లఖీంపూర్ ఖేరీ: యూపీ ప్రభుత్వ తీరు బాగా లేదు, విచారణను వేరే ఏజెన్సీకి అప్పగించాలన్న సుప్రీం కోర్టు

లఖీంపూర్ ఖేరీ హింసాకాండ విచారణలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు బాగాలేదంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లఖీంపూర్ ఖేరీ హింసాకాండ విచారణలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ పని తీరు బాగాలేదంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

లఖీంపూర్ ఖేరీ హింసా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రభుత్వ వైఫలమైందని వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనంలోని మిగిలిన సభ్యులు.

ఈ ఘటనలో ఎనిమిది మందిని క్రూరంగా హత్య చేశారని, నిందితులందరినీ చట్ట పరిధిలోకి తీసుకురావాలని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేసులోని సున్నితత్వం కారణంగా, యూపీ ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసును సీబీఐకి బదలాయించవద్దని చెప్పింది. దానికి బదులుగా విచారణ కోసం మరో ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లఖీంపూర్ ఖేరీ ఘటన విచారణను సీబీఐకి అప్పగించవద్దని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTYIMAGES

ఫొటో క్యాప్షన్, లఖీంపూర్ ఖేరీ ఘటన విచారణను సీబీఐకి అప్పగించవద్దని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది

మరో ఏజెన్సీకి విచారణ బాధ్యతలు

ఈ బాధ్యతలను మరో ఏజెన్సీ చేపట్టేంత వరకు, సాక్ష్యాలను భద్రపరచాల్సిందిగా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని ఉత్తర్‌ప్రదేశ్ సర్కారుకు చెప్పింది.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

ఈ ఘటనకు సంబంధించి సర్కారు తీసుకున్న చర్యలను, రిపోర్టుల స్థితిగతులను ఆయన ధర్మాసనానికి వివరించారు. అయితే ఈ చర్యలతో తాము సంతృప్తిగా లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మరో ఏజెన్సీ ఈ కేసు బాధ్యతలు తీసుకునేంత వరకు, ఇందులోని సాక్ష్యాలను అత్యున్నత స్థాయి పోలీసు అధికారి భద్రపరుస్తారని సాల్వే, సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు.

రేపు ఉదయం 11 గంటలకు పోలీసుల ముందుకు హాజరు కావాలని నిందితునికి నోటీసులు ఇచ్చామని ఈ సందర్భంగా సాల్వే తెలిపారు. ఒకవేళ నోటీసులను ధిక్కరిస్తే, చట్ట ప్రకారం ముందుకు వెళతామని అన్నారు.

యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, NURPHOTO

ఫొటో క్యాప్షన్, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్

పోస్ట్‌మార్టం నివేదికలో బుల్లెట్ గాయాలున్నట్లు వెల్లడి కాలేదని, అందుకే పోలీసులు ఆయనకు ఒక అవకాశం ఇచ్చారని తెలిపారు.

బహుశా, ఇది భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని 302 (హత్య) కేసు కావచ్చు అని సాల్వే అన్నారు. దీనికి స్పందించిన జడ్జిలు 'బహుశా, 302' అంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. ''శాంతి భద్రతలు కాపాడే బాధ్యత పోలీసులు, ప్రభుత్వానిది'' అని చీఫ్ జస్టిస్ అన్నారు.

ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రభుత్వం అవరసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని సాల్వే పేర్కొనగా...వాస్తవంలో అలా కనిపించడం లేదని ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సాధారణంగా అయితే, నిందితులందరినీ పోలీసులు తక్షణమే అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందా అని ప్రశ్నించగా... సాల్వే లేదని సమాధానమిచ్చారు.

ఈ కేసును, సీబీఐకి బదలాయించడంలో ఎలాంటి అర్థం లేదని జస్టిస్ రమణ అన్నారు. తాము సీబీఐకి ఈ కేసును ఎందుకు బదలాయించడం లేదో మీకు (సాల్వే) చాలా బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)