భారత 'నౌకా శ్మశానవాటిక'లో తుక్కుగా మారిపోతున్న బ్రిటన్ నౌకలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కేట్ వెస్ట్, మార్గట్ గిబ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలు భారతదేశంలోని ఒక బీచ్‌లో తుక్కుగా మారాయి. ఆ రెండింటినీ మరి కొన్నాళ్లు వినియోగించవచ్చనే అంగీకారం కుదిరినప్పటికీ వాటిని స్క్రాప్ చేశారు.
నౌకల జీవితం కాలం ముగింపు దశకు చేరుకున్నాక, అవి ప్రమాదకరమైన వ్యర్థాలుగా మారుతాయి. అంతే కాకుండా, బ్రిటన్ నుంచీ వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపించడం చట్టవిరుద్ధం.
బ్రిటన్‌లో ఈ రెండు నౌకలను బయట దేశస్థులకు అమ్మే ఉద్దేశంతో కొన్ని నెలలపాటూ వేలంలో ఉంచారు. కానీ, చివరికు వాటిని రెట్టింపు ధరకు తుక్కు (స్క్రాప్)గా అమ్మేశారు.
2020 ప్రారంభం నుంచీ బ్రిటన్‌కు చెందిన కనీసం 13 నౌకలు, ఎక్కువగా కార్గో షిప్పులు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని స్క్రాప్ బీచ్‌లకు చేరాయని బీబీసీ ఫైల్ ఆన్ 4 ప్రోగ్రాం జరిపిన దర్యాప్తులో తేలింది.
'ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా శ్మశానవాటిక'
బ్రిటన్‌కు చెందిన 'మార్కో పోలో', 'మాగెల్లన్' నౌకలను నవంబర్‌లో వేలంలో విక్రయించారు. వాటి యాజమాన్య సంస్థ 'క్రూయిజ్ అండ్ మరిటైం వాయేజెస్' నష్టాల్లో కూరుకుపోవడంతో వీటిని అమ్మకానికి పెట్టారు.
మార్కో పోలో ఓడను 1960లో నిర్మించారు. ఇది ప్రపంచంలోని చివరి ఓషన్ క్రూయిజ్ లైనర్లలో ఒకటి. ఈ నౌక ఈ ఏడాది బ్రిటన్ ప్రయాణికులను అమేజాన్, నార్వేలకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ, దాని చివరి ప్రయణం ఇండియాలోని అలాంగ్‌కు సాగింది.
జీవిత కాలం ముగిసిన నౌకలను, పనికి రాని ఓడలను తుక్కు కింద విరగ్గొట్టే ప్రదేశం.. 'నౌకల శ్మశానవాటిక' భారతదేశంలో ముంబయి తీరానికి కొంచం పైన గుజరాత్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నౌకా శ్మశానవాటికగా పేరు పొందింది.
మార్కోపోలోను హైసీస్ లిమిటెడ్ సంస్థ వేలంలో 2 మిలియన్ పౌండ్లకు కొనుక్కుంది. అమ్మకం తరువాత, దీన్ని మరి కొంతకాలం వాణిజ్యానికి ఉపయోగించాలనే నిబంధనతో బ్రిటన్ నుంచీ బయలుదేరింది.

ఫొటో సోర్స్, VIRAMDEVSINH GOHIL
దీన్ని దుబాయ్‌లో నీళ్లపై తేలియాడే హోటల్ (ఫ్లోటింగ్ హొటల్)గా ఉపయోగిస్తామని హైసీస్ లిమిటెడ్ మాటిచ్చింది.
కానీ, రెండు నెలల తరువాత మార్కో పోలోను 4 మిలియన్ పౌండ్లకు స్క్రాప్‌గా అమ్మేశారు.
మార్కో పోలోను మరొకరికి అమ్మలనే అనుకున్నామని, కానీ "దురదృష్టవశాత్తు దీన్ని కొనడానికి ముందుకొచ్చిన దుబాయ్ కొనుగోలుదారులు చివరికు నిరాకరించారని" హైసీస్ లిమిటెడ్ డైరెక్టర్ రిషీ అగర్వాల్ తెలిపారు.
మార్కో పోలోను మరొక రకంగా వినియోగించేందుకు అనేక విధాలా ప్రయత్నించి విఫలమవ్వడంతో ఇండియాలో స్క్రాప్‌గా అమ్మేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
మాగెల్లన్ నౌకది కూడా ఇంచుమించు ఇదే కథ. లివర్‌పూల్‌లో 2021 గ్రాండ్ నేషనల్ కోసం దాన్ని ఫ్లోటింగ్ హొటల్‌గా వినియోగించాలనుకున్నారు.
ఈ నౌకను వేలంలో ఒక గ్రీక్ షిప్ యజమాని కొనుక్కున్నారు. ఆ తరువాత, దీన్ని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్క్రాప్‌గా అమ్మేయాల్సి వచ్చిందని బ్రోకర్లు చెబుతున్నారు.
బ్రిటన్ క్రూయిజ్ షిప్ పరిశ్రమ పాత నౌకలను సురక్షితంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆమోదించిన స్థలాల్లో మాత్రమే స్క్రాప్ చేస్తుంది.
సాధారణంగా ఆయా సంస్థలు దివాలా తీసినప్పుడు లేదా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు వాటి వద్ద ఉన్న నౌకలను వేలంలో అమ్మేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ నౌకలను స్క్రాప్‌కు పంపించే నిర్ణయం ఆ సంస్థల చేతులు దాటిపోతుంది.
ఆస్‌బెస్టాస్ బాంబు
దక్షిణ ఆసియాలో పలు చోట్ల పాత నౌకలను తుక్కు చేసే పరిశ్రమలు పర్యావరణంపై చూపించే ప్రభావం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతీ ఏడాది సుమారు 800 ఓడలను విరగ్గొట్టి ముక్కలు చేస్తుంటారు. వీటిలో కొన్ని పదార్థాలను రీసైకిల్ చేస్తారు.
ఈ పని బ్రిటన్‌లో, ఈయూ ఆమోదించిన స్థలాల్లో జరపవచ్చు కానీ, ప్రపంచంలోని 70% ఓడలు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని బీచ్‌లకే చేరుతున్నాయి. ఎందుకంటే ఈ దేశాల్లో స్టీల్ స్క్రాప్‌ను ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారు.
అయితే, ఈ బీచ్‌లలో ఓడలను విరగ్గొట్టే పనిలో 400 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని 'షిప్-బ్రేకింగ్ ప్లాట్‌ఫార్మ్' అనే ప్రభుత్వేతర సంస్థ తెలిపింది. ఆ మరణాల వివరాలన్నీ ఈ సంస్థ నమోదు చేసింది.
ఈ స్థలాల్లో పని చేసే కార్మికులు ప్రాణాంతకమైన ప్రమాదాలకు గురవుతున్నారని.. ఎత్తుల నుంచీ పడిపోవడం, గ్యాస్ పేలుళ్లలో మరణించడం, ఆస్‌బెస్టాస్‌లాంటి విష పదార్థాలకు లోనై దీర్ఘకాలిక రోగాల బారిన పడడం జరుగుతున్నాయని తెలిపింది.
బ్రిటన్‌లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రమాదకరమైన వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంపకూడదని చట్టాలు ఉన్నప్పటికీ, చివరకు అదే జరుగుతోందని ఈ ఎన్జీవో డైరెక్టర్ ఇంగ్విల్డ్ జెన్సెన్ అంటున్నారు.
"వీటికి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో పెద్ద మొత్తాల్లో స్టీల్ ఉంటుంది. కానీ, ప్రమాదకరమైన పదార్థాలు కూడా అధిక మొత్తాల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ఆస్‌బెస్టాస్, భారీ లోహాలు, సీసంలాంటి అనేక విష పదార్థాలు ఉంటాయి. వీటితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి" అని ఆమె తెలిపారు.
అయితే, ఇండియాలో ఆస్‌బెస్టాస్‌ను విష పదార్థంగా భావించరని 'సీ2క్రాడిల్'కు చెందిన షిప్ రీసైకిలింగ్ కన్సల్టంట్ మెరిజిన్ హౌగీ అన్నారు.
"60లల్లో తయారైన నౌకల్లో పెద్ద మొత్తాల్లో ఆస్‌బెస్టాస్ ఉండే అవకాశం ఉంది. యూరోప్‌లో దీనిపై నిషేధం ఉందిగానీ ఇండియాలో లేదు. భారతదేశంలో ఆస్‌బెస్టాస్ వ్యాపారం భారీగా జరుగుతుంది. భవన నిర్మాణాల్లో దీన్ని పెద్ద మొత్తాల్లో వాడతారు" అని ఆయన తెలిపారు.
"నౌకలను విరగ్గొడుతున్నప్పుడు వచ్చే చమురు, పెట్రోల్‌లాంటి వాటిని సముద్రాల్లోకి వదిలేస్తాం. లేదా ఒడ్డున ఏవైనా పరికరాలను తగలబెట్టడానికి వాడతాం" అని నౌకలను తుక్కు చేసే పరిశ్రమలో పని చేస్తున్న ఒక కార్మికుడు బీబీసీకి చెప్పారు.
రెండుసార్లు తనకు తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయని, అందుకు ఎలాంటి నష్ట పరిహారం అందలేదని ఆ వ్యక్తి తెలిపారు.
బ్రిటన్ నౌకలు అక్కడే ఆమోదించబడిన స్థలాల్లోనే స్క్రాప్‌కు వెళ్లేలా అంతర్జాతీయంగా చట్టాలను బలోపేతం చేయాలని, వీటి వ్యర్థాల ఎగుమతిపై కఠినమైన నియంత్రణలు అమలు చేయాలని యూకే షాడో ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లూక్ పొల్లార్డ్ అంటున్నారు.
"బ్రిటిష్ నౌకలు ప్రపంచంలో పలు చోట్ల పర్యావరణాన్ని కలుషితం చేయడాన్ని పబ్లిక్ ఇష్టపడతారని నేననుకోను. వాటిని సవ్యంగా, ఆమోదించిన పద్ధతుల్లో పారవేయడం, రీసైకిలింగ్‌కు పంపించడం చేయాలని కోరుకుంటారు" అని ఆయన అన్నారు.
"వ్యర్థాలను అక్రమంగా ఎగుమతి చేయడం ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు. ఈ పనిలో పట్టుబడి, దోషులుగా తేలితే రెండేళ్ల జైలు శిక్షతో పాటూ అపరిమిత జరిమానా విధించే అవకాశం ఉంది" అని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- నైజీరియా కిడ్నాప్: 279 మంది బాలికల విడుదల
- పవర్ గ్రిడ్‌పై చైనా సైబర్ దాడి కేసులో భారత్‌కు అండగా ఉంటాం: అమెరికా కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు
- సియాచిన్‌లో పనిచేసే సైనికుల్లో మతిమరుపు, లైంగిక శక్తి తగ్గడం సాధారణం
- చంద్రశేఖర్ ఆజాద్ నిజంగా తనను తాను కాల్చుకొని చనిపోయారా?
- ఆసిఫా బానో: బాలికపై అత్యాచారం, హత్యపై రగులుతున్న కశ్మీరం
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- అమెరికాకు రష్యా హెచ్చరిక: సిరియాలో మీరు దాడి చేస్తే మనిద్దరి మధ్య యుద్ధమే!
- అమెరికా కొత్త సుంకాలు చైనాను ఎంతగా దెబ్బ తీస్తాయి?
- కామన్వెల్త్ గేమ్స్ వలసవాద అవశేషమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








