కఫీల్ ఖాన్: గోరఖ్‌పూర్‌ డాక్టర్‌కు బెయిల్.. తక్షణ విడుదలకు ఆదేశాలు

డాక్టర్ కఫీల్‌ఖాన్‌

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/bbc

జాతీయ భద్రతా చట్టం కింద జైలులో ఉన్న గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌కు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై గోరఖ్‌పూర్ బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలో పని చేస్తున్న డాక్టర్‌కఫీల్‌ఖాన్‌ను గతంలో విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి మథుర జైలులో ఉంచారు.

కఫీల్‌ఖాన్‌ అరెస్టు చట్ట విరుద్దమని, ఆయనను విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు వేసిన బెయిల్ దరఖాస్తును పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ప్రసంగాలు విద్వేషాలను రెచ్చగొట్టేలా లేవని, అందరూ ఐకమత్యంగా పోరాడాలని మాత్రమే చెప్పారని చెప్పారని కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది.

జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అలీగఢ్‌ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కఫీల్‌ఖాన్‌ను ఫిబ్రవరి 13, 2020న అరెస్టు చేశారు.

కఫీల్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ కేసు.. కఫీల్ ఖాన్‌ను ఎందుకు ఇంతకాలం జైలులో ఉంచారు?

మూడేళ్ల కిందట గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో పిల్లల మరణాల అంశంలో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన డాక్టర్‌ కఫీల్‌ఖాన్‌ ఆరు నెలలుగా జైలులో ఉన్నారు.

సీజేఎం కోర్టు ఆయనకు ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు ముందు ఆయన్ను జాతీయ భద్రతా చట్టం కింద మళ్లీ అరెస్టు చేశారు.

అయితే తనను నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకోవడాన్ని కఫీల్‌ఖాన్‌ అలహాబాద్‌ హైకోర్టులో సవాల్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు బెయిల్ రాలేదని ఆయన సోదరుడు అహ్మద్‌ తెలిపారు. హైకోర్టులో బెయిల్‌పై విచారణ జులై వరకు 11సార్లు వాయిదా పడిందని అహ్మద్ వెల్లడించారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపణ

గత ఏడాది డిసెంబర్‌లో డాక్టర్ కఫీల్‌ఖాన్‌ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అలీగఢ్‌‌లోని సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కఫీల్‌పై కేసు నమోదైంది. జనవరి 29న ఎస్టీఎఫ్‌ ఉత్తరప్రదేశ్‌ విభాగం ఆయన్ను ముంబయిలో అరెస్టు చేసింది.

మథుర జైలులో ఉన్న డాక్టర్ కఫీల్‌కు ఫిబ్రవరి 10న బెయిల్ లభించినప్పటికీ మూడు రోజులపాటు జైలు నుంచి విడుదల కాలేదు. ఇదే సమయంలో అలీగఢ్‌ జిల్లా యంత్రాంగం ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకుంది.

డాక్టర్‌ కఫీల్‌ను యూపీ ఎస్టీఎఫ్‌ ఇప్పటికి రెండుసార్లు అరెస్టు చేసింది. "అలీగఢ్‌లో కఫీల్‌పై కేసు నమోదైంది. ఆయన వాంటెడ్‌ క్రిమినల్. ముంబయిలో అరెస్టు చేసి అలీగఢ్‌ పోలీసులకు అప్పగించాం. అంతకు ముందు ఆయన గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ వివాదంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు'' అని యూపీ ఎస్టీఎఫ్‌ ఐజీ అమితాబ్‌ యష్‌ బీబీసీకి తెలిపారు.

బెయిల్‌ లభించినా కఫీల్‌ఖాన్‌ను మూడు రోజులపాటు ఎందుకు విడదల చేయలేదు? బెయిల్‌ వచ్చిన తర్వాత అతనిపై ఎందుకు ఎన్‌ఎస్‌ఏ కేసు పెట్టారు అన్నది చర్చనీయమైంది.

రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ కేసులు పెట్టారని కఫీల్‌ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో ఆరోపించారు. బెయిల్‌ పొందిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ విధించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.

డాక్టర్ కఫీల్‌ఖాన్‌

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/BBC

ఫొటో క్యాప్షన్, ఎన్‌ఎస్‌ఏను పొడిగించాలని ఏప్రిల్‌ 1 బోర్డు నిర్ణయించింది

ఎన్‌ఎస్‌ఏ వ్యవధి మూడు నెలలు పెంపు

" కఫీల్‌ఖాన్‌ను విడుదల చేయాలని ఫిబ్రవరి 10న సాయంత్రం 4గంటలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాని ఉత్తర్వులు విడుదల కాలేదు. బెయిల్ తర్వాత నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద కేసు పెట్టకూడదని సుప్రీం కోర్టు ఇంతకు ముందే చెప్పింది'' అని కఫీల్ సోదరుడు ఆదిల్‌ ఖాన్‌ అన్నారు.

"డాక్టర్‌ కఫీల్‌పై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చారు. కానీ ఆయనపై ఎన్‌ఎస్ఏ కేసు ఎలా పెట్టారో అర్ధం కావడం లేదు'' అన్నారు ఆదిల్. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసినందుకు ఆయనపై కేసు పెట్టామని, అది కరెక్టో కాదో హైకోర్టు నిర్ణయిస్తుందని అలీగఢ్‌ జిల్లా అధికారులు చెబుతున్నారు. "ఎన్‌ఎస్‌ఏ గడుపు పెంచడానికి బోర్డు ఉంది. ఇది ప్రభుత్వం నిర్ణయించేది కాదు. ఈ బోర్డులో సీనియర్‌ సిటిజన్‌లు, న్యాయనిపుణులు ఉంటారు. ఎన్‌ఎస్‌ఏ యాక్ట్ కాలపరిమితి 3 నెలలే. కానీ దానిని బోర్డు అనుమతితో మరో మూడేసి నెలలు పొడిగించుకుంటూ పోవచ్చు. కేసు తీవ్రత కారణంగా కఫీల్‌ ఖాన్‌ విషయంలో ఎన్‌ఎస్‌ఏను మూడు నెలలు పొడిగించారు'' అని ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీష్ గోయల్ బీబీసీతో అన్నారు.

నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద పెట్టిన కేసు గడుపు ఏప్రిల్‌ 13తో ముగియాల్సి ఉంది. కానీ ఏప్రిల్‌ 1న దాని కాల పరిమితిని మూడు నెలలు పెంచాలని బోర్డు సిఫారసు చేసింది. డాక్టర్ కఫీల్ కుటుంబం ఆయన అరెస్టుకు, ఎన్ఎస్ఏ యాక్ట్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో హెబియాస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. కానీ సుప్రీంకోర్టు ఆ కేసును అలహాబాద్ హైకోర్టుకు పంపింది.

"ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశాం. సుప్రీంకోర్టు బిజీగా ఉందని, దీనిని హైకోర్టులోనే విచారించవచ్చని చెబుతూ మార్చి 18న హైకోర్టుకు పంపారు. రకరకాల కారణాలు చెబుతూ ప్రభుత్వ న్యాయవాదులు తేదీలు మారుస్తూ వస్తున్నారు. డాక్టర్ కఫీల్ విడుదలపై ఇంత వరకు విచారణ జరగలేదు. మే 14 నుండి 11సార్లు విచారణ వాయిదా పడింది." అని కఫీల్‌ సోదరుడు ఆదిల్ అన్నారు.

డాక్టర్ కఫీల్‌ఖాన్‌

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/bbc

జైలు నుంచే కఫీల్‌తో ముప్పు

జాతీయ భద్రతా చట్టం ఎన్‌ఎస్‌ఏ ఏ వ్యక్తినైనా అదుపులోకి తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా ఒక సంవత్సరంపాటు జైలులో ఉంచవచ్చు. అయితే మూడు నెలలకు పైగా జైలులో ఉంచడానికి సలహా బోర్డు ఆమోదం పొందాలి. ఒక వ్యక్తి వల్ల దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు, న్యాయవ్యవస్థ ఇబ్బందుల్లో పడినప్పుడు నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ను విధిస్తారు.

జైలులో ఉన్న సమయంలో డాక్టర్ కఫీల్ ఒక లేఖ కూడా రాశారు. జైలు లోపల అమానవీయ పరిస్థితుల గురించి అందులో ప్రస్తావించారు. కఫీల్ రాసిన ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

150మంది ఖైదీలకు ఒకే మరుగుదొడ్డి ఉందని, సాధారణ పరిస్థితుల్లో ఎవరూ లోపలికి వెళ్లలేరని లేఖలో డాక్టర్ కఫీల్ రాశారు. జైలులో ఆహారం, పానీయాల ఏర్పాట్లలో సామాజిక దూరం నియమాలేలేవని ఆయన అన్నారు.

"లాక్‌డౌన్‌ సమయంలో, కరోనా యుగంలో కఫీల్ శాంతి, మత సామరస్యాలను ఎలా పాడు చేయగలడో నాకు అర్థం కావడం లేదు ? రాజకీయ కారణాల వల్ల మాత్రమే ఆయన్ను టార్గెట్‌ చేసుకున్నారు. కఫీల్‌కు గుండె సంబంధ సమస్యలున్నాయి. ఎంత వేడుకున్నా సరైన చికిత్స అందించడం లేదు'' అని కఫీల్‌ సోదరుడు ఆదిల్‌ అన్నారు.

కఫీల్‌ఖాన్‌ లేఖ

ఫొటో సోర్స్, Samiratmaj Mishra/bbc

ఫొటో క్యాప్షన్, కఫీల్‌ఖాన్‌ లేఖ

విడుదల కోసం డిమాండ్లు

డాక్టర్‌ కఫీల్‌ విడుదల కోసం గతంలో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని గంటల్లో లక్షకు పైగా ట్వీట్లు వచ్చాయి. బుధవారం లక్నోలోని కొందరు న్యాయవాదులు ఆయన్ను విడుదల చేయాలంటూ ప్రదర్శన నిర్వహించారు.

ఇటు కాంగ్రెస్‌ మైనారిటీ సెల్‌ కూడా కఫీల్ విడుదల కోరతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించింది. సంతకాల సేకరణ, సోషల్‌ మీడియా ప్రచారం, వినోద కార్యక్రమాల రద్దు, రక్తదానంతోపాటు, 15రోజులపాటు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించింది.

2017లో గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 60మంది పిల్లలు మరణించినప్పుడు డాక్టర్‌ కఫీల్ పేరు చర్చకు వచ్చింది. నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, కఫీల్‌ను సస్పెండ్ చేసి జైలుకు పంపింది. అనేక ఆరోపణల్లో ఆయన క్లీన్‌చిట్ పొందినా సస్పెన్షన్‌ మాత్రం రద్దు కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)