పవర్ గ్రిడ్‌పై చైనా సైబర్ దాడి కేసులో భారత్‌కు అండగా ఉంటాం: అమెరికా కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు

విద్యుత్ సరఫరా

ఫొటో సోర్స్, Getty Images

భారత పవర్ గ్రిడ్ వ్యవస్థపై చైనా సైబర్ దాడి కేసులో భారత దేశానికి అండగా నిలవాలని జో బైడెన్ ప్రభుత్వానికి అమెరికా కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఫ్రాంక్ పలోన్ విజ్ఞప్తి చేశారు.

ముంబయి మహానగరంతో పాటు, పరిసరాల్లోని పట్టణ ప్రాంతాల్లో 2020 అక్టోబర్ 12న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దానికి కారణం సాంకేతిక సమస్య కాదని.. భారతదేశం మీద చైనా చేసిన సైబర్ దాడి కారణమని న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

"అమెరికా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్‌కు అండగా నిలబడాలి. భారత పవర్ గ్రిడ్ వ్యవస్థపై చైనా చేసిన ప్రమాదకర సైబర్ దాడిని ‌‍ఖండించాలి. ఈ దాడి కారణంగా కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో ఆసుపత్రులలో విద్యుత్తు లేకుండాపోయింది. దాంతో జనరేటర్లను వాడాల్సి వచ్చింది. బలప్రయోగం, బెదిరింపులతో చైనా ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించడాన్ని ఏమాత్రం సహించకూడదు" అంటూ ఫ్రాంక్ పలోన్ ట్వీట్ చేశారు.

భారత్, చైనా సైనిక బలగాల మధ్య 2020 జూన్‌లో సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరిగింది. అక్కడికి నాలుగు నెలల తర్వాత ముంబయి నగరానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అప్పుడు మహాట్రాన్స్‌ సంస్థకు చెందిన 400 కేవీ కాల్వా-పద్గా జీఐఎస్ స్టేషన్‌కు చెందిన సర్క్యూట్-1 విభాగంలో మరమ్మతులు జరుగుతున్నాయి.

ఆ సమయంలో సర్క్యూట్-2 మీద విద్యుత్ లోడ్ ఉంది. అయితే.. సర్క్యూట్-2లో ఆకస్మిక సాంకేతిక వైఫల్యం కారణంగా ముంబయి, ఠాణేల్లోని చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కరోనా కాలంలో విద్యుత్ అంతరాయాల వల్ల ఆస్పత్రులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. లోకల్ రైళ్లను కూడా నిలిపివేశారు.

ముంబయి నగరం

ఫొటో సోర్స్, AFP

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, విద్యుత్ మంత్రి డాక్టర్ నితిన్ రౌత్‌లు.. ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

తాజాగా.. ఆ విద్యుత్ వైఫల్యానికి కారణం చైనా ప్రణాళిక ప్రకారం చేసిన సైబర్ దాడేనని న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది.

మరోవైపు ఆ రోజు ఘటనకు సైబర్ దాడి కారణమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు.

‘భారతదేశంలో విద్యుత్ గ్రిడ్‌కు అంతరాయం కలిగించటం ఆ దాడి లక్ష్యం. గాల్వన్ లోయలో భారత్ కదలికలు మరింత తీవ్రంగా ఉన్నట్లయితే.. దేశవ్యాప్తంగా విద్యుత్‌కు అంతరాయం కలిగించాలనే ప్రణాళికలను కూడా చైనా రచించింద’ని న్యూయార్క్ టైమ్స్ కథనంలో రాశారు.

రికార్డెడ్ ఫ్యూచర్స్ అనే అమెరికా సైబర్ సంస్థ.. ఈ చైనా సైబర్ దాడి విషయాన్ని బహిర్గతం చేసింది. అయితే చైనాకు చెందిన మాల్‌వేర్‌లో చాలా వరకూ యాక్టివేట్ చేయలేదని రికార్డెడ్ ఫ్యూచర్స్ అధ్యయనం చెప్తోంది.

చైనాకు చెందిన రెడ్ ఎకాన్ అనే సంస్థ.. అత్యాధునిక సైబర్ దాడి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డజనుకు పైగా పవర్ గ్రిడ్ల మీద దాడి చేయటానికి ప్రయత్నించిందని రికార్డెడ్ ఫ్యూచర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్టువర్ట్ సాలమన్ వివరించారు.

న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సైబర్ విభాగానికి నిర్దేశించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

విద్యుత్ లైన్లు

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఏం జరిగింది?

2020 అక్టోబర్ 12వ తేదీ ఉదయం ముంబయిలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. నగరానికి విద్యుత్ సరఫరా చేసే సంస్థ బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్.. ఉదయం 10:15 గంటలకు విద్యుత్ నిలిచిపోయినట్లు నివేదించింది.

అప్పటికి ముంబై మెట్రోనగరం, వెస్ట్రన్, సెంట్రల్ సబర్బ్ ప్రాంతాలు, ఠాణే, డోంబివలీ, కళ్యాణ్, భివాండి ప్రాంతాలకు కూడా విద్యుత్ అంతరాయాలు తలెత్తాయి. దీనివల్ల సబర్బన్ రైల్వే సర్వీసులు, నగరంలో అత్యవసర సేవలు, రోడ్డు సిగ్నల్ వ్యవస్థలపై ప్రభావం పడింది.

ఎంఎస్ఈడీసీఎల్ తర్వాత రెండు గంటల్లో విద్యుత్‌ను పునరుద్ధరించింది. అయితే.. ముంబై వంటి పారిశ్రామిక రాజధానిలో ఈ తరహా విద్యుత్ అంతరాయం వల్ల మొత్తం వ్యవస్థకు పలు గంటల పాటు అంతరాయం కలిగింది.

విద్యుత్ బల్బ్

ఫొటో సోర్స్, Getty Images

ముంబయి నగరానికి విద్యుత్ సరఫరా చేసేది ఎవరు?

ముంబై పారిశ్రామిక రాజధాని కావటం వల్ల.. ఇక్కడ పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం ముంబైలో బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ అనే కంపెనీని 1873లో స్థాపించారు.

ఇంటర్-సిటీ రవాణా సర్వీసులు నడవటం కోసం ముంబై నగరానికి నిరంతరాయ విద్యుత్‌ను అందించటం ఈ సంస్థ ప్రధాన విధి. నగరంలో 15 లక్షల ఇళ్లు, కార్యాలయాలకు ఇదే సంస్థ ఇప్పటికీ విద్యుత్ సరఫరా చేస్తోంది.

అయితే.. ముంబై నగరం విస్తరించటంతో సబర్బన్ ప్రాంతాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అవసరం కూడా పెరిగింది.

ముంబై నగరానికి, సబర్బన్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయటం కోసం 1990లలో టాటా పవర్, రిలయన్స్ సంస్థలతో కాంట్రాక్టులు చేసుకున్నారు. రిలయన్స్ సంస్థ 2018లో.. ముంబైలోని తన విద్యుత్ పంపిణీ సంస్థను అదానీ పవర్ కంపెనీకి విక్రయించింది.

స్థూలంగా చెప్తే.. దక్షిణ ముంబైలో విద్యుత్ సరఫరాను బెస్ట్ చేస్తోంది. పశ్చిమ ముంబైలో టాటా సంస్థ, సెంట్రల్ ముంబైలో అదానీ పవర్ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. టాటా పవర్ వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వినియోగదారులకు.. ప్రత్యేకించి నగరంలోని కమర్షియల్ కాంప్లెక్సులు, ఆఫీసులకు సరఫరా చేస్తుంది.

అదానీ ఎనర్జీ దహను వద్ద 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. గృహ వినియోగదారులు, వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)