నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?

నియాండర్తాల్ మానవుడు

ఫొటో సోర్స్, RM Favimo Assari/Alamy

    • రచయిత, జరియా గార్వెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మానవ పరిణామ చరిత్రలోని నియాండర్తాల్ జాతులు తొలి తరం ఆధునిక మానవులతో శారీరక సంబంధాలు ఏర్పర్చుకోవడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన వివరాలను సేకరించారు.

వారు ముద్దు పెట్టుకున్నారా.. లేదా, అప్పుడు వారి లైంగిక అవయవాల పని తీరు ఎలా ఉండేది వంటి అనేక విషయాలు తెలుసుకున్నారు.

పురాతన రొమేనియాలో కఠినమైన పర్వత శ్రేణుల అంచుల దగ్గర వారిద్దరి కళ్లు కలుసుకున్నాయి. అక్కడే తోలుతో చేసిన కోటు తప్ప మరే ఆచ్ఛాదనా లేకుండా నగ్నంగా ఉన్న నియాండర్తాల్ (అంతరించిపోయిన ప్రాచీన మానవ జాతి) నిలుచుని ఉన్నారు.

ఆయన మంచి అవయవ సౌష్టవం, లేత చర్మం, ఎండ వలన ఎర్రబడిన చర్మంతో కనిపిస్తున్నారు. కండపుష్టి కలిగిన అతను చేతికి గద్ద గోళ్ళతో చేసిన కంకణం ధరించి ఉన్నారు.

ఆమె తొలి తరం ఆధునిక యుగానికి చెందిన మహిళ. ఆమె జంతు చర్మంతో చేసిన కోటుని ధరించి, తోడేలు వూలుతో చేసిన టోపీని తలకు కప్పుకున్నారు. ఆమె చర్మం నలుపుగా, పొడవైన కాళ్ళు కలిగి, జుత్తును జడలుగా అల్లుకుని ఉన్నారు.

ఆయన గొంతు సవరించుకున్నారు. ఆమెను పై నుంచి కిందకు చూశారు. ఒక అసంబద్ధమైన బిగ్గర గొంతుతో, ముక్కులోంచి వచ్చిన శబ్దంతో అతనికి నచ్చిన ఉత్తమమైన వాక్యం మాట్లాడారు. ఆమె ఆయన వైపు శూన్యంగా చూశారు. అదృష్టవశాత్తూ వారిద్దరూ ఒకే భాష మాట్లాడుకోవడం లేదు.

వారిద్దరూ ఒక ఇబ్బందికరమైన నవ్వు నవ్వుకున్నారు. ఆ తర్వాతేమయిందో మనం ఊహించుకోవచ్చు.

ఒక రొమాంటిక్ నవలలో కనిపించే విధంగా ఒక వేడెక్కించే దృశ్యాన్ని అక్కడ మనం ఊహించుకోవచ్చు.

వారి సంబంధం చాలా వ్యవహార జ్ఞానంతో కూడిన సాధారణ సంబంధం అయి ఉండవచ్చు. ఆ సమయంలో ఆ చుట్టు పక్కల ఎవరూ లేరు. అలాంటి సంబంధాలలో ఆ జంట ఒకరినొకరు మనస్సుతో ఇష్టపడి కలయికకు పరస్పర అంగీకారం ఉండాలనే నియమం కూడా ఏమీ లేదు.

ఈ కలయికలో ఏం జరిగిందో మనకు ఎప్పటికీ తెలియలేకపోయినప్పటికీ అలాంటి జంటలు కచ్చితంగా కలిశాయని మాత్రం చెప్పవచ్చు.

కార్పాతియన్ పర్వత ప్రాంతం

ఫొటో సోర్స్, NPL/Alamy

ఇది జరిగిన సుమారు 37,000 - 42,000 సంవత్సరాల తర్వాత ఇద్దరు అన్వేషకులు రొమేనియా పట్టణం అనీన దగ్గర ఉన్న కార్పాతియన్ పర్వత ప్రాంతాల్లో ఉన్న భూగర్భ గుహల్లో 2002 ఫిబ్రవరిలో ఒక అసాధారణ ఆవిష్కరణ చేశారు.

అక్కడకు వెళ్లడం కూడా ఏమంత సులభం కాదు. వాళ్ళు ముందుగా భూగర్భంలో ఉన్న నదిలో పీకల లోతులో నీటిలో 200 మీటర్ల పాటు ఈదారు. ఆ తర్వాత ఒక భూగర్భ జల మార్గంలో 30 మీటర్ల వరకు స్కూబా డైవింగ్ చేశారు.

ఆ తర్వాత ఒక సన్నని మార్గంలో 300 మీటర్లు పైకి ఎక్కుతూ వెళ్లారు. అక్కడున్న ప్రవేశ ద్వారం నుంచి అంత వరకు ఎవరికీ తెలియని ఒక ఛాంబర్ లోకి ప్రవేశించారు.

ఎముకలతో నిండిన ఆ గుహలో వారికి కొన్ని వేల క్షీరదాల ఎముకలు కనిపించాయి. వాటి చరిత్ర ఆధారంగా అవి గుహలో ఉండే మగ ఎలుగుబంటులవని భావించారు. అవి బ్రౌన్ ఎలుగుబంటులకు అంతమైపోయిన బంధువులు.

ఆ గుహ ఉపరితలం పై ఒక మానవ దవడ ఎముక కూడా కనిపించింది. దాని రేడియో కార్బన్ వివరాల ద్వారా అది యూరప్ లో తొలి తరపు ఆధునిక మానవ జాతికి చెందినవని వెల్లడవుతోంది.

ఈ అవశేషాలు ఈ గుహ లోపలకు సహజంగానే కొట్టుకుని వెళ్లి అక్కడ స్థిరపడి ఉండవచ్చు. శాస్త్రవేత్తలు వాటిని కనుగొనే నాటికి, ఆ దవడ ఎముక మాత్రం ఆధునికంగానే కనిపించింది. అందులో కొన్ని అసాధారణమైన నియాండర్తాల్ జాతికి చెందిన వారి పోలికలు కనిపించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయం నిర్ధరణయింది.

శాస్త్రవేత్తలు 2015లో దొరికిన అవశేషాల నుంచి డిఎన్ఏ పరిశీలించినప్పుడు ఆ వ్యక్తి 6 - 9 శాతం వరకు ఉన్న నియాండర్తాల్ పురుషుడని అర్ధమయింది. తొలి తరం ఆధునిక మానవునిలో నియాండర్తాల్ డిఎన్ఎ శాతం అత్యధికంగా కనిపించడం ఇక్కడే జరిగింది. ఇది నేటి ఆసియన్లు,యూరోపియన్లలో కనిపించిన శాతం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. వీళ్ళలో నియాండర్తాల్ జన్యువులు 1 - 3 శాతం మాత్రమే ఉన్నాయి.

ఈ జన్యువులలో నియాండర్తాల్ డిఎన్ఏ తీరు అంతరాయం లేకుండా ఉంది. ఈ ఎముక దవడ కనీసం 4 - 6 తరాల క్రితం నియాండర్తాల్ జాతి వారికి చెందినట్లుగా ఈ అధ్యయనకర్తలు తేల్చారు. అంటే తొలి సమాగమం ఈ వ్యక్తి పుట్టుకకు 200 ఏళ్ల క్రితం జరిగి ఉంటుందని నిర్ధరించారు.

ఈ బృందానికి గుహలో ఎముక దవడతో పాటు ఇంకొక వ్యక్తి పుర్రె అవశేషాలు కూడా లభించాయి. అయితే ఈ అవశేషాల నుంచి శాస్త్రవేత్తలు ఇంకా డిఎన్ఏ వెలికి తీయలేకపోయారు. కానీ, ఇది కూడా నియాండర్తాల్ వారసత్వానికి సంబంధించినదే అని అన్నారు.

అప్పటి నుంచి తొలి తరపు ఆధునిక మానవులు, నియాండర్తాల్ జాతుల మధ్య సెక్స్ జరగడం అరుదైన విషయం కాదనే ఆధారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత జనాభాలో కూడా ఈ జన్యువులు అంతర్గతంగా దాగి ఉన్నట్లు వివిధ సందర్భాలలో కొన్ని చిహ్నాలు కనిపించాయి.

ఈ రోజుకీ కొంత మంది ప్రజలు కనీసం రెండు రకాల నియాండర్తాల్ జనాభాకు చెందిన జన్యువులను కలిగి ఉన్నారని యూరప్, ఆసియాలోని జనాభాలతో వీరు చాలా సార్లు సంపర్కం అయ్యారని ఒక విశ్లేషణ చెబుతోంది.

నిజానికి నేడు సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరిలో ఆఫ్రికా సంతతికి చెందిన వారితో సహా నియాండర్తాల్ డీఎన్ఏ కనిపిస్తుంది. 2016లో సైబీరియాలో ఉన్న ఆల్టై పర్వతాల దగ్గర ఉండే నియాండర్తాల్ జనాభా 1 - 7 శాతం జన్యువులను ఆధునిక మానవుని పూర్వీకులతో పంచుకుని ఉంటారని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీళ్ళు 100,000 సంవత్సరాల క్రితం బ్రతికి ఉండి ఉండవచ్చని అంచనా వేశారు.

అయితే, ఇవి ఆధునిక చరిత్ర మొదలుకాక ముందే అంతమైపోయి ఉంటాయని భావించినప్పటికీ, వాటి ఆధారాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి.

మానవ చరిత్రలో ఈ ఆసక్తి కలిగించే ఘట్టం గురించి కొన్ని విశేషాలు

పుర్రెలు

ఫొటో సోర్స్, Sabena Jane Blackbird/Alamy

ముద్దు

2017లో పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీ ఆంత్రోపాలజిస్ట్ లారా వేరిచ్ ఒక పురాతనమైన దంతానికి ఉన్న ఒక 48,000 సంవత్సరాల పురాతన హిచ్ హైకర్ సూక్ష్మ చిహ్నాన్ని కనుగొన్నారు.

"నేను గత చరిత్ర గురించి తెలుసుకోవడానికి పురాతనమైన సూక్ష్మజీవులను పరిశీలిస్తాను. ఈ పురాతన మానవుల్లో ఉన్న సూక్ష్మజీవులను పునర్నిర్మించడానికి దంతాల గణన కాలాన్ని పరిశీలించడమే నమ్మకమైన మార్గం" అని వేరిచ్ చెప్పారు.

ఆమెకు ప్రత్యేకంగా నియాండర్తాల్ ప్రజల ఆహార పద్ధతులు, చుట్టూ ఉన్న వాతావరణంతో వారు ప్రవర్తించిన విధానం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఇది తెలుసుకోవడానికి ఆమె మూడు రకాల గుహలలో లభించిన దంతాల నుంచి వచ్చిన డిఎన్ఏ ను క్రమబద్ధీకరించారు.

అందులో 2 నమూనాలను ఆగ్నేయ స్పెయిన్ లో ఎల్ సిడ్రోన్ ప్రాంతంలో లభించిన 13 మంది నియాండర్తాల్ జాతికి చెందిన వారి నుంచి సేకరించారు. అయితే వాళ్లలో చాలా మంది కొన్ని రకాల పుట్టుకతో వచ్చిన అసాధారణ అనారోగ్య సమస్యలతో బాధపడేవారని అర్ధమయింది. వంకర టింకరగా ఉండే మోకాళ్ళు, వెన్నెముక, వయసు పెరిగినా బాల దంతాల లాంటి సమస్యలతో బాధపడుతూ ఉండేవారని తెలిసింది.

వీళ్ళలో చాలా మంది దగ్గర బంధువుల మధ్యలోనే సంబంధాలు పెట్టుకోవడంతో వాళ్ళ జన్యువులు మందగించి ఉంటాయనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఈ కుటుంబాలు అనుకోకుండా అంతమైపోయాయి. వాళ్ళని సొంత జాతి వాళ్లే చంపి తిని ఉంటారనే చిహ్నాలు వాళ్ళ ఎముకలను బట్టి తెలుస్తున్నాయి. వాళ్ళు ఈ భూమి పై నడిచిన ఆఖరి నియాండర్తాల్ జాతికి చెందిన వారని భావిస్తున్నారు.

ఎల్ సిడ్రోన్ లో లభించిన ఒక దంతంలో మెథనోబ్రెవిబ్యాక్టర్ ఒరాలిస్ అనే ఒక సూక్ష్మమైన జన్యు చిహ్నం ఉంది. ఇది ఇప్పటికీ మన నోటిలో కూడా కనిపిస్తోందని వేరిచ్ ఆశ్చర్యపోయారు.

నియాండర్తాల్ జాతి చిహ్నాలను, ఆధునిక మానవుని చిహ్నాలతో పోల్చి చూసినప్పుడు వాళ్ళు 120,000 సంవత్సరాల క్రితమే విడిపోయినట్లు తెలుస్తుంది.

ఆధునిక మానవునికి, పురాతన మానవునికి ఒకేలాంటి దంత జన్యువులు ఉంటే ఈ విడిపోవడం 450,000 సంవత్సరాల క్రితమే జరిగి ఉండవచ్చు. అంటే, అప్పటి నుంచే ఈ సూక్ష్మజీవులు పురాతన మానవుల నుంచి ఆధునిక మానవునికి బదిలీ జరిగి ఉండవచ్చు" అని వేరిచ్ చెబుతున్నారు.

అయితే ఇది జరిగిందో లేదో నిర్ధారించడానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కానీ 120,000 సంవత్సరాల క్రితం జరిగిన దానితో దీనికి సంబంధం ఉండి ఉండవచ్చు. "ఇది మానవులకు, నియాండర్తాల్ జాతికి మధ్య సంబంధాలు ఉండేవని చెప్పడానికి తొలి సమయమనే విషయం నన్ను విస్మయానికి గురి చేస్తోంది" అని వేరిచ్ అన్నారు. ఆ సమయంలోనే సూక్ష్మజీవులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ అయి ఉంటాయని భావిస్తున్నారు.

అయితే ఈ సూక్ష్మజీవుల బదిలీ ముద్దు పెట్టుకోవడం వలన జరిగి ఉంటుందని వేరిచ్ వివరించారు.

"ఎవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు నోటిలో ఉండే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతాయి" అని ఆమె చెప్పారు.

ఇలా అప్పట్లో ఒకసారి జరిగి తర్వాత పెరిగి ఉండవచ్చు. లేదా ఈ ప్రక్రియ తరచుగా కూడా జరిగి ఉండవచ్చు" అని ఆమె అన్నారు.

అలాగే ఆహారాన్ని పంచుకుని తినడం వలన కూడా సూక్ష్మజీవులు బదిలీ అవుతాయి. అయితే, నియాండర్తాల్ జాతికి చెందినవారు తొలి తరం ఆధునిక మానవునికి ఆహరం వండి పెట్టినట్లు ఎక్కడా దాఖలాలు లేనప్పటికీ, ఒక ప్రేమపూరితమైన విందు కూడా ఈ ఎం ఒరాలిస్ సూక్ష్మజీవుల బదిలీకి మూలం అయి ఉండవచ్చు.

ఆధునిక మానవునికి ఇతర రకాల మనుషులకు మధ్య ఏర్పడిన సంబంధాలు మనకి నేడున్న సూక్ష్మజీవుల సమూహాలకు ఆకారం కల్పించాయనే కొత్త విషయం, వేరిచ్ కి ఉత్సాహవంతంగా అనిపించింది.

'మన సూక్ష్మజీవుల సమూహం ఈ నియాండర్తాల్ నుంచి పొందటం వల్లే సరిగ్గా పని చేస్తుందా' అనే సందేహం వేరిచ్ కి కలిగింది.

ఉదాహరణకు ఆధునిక మానవుల్లో ఉన్న దంత సంబంధ వ్యాధులకి ఎం ఒరాలిస్ కి సంబంధం ఉండటం వలన, పురాతన మానవులకు ఆరోగ్యకరమైన దంతాలుండేవని వేరిచ్ చెప్పారు.

ఈ పురాతన దంతాల పై ఉండే గార ద్వారా లభించిన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఆధునిక మానవునిలో ఆరోగ్యకరమైన నోటి సంబంధిత సూక్ష్మజీవుల సమూహాన్ని పునర్నిర్మించవచ్చని వేరిచ్ భావిస్తున్నారు.

నియాండర్తాల్ మానవుడి రూపంతో మహిళ

ఫొటో సోర్స్, Lambert/Ullstein Bild/Getty Images

నియాండర్తాల్ స్త్రీ-పురుషులు

అయితే నియాండర్తాల్ స్త్రీలు తొలి తరపు ఆధునిక పురుషునితో కలిసారా లేదా నియాండర్తాల్ పురుషులు తొలి తరపు ఆధునిక స్త్రీలతో కలిసారా అనే విషయం గురించి మాత్రం కచ్చితంగా చెప్పలేం. కానీ, దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి.

2008లో పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక విరిగిన వేలి ఎముకను, దవడ పక్కన ఉండే దంతాన్ని రష్యా ఆల్టై పర్వతాలలో డెనిసోవా గుహల్లో కనుగొన్నారు. అందులో మానవ జాతికి చెందిన ఒక కొత్త ఉప జాతి గురించి విషయాలు బయటపడ్డాయి.

కొన్ని సంవత్సరాల పాటు డెనిసోవా ప్రజల గురించి కేవలం అక్కడ దొరికిన నమూనాల ద్వారా మాత్రమే తెలుసు. అయితే, వారి వారసత్వం మాత్రం తూర్పు ఆసియా, మెలనేసియా జాతి జన్యువులలో నేటికీ కొనసాగుతోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

నియాండర్తాల్ ప్రజలతో ఆధునిక మానవుని కంటే డెనిసోవ ప్రజలు చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉండేవారు. ఈ ఉప జాతుల నుంచి వచ్చిన వారు కొన్ని వందల ఏళ్ల పాటు ఆసియాలో పెరుగుతూ ఉండి ఉండవచ్చు. 2018లో డెని అనే ముద్దు పేరున్న ఒక అమ్మాయి ఎముక లభించడంతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలిసింది. ఆమెకు నియాండర్తాల్ తల్లి, డెనిసోవ తండ్రి ఉండేవారు.

నియాండర్తాల్ పురుషుల సెక్స్ క్రోమోజోములు డెనిసోవ ప్రజల క్రోమోజోములను పోలి ఉండటంలో ఆశ్చర్యం లేదు.

కానీ, 38,000 - 53,000 సంవత్సరాల క్రితం ముగ్గురు నియాండర్తాల్ డిఎన్ఏ ను క్రమబద్దీకరించి పరిశీలించినప్పుడు, వారిలో ఉన్న వై క్రోమోజోములు ఆధునిక మానవుల క్రోమోజోములతో పోలి ఉండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురి చేసింది.

నియాండర్తాల్ జాతులకు తొలి తరం ఆధునిక మానవునికి మధ్య బలమైన జన్యు బదిలీ జరిగిందనడానికి ఇది ఆధారంగా నిలుస్తోందని అధ్యయనకారులు చెబుతున్నారు. వాళ్ళ మధ్య సంతానోత్పత్తి ఎక్కువగానే జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

కాకపొతే, నియాండర్తాల్ జాతి అంతమయ్యే సమయానికి వారి సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతూ రావడంతో వారి వై క్రోమోజోములు కూడా అంతరించిపోయాయి, కొత్త రకమైన క్రోమోజోములు పుట్టి ఉంటాయని భావిస్తున్నారు. దీనిని బట్టి మన పూర్వీకులు నియాండర్తాల్ జాతి స్త్రీలతో సెక్స్ చేస్తూ ఉండేవారని అర్ధమవుతోంది.

కానీ, కథ అక్కడితో ముగియటం లేదు. ఇలాంటి పరిస్థితే శరీరంలో చక్కెరను శక్తిగా మార్చే నియాండర్తాల్ మైటోకాండ్రియా కణజాలానికి కూడా కలిగిందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇవి ముఖ్యంగా తల్లుల నుంచి పిల్లలకు సంక్రమించాయి. 2017లో తొలి తరం ఆధునిక మానవుని మైటోకాండ్రియా నియాండర్తాల్ అవశేషాల్లో దొరికినప్పుడు మన పూర్వీకులు కూడా నియాండర్తాల్ జాతి పురుషులతో సెక్స్ చేసేవారనే సూచనలు ఇస్తోంది.

అయితే, ఇది 270,000 - 100,000 సంవత్సరాల క్రితం చాలా మంది మానవులు ఆఫ్రికాలో విస్తరించి ఉన్నప్పుడు జరిగి ఉండవచ్చు.

నియాండర్తాల్ మానవుల దంతం

ఫొటో సోర్స్, STR/AFP/Getty Images

లైంగిక వ్యాధులు

విల్లే పిమెనాఫ్ అనే అధ్యయనకర్త కొన్ని సంవత్సరాల క్రితం లైంగికంగా సంక్రమించే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన కాస్త అసాధారణమైన విషయాన్ని గమనించారు.

పాపిల్లోమా వైరస్ ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు, తాబేళ్లు, పాములు, కొన్ని పక్షులలో వ్యాప్తి చెంది ఉంటుంది. నిజానికి అవి అన్ని రకాల జాతులలోనూ కనిపిస్తాయి. కానీ, ఒక్క మనుషులలోనే 100కి పైగా రకాలు వ్యాప్తిలో ఉంటాయి. ఇవన్నీ కలిపే ప్రపంచ వ్యాప్తంగా 99.7 శాతం సెర్వికల్ క్యాన్సర్ కి కారణమవుతాయి. అందులో హెచ్ పివి-16 శరీరంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండి అది ఇన్ఫెక్ట్ చేసిన కణాలను నెమ్మదిగా నాశనం చేస్తుంది.

ఇలాంటి లైంగిక సంబంధాలు రెండు రకాల జాతుల ప్రజలు నివసించే యురేషియా ప్రాంతంలో చాలా సాధారణంగా ఉండి ఉండవచ్చు అని విల్లే పిమెనాఫ్ అన్నారు.

అయితే, కొన్ని రకాల వైరస్‌లు లభించిన చోట అంతర్జాతీయంగా స్పష్టమైన విభజన ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల టైప్ ఎ వైరస్ వలన ప్రభావితమయితే ,సబ్ సహారా ఆఫ్రికాలో చాలా మంది ప్రజలు టైప్ బి, టైపు సి తో ఇన్ఫెక్ట్ అయ్యారు

ఈ సరళి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన నియాండర్తాల్ డిఎన్ఏ తో సరిగ్గా సరిపోతోంది. సబ్ సహారా ఆఫ్రికాలో ఉండే ప్రజలు ఈ అసాధారణ హెచ్ పివి ని కలిగి ఉన్నప్పటికీ మిగిలిన వారితో పోలిస్తే నియాండర్తాల్ జన్యు తీరును వీరు చాలా తక్కువగా కలిగి ఉంటారు.

దీని గురించి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పిమెనాఫ్ టైపు ఎలో నేడున్న జన్యు వైవిధ్యాన్ని వాడి ఇది 60,000 - 120,000 సంవత్సరాల మధ్యలో పుట్టిందని గణించారు. అంటే ఇది మిగిలిన హెచ్ పివి 16 కంటే చాలా తర్వాత పుట్టింది. అప్పుడే ఆఫ్రికాకు చెందిన తొలి తరం ఆధునిక మానవులు నియాండర్తాల్ ప్రజలతో కలవడం మొదలయింది.

ఇది కచ్చితంగా నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ , వారు లైంగిక వ్యాధులను కూడా ఒకరితో ఒకరు పంచుకోవడం మొదలయిందని హెచ్ పి వి16 లో ఉన్న వివిధ రకాలు వాటి పుర్వ జాతుల నుంచి వచ్చి ఉంటాయని పిమెనాఫ్ భావిస్తారు.

"నేను కొన్ని రకాల విధానాలు వాడి దీనిని కొన్ని వేల సార్లు పరీక్షించాను. వీటి ఫలితాలు ఎప్పుడూ ఒకేలా వచ్చాయి" అని పిమెనాఫ్ చెప్పారు.

నేడు హెచ్ పివి వైరస్ వ్యాప్తి చెందిన తీరు చూస్తుంటే, ఈ వైరస్ మనుషులకు కేవలం ఒక్క సారి మాత్రమే కాకుండా వివిధ సందర్భాలలో బదిలీ అయి ఉండవచ్చని భావిస్తున్నారు

ఈ వైరస్ ఒక్కసారే బదిలీ అయి ఉంటే ఈ వైరస్ ఎక్కువ సార్లు బ్రతికి ఉండకపోయి ఉండేదని ఆయన అన్నారు.

ఇటీవల కాలంలో మానవులకు సంక్రమించడం వల్లే ఇది క్యాన్సర్ కారకంగా మారిందని వివరించారు. ఈ ఇన్ఫెక్షన్ తో పోరాడేందుకు మన రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందలేదని అన్నారు.

అయితే, నియాండర్తాల్ జాతులతో జరిపిన సెక్స్ వలన మనకి హెచ్ఐవి పురాతన బంధువుతో సహా కొన్ని ఇతర రకాల వైరస్ లు మిగిలాయి.

అయితే, ఎప్పుడో అంతమైపోయిన మన బంధువులపై కోప్పడాల్సిన పని లేదని , ఎందుకంటే మనం కూడా హెర్పిస్ లాంటి లైంగిక సంక్రమిత వ్యాధులు వారికి సోకించినట్లు ఆధారాలు ఉన్నాయి"అని చెప్పారు.

నియాండర్తాల్ మానవుడు

పునరుత్పత్తి అవయవాలు

నియాండర్తాల్ పురుషాంగాలు, యోనులు ఎలా ఉండేవో ఊహించడం కాస్త అవమానించినట్లే ఉంటుంది కానీ, వీరి జననాంగాల గురించి చాలా శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు పురుషాంగం పుట్టుక గురించి గూగుల్ స్కాలర్ లో వెతికితే 98,000 ఫలితాలు వస్తే, యోని పుట్టుక గురించి 87,000 ఫలితాలు వచ్చాయి.

ఒక జంతువు పునరుత్పత్తి అవయవాల ద్వారా వాటి జీవన విధానం, సంపర్కం చేసే వ్యూహాలు, వాటి పుట్టుక గురించి చరిత్ర లాంటి వివారాలు తెలుస్తాయి. వాటిని అర్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు రావడం వాటి గురించి తెలుసుకునేందుకు ఇంకొక మార్గం.

జంతు సామ్రాజ్యంలో రక రకాల చిత్ర విచిత్రమైన రూపాలతో కూడిన ఊహాత్మక రకాలు ఉంటాయి. ఇందులో ఆర్గోనాట్ ఆక్టోపస్ కి ఒక పురుగులా విడిగా శరీరం నుండి ఊడి వచ్చే పురుషాంగం ఉంటుంది. ఇది ఒంటరిగా స్త్రీ జాతితో సంపర్కం చెందడానికి వెళ్లగలదు. ఈ జాతి మగ జంతువులు కేవలం వాటి ప్రేమికుల పరిమాణంలో 10 శాతం మాత్రమే ఉండటం వలన ఈ రకంగా పుట్టి ఉండవచ్చు. కంగారూలకి మూడు యోనులు ఉంటాయి. దాంతో ఇవి నిరంతరం గర్భం దాలుస్తూనే ఉంటాయి.

మానవ పురుషాంగం మెత్తగా ఉంటుంది. ఇప్పుడు సజీవంగా ఉన్న మన దగ్గర బంధువులు కామన్ బొనొబో చింపాంజీలతో మనం 99 శాతం డీఎన్ఏ ను పంచుకుంటున్నాం. వీటన్నిటి పురుషాంగానికి వెన్నెముక ఉంటుంది.

పురుషాంగం చివరన చర్మం, రోమాలతో తయారైన మొనలా ఉండే భాగం పురుషుల నుంచి వీర్యాన్ని వేరు చేయడానికి పుట్టి ఉంటాయి. లేదా ఆడ చింపాంజీలతో సెక్స్ కొంత సేపు చేసిన తర్వాత వాటికి తిరిగి వెంటనే కోరిక కలగకుండా సున్నితంగా స్త్రీల యోనిని తాకడానికి పనికొస్తాయి.

కొన్ని సంకర జాతుల్లో పురుషాంగానికి ఉండే వెన్నెముక చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు. వీటి వలన మగ వారు పునరుత్పత్తి చేసే సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

అయితే, నియాండర్తాల్, డెనిసోవ జాతుల జన్యు క్రమంలో ఆధునిక మానవులలానే పురుషాంగ వెన్నెముకకు సంబంధించిన జెనెటిక్ కోడ్ లేదని కనిపెట్టారు. దీనిని బట్టి మన ఉమ్మడి పూర్వీకుల నుంచి ఇది 800,000 సంవత్సరాల క్రితమే మాయమైపోయి ఉండవచ్చు అని ఊహిస్తున్నారు.

సంకర జాతి జీవుల్లో ఈ వెన్నెముక ఉండటం వలన మగవారు ఇతరులతో పోటీ పడటానికి పునరుత్పత్తికి పెంచుకోవడానికి సహాయపడుతుంది. దీనిని బట్టి నియాండర్తాల్ డెనిసోవ జాతులు ఒకే భాగస్వామిని కలిగి ఉండేవారనే అనుమానానికి దారి తీస్తోంది.

ఒకరితో ఒకరు పడకను పంచుకోవడం

నియాండర్తాల్ జాతికి చెందిన ప్రజలు ఆధునిక మానవుల కంటే ఎక్కువగానే ఒకరితో ఒకరు పడకను పంచుకునేవారని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి.

పిండాలపై జరిపిన కొన్ని అధ్యయనాలు పొట్టలో ఉండే టెస్టోస్టెరాన్ లాంటి ఆండ్రోజెన్ లు ఒక వ్యక్తి వయోజన డిజిట్ నిష్పత్తి పై ప్రభావం చూపించవచ్చని తెలిపాయి. ఇది ఒక వ్యక్తి చూపుడు వేలు, ఉంగరం వేలు పొడవు మధ్య తేడాను కనిపెట్టడానికి చూపుడు వేలు పొడవును రెండవ వేలు పొడవుతో భాగహారం చేయడం వలన వచ్చే ఫలితంతో కొలుస్తారు. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండే వాతావరణంలో ప్రజలు ఈ రేషియో తక్కువగా కలిగి ఉంటారు. ఈ రేషియోకి లింగ బేధం లేదు.

ముఖంలో ఉండే ఆకర్షణకు, లైంగిక ఆకర్షణకు, ముప్పు ఎదుర్కోవడానికి, చదువులో ముందుండటానికి, సహానుభూతి కలిగి ఉండటానికి, పురుషుల్లో ఉండే ఆధిపత్యానికి, పురుషాంగాల పరిమాణానికి డిజిట్ రేషియో కి సంబంధం ఉందనడానికి కొన్ని ఆధారాలు లభించాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని అధ్యయనాలు వివాదాస్పదంగా కూడా మారాయి.

చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్లు లాంటి సంకర జాతులు సగటున తక్కువ డిజిట్ నిష్పత్తులు కలిగి ఉన్నాయని 2010లో ఒక శాస్త్రవేత్తల బృందం గమనించింది. అయితే, ఇజ్రాయెల్ గుహలో లభించిన తొలి తరం ఆధునిక మానవునిలో (0. 935), నేటి తరం మానవుల్లో (0. 957) ఇవి అధిక నిష్పత్తిలో ఉన్నట్లు గుర్తించారు.

మానవులు సాధారణంగా ఒకే భాగస్వామిని కలిగి ఉంటారు. ఈ జాతుల డిజిట్ రేషియోకి వారనుసరించే లైంగిక వ్యూహానికి సంబంధం ఉందేమోనని శాస్త్రవేత్తలకు సందేహం వచ్చింది. ఇదే నిజమైతే రెండు విభాగాలలో 0.928 రేషియోలు ఉన్న నియాండర్తాల్ లు నేటి తరం, తొలి తరం మనుషుల కంటే కాస్త తక్కువ స్థాయిలోనే ఒకే ఒక్క భాగస్వామిని కలిగి ఉండేవారని అనిపిస్తోంది.

నియాండర్తాల్ మానవుడు

సూర్యాస్తమయం వైపు గమనం

ఒక సారి నియాండర్తాల్ వ్యక్తి, తొలి తరం ఆధునిక మానవులు ఒకరినొకరు కలిసినప్పుడు వారు మనిషి నివసించిన చోటే స్థిరపడి ఉంటారు. ఇదే తరహాను ప్రతీ తరంలో అనుసరించి ఉంటారు. గృహాలు పురుషులు, వారి భాగస్వాములు, పిల్లలతో కూడి ఉండేవని నియాండర్తాల్ నుంచి సేకరించిన జన్యు ఆధారాలు సూచిస్తున్నాయి. మహిళలు వారికి భాగస్వామి లభించగానే కుటుంబం నుంచి దూరంగా వెళ్లే వారని అనిపిస్తోంది.

ఐస్‌ల్యాండ్ ప్రజల్లో వారు వదిలేసిన జన్యువుల మీద చేసిన అధ్యయనాల నుంచి కూడా తొలి తరం ఆధునిక మానవులు, నియాండర్తాల్ మధ్య సంతోషకరమైన జీవనం సాగిందనడానికి ఆధారాలు తెలుపుతున్నాయి. అలా ఉన్న 27566 మంది వ్యక్తుల నుంచి సేకరించిన జన్యువులను విశ్లేషించినప్పుడు నియాండర్తాల్ కి పిల్లలు కూడా పుట్టేవారని తెలుస్తోంది. వీరిలో స్త్రీలు కాస్త పెద్ద వయసులో ఉంటే పురుషులు మాత్రం చిన్న వయసు వారు ఉండేవారు.

వీళ్లకు పిల్లలు పుడితే, మిగిలిన నియాండర్తాల్ వారి లాగే తల్లి పిల్లలకు 9 నెలల వరకు పాలిచ్చి 14 నెలలు వచ్చేసరికి పాలివ్వడం మానేసేవారు.

ఈ ప్రాచీన మానవ సంబంధాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నియాండర్తాల్ ప్రజలు అవలంబించిన సాధారణం జీవన విధానాన్ని, వారు అంతమవ్వడానికి కారణాలను తెలియచేస్తోంది.

ఆఖరి నియాండర్తాల్ - జాతి అంతం

ప్రాచీన మానవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోయినప్పటికీ , ఈ జాతుల మధ్య ఏర్పడిన సంబంధాల వలన ఆధునిక మానవునిలో శరీర రంగు, జుట్టు రంగు, పొడవు, నిద్రపోయే తీరు, మానసిక స్థితి,రోగ నిరోధక శక్తి లాంటి కొన్ని రకాల లక్షణాలు ఏర్పడటానికి సహకరించాయి అని చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవడం వలన కొన్ని కొత్త రకాల రోగాలకు ప్రభావవంతమైన చికిత్సను కనిపెట్టడానికి దారి తీస్తోంది.

నియాండర్తాల్ జన్యువును లక్ష్యంగా చేసి తయారు చేసిన మందులు తీవ్రమైన కోవిడ్-19 కేసులలో పని చేసినట్లు చెబుతున్నారు.

ఒకరి పై ఒకరికి కలిగిన ఆకర్షణ వలన , ఆకస్మిక వాతావరణ మార్పులు, స్వజాతి వ్యక్తుల మధ్య జరిగిన సంతానోత్పత్తి లాంటి కారణాలు నియాండర్తాల్ జనాభా 40000 సంవత్సారాల క్రితమే అంతరించి పోవడానికి పాక్షికంగా దారి తీసి ఉండవచ్చని ఊహిస్తున్నారు.

ఈ రెండు ఉప జాతులు తీసుకొచ్చిన రెండు రకాల రోగాలు హెచ్ పివి, హెర్పిస్ లాంటి రోగాలు వాటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుని మరింతమందిని కాంటాక్ట్ అవ్వడానికి ఒక కనిపించని అవరోధాన్ని కల్పించాయి.

ఎక్కడైతే అవి అవరోధాలను దాటుకుని వచ్చాయో అక్కడ ఇతర జాతులతో కలిసి సంతానోత్పత్తిని చేశాయి. దాంతో తొలి తరం మానవులు పనికొచ్చే రోగ నిరోధక జన్యువులను పొందారు.

కానీ, నియాండర్తాల్ జాతులకు ఆ అదృష్టం లేదు. వాళ్లకి రోగాల భారం ఎక్కువ ఉన్నట్లయితే ఈ కొత్త రకాల జబ్బులకు వారికి కలిగే ముప్పు ఎక్కువగా ఉండి ఉండేది. కాలక్రమేణా నేటి తరం వారి పూర్వీకులు వారి పరిధిలోకి వీటిని తీసుకుని వెళ్లి అంతం చేశారు.

అలాగే, మిగిలిన కాస్త జనాభాను ఆధునిక మానవులలో కలిపేశామనే వాదన కూడా ఉంది.

అందుకే ఆధునిక మానవులు వారి నుంచి ఎక్కువగా వై క్రోమోజోములను, మైటో కాండ్రియాను పొందారు. వారి డిఎన్ఏ లో కనీసం 20 శాతం నేడు సజీవంగా ఉన్న మనుషులలో కనిపిస్తుంది.

నేడు ఈ వ్యాసం చదువుతున్న వారెవరిలోనైనా రొమేనియాలో కలుసుకున్న జంట జన్యువులు బ్రతికే ఉండి ఉండవచ్చు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)