వాతావరణ మార్పులు: బొగ్గు లేకుండా భారతదేశం మనుగడ సాగించలేదా?

భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారతదేశ ఇంధన ఉత్పత్తిలో బొగ్గు వాటా 70% కంటే ఎక్కువ
    • రచయిత, రజిని వైద్యనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శిలాజ ఇంధనాల ఉద్గారాల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉన్నప్పటికీ, దేశంలో బొగ్గు వినియోగం తగ్గలేదు.

బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారతదేశానికి అదెంతవరకూ సాధ్యం అవుతుంది?

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి కీలక ఇంధన వనరును వదులుకోవడం ఎంత కష్టం అవుతుంది? వాతావరణ మార్పులు అంశంలో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు చిన్నవేమీ కాదు. గత అయిదారేళ్లలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.

"పశ్చిమ దేశాలు దశాబ్దాల పాటు పర్యావరణాన్ని కలుషితం చేస్తూ, వ్యాపార లాభాలు పొందాయి. అలాంటపుడు, కర్బన్ ఉద్గారాలను తగ్గించమని భారతీయులకు మాత్రం ఎందుకు చెప్తున్నారు?" అంటూ 2006లో షౌనక్ అనే యువ వ్యాపారవేత్త మండిపడ్డారు.

ముంబైకి చెందిన షౌనక్ ఒక షూ ఫ్యాక్టరీ నడిపేవాడు. తన ఫ్యాక్టరీ వలన చెడు వాయువులు గాల్లోకి విడుదల అవుతున్నాయని ఆయనే ఒప్పుకున్నారు.

అయినప్పటికీ, "అమెరికా, బ్రిటన్‌లకు మా సంస్థ షూలను ఎగుమతి చేస్తాం. అచ్చం పశ్చిమ దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలకు ఉద్గారాలు ఎగుమతి చేసినట్లే. మనం ఎందుకు ఆపాలి?" అని ప్రశ్నించారు.

కానీ, అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. భారతదేశ జనాభా, ఆర్థికవ్యవస్థతో పాటూ కర్బన ఉద్గారాలు కూడా అమాంతం పెరిగిపోయాయి.

ఈ ఉద్గారాలను తగ్గించాలంటూ పశ్చిమ దేశాలు కోరుతున్నాయి. దాంతో, దేశంలో బొగ్గు వాడకం చర్చనీయాంశమైంది.

భారతదేశంలో 70 శాతం కన్నా ఎక్కువ ఇంధన ఉత్పత్తికి బొగ్గును వినియోగిస్తున్నారు. ఇది అత్యంత చెడు ఉద్గారాలను గాల్లోని విడుదల చేస్తుంది.

భారతదేశంలో లక్షలాదిమంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో లక్షలాదిమంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు

స్థానికులకు జీవనాధారం

ఒడిశాలోని తాల్చేర్ జిల్లాలో తెల్లవారకముందే ట్రక్కులు బొగ్గు నింపుకుని సిద్ధమైపోతాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు బొగ్గు సరఫరా చేసే రైలు ఆ పక్క నుంచే వెళుతుంది.

మహిళలు బొగ్గు ముక్కలు చేత్తో ఏరి బుట్టల్లోకి నింపుతుంటారు. వాటిని నెత్తిన పెట్టుకుని తీసుకెళుతారు. పురుషులు సైకిళ్లకు అటూ ఇటూ బొగ్గు నిండిన సంచులు వేలాడదీసుకుని వెళుతుంటారు.

భారతదేశంలో సుమారు 40 లక్షలమంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక తెలిపింది.

తూర్పు భారతదేశంలో బొగ్గు గనులు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని కోల్ బెల్ట్ అని పిలుస్తారు.

ఈ ప్రాంతాల్లో ఆర్థికవ్యవస్థకు బొగ్గు గనులే కీలకం. స్థానికులకు జీవనాధారం. ఈ గనుల్లో పనిచేస్తున్న అనేకమంది కటికపేదలు.

"బొగ్గు లేకుండా భారతదేశం మనుగడ సాగించలేదు" అని ఒడిశా గని కార్మికుల యూనియన్ నాయకుడు సుదర్శన్ మొహంతి అన్నారు.

బొగ్గు వాడకాన్ని తగ్గించి ఇతర మెరుగైన ఇంధనాల వైపు మళ్లడానికి సరైన వ్యూహం కావాలని, బొగ్గు గనుల్లో పనిచేస్తున్న లక్షలాదిమందికి నష్టం వాటిల్లకుండా ఉండేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని సుదర్శన్ మొహంతితో సహా పలువురు భావిస్తున్నారు.

అలాగే, బొగ్గు గనుల విస్తరణ కోసం దశాబ్దాల క్రితం అనేకమంది తమ నివాసాలను కోల్పోయారని మొహంతి చెప్పారు.

ఇప్పుడు ఈ గనులను కూడా తొలగిస్తే వాళ్లు మళ్లీ ఆవాసాలను కోల్పోతారని అన్నారు.

"ప్రపంచం ఒత్తిడి తెస్తోందని బొగ్గు ఉత్పత్తి ఆపేస్తే దానిపై ఆధారపడినవారు ఏమైపోవాలి? పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించవచ్చుగానీ, బొగ్గు ఉత్పత్తిలో రాజీపడడం అసాధ్యం" అని ఆయన అన్నారు.

జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి

పరిశుభ్రమైన ఇంధనానికి మార్కెట్

గత దశాబ్దంలో భారతదేశంలో బొగ్గు వినియోగం దాదాపు రెట్టింపు అయింది. పెద్ద మొత్తంలో బొగ్గును దిగిమతి చేసుకుంటూనే ఉంది. అదనంగా, రాబోయే సంవత్సరాలలో డజన్ల కొద్దీ కొత్త గనులు తెరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అయితే, అమెరికన్ లేదా బ్రిటిష్ పౌరుడితో పోలిస్తే సగటు భారతీయుడు చాలా తక్కువ ఇంధనాన్నే వినియోగిస్తున్నాడు.

అలాగే, శుభ్రమైన ఇంధన ఉత్పత్తికి మారే దిశగా భారతదేశం సన్నాహాలు చేస్తోంది. 2030 కల్లా 40 శాతం విద్యుచ్ఛక్తిని శిలాజేతర ఇంధనాల నుంచి పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఈ దిశలో దేశం పురోగతిని సాధించిందని దిల్లీలోని 'కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్' థింక్-టాంక్‌కు చెందిన అరుణాబా ఘోష్ అన్నారు.

ఉదాహరణకు, దిల్లీ మెట్రో వ్యవస్థ 60 శాతం కన్నా అధికంగా సోలార్ శక్తిపై ఆధారపడి ఉంది.

అయితే, పునరుత్పాద శక్తిని వృద్ధి చేసే మరిన్ని ప్రాజెక్టులను చేపట్టడానికి భారీగా విదేశీ పెట్టుబడి అవసరం అవుతుందని ఘోష్ అన్నారు.

"ఉచితంగా డబ్బు ఇమ్మని కాదు. క్లీన్ ఎనర్జీకి ఉన్న అతిపెద్ద మార్కెట్లల్లో భారతదేశం ఒకటి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టి, లాభాలను పొందాలని కోరుకుంటున్నాం."

బొగ్గు పరిశ్రమలో పని చేసేవారిలో చాలామంది కటిక పేదలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బొగ్గు పరిశ్రమలో పని చేసేవారిలో చాలామంది కటిక పేదలు

'వేరే మార్గం లేదు'

ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే, సుమారు 137 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో రాబోయే 20 ఏళ్లల్లో ఇంధన అవసరాలు మరింత పెరుగుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.

అయితే, బొగ్గు వినియోగం తగ్గించడంలో ఎదుర్కొనే సవాళ్లు కూడా అధికమే.

దేశంలో ఇప్పటికీ అనేక ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం లేదు. గ్యాస్ స్టవ్‌లు లేవు. బొగ్గు కుంపటిపై వంట చేసుకునే వారు ఎందరో ఉన్నారు.

"బొగ్గు లేకపోతే వంట చేయలేం. రాత్రి పూట ఇంట్లో వెలుగు కావాలంటే బొగ్గే ఆధారం. అది ప్రమాదకరమైతే మాత్రం ఏం చేయగలం? అది వాడడం తప్ప మాకు మార్గం లేదు" అని బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికురాలు జమునా ముండా అన్నారు.

అయితే, ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారతదేశం ఇప్పటికే బొగ్గు వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు సాగుతోందని పలువురు భావిస్తున్నారు.

అయినప్పటికీ, బొగ్గుపై భారీగా ఆధారపడి ఉన్న పరిస్థితులు చూస్తే, అది లేని భవిష్యత్తు చాలా దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

షౌనక్ అయినా, జమునా అయినా.. బొగ్గుతో సంబంధం తెంచేసుకోవడం అంత సులభం కాదని స్పష్టం చేశారు.

అభివృద్ధి సాధించాలంటే కొంత మూల్యం చెల్లించక తప్పదేమో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)