చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గిపోయాయి.. కానీ భారత్ నుంచి చైనాకు ఎగుమతులు పెరిగాయి.. ఎందుకు, ఎలా?

మోదీ, జిన్‌పింగ్

ఫొటో సోర్స్, NArendra modi/Twitter

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏప్రిల్‌లో తొలిసారి ‘భారత ఆత్మ నిర్భరత’ నినాదం ఇచ్చారు. మరోవైపు చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మే నెల నుంచి పెరుగుతూ వచ్చాయి. అయినా, భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగింది.

సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణ తర్వాత చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. చైనా టీవీలు, మొబైల్ ఫోన్ల దిగుమతులపై ఆంక్షలు విధించడం వాటిలో ఒకటి.

అయితే, ఈ చర్యల ప్రభావం మరో మూడు నెలల తర్వాతే కనపించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తక్షణమే ద్వైపాక్షిక వాణిజ్యం తగ్గదని అభిప్రాయపడుతున్నారు.

చైనాపై ఆంక్షలు విధించడమనేది సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి, ద్వైపాక్షిక వాణిజ్యంలో ఉన్న లోటును సరిచేసుకోవడానికి భారత్‌కు ఓ సాధనమని దిల్లీలోని ఎఫ్ఓఆర్‌ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చైనా వ్యవహారాల నిపుణుడిగా ఉన్న డాక్టర్ ఫైసల్ అహ్మద్ అన్నారు.

‘‘చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌ వైపు లోటు ఉంది. అందుకే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందంలో భారత్ భాగం కావడం లేదు. ఒకవేళ అందులో చేరితో చైనా నుంచి వచ్చే దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు.

కొన్నేళ్లుగా ద్వైపాక్షిక వాణిజ్యంలో చైనా వాటానే ఎక్కువగా ఉంటూ వస్తోంది.

2019లో ఈ రెండు దేశాల మధ్య దాదాపు 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగితే, అందులో మూడింట రెండొంతుల వాటా చైనాదే.

తమ ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు చైనా ఉక్కు ఉత్పత్తిని పెంచుతోంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తమ ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు చైనా ఉక్కు ఉత్పత్తిని పెంచుతోంది

లోటు తగ్గుతోందా?

చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో ఉన్న లోటును పూడ్చుకునే విషయంలో భారత్ వైపు కాస్త పురోగతి కనిపించింది.

జనవరి నుంచి జూన్ వరకు ఉన్న గణాంకాలను చూస్తే, చైనా నుంచి వచ్చే దిగుమతులు తగ్గిపోయాయి. మరోవైపు భారత్ నుంచి చైనాకు వెళ్లే ఎగుమతులు పెరిగాయి.

భారత్ ఏప్రిల్‌లో చైనాకు రెండు బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు అమ్మింది. జూలైలో అది 4.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. జనవరి నుంచి జూన్ వరకు చైనాకు భారత్ ఎగుమతులు 6.7 శాతం పెరిగాయి.

రెండు దేశాల మధ్య గత ఆరు నెలల్లో జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించిన గణాంకాలను చైనా వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకూ భారత్‌కు వచ్చిన చైనా దిగుమతులు 24.7 శాతం తగ్గిపోయాయి. కానీ, ఏప్రిల్ నుంచి జులై వరకూ పరిస్థితిని చూస్తే, భారత్‌కు దిగుమతులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.

ఏప్రిల్‌లో భారత్‌కు వచ్చిన చైనా దిగుమతులు 3.2 బిలియన్ డాలర్లు ఉంటే, జూలైలో అవి 5.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

చైనా నుంచి వచ్చే దిగుమతులు తగ్గడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకటి లాక్‌డౌన్ సమయంలో ఎగుమతులు-దిగుమతులు నిలిచిపోవడం. రెండోది రెండు దేశాల ఆర్థికవ్యవస్థలు మందగమనంలోకి వెళ్లడం.

‘భారత్‌లోకి చైనా దిగుమతులు రాకుండా అడ్డుకోవడం వల్ల రెండు దేశాలకూ నష్టమే’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘భారత్‌లోకి చైనా దిగుమతులు రాకుండా అడ్డుకోవడం వల్ల రెండు దేశాలకూ నష్టమే’

కరోనావైరస్ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై బాగా పడింది. భారత్‌లోని పోర్టుల్లో చైనా సరుకులకు క్లియరెన్స్ రావడం కూడా జాప్యమైంది.

భారత్, చైనా దేశాల నాయకులు బయటకు ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నా, వాణిజ్యం విషయంలో మాత్రం వారి వారి దేశాలకు ప్రయోజనకరమైన విధంగానే వ్యవహరిస్తున్నారని ఆర్థిక నిపుణుడు వివేక్ కౌల్ అన్నారు.

చైనాతో వ్యాపారం తమకు సరైనదని భావించడం వల్లే భారత వ్యాపారులు, కార్పొరేట్లు వాణిజ్యం కొనసాగిస్తున్నారు. ఒకవేళ చైనా వస్తువులపై భారత్ సుంకాలు పెంచితే, వీరు ఇలాగే వాణిజ్యం కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు చెప్పడం కష్టం.

కరోనావైరస్ సంక్షోభం ఉన్నా ఆర్థిక వ్యవస్థ తనదైన వేగంతో వెళ్తోందని ఈ ఏడాది తొలి ఆరు నెలల గణాంకాలు సంకేతాలు ఇచ్చాయని చైనాలోని సిచువాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ హువాంగ్ యుంగ్ సోంగ్ అంటున్నారు.

దిగుమతులు కొంత తగ్గినా, అది తాత్కాలిక సమస్యేనని అన్నారు.

‘‘ఆసియాలోని రెండు అతిపెద్ద వ్యవస్థలను వేరు చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది 21వ శతాబ్దపు అవసరం’’ అని అభిప్రాయపడ్డారు.

భారత్ ఎగుమతులు

ఫొటో సోర్స్, AFP

పెరిగిన భారత్ ఎగుమతులు

గత మూడు నెలల్లో భారత్ నుంచి చైనాకు ఎగుమతుల్లో వృద్ధి రావడానికి... ముడి ఇనుము ఎగుమతులు భారీగా పెరగడం ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. గత ఏడాదితో పోల్చితే ముడి ఇనుము ఎగుమతులు చాలా రెట్లు పెరిగాయని చెబుతున్నారు.

చైనా కస్టమ్స్ గణాంకాల ప్రకారం భారత్ నుంచి ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య 2 కోట్ల టన్నుల ముడి ఇనుము చైనాకు చేరింది. 2019 ఏడాది మొత్తంలో జరిగిన ముడి ఇనుము ఎగమతులు 80 లక్షల టన్నులు మాత్రమే.

తమ ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు చైనా ఉక్కు ఉత్పత్తిని పెంచుతోంది. ఇందుకోసం ఆ దేశానికి ముడి ఇనుము అవసరం. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా నుంచి కూడా దీన్ని చైనా దిగుమతి చేసుకుంటోంది.

జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత... దాదాపు 60 చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలోకి చైనా వస్తువుల ప్రవాహాన్ని తగ్గించేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకుంది.

భారత విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) రెండు వారాల క్రితం దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

కలర్ టీవీ దిగుమతులను ‘ఫ్రీ’ నుంచి ‘రెస్ట్రిక్టెడ్’ జాబితాలోకి మార్చుతున్నట్లు డీజీఎఫ్‌టీ పేర్కొంది.

రెస్ట్రిక్టెడ్ జాబితాలో ఉన్నవాటిని దిగుమతి చేసుకోవాలంటే డీజీఎఫ్‌టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.

కేంద్ర వాణిజ్యశాఖ కింద డీజీఎఫ్‌టీ పనిచేస్తోంది.

చైనా, భారత్

చైనాపై ఆధారపడటం వల్ల నష్టమా?

చైనాతో సంబంధాలు దిగజారిన తర్వాత భారత ప్రభుత్వం ‘ఆత్మ నిర్భరత’ నినాదానికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది చైనా వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే, చైనా దిగుమతులపై ఆంక్షలు విధించడం ‘ఆత్మ నిర్భరత’ ఎలా అవుతుందని దిల్లీలో చైనా వస్తువులను విక్రయించే దీపక్ చోప్రా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

‘‘గత ఐదేళ్లుగా నేను హై ఎండ్ చైనా టీవీ వాడుతున్నా. దాన్ని రూ. 40 వేలకు కొన్నా. అదే స్థాయి మోడల్ టీవీని... సోని, ఎల్‌జీ సంస్థల నుంచి కొనాలంటే రూ.లక్ష దాకా ఖర్చు అవుతుంది. నష్టం వినియోగదారుడికే కదా?’’ అని ఆయన అన్నారు.

ఆత్మ నిర్భరత అంటే, దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడకుండా చేయడం కాదని డాక్టర్ ఫైసల్ అహ్మద్ అన్నారు.

భారత్‌లోకి చైనా దిగుమతులు రాకుండా అడ్డుకోవడం వల్ల రెండు దేశాలకూ నష్టమేనని ప్రొఫెసర్ హువాంగ్ అభిప్రాయపడ్డారు.

‘‘ఆసియాలోని రెండు అతిపెద్ద దేశాలపై బయటి శక్తులు ‘విభజించు, పాలించు’ వ్యూహాన్ని ప్రయోగిస్తున్నాయి. భారత్ ఆ శక్తుల చేతుల్లో పావుగా మారుతుండటం బాధాకరం’’ అని అన్నారు.

చైనా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలో ఏ దేశమైనా తమ ఉత్పత్తుల ధరలు తగ్గించేందుకు పూర్తి ప్రయత్నం చేస్తుంది. పూర్తి‌గా ఎగుమతులు, దిగుమతులపైనే ఆధారపడదు.

తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం, వాల్యూ చైన్‌పై దృష్టి పెట్టి... విభిన్న రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించే ప్రయత్నాలను ప్రతి దేశమూ చేస్తుంది. ఇది వాటికి ఆర్థికపరంగా అవసరం కూడా.

ఏదో ఒక్క దేశంపైనే ఆధారపడి ఉండాలని ఏ దేశమూ కోరుకోదు.

ఆత్మ నిర్భరత అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికపరంగా భారత్ ఇతర దేశాలపై ఇక ఆధారపడదని కాదని... చైనా, ఆసియాన్ దేశాలు సహా భారత్ వాణిజ్య భాగస్వామ్యులందరూ అర్థం చేసుకోవాలి.

అయితే, సరిహద్దు వివాదాలు ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, మరో మూడు నెలల్లో దీని ప్రభావాలు కనిపించవచ్చని ఫైసల్ అహ్మద్ అన్నారు.

‘‘చైనా తన వాంఛలను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. మేడ్ ఇన్ చైనా-2025 కార్యక్రమాలతో పాటు మేక్ ఇన్ ఇండియా కోసమూ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేలా ఆ దేశం నడుచుకోవాలి’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)