కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం అండా?.. గుదిబండా?

ఫొటో సోర్స్, Hindustan times
- రచయిత, తారేంద్ర కిశోర్
- హోదా, బీబీసీ కోసం
దేశంలో అతి పురాతన పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలం రోజురోజుకీ పడిపోతోంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వందలోపే సీట్లు వచ్చాయి.
2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం కూడా ఏర్పడింది. పార్టీని నడిపించేది ఎవరు అన్న ప్రశ్న పదే పదే వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తరువాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేశారు.
"అధ్యక్షుడిగా ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. అందువల్లే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను '' అని రాహుల్ అప్పట్లో ప్రకటించారు.
"నెల రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగాలి. నేను ఇప్పుడు బాధ్యతల్లో లేను. రాజీనామా చేశాను. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలి'' అని ఆయన అన్నారు.
2019లో సోనియా గాంధీని ఒక ఏడాది కాలానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు ఎవరు అన్నది తేలకపోవడంతో ఆమె మరో సంవత్సరం ఆ పదవిలో కొనసాగారు.
అయితే, అధ్యక్ష పదవిపై ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు గళం విప్పుతున్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
"పార్టీ అనాథ అనిపించుకునే పరిస్థితి రాకుండా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను తక్షణం ప్రారంభించాలి'' అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు.
"పార్టీని నడిపించే శక్తియుక్తులు రాహుల్ గాంధీకి ఉన్నాయి, ఆయన ముందుకు రాకపోతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలి'' అని థరూర్ వ్యాఖ్యానించారు.
శశిథరూర్ ప్రకటనతో, గాంధీ కుటుంబం కాకుండా బయటి వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.
అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేసరికి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది అసలు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అనగానే గాంధీ కుటుంబంవైపే చూడాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది?
రెండో ప్రశ్న, కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు మళ్లీ గాంధీ కుటుంబంపై ఆధారపడటం వల్ల ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సాధించగలదా?
గాంధీ కుటుంబం బలమా లేక బలహీనతా ?

ఫొటో సోర్స్, Pti
ఈ అంశాన్ని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ విశ్లేషించారు. " ఏ సంస్థలోనైనా ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి ఎక్కువ పాత్ర ఉందనేది నిజం. చారిత్రాత్మకంగా ఇది స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి నడుస్తోంది.
ఇక పార్టీలో అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఏమీ చేయరు. ఒక్కోసారి పార్టీ నిబంధనల గురించి మాట్లాడతారు. ఏఐసీసీ సమావేశం పెట్టాలని డిమాండ్ చేస్తారు. గతంలో అర్జున్ సింగ్ పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా ఇలాగే సంతకాల సేకరణ చేసి ఏఐసీసీ సమావేశానికి డిమాండ్ చేశారు'' అని ఆయన వెల్లడించారు.
"సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలయ్యారు. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్టీ నేతల నుంచి స్వేచ్ఛ కోరుకున్నారు. కానీ అది జరగలేదు. ఆ పార్టీలో అలాంటి నాయకులు ఉంటారు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగలేను అనడానికి అనేక కారణాలున్నాయి. కానీ పార్టీ ఓ నాయకుడిని ఎన్నుకోవడం దాని బాధ్యత'' అని కిద్వాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే సీనియర్ జర్నలిస్టు నీరజా చౌధరి మరో విషయం చెప్పారు. " గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ నడవలేదు. కానీ రాహుల్ గాంధీతో కూడా నడవలేదు. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరూ ముందుకు రావడం లేదు గనుక సోనియాగాంధీ మరోసారి పార్టీ అధ్యక్షురాలు కావడం ఖాయం'' అని ఆమె అన్నారు.
" గాంధీ కుటుంబం ఇష్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తే పార్టీలో అభిప్రాయభేదాలు వచ్చి చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే పార్టీ మళ్లీ కోలుకోలేదు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమే. పైగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు.
నిర్ణయాలు తీసుకోవడంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని రాహుల్ భావిస్తున్నారు. లేదంటే తనకు అధ్యక్ష పదవి వద్దంటున్నారు. ప్రియాంకను సోనియాగాంధీ ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో లేరు. ఎందుకంటే రాహుల్ ఎదగాలని ఆమె కోరుకుంటున్నారు. ఇదొక వింత పరిస్థితి" అన్నారు నీరజా చౌధరి.

ఫొటో సోర్స్, AFP
కాంగ్రెస్ సమస్య ఏమిటి?
కాంగ్రెస్ నిజమైన సంక్షోభం నాయకత్వమే. ఆ పార్టీ దేశ రాజకీయాలలో పూర్తిగా దిగజారి పోయింది. అసలు భారత రాజకీయాల్లో దీనికి ఇంకా స్థానం ఉందా అన్న అనుమానం కూడా తలెత్తుతుంది.
"ఈ రోజు కాంగ్రెస్‌కు తన వైఖరేంటో తనకే తెలియదు. ప్రత్యామ్నాయ విధానంగానీ, నాయకత్వం కానీ లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిని ఉంది. యువత నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉంది.
సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడారు. కాంగ్రెస్ మళ్లీ ఎదుగుతుందని ఎవరూ భావించడం లేదు. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
గాంధీ కుటుంబం నుంచి ఎవరూ నాయకత్వ బాధ్యత తీసుకోరు అని గత సంవత్సరం రాహుల్ గాంధీ అన్నారు. కొన్నాళ్లు ఇతరులకు వదిలేయడం మంచిది'' అని నీరజా చౌధరి అన్నారు.
అయితే దీనిపై రషీద్ కిద్వాయ్ అభిప్రాయం కొంత భిన్నంగా ఉంది.
"గాంధీ కుటుంబం మినహా, కాంగ్రెస్‌లోని ఇతర సీనియర్లు ఆశను వదులుకున్నారు. వారికి కొంచెం అధికారం ఇస్తే పార్టీని బాగు చేయగలరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలో పార్టీ మంచి విజయాలను సాధించింది.
గుజరాత్‌లో దాదాపు సమాన పోటీ ఉంది. దిల్లీలో కూడా బీజేపీ ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు బీజేపీతో పోటీ పడలేవు అనడం కరెక్టు కాదు. కాకపోతే వాటిని నడిపించే వారు లేరు " అన్నారాయన.
"ఆర్థిక, విదేశాంగ, రక్షణ విధానాల్లో అన్ని విషయాలపై కాంగ్రెస్‌కు అవగాహన, సుదీర్ఘ అనుభవం ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఇంత సుదీర్ఘ అనుభవం లేదు. మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలు" అనిక కిద్వాయ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ, మోదీ శకానికి ప్రత్యామ్నాయం ఏంటి?
"రాహుల్ గాంధీపై చాలామందికి ఆశ ఉంది. ఎందుకంటే ఆయనే నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా నిలవగలరు. రాహుల్ గాంధీ మోదీ ప్రతి విధానాన్ని సవాలు చేయగలరు. దాన్ని కొనసాగించాలంటే ఆయనకు స్వేచ్ఛ కావాలి. తనకు కావాల్సిన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉండాలి '' అన్నారు కిద్వాయ్
"కాంగ్రెస్‌లో ఇంకా పాతకాలపు నాయకుల ఆధిపత్యం కొనసాగుతోంది. వీరంతా సోనియపక్షంలో ఉన్నట్లు కనిపిస్తారు. జ్యోతిరాదిత్యను, సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రులను చేయాలని రాహుల్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది'' అని కిద్వాయ్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Pti
పార్టీని బతికించే ప్రయత్నాలు
ఇంత దారుణమైన స్థితికి చేరుకున్న తరువాత కూడా కాంగ్రెస్ ఎలాంటి అంతర్గత సంస్కరణలకు ప్రయత్నించలేదా?
"ఏళ్లుగా అనేక అంతర్గత కమిటీలు పార్టీలో సంస్కరణలపై నివేదికలను సమర్పించాయి. చివరి కమిటీ 2006-08లో 'ఫ్యూచర్ ఛాలెంజెస్' అనే పేరుతో ఏర్పడింది. ఇందులో మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ ఉన్నారు.
అప్పటికే 8-9మంది సభ్యులు ఉన్నందున రాహుల్ గాంధీ కూడా ఇందులో సభ్యుడుగా ఉండటం వింతగా అనిపించవచ్చు. ఈ కమిటీ పార్టీ ఎదుర్కోబోయే సవాళ్లు వ్యూహాలపై నివేదికను సమర్పించింది. ఇది కాకుండా, సంగ్మా నివేదిక, శామ్ పిట్రోడా రిపోర్ట్ , ఏకే ఆంటోనీ రిపోర్ట్ ఇలా మూణ్నాలుగు కమిటీల నివేదికలు ఉన్నాయి.'' అని కిద్వాయ్ వెల్లడించారు.
"పార్టీ సంస్కరణ మీద అద్భుతమైన నివేదికలున్నాయి. కానీ వాటిని అమలు చేసే నిబద్ధత, సంకల్పం లేకపోవడమే అసలు సమస్య'' అన్నారు నీరజా చౌధరి.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ ముక్త భారత్ ఎంత వరకు సాధ్యం?
కాంగ్రెస్ రాజకీయాలన్నింటికీ గాంధీ కుటుంబమే ఇరుసు. గాంధీ అనే పేరు పార్టీలోని అన్ని భావజాలాలను ఏకం చేయగలని నమ్ముతారు. మరి అలాంటి గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందా?
"కాంగ్రెస్ ముక్త భారతదేశం కావాలని నరేంద్ర మోదీ అంటారు. కానీ గాంధీ కుటుంబం లేనిదే కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ విషయం పార్టీలో అందరికీ తెలియదు. అదే వారి భయం కూడా. ఆ భయంలో నిజం కూడా ఉంది. అందుకే చేతులు కట్టుకుని కూర్చుంటే కుదరదు. ఏదో ఒక దారి కనుక్కోవాలి. లేదంటే పార్టీ ఉండదు'' అని నీరజా చౌధరి అన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయపక్షం అన్న శూన్యత భారత రాజకీయాలలో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మరో 10వారాల్లో పాకిస్తాన్ ఖజానా ఖాళీ!
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- ‘పాకిస్తాన్ ఆందోళన’కు కారణమైన ఇస్రో 100వ స్వదేశీ శాటిలైట్ విశేషాలివే
- దేశ భాషలందు తెలుగు: 50 ఏళ్లలో 2 నుంచి 4వ స్థానానికి
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- నల్లమల: సంపర్కం, ఆవాసం కోసం పులుల మధ్య పోరాటం
- Reality check: చైనీస్.. పాకిస్తాన్ అధికారిక భాషగా మారిందా?
- కశ్మీర్ విలీనానికి 70 ఏళ్లు: భారతదేశంలో ఇలా కలిసింది
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








