.
దీంతో వందలాది కాలేజీలు ఈ నిబంధనలకు లోబడిలేవని తేలింద’’ని ఈ కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- హజ్ యాత్ర-మానస సరోవర్ యాత్ర రాయితీ ఒకటేనా?
- మీ నగరం ఎంత వేడిగా ఉంది
- అమర్నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








