చైనా - అమెరికా వివాదం: చెంగ్డూలో అమెరికన్ కాన్సులేట్‌ను ఖాళీ చేయించిన చైనా

ఫొటో సోర్స్, AFP
అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో చైనాలోని చెంగ్డూ నగరంలో ఉన్న తమ కాన్సులేట్ కార్యాలయాన్ని అమెరికా అధికారులు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సోమవారం ఉదయంకల్లా ఆఫీసు వదిలి వెళ్లాలని చైనా గడువు విధించడంతో, అధికారులు, సిబ్బంది హడావుడిగా సామాన్లు సర్దుతూ కనిపించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు చైనా జెండాలు ఊపుతూ కాన్సులేట్ కార్యాలయం ముందు గుమిగూడారు.

ఫొటో సోర్స్, EPA
గతవారం అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని తమ కార్యాలయాన్ని మూసి వేయాల్సిందిగా అమెరికా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చైనా కూడా దానికి ప్రతిగా స్పందించింది.
చైనా అధికారులకు అమెరికా ప్రభుత్వం విధించిన 72 గంటల గడువు శుక్రవారం నాటికి ముగియడంతో హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్ కార్యాలయంలోకి అధికారులు బలవంతంగా ప్రవేశించారు.
చైనా మేధా సంపత్తిని దొంగిలిస్తుండటంతో తాము ఈ చర్యకు పాల్పడ్డామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. అయితే తమ దేశం మీద అక్కసుతో కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి అమెరికా ఈ చర్యకు దిగిందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల మధ్య గత కొద్దికాలంగా విభేదాలకు దారి తీసిన అంశాలు
- కరోనా వైరస్, వ్యాపార సంబంధాల విషయంలో ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చైనాతో అనేకసార్లు ఘర్షణ పడింది.
- హాంకాంగ్‌లో చైనా ప్రవేశపెట్టాలనుకున్న రక్షణ చట్టాన్ని అమెరికా వ్యతిరేకించింది.
- తాను చైనా కోసం అమెరికాలో గూఢచర్యం చేస్తున్నానని సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి గత వారం అమెరికా కోర్టు ముందు అంగీకరించారు.
- మిలటరీ అధికారులుగా చెప్పుకుంటూ వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై చైనాకు చెందిన నలుగురు వ్యక్తులపై అమెరికా కేసులు నమోదు చేసింది.

ఫొటో సోర్స్, Reuters
చెంగ్డూలో ఏం జరుగుతోంది?
చెంగ్డూలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని అక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్న దృశ్యాలను చైనా అధికార మీడియా చూపించింది.
ఉద్రిక్తతలు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యగా డజన్ల సంఖ్యలో పోలీసులు రాయబార కార్యాలయం ముందు మోహరించారు. అయితే కార్యాలయం నుంచి ఓ బస్సు బైటికి వెళుతుండగా నినాదాలు వినిపించాయని ఏఎఫ్‌పి న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటు హ్యూస్టన్‌లోని చైనా కార్యాలయం నుంచి అధికారులు వెళుతున్నప్పుడు కూడా ఇలాగే నినాదాలు వినిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
చెంగ్డూలో అమెరికా రాయబార కార్యాలయాన్ని 1985లో ఏర్పాటు చేశారు. ఇది చైనా నైరుతి భాగంలో, టిబెట్‌కు సమీపంలో ఉంటుంది. ఈ కార్యాలయంలో స్థానికులైన సుమారు 200మంది చైనీస్ ఉద్యోగులు కూడా పని చేస్తున్నారు.
పరిశ్రమలు, సేవారంగం వృద్ధి చెందుతుండటంతో వ్యవసాయ ఉత్పత్తులు, కార్లు, ఇతర యంత్రాల ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో చెంగ్డూ కార్యాలయం ప్రయోజనకారిగా ఉంటుందని అమెరికా భావించింది.
ఈ కార్యాలయం మూసివేతతో అమెరికాకు చైనా మెయిన్‌ల్యాండ్‌లో నాలుగు, బీజింగ్‌లో ఒక రాయబార కార్యాలయం మాత్రమే ఉన్నాయి. హాంకాంగ్‌లో కూడా కాన్సులేట్ ఉంది. హ్యూస్టన్ కార్యాలయం మూసివేసిన తర్వాత చైనాకు వాషింగ్టన్ డీసీలో ఒకటి, అమెరికా వ్యాప్తంగా నాలుగు రాయబార కార్యాలయాలు మిగిలి ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
అమెరికా చైనాల మధ్య ఘర్షణ ఎందుకు?
అమెరికా చైనాల మధ్య ఘర్షణకు అనేక కారణాలున్నాయి. కరోనావ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా వాదిస్తోంది. వైరస్ చైనాలోని వూహాన్ నగరంలో ఉన్న ఓ లేబరేటరీలో సృష్టించారని ఆధారాలు చూపకుండా ట్రంప్ అనేకమార్లు ఆరోపణలు చేశారు. అయితే అమెరికా సైన్యమే తమ దేశానికి ఈ వైరస్‌ను తెచ్చి ఉంటుందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ప్రత్యారోపణలు చేశారు.
2018లో రెండు దేశాల మధ్య ట్యాక్స్‌ల యుద్ధం నడిచింది. అమెరికా మేథోసంపత్తిని చైనా దొంగతనం చేస్తోందని ట్రంప్ అనేకమార్లు ఆరోపించగా, తమ ఆర్ధికాభివృద్ధిని చూసి తట్టుకోలేక అణచివేయడనికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా ఆరోపణలు చేసింది.
షిన్‌జియాంగ్ ప్రాంతంలో వీగర్ ముస్లింలను అణచివేతకు గురి చేస్తున్నారన్న ఆరోపణలతో చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే అమెరికా వాదనను తప్పుబట్టిన చైనా, ఇది తమ దేశ వ్యవహారాలలో కలగజేసుకోవడమేనని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
హాంకాంగ్ సంగతేంటి ?
హాంకాంగ్‌లో కొత్తగా రక్షణ చట్టాలను తీసుకురావడంపై అమెరికా, బ్రిటన్‌లు చైనాతో ఘర్షణ పడుతున్నాయి. చైనా వస్తువులకు పన్ను రాయితీలు ఇచ్చే హాంక్‌కాంగ్ ప్రత్యేక వాణిజ్య గుర్తింపును అమెరికా రద్దు చేసింది.
హాంకాంగ్‌లో చైనా రక్షణ చట్టం ఆ దేశ ప్రజల స్వేచ్ఛను అణచివేస్తుందని వాదించిన బ్రిటన్, ఇంకో అడుగు ముందుకేసి హాంకాంగ్‌వాసులకు తమ దేశ పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది.
దీనికి ప్రతిగా హాంకాంగ్‌లో ఉంటున్న బ్రిటన్ దేశీయులకు బీఎన్‌ఓ పాస్‌పోర్టులను రద్దు చేస్తామని చైనా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్‌బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








