చైనా-అమెరికా: ‘ముస్లింలపై అకృత్యాలకు పాల్పడిన చైనా అధికారుల’పై అమెరికా ఆంక్షలు

ఫొటో సోర్స్, Getty Images
చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లిం మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆ దేశానికి చెందిన కొందరు రాజకీయ నాయకులపై అమెరికా ఆంక్షలు విధించింది.
వీగర్ ముస్లింలు, మరికొన్ని వర్గాలను సామూహికంగా నిర్బంధించిందని.. వారిపై మతపరమైన హింసకు పాల్పడుతోందని.. బలవంతంగా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయిస్తోందని చైనాపై ఆరోపణలున్నాయి.
అమెరికాతో సంబంధం గల ఆర్థిక ఆసక్తులున్న రీజనల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత చెన్ క్యుయాంగో, మరో ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించారు.
కాగా జిన్‌జియాంగ్‌లో వీగర్ల పట్ల అలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదంటూ చైనా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఇటీవల కొన్ని సంవత్సరాలుగా జిన్‌జియాంగ్‌లో విద్యా శిబిరాల పేరుతో సుమారు 10 లక్షల మందిని అధికారులు నిర్బంధించినట్లు ఆరోపణలున్నాయి.
తీవ్రవాదం, వేర్పాటువాదాలను అరికట్టేందుకు వొకేషనల్ ట్రైనింగ్ అవసరమంటూ ఈ నిర్బంధ శిబిరాలకు లక్షల మందిని తరలించారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీలో శక్తిమంతమైన పొలిట్ బ్యూరో సభ్యుడు చెన్ క్యుయాంగో. ఇప్పటివరకు అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొన్నవారిలో అత్యున్నత స్థాయి అధికారి ఈయనేనని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.
చెన్ అంతకుముందు టిబెట్ వ్యవహారాలు చూసేవారని.. కొన్నాళ్లుగా చైనా అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక విధానాలన్నీ ఈయన రూపొందించినవేనని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అమెరికా ఆంక్షలకు గురైన మిగతా ముగ్గురిలో జిన్‌జియాంగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ వాంగ్ మింగ్షాన్, జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సీనియర్ నేత జూ హైలూన్, మాజీ సెక్యూరిటీ అధికారి హ్యూవో లియాజున్‌లు ఉన్నారు.
తాజా ఆంక్షల ప్రకారం ఇప్పుడు అమెరికాలో ఎవరైనా ఈ నలుగురితో ఆర్థిక లావాదేవీలు జరిపితే అది నేరమవుతుంది.
అంతేకాదు.. వీరికి సంబంధించిన అమెరికాలోని ఆస్తులను స్తంభింపజేస్తారు.
కాగా ఈ నలుగురిలో హ్యువో మినహా మిగతా ముగ్గురు, వారి కుటుంబాలపై వీసా ఆంక్షలూ విధించారు. వారెవ్వరూ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం లేకుండా చేశారు.
మరోవైపు ఈ నలుగురు అధికారులపైనే కాకుండా మొత్తంగా జిన్‌జియాంగ్ పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోపైనా ఆంక్షలు విధించింది అమెరికా.

ఫొటో సోర్స్, Reuters
జిన్‌జియాంగ్ ప్రాంతంలో జరుగుతున్న భయంకరమైన, వ్యవస్థీకృతమైన అకృత్యాలపై చర్యలకు ఉపక్రమించినట్లు అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి మైక్ పాంపియో తెలిపారు.
''వీగర్లు, అనాదిగా నివసిస్తున్న కజక్‌లు, జిన్‌జియాంగ్‌లోని ఇతర అల్పసంఖ్యాక వర్గాలను లక్ష్యంగా చేసుకుని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అరాచకాలకు పాల్పడితే అమెరికా చూస్తూ ఊరుకోదు'' అని పాంపియో ఒక ప్రకటనలో హెచ్చరించారు.
జిన్‌జియాంగ్‌లో అకృత్యాలకు బాధ్యులుగా భావిస్తున్న మరికొందరు చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యులపైనా ఆంక్షలు విధిస్తున్నామని.. అది వారి కుటుంబాలకూ వర్తిస్తుందని పాంపియో వెల్లడించారు.
ఇప్పటికే కరోనావైరస్ సంక్షోభం, హాంకాంగ్‌లో చైనా జాతీయ భద్రత చట్టం అమలు విషయంలో అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
జిన్‌జియాంగ్‌లో చైనా ఏం చేస్తోంది?
హక్కుల సంస్థలు చెబుతున్న ప్రకారం జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో నిర్వహిస్తున్న జైళ్లలాంటి శిబిరాల్లో సుమారు 10 లక్షల మందిని నిర్బంధించారు.
గత ఏడాది కేవలం ఒక్క వారంలోనే 15 వేల మందిని ఇలాంటి శిబిరాల్లో నిర్భందించినట్లు బీబీసీ ఒక రహస్య పత్రం ఆధారంగా తెలుసుకుంది.
చైనా చెబుతున్నట్లుగా వారి గత చరిత్రలోని నేర, చట్టవ్యతిరేక, ప్రమాదకర స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే వారిని విడిచిపెడతారు.
అయితే.. చైనా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని హింసాత్మక మత తీవ్రవాదానికి వ్యతిరేకంపై పోరులో భాగంగా వారందరికీ వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెబుతున్నారు.
కానీ, ప్రార్థనలు చేసుకోవడం, బురఖా ధరించడం వంటి మత విశ్వాసాలు పాటించినందుకు, టర్కీ వంటి దేశాలతో సంబంధాలున్నందుకు చాలామందిని తీసుకెళ్లి నిర్బంధ శిబిరాల్లో పెట్టినట్లు ఆధారాలున్నాయి.
వీగర్లలో అత్యధికులు టర్కీ మూలాలున్న ముస్లింలు.. జిన్‌జియాంగ్ జనాభాలో 45 శాతం వారే ఉంటారు.
జిన్‌జియాంగ్‌లోని మహిళలకు బలవంతంగా సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయించడం, గర్భనిరోధక పరికాలు అమర్చడం చేస్తున్నారని గత నెలలో చైనా స్కాలర్ ఆడ్రియన్ జెంజ్ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికలోని అంశాలపై ఐరాస దర్యాప్తు చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వినిపించాయి.
ఇవి కూడా చదవండి:
- ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?
- యాదాద్రి: ముస్లిం శిల్పులు చెక్కుతున్నారు
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- రోహింజ్యా ముస్లింలు క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- ఎన్నికల్లో వాట్సాప్ దుర్వినియోగం, ఒకేసారి 3 లక్షల మందికి మెసేజ్‌లు
- దీపావళి: హరిత టపాసులు అంటే ఏంటి?
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








