పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'

అబ్దుల్ ఖదీర్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అబ్దుల్ ఖదీర్ ఖాన్
    • రచయిత, గోర్డాన్ కొరెరా
    • హోదా, సెక్యూరిటీ కరెస్పాండెంట్

లిబియాలో 2003 డిసెంబర్ 11న ఒక విమానాన్ని ఎక్కబోతోన్న కొంతమంది సీఐఏ, ఎంఐ6 అధికారుల బృందానికి గోదుమ రంగులో ఉన్న అరడజను కవర్లు అందాయి.

అప్పుడు ఆ బృందం ఒక రహస్య మిషన్ తుది దశలో ఉంది. ఈ మిషన్ కోసం లిబియా అధికారులతో కీలక చర్చలను జరుపుతోంది. వారు ఎన్వలప్‌లను తెరిచి చూడగా... అందులో వారికి అవసరమైన ఆధారాలు దొరికాయి. అవేంటంటే, న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించిన డిజైన్లు. వారికి, ఆ కవర్లలో లభించాయి.

ఆ డిజైన్లను ఏక్యూ ఖాన్ పంపించారు. వాటితో పాటు న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు అవసరమైన అనేక భాగాలను కూడా ఆయనే సరఫరా చేశారు. ఏక్యూ ఖాన్ (అబ్దుల్ ఖదీర్ ఖాన్) 85 ఏళ్ల వయస్సులో ఆదివారం మరణించారు.

గత 50 ఏళ్లుగా, గ్లోబల్ సెక్యూరిటీ పరంగా, అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఖాన్ ఒకరు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సాంకేతికత విషయంలో, దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో ఈయన కీలక పాత్ర పోషించారు. ఈ ప్రమాదకర సాంకేతికతను కలిగి ఉన్న దేశాలకు, ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆశ పడిన దేశాలకు మధ్య జరిగిన పోరాటాల్లో ఈయన కీలకంగా వ్యవహరించారు.

''ఏక్యూ ఖాన్ ఎంత లేదన్నా బిన్ లాడెన్ అంత ప్రమాదకారి'' అని సీఐఏ మాజీ డైరెక్టర్ జార్జ్ టెనెట్ వర్ణించారు.

అబ్దుల్ ఖదీర్ ఖాన్

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

పాశ్చాత్య గూఢచారులు, ఏక్యూ ఖాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించి ఉండొచ్చు. కానీ, సొంత దేశంలో ఆయనను హీరోగా కీర్తించారు. ఒక వ్యక్తిగా ఆయనెంత కఠినంగా ఉండేవారో,, ప్రపంచం దృష్టిలో న్యూక్లియర్ ఆయుధాల విలువేమిటో ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు.

ఆయన యూరప్‌కు న్యూక్లియర్ గూఢచారిగా రాలేదు. యూరప్‌కు వచ్చాక వారిలో ఒకరిగా తయారయ్యారు. 1970 దశకంలో ఖాన్ నెదర్లాండ్స్‌లో పనిచేస్తున్న సమయంలో, ఆయన దేశం (పాకిస్తాన్) బాంబును పునర్నిర్మించేందుకు సిద్ధమైంది. భారత్ అణు అభివృద్ధిని చూసి భయపడటంతో పాటు, 1971 యుద్ధంలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ ఈ ఆలోచన చేసింది.

ఆ సమయంలో ఖాన్, యురేనియంకు శక్తిని అందించే సెంట్రిఫ్యూజ్‌లను తయారు చేసే యూరోపియన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇలా శక్తిమంతం అయిన యురేనియంను న్యూక్లియర్ పవర్ కోసం వాడవచ్చు. ఈ యురేనియంకు మరింత సత్తువను అందిస్తే దాన్ని బాంబు తయారీలో ఉపయోగించవచ్చు. ఈ నేపథ్యంలో, ఖాన్ అక్కడి అధునాతనమైన సెంట్రిఫ్యూజ్ డిజైన్లను సులువుగానే కాపీ చేసుకొని సొంత దేశానికి చేరారు. అక్కడ రహస్య నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కీలకమైన భాగాలను సరఫరా చేయగలిగే యూరోపియన్ వ్యాపారవేత్తలనే ఈ నెట్‌వర్క్‌లో ఎక్కువగా చేర్చుకున్నారు.

ఆయనను ఎక్కువగా 'పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్' పితామహుడిగానే పిలుస్తుంటారు. కానీ నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన కొంతమంది వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. తన చరిత్రను జాగ్రత్తగా నిర్మించుకున్న ఖాన్... పాకిస్తాన్‌లో జాతీయ హీరోగా మారారు. భారత ముప్పు నుంచి పాకిస్తాన్‌కు భద్రత కల్పించిన వ్యక్తిగా ఆయన అక్కడి ప్రజల్లో నిలిచిపోయారు.

ఖాన్ చేసిన పనుల వల్లే ఆయనకు ప్రపంచంలో కీలక వ్యక్తిగా గుర్తింపు లభించింది. ఆయన తన నెట్‌వర్క్‌ను దిగుమతుల నుంచి ఎగుమతులు చేసే వరకు విస్తరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో చాలా పాశ్చాత్య దేశాలు 'దొంగ రాష్ట్రాలుగా' గుర్తింపు పొందాయి.

అబ్దుల్ ఖదీర్ ఖాన్

ఫొటో సోర్స్, AFP

ఇటీవల సంవత్సరాల్లో, ఇరాన్‌లోని నాటాంజ్ సెంట్రిఫ్యూజ్ ప్రోగ్రామ్, ప్రపంచ దౌత్యానికి మూలంగా నిలిచింది. ఈ సెంట్రిఫ్యూజ్ ప్రోగ్రామ్‌లోని ఎక్కువ భాగం డిజైన్లు, పరికరాలు ఏక్యూ ఖాన్ ద్వారా సరఫరా అయినవే.

ఒక సమావేశంలో ఏక్యూ ఖాన్ ప్రతినిధులు, ధరల జాబితాతో కూడిన మెనూని ఇరానియన్లకు అందించారు. ఆ జాబితా నుంచి తమకు కావాల్సిన పరికరాలను, డిజైన్లను ఇరాన్ ఆర్డర్ చేసింది.

ఖాన్, పన్నెండుసార్లకు పైగా ఉత్తరకొరియాను సందర్శించారు. అక్కడ క్షిపణి సాంకేతికత నైపుణ్యం కోసం, ఖాన్ న్యూక్లియర్ టెక్నాలజీని బదిలీ చేసినట్లు అందరూ నమ్ముతారు.

ఈ ఒప్పందాలన్నింటిని ఖాన్, వ్యక్తిగతంగా చేస్తున్నారా? లేక వాటి వెనుక తన దేశ ప్రభుత్వ ఆదేశాలున్నాయా అనే అంశం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా ఉత్తర కొరియాతో ఒప్పందాన్ని దేశ నాయకత్వం ఫాలో అవ్వడమే కాకుండా అందులో పాల్గొన్నట్లు కూడా సంకేతాలు ఉన్నాయి.

ఖాన్, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని కొన్నిసార్లు వినిపిస్తుంటుంది. కానీ, ఇది నిజం కాకపోవచ్చు. ఆయన దేశ నాయకత్వంతో కలిసి పనిచేయడంతో పాటు, న్యూక్లియర్ ఆయుధాలపై పాశ్చాత్య దేశాల గుత్తాధిపత్యానికి గండి కొట్టాలనుకున్నారు. తమ దేశ భద్రత కోసం అణ్వాయుధాలను దాచుకునే హక్కు కొన్ని దేశాలకే ఎందుకు ఉండాలి? మిగతా దేశాలకు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు.

పాశ్చాత్య హిపోక్రసీని ఆయన విమర్శించారు. ''నేను పిచ్చివాడిని కాదు. నాకేం మతి పోలేదు. వారికి నేను నచ్చను. వారంతా నాపై కల్పితమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంటారు. ఎందుకంటే వారి వ్యూహాత్మక విధానాలను నేను తలకిందులు చేశాను'' అని ఆయన ఒకసారి వ్యాఖ్యానించారు.

వీడియో క్యాప్షన్, ఏక్యూ ఖాన్: పాకిస్తాన్ న్యూక్లియర్ సైంటిస్ట్‌ను ప్రపంచం ప్రమాదకర వ్యక్తిగా ఎందుకు చూసింది?

ఏక్యూ ఖాన్ గురించి నేను పుస్తకం రాసేటప్పుడు, ఆయన నెట్‌వర్క్‌లోని కొందరిని కలిశాను. అప్పుడు వారు డబ్బుకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు అనిపించింది. 1990 దశకంలో జరిగిన లిబియా ఒప్పందం వారికి రివార్డులను అందించినప్పటికీ, వారి పతనాన్ని కూడా వేగవంతం చేసింది.

బ్రిటన్‌కు చెందిన ఎంఐ6తో పాటు, అమెరికా సంస్థ సీఐఏ, ఏక్యూ ఖాన్ గురించి వెతకడం ప్రారంభించాయి. ఆయన ప్రయాణాల జాబితాతో పాటు, ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. ఆయన నెట్‌వర్క్‌లోకి చొరబడి, ఆయన భాగస్వాములకు డబ్బును ఎరగా చూపి (కొన్ని సందర్భాల్లో కనీసం మిలియన్ డాలర్లు ఇవ్వజూపారు) తమ ఏజెంట్లుగా మార్చుకున్నారు. ఆయన రహస్యాలను తెలుసుకున్నారు. ''మేం ఆయన ఇంట్లోకి చేరిపోయాం. ఆయన కార్యాలయాలు, ఆయన గదుల్లో కూడా చొరబడ్డాం'' అని సీఐఏ అధికారి ఒకరు చెప్పారు.

2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత, సామూహిక విధ్వంసాలను సృష్టించడానికి తీవ్రవాదులు న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగిస్తారనే భయాలు తీవ్రమయ్యాయి. అందుకే పాకిస్తాన్‌తో వ్యవహారాలు సంక్లిష్టం కావడంతో పాటు, ఖాన్‌కు వ్యతిరేకంగా చర్యలు ఎక్కువయ్యాయి.

ఫలితంగా సీఐఏ, ఎంఐ6 బృందాలు ఒక రహస్య మిషన్‌ను అమలు చేసి... ఒక ఒప్పందానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశాయి. దీంతో ఖాన్‌పై చర్య తీసుకోవాలని పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్‌కు మంచి అవకాశం లభించింది.

ఆ తర్వాత ఖాన్‌ను గృహ నిర్బంధం చేశారు. బలవంతగానైనా, ఆయన చర్యలన్నింటిని టెలివిజన్ ద్వారా ప్రకటించారు. అయినప్పటికీ, తమ దేశానికి బాంబును అందించిన 'హీరో'గా పాకిస్తాన్ ప్రజలు ఆయనను కీర్తిస్తారు. గృహ నిర్బంధం తర్వాత ఆయన బయటి ప్రపంచంతో మాట్లాడటం మానేశారు. దీనివల్ల ఆయన చేసిన పూర్తి పనులేమిటో, ఆయన వాటిని ఎందుకు చేశారో తెలిసే అవకాశం రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)