బగ్దాదీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ను అంతం చేసిన 15 నిమిషాల అమెరికన్ సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగింది...

ఫొటో సోర్స్, OMAR HAJ KADOR
ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
ఆ సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగింది. బగ్దాదీ ఇడ్లిబ్‌లో ఎందుకున్నారు. ఆయన అక్కడున్నాడన్న విషయం ఎలా తెలిసింది. బగ్దాదీ చనిపోయారని అమెరికా అంత కచ్చితంగా ఎలా చెబుతోంది.

దాడి ఎక్కడ.. ఎప్పుడు జరిగింది?
బగ్దాదీ కోసం అమెరికా ఎంతో కాలంగా వెతుకుతోంది. అతనిపై 25 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 177 కోట్ల రూపాయల బహుమతి ఉంది. అతడిని చంపినా.. ప్రాణాలతో పట్టిచ్చినా... కనీసం ఆచూకీ చెప్పినా.. 177 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఐఎస్ ఆవిర్భావం నుంచి అమెరికా, దాని సంకీర్ణ సేనలు వెతుకుతున్నప్పటికీ, అతడు దొరక్కుండా తిరుగుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం రెండు వారాల క్రితం బగ్దాదీ గురించి సమాచారం అందింది. అప్పటినుంచి అతడిపై నిఘా పెట్టారు.
అతడు త్వరలోనే మరో ప్రాంతానికి వెళ్లబోతున్నారని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. కానీ చివరి క్షణంలో ఐఎస్ చీఫ్ తన మనసు మార్చుకున్నారు. దాంతో దాడి చేయాలన్న ప్రయత్నాలను రెండు, మూడుసార్లు అమెరికా కమాండోలు విరమించుకోవాల్సి వచ్చింది.
చివరికి సిరియా- ఇడ్లిబ్ ప్రాంతంలో.. టర్కీ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల దూరంలో.. బరిషా అనే గ్రామం బయట బగ్దాదీ స్థావరాన్ని గుర్తించారు. అందులో ఉన్నది అతనేనని నిర్ధారించుకుని.. అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ ఈ దాడి చేపట్టింది.

ఫొటో సోర్స్, AFP
బగ్దాదీ అక్కడ ఉన్నాడని ఎలా తెలిసింది?
బగ్దాదీ సెల్‌ఫోన్ వాడరు. సెల్‌ఫోన్ వాడితే నిఘా వర్గాలు కనిపెడతాయని భయం. కానీ, ఇంటర్నెట్ మాత్రం బాగా వాడేవారు. ఇదే అతన్ని నిఘా వర్గాలకు పట్టించింది. టెక్నాలజీతో బగ్దాదీ ఎక్కడున్నారో గుర్తించారు.
ఆపరేషన్ ఎలా మొదలైంది?
బగ్దాదీ స్థావరాన్ని పక్కాగా గుర్తించిన అమెరికా కమాండోలు మెరుపుదాడి చేశారు.
ఎనిమిది హెలికాప్టర్లు ఇరాక్ నుంచి బయలుదేరాయి. గంట 10 నిమిషాలు ప్రయాణించి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 1 గంటకు లక్ష్యాన్ని చేరుకున్నాయి.
లక్ష్యాన్ని చేరుకోవాలంటే టర్కీ, సిరియా, రష్యా మిలిటరీ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి హెలికాప్టర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే రష్యాకు ముందే సమాచారం ఇచ్చారు. కానీ, ఎందుకోసమన్నది మాత్రం చెప్పలేదు.
అదే సమయంలో యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను సైతం సిద్ధం చేశారు.
హెలికాప్టర్లను చూడగానే బగ్దాదీ అనుచరులు కాల్పులు జరిపారు. అమెరికా స్పెషల్ ఫోర్స్ వాటిని తిప్పి కొట్టింది.
హెలికాప్టర్లు రెండు ఇళ్లపై మిస్సైల్స్ ప్రయోగించాయి. ఫైరింగ్ 30 నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు కూడా బీబీసీకి ఇదే విషయం చెప్పారు.
హెలికాప్టర్లు ల్యాండైన మరుక్షణం లొంగిపోవాలని అమెరికా సేనలు బగ్దాదీని కోరాయి. ఇద్దరు యువకులు, 11 మంది చిన్నారులు లొంగిపోయారు. కానీ బగ్దాదీ మాత్రం ఇంటి లోపలే ఉండిపోయారు.
దాంతో బగ్దాదీ కంపౌండ్ ప్రహారీ, ఇంటి గోడలను పేల్చేసి సైనికులు లోపలికి ప్రవేశించారు. మెయిన్ డోర్ ద్వారా వెళ్లి బగ్దాదీ వలలో చిక్కుకోకుండా అమెరికా కమాండోలు ఇలా వెళ్లారు. ఆ తర్వాత ఏరివేత మొదలుపెట్టారని ట్రంప్ చెప్పారు. సిచ్యువేషన్ రూంలో కూర్చుని ట్రంప్ ఈ ఆపరేషన్‌ను వీక్షించారు.

చనిపోయింది బగ్దాదేనా?
కమాండోల ఆపరేషన్‌తో తప్పించుకునేందుకు బగ్దాదీ ప్రయత్నించారు.
తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఒక సొరంగంలోకి పారిపోయారు. అమెరికా ఆర్మీ డాగ్స్ ఆయన్ను వెంబడించాయి. సొరంగం చివరికి చేరుకోగానే డాగ్స్ ఆయనపైకి దూకేశాయి.
కిందపడిన బగ్దాదీ తాను వేసుకున్న ఆత్మాహుతి కోటును పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ వెల్లడించారు. పేలుడులో బగ్దాదీ శరీరం ముక్కలు ముక్కలైపోయింది.
డీఎన్ఏ పరీక్షల ద్వారా చనిపోయింది బగ్దాదేనని తేలిందని ట్రంప్ చెప్పారు. అతనితో పాటు అతని ముగ్గురు చిన్నారులు కూడా చనిపోయారు. బగ్దాదీ ఇద్దరు భార్యలు మరణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బగ్దాదీ స్థావరంలో ఉన్న వాళ్లు కొందరు లొంగిపోయారు. మరికొందరు సైనికుల కాల్పుల్లో మరణించారు. బగ్దాదీ కాంపౌండ్ నుంచి 11 మంది చిన్నారులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ఆపరేషన్ మొత్తం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. అయితే, దాడి చేపట్టిన 15 నిమిషాల్లోనే బగ్దాదీ చనిపోయారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.
"ఒక క్రూర హంతకుడు, ఎన్నో మరణాలకు కారణమైన వ్యక్తి క్రూరంగా అంతమయ్యారు. అతను కుక్కచావు చచ్చారు. ఒక పిరికివాడిలా చనిపోయారు" అని ట్రంప్ అన్నారు.
అయితే, బగ్దాదీ మరణాన్ని ఇస్లామిక్ స్టేట్- ఐఎస్ ఇంకా ధ్రువీకరించలేదు. గతంలో కూడా బగ్దాదీ చనిపోయినట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి.

ఫొటో సోర్స్, AFP
అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు?
అబూ బకర్ అల్ బగ్దాదీ అసలు పేరు ఇబ్రహీం అవ్వద్ ఇబ్రహీం అల్-బద్రి. అనుచరులు 'ఖలీఫా ఇబ్రహీం'గా పిలుచుకుంటారు.
మధ్య ఇరాక్ నగరం సమర్రాలో 1971లో బగ్దాదీ పుట్టారు. యువకుడిగా ఉన్నప్పుడు ఖురాన్ బోధించేవారు.
2003లో సద్దాం హుస్సేన్ పాలన అంతమైనప్పుడు ఇస్లామిక్ తిరుగుబాటు గ్రూపు ఆవిర్భావానికి బగ్దాదీ సాయం చేశారని చెబుతారు.
ఆ తర్వాత 2004లో బగ్దాదీని అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని బక్కా క్యాంపులో నిర్బంధించాయి. ఆయన నుంచి ప్రమాదం లేదని భావించిన అమెరికా.. పది నెలల తర్వాత అతన్ని వదిలేసింది.
బుక్కా క్యాంపు నుంచి బయటపడిన బగ్దాదీ అల్-ఖైదా ఇన్ ఇరాక్‌తో పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రమంగా బగ్దాదీ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారారు.
ఇవి కూడా చదవండి:
- సుజిత్ విల్సన్ మృతి.. బోరు బావి నుంచి మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- ప్రెస్ రివ్యూ: ఇద్దరితో ప్రేమ ఎందుకన్నందుకు తల్లిని చంపిన కూతురు
- ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఎందుకు దొరకడం లేదు? ప్రభుత్వం ఏమంటోంది?
- శిథిల నగరం కింద శవాల కోసం వెదుకులాట
- ఇస్లామిక్ స్టేట్ ప్రస్తుతం ఏ దేశంలో విస్తరిస్తోంది?
- ‘అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకారం
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








