Nuclear War: అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?

న్యూ మెక్సికోలో అణ్వస్త్ర పరీక్ష

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తొలి అణ్వాయుధ పరీక్షను అమెరికా 1945లో న్యూమెక్సికో ఎడారిలో నిర్వహించింది.

ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలో న్యూ మెక్సికో లోని అలోమాగార్డో ఎయిర్ బేస్ లో 1945 జులై 16వ తేదీన జరిగింది. ట్రినిటీ అనే కోడ్ తో నిర్వహించిన ఈ పరీక్ష జరిగి 76 సంవత్సరాలు అవుతోంది .

ఈ పరీక్ష జరిగిన మరి కొన్ని వారాలలోనే, అదే సంవత్సరం ఆగస్టు 6న జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి మీద అణు బాంబు ప్రయోగం జరిగింది.

ఈ బాంబు దాడితో హిరోషిమాలో 90000 - 166000 మంది ప్రజలు మరణించారు. నాగసాకి లో 60000 నుంచి 80000 మంది మరణించినట్లు అంచనా. అందులో సగం మరణాలు బాంబు దాడి జరిగిన రోజే చోటు చేసుకున్నాయి.

అణు బాంబు దాడుల వలన నగరాలకు నగరాలే సమూలంగా నాశనమవుతాయి.

న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాలుగా పేర్కొంటారు.

జపాన్‌లోన హీరోషిమా నగరంపై అమెరికా 1945 ఆగస్ట్ 6న అణుబాంబుతో దాడి చేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్‌లోని హీరోషిమా నగరంపై అమెరికా 1945 ఆగస్ట్ 6న అణుబాంబుతో దాడి చేసింది

అణు ఆయుధాలంటే ఏమిటి?

అవి చాలా శక్తిమంతమైన పేలుడు పదార్ధాలు. సైన్స్ పాఠాలలో ఆటం, ఐసోటోప్ అనే పదాలు వినే ఉంటారు. న్యూక్లియర్ బ్లాస్ట్ వీటి వల్లే జరుగుతుంది.

పరమాణు శక్తిని విస్ఫోటనం చెందించడం ద్వారా భారీ పేలుడును సృష్టించగల బాంబులు తయారు చేస్తారు. అందుకే, దీనిని అణు బాంబు అని కూడా అంటారు.

న్యూక్లియర్ ఆయుధాలు అధిక మొత్తంలో రేడియేషన్ ని విడుదల చేస్తాయి, దీని వలన రేడియేషన్ సిక్ నెస్ ఏర్పడుతుంది. అందువలన పేలుడు జరిగినప్పుడు కంటే కూడా ఆ తరువాత కలిగే దుష్ప్రభావాలు దీర్ఘ కాలం పాటు ఉంటాయి.

ఎన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి?

జనవరి 2021 నాటికి ప్రపంచంలో తొమ్మిది దేశాలు అమెరికా, యు కె, రష్యా, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్నాయి.

ఏ దేశం వద్ద ఎన్ని అణు బాంబులు ఉన్నాయి?

ఫొటో సోర్స్, sipri

ఏ దేశం వద్ద ఎన్ని అణు బాంబులు ఉన్నాయి?

ది స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) ప్రకారం.. 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 13080 అణ్వాయుధాలు ఉన్నాయి. రష్యా వద్ద అత్యధికంగా, ఉత్తర కొరియా వద్ద అత్యల్పంగా అణుబాంబులు ఉన్నాయి.

దేశాల వారీగా చూస్తే.. రష్యా వద్ద 6255, అమెరికా వద్ద 5550, చైనా వద్ద 350, ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225, పాకిస్తాన్ వద్ద 165, ఇజ్రాయెల్ వద్ద 90 అణు బాంబులు ఉండగా.. ఉత్తర కొరియా వద్ద 40 నుంచి 50 అణ్వాయుధాలు ఉండొచ్చని అంచనా.

అయితే, ప్రపంచవ్యాప్తంగా 3825 అణ్వాయుధాలు మాత్రమే తక్షణం ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటివి అమెరికా వద్ద 1800, రష్యా వద్ద 1625, ఫ్రాన్స్ వద్ద 280, బ్రిటన్ వద్ద 120 ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఉ.కొరియాతో యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనే అంశంపై అమెరికా నిపుణులు ఇద్దరు బీబీసీతో మాట్లాడారు.

ప్రధానమైన అణు బాంబు పరీక్షలు ఎక్కడ జరిగాయి?

దేశాల మధ్య న్యూక్లియర్ ఆయుధాల కోసం పోటీ తారా స్థాయిలో ఉన్నపుడు 1961 లో సోవియెట్ యూనియన్ పరీక్షించిన త్సార్ (TSAR) బాంబు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బాంబు గా పరిగణిస్తారు.

దీనిని ఆర్క్టిక్ నోవాయా జెమిలియా ద్వీపంలో సుఖోయ్ నోస్ పరీక్షా కేంద్రం దగ్గర పరీక్షించారు.

ఆ కేంద్రానికి సమీపంలో 55 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న అన్ని భవనాలను ఇది నాశనం చేసిందని అప్పట్లో ప్రచురితమైన కొన్ని రిపోర్టులు తెలిపాయి. ఈ విస్ఫోటనం వలన భూగోళం చుట్టూ మూడు సార్లు ప్రకంపనలు కలిగాయని ఆ రిపోర్టులు పేర్కొన్నాయి. 8 మీటర్ల పొడవు, 27 టన్నుల బరువుతో దీనిని పారాచూట్ ద్వారా వదిలి ఉండవచ్చు.

1952 లో అమెరికా అణుబాంబుల కంటే శక్తివంతమైన 10 మెగా టన్నుల పేలుడు శక్తి కలిగిన తొలి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. దీనిని ఐవీ మైక్ అనే పేరుతో పసిఫిక్ మహా సముద్రంలోని మార్షల్ ఐలాండ్స్ లో పరీక్షించారు.

ఈ పేలుడు నుంచి వచ్చిన ధూళి మేఘాలు సుమారు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎలుగెలాబ్ ద్వీపాన్ని పూర్తిగా నాశనం చేశాయి.

బికిని అటోల్‌లో 1956లో పేల్చిన హైడ్రోజన్ బాంబు

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, బికిని అటోల్‌లో 1956లో పేల్చిన హైడ్రోజన్ బాంబు

"నేను ఎప్పటికి మర్చిపోలేని విషయం ఈ పరీక్ష నుంచి వెలువడిన వేడి. పేలుడు కాదు. పేలుడు తర్వాత వేడి చాలా సేపటి వరకు వస్తూనే ఉంది. అది చాలా భయంకరమైన అనుభవం" అని ఈ పరీక్షను దూరంగా పరిశీలించిన అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రాంలో సభ్యుడిగా ఉన్న హారొల్ద్ ఆగ్న్యు చెప్పారు.

1954 లో మార్షల్ ఐలాండ్స్ లో బికినీ ఆటోల్ లో పేల్చిన కాసిల్ బ్రావో అమెరికా ప్రయోగించిన అతిపెద్ద అణు బాంబు.

దీని పేలుడు వలన సంభవించే పరిణామాలతో ఇది ఎక్కువగా గుర్తుంటుంది.

ఈ పేలుడు వలన వచ్చిన పుట్టగొడుగు లాంటి మబ్బులు నాలుగు మైళ్ళ దూరం వరకు వ్యాపించాయి. దీనినుంచి వెలువడ్డ రేడియేషన్ 11,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది.

భారతదేశంలో తొలిసారి భూగర్భ అణు పరీక్షలు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో 1974 లో జరిగాయి.

ఇప్పటి వరకు చరిత్రలో అణు బాంబులను రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ మీద 1945లో రెండు సార్లు ప్రయోగించారు.

1998 అణ్వస్త్ర పరీక్షలు

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, 1998లో భారతదేశం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినపుడు దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు

వీటిని ఎవరు తయారు చేయగలరు?

ఈ ఆయుధాలను తయారు చేయడానికి టెక్నాలజీ, నైపుణ్యం, సౌకర్యాలు ఉన్న వారెవరైనా సరే వీటిని తయారు చేయగలరు .

కానీ, అణ్వాయుధాలను తగ్గించి వీటి తయారీని ఆపాలనే ఉద్దేశ్యంతో అణు నిరాయుధీకరణ ఒప్పందం అన్ని దేశాలు వీటిని తయారు చేసేందుకు వీలు లేకుండా నిరోధిస్తుంది.

ఈ ఒప్పందంలో 1970 నుంచి సుమారు 191 దేశాలు భాగస్వాములయ్యాయి. జనవరి 01 వ తేదీ 1967 లో ఈ ఒప్పందం జరగక ముందే అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, చైనా అణ్వస్త్ర కేంద్రాల నిర్మాణం చేపట్టడంతో ఈ అయిదు దేశాలు మాత్రం అణ్వాయుధాలు సమకూర్చుకునే హక్కును కలిగి ఉన్నాయి. అయితే, వీటికి కూడా పరిమితి ఉంటుంది.

1986 లో 70,000 దాకా ఉన్న అణ్వాయుధాలు నేడు దాదాపు 14,000 మాత్రమే ఉన్నాయి.

అమెరికా, యు కె, రష్యా తమ అణ్వాయుధాలను తగ్గించుకుంటుంటే , చైనా, పాకిస్తాన్, ఇండియా, ఉత్తర కొరియా మాత్రం ఎక్కువ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య చెబుతోంది.

వీడియో క్యాప్షన్, సెల్లాఫీల్డ్: దశాబ్దాల అణు కాలుష్యానికి సజీవ సాక్ష్యం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)