బొగ్గు కొరత: భారత విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోనుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
- హోదా, బీబీసీ న్యూస్
మునుపెన్నడూ లేని విధంగా దేశం విద్యుత్ సంక్షోభం అంచున ఉంది. దేశంలోని 135 బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో సగానికి పైగా కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి.
నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ & ఫెసిలిటేషన్ ఏజెన్సీ ప్రకారం ఇండియాలో బొగ్గు ఆధారంగా 53 శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థను విద్యుత్ సంక్షోభం దెబ్బతీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు ఉన్నాయి.
ఇలా ఎందుకు జరుగుతోంది?
కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విద్యుత్ వ్యవస్థను సంక్షోభంవైపు నడిపిస్తున్నాయి. రెండో వేవ్ తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గడంతో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. దీంతో విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది.
2019లో ఇదే సమయంతో పోలిస్తే గత రెండు నెలల్లో విద్యుత్ వినియోగం దాదాపు 17% పెరిగింది. ఇటు ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ధరలు 40% పెరిగాయి. భారతదేశ దిగుమతులు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి.
ప్రపంచంలో బొగ్గు నిల్వల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు దిగుమతిదారు కూడా భారతదేశమే.
సాధారణంగా దిగుమతులపై ఆధారపడే పవర్ ప్లాంట్లు ఇప్పుడు దేశంలో లభించే బొగ్గు వైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశీయ బొగ్గు సరఫరాపై ఇది మరింత ఒత్తిడిని పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభావితం చేసే అంశాలు ఏంటి?
దేశీయంగా ఉన్న కొరతను తీర్చడానికి ఎక్కువ బొగ్గును దిగుమతి చేసుకోవడం సరైన మార్గం కాదని నిపుణులు చెబుతున్నారు.
"మనం గతంలో కూడా బొగ్గు కొరతను చూశాము. కానీ మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఇప్పుడు చాలా ఖరీదైంది" అని భారత ఆర్థికవేత్త, నోమురా ఉపాధ్యక్షుడు డాక్టర్ అరోదీప్ నంది అన్నారు.
"నేను కంపెనీ అవసరాల కోసం ఎక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసుకుంటే, నేను నా ఉత్పత్తుల ధరలను పెంచాల్సిందే కదా? కంపెనీలు అదనంగా చేసిన ఖర్చును సహజంగా వినియోగదారులకు బదిలీ చేస్తాయి. అంటే అంతిమంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం పడుతుంది. ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉంటుంది" అని డాక్టర్ నంది అన్నారు.
సంక్షోభం కొనసాగితే, విద్యుత్ ధరలు పెరిగి, ఈ ప్రభావం కస్టమర్లపై పడుతుంది. చమురు నుంచి ఆహారం వరకు దాదాపు అన్నింటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఎక్కువగా ఉంది.
ఇది ఒక 'ప్రమాదకరమైన' పరిస్థితి అని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ డైరెక్టర్ వివేక్ జైన్ అభివర్ణించారు.
ఇటీవలి సంవత్సరాలలో, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించడంతో ఉత్పత్తిలో భారత్ వెనుకబడింది.

ఫొటో సోర్స్, NTPC
ప్రస్తుతం పరిస్థితి అనిశ్చితిగా ఉందని, రాబోయే ఐదు నుంచి ఆరు నెలల కాలంలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి కూడా బీబీసీతో అన్నారు.
''ఇది ఇలాగే కొనసాగితే, ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ తిరిగి గాడిన పడటానికి కష్టపడాల్సి వస్తుంది'' అని ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చీఫ్ జోహ్రా ఛటర్జీ హెచ్చరించారు.
"విద్యుత్తు అన్నింటికీ శక్తినిస్తుంది, కాబట్టి మొత్తం తయారీ రంగంలోని సిమెంట్, స్టీల్‌లతోపాటూ, నిర్మాణ రంగంలోని ప్రతిదానిపై బొగ్గు కొరత ప్రభావం ఉంటుంది" అన్నారామె.
భారతదేశం మేల్కొనాల్సిన సమయం వచ్చిందని జోహ్రా ఛటర్జీ అన్నారు. బొగ్గుపై ఆధారపడటం తగ్గించి, పునరుత్పాదక ఇంధన వ్యూహాన్ని మరింత దూకుడుగా కొనసాగించే ప్రయత్నం మొదలు పెట్టాలని ఆమె అన్నారు.

ప్రభుత్వం ఏం చేయగలదు?
భారీ కాలుష్య కారకాలైన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లపై ఆధారపడటాన్ని ఒకవైపు తగ్గిస్తూనే, దాదాపు 140 కోట్ల జనాభాకు విద్యుత్ డిమాండ్‌ను ఎలా తీర్చగలమనే ప్రశ్న ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది.
సమస్య విస్తృతి పెద్దది కావడంతో, స్వల్పకాలిక పరిష్కారం సాధ్యంకాదని డాక్టర్ అరోదీప్ నంది తెలిపారు.
"మనం వాడే ఎనర్జీలో అధిక భాగం బొగ్గు నుంచి వస్తుంది. బొగ్గుకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉండే దశకు చేరుకున్నామని నేను అనుకోవడం లేదు. నిజంగా ఇది కళ్లు తెరవాల్సిన సమయం. కానీ, ఇంధన అవసరాలకు, బొగ్గు స్థానాన్ని త్వరలోనే మరోదానితో భర్తీ చేయగలుగుతామని నేను అనుకోవడం లేదు" అని ఆయన చెప్పారు.
బొగ్గు, స్వచ్ఛమైన శక్తి వనరుల మిశ్రమాన్ని దీర్ఘకాలిక పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు.
"ఒకేసారి సంపూర్ణ మార్పు సాధ్యం కాదు. బ్యాకప్ లేకుండా 100% పునరుత్పాదకతకు మారడం మంచి వ్యూహం కాబోదు. మీకు ఆ బ్యాకప్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మార్పు సాధ్యం అవుతుంది. ఎందుకంటే పర్యావరణంతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని జైన్ అన్నారు.
బహుళ విద్యుత్ వనరులలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంవంటివి పక్కన పెడితే, మెరుగైన ప్రణాళికతోనే ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని నివారించవచ్చని ఎం.ఎస్.ఛటర్జీ వంటి మాజీ అధికారులు చెబుతున్నారు.
దేశంలో అతిపెద్ద బొగ్గు సరఫరాదారు కోల్ ఇండియా లిమిటెడ్, మిగతా వాటాదారుల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని ఆమె భావిస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా, విద్యుత్ కంపెనీలు మరింత జవాబుదారీగా ఉండటానికి "విద్యుత్ ఉత్పత్తిదారులు తప్పనిసరిగా బొగ్గును నిల్వ చేసుకోవాలి, వారు అన్ని వేళలా తప్పనిసరిగా కొంత స్టాక్ కలిగి ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తరువాత ఏం జరగవచ్చు?
ప్రస్తుత పరిస్థితి ఎంతకాలం ఉంటుందో అస్పష్టంగా ఉంది. కానీ, డాక్టర్ అరోదీప్ నంది మాత్రం ఆశాజనకంగా ఉన్నారు.
"రుతుపవనాలు వెళుతుండటం, శీతాకాలం సమీపిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ సాధారణంగా తగ్గుతుంది.
కాబట్టి, డిమాండ్, సరఫరా మధ్య అసమతుల్యత కొంత వరకు తగ్గుతుంది" అని ఆయన అన్నారు.
"ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ప్రత్యేకంగా భారతదేశానికి పరిమితం కాదు. గ్యాస్ ధరలు తగ్గితే, తిరిగి గ్యాస్‌కు మారవచ్చు" అని వివేక్ జైన్ అన్నారు.
ప్రస్తుతానికి, సరఫరా, డిమాండ్ మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉత్పత్తి, మైనింగ్‌ని పెంచడానికి ప్రభుత్వరంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది.
'క్యాప్టివ్' గనుల నుండి బొగ్గును పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. క్యాప్టివ్ గనులు బొగ్గు లేదా ఖనిజాలను కేవలం ఒక కంపెనీ కోసం ఉత్పత్తి చేస్తుంటాయి. మామూలు పరిస్థితులలో వారు ఉత్పత్తి చేసే ఖనిజాలను ఇతర వ్యాపారాలకు విక్రయించరు.
ప్రస్తుత విద్యుత్ సంక్షోభం నుంచి భారతదేశం గట్టెక్కడానికి స్వల్పకాలిక పరిష్కారాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పెరుగుతున్న దేశీయ విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాల కోసం కృషి చేయాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ వెళ్లలేరు.. ఇండియాలో ఉండలేరు
- మా ఊరు ఎవరిది
- మహాత్మా గాంధీకి పొందూరు ఖాదీ వస్త్రాలకు ఉన్న అనుబంధం ఎలాంటిది?
- కరోనావైరస్తో పోరాడే మాత్ర ఇదేనా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి
- మలేరియాపై పోరాటంలో చరిత్రాత్మక ముందడుగు.. వ్యాక్సినేషన్‌కు అనుమతి
- టీటీడీ బోర్డును జగన్ తన 'సంపన్న మిత్రుల క్లబ్'గా మార్చేశారా?
- కాలి వేళ్ల మీద పుండ్లు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇది కరోనా సైడ్ ఎఫెక్టేనా
- విధేయత పేరుతో వేలాడేవారిని పార్టీ నుంచి రాహుల్ గాంధీ తప్పించగలరా
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
- చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక అప్పుల ఊబిలో ముంచేస్తోందా?
- పాకిస్తాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు డాలర్ల స్మగ్లింగ్ జరుగుతోందా... పాక్ రూపాయి పడిపోవడానికి అదే కారణమా?
- నిజమైన గూఢచారులు జేమ్స్బాండ్లాగే ఉంటారా? సీక్రెట్ సర్వీస్‌లో పనిచేసే ఆఫీసర్ ఏం చెబుతున్నారు
- డన్‌కర్క్: ‘చరిత్ర చెప్పని, పుస్తకాల్లో చోటు దక్కని’ 300 మంది భారత సైనికుల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










