నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Science Photo Library

    • రచయిత, నికొలాస్ ఆర్. లాంగ్‌రిచ్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

నలభై వేల ఏళ్ల కిందట మనుగడలో ఉన్న నియాండర్తల్స్‌ జాతి ఎలా అంతరించిపోయిందన్నది ఇప్పటికీ అంతుచిక్కని విషయం. అయితే, వారికి, ఆధునిక మానవులకు మధ్య యుద్ధం జరిగిన కారణంగా ఆ జాతి అంతరించిపోయుంటుందా అనే అంశాన్ని జీవ పరిణామ శాస్త్రవేత్త నికొలాస్ లాంగ్‌రిచ్ పరిశీలిస్తున్నారు.

6,00,000 ఏళ్ల కిందట మానవ జాతి రెండు బృందాలుగా చీలిపోయింది. ఒక బృందం ఆఫ్రికాలో ఉండిపోయింది. ఆ బృందం నుంచే మనందరం పరిణామం చెందాం.

రెండో బృందం ఆసియా, ఆ తరువాత యూరోప్ ప్రాంతాల్లో హోమో నియాండర్తలెన్సిస్ అనే జాతిగా పరిణామం చెందింది. వారినే నియాండర్తల్స్ అంటున్నాం. వాళ్లు మన పూర్వీకులు కారు. కానీ మనలాగే ఈ భూమి మీద పరిణామం చెందిన మన తోబుట్టువులు.

నియాండర్తల్స్ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ల గురించి తెలుసుకుంటే మన గురించి మనకు తెలుస్తుంది.

మనం ఎవరం? ఎక్కడినుంచి వచ్చాం? మనం ఇలా పరిణామం చెందడానికి కారణాలేంటి? అనే విషయాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాళ్లు ప్రకృతికి దగ్గరగా, ఒకరితో ఒకరు స్నేహంగా, శాంతియుతంగా జీవించారని భావించడం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అదే నిజమైతే.. ప్రాదేశికత, హింస, యుద్ధం అనేవి ఆధునిక మానవుల ఆవిష్కరణలనే చెప్పుకోవాలి.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

కానీ, జీవశాస్త్రం, పాలియోంటాలజీ (శిలాజాల విశ్లేషణ శాస్త్రం) దీనికి విరుద్ధమైన అంశాలను చెబుతున్నాయి. నియాండర్తల్స్‌ మనం ఊహిస్తున్నట్టు శాంతికాముకులు కాకపోవచ్చు. బహుశా వారు యుద్ధంలో నిష్ణాతులైన యోధులు, ఆధునిక మానవులకు కొరకరాని కొయ్యగా నిలబడిన ప్రత్యర్థులు కావొచ్చు.

జంతువుల్లో ముఖ్యంగా క్రూరమృగాలు, పాలిచ్చి పెంచే జంతువులు ప్రాదేశికతను పాటిస్తాయి. వాటి జాగాలోనికి ఎవ్వరినీ రానివ్వవు. సింహాలు, తోడేళ్లు, మన పూర్వీకులైన హోమో సేపియన్స్, నియాండర్తల్స్‌ వేటాడడంలో ఆరి తేరిన జాతులు. ఆహార గొలుసులో పైన ఉన్న మరికొన్ని జాతులు కూడా వేటాడి జీవించేవే. అంతే కాకుండా, వీటిల్లో కొన్ని గుంపులు కట్టి ఇతర జంతువుల మీద దాడికి వెళ్లేవి.

అలాగే, వేటాడే జాతులన్నీ కూడా ఆహారం సంపాదించుకోవడానికి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. నియాండర్తల్స్‌ కూడా ఇలాంటి పోటీని ఎదుర్కొని ఉంటారు.

మానవుల్లో ఈ ప్రాదేశికతకు లోతైన మూలాలున్నాయనే చెప్పవచ్చు. మనకు సమీప బంధువులైన చింపాంజీలలో కూడా ఈ కారణంగా ఏర్పడే సంఘర్షణలను గమనించొచ్చు. మగ చింపాంజీలు గుంపుగా చేరి తరచుగా ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ వాటిల్లోని మగ జీవాలను చంపుతూ ఉంటాయి. ఈ యుద్ధాలు మనుషుల మధ్య జరిగే యుద్ధాల్లాంటివే.

ఇలా గుంపులుగా దాడికి దిగడం, యుద్ధాలు చెయ్యడం అనేది మనకు, చింపాంజీలకు ఉమ్మడి పూర్వీకులైనవారిలో కనీసం 70 లక్షల సంవత్సరాలకు పూర్వమే అలవడి ఉండొచ్చు.

అదే నిజమైతే, నియాండర్తల్స్ కూడా ఈ సమూహ దాడిని వారసత్వ లక్షణంగా పొంది ఉండొచ్చు.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Alamy

యుద్ధం మానవుని లక్షణాల్లో అంతర్భాగం. ఇదేమీ ఆధునికం యుగంలో కనిపెట్టిన విషయం కాదు. చాలా పురాతనమైనది, మానవుని ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. చరిత్రలో మనుషులందరూ యుద్ధం చేశారు. మన చరిత్ర పుస్తకాలన్నీ యుద్ధాలతోనే నిండిపోయాయి. చరిత్ర పూర్వ యుగంలో జరిగిన యుద్ధాలు, ఆయుధాలు, కోటల గురించి పురావస్తు శాస్త్రం ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది.

యుద్ధం చెయ్యడం మానవ లక్షణం. నియాండర్తల్స్ కూడా మనలాంటి వారే. మనకూ, నియాండర్తల్స్‌కు చాలా పోలికలున్నాయి. పుర్రె, శరీర నిర్మాణం ఒకలాగే ఉంటాయి. మనకూ, వాళ్లకూ డీఎన్ఏలో 99.7% మ్యాచ్ అవుతుంది.

ప్రవర్తనలో కూడా నియాండర్తల్స్‌కూ, మనకూ చాలా పోలికలున్నాయి. వాళ్లు కూడా మనలాగే నిప్పు పుట్టించారు. చనిపోయినవారిని ఖననం చేశారు. సముద్రపు చిప్పలు, గవ్వలు, జంతువుల దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారుచేసి ధరించేవారు. మనలాగే రాతిమీద కళాకృతులను చెక్కారు. మందిరాలు నిర్మించారు.

సృజనాత్మక అంశాల్లో నియాండర్తల్స్‌కు, మనకూ ఇన్ని పోలికలున్నప్పుడు, విధ్వంసక ప్రవృత్తిలో కూడా పోలికలు ఉండే ఉంటాయి.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

నియాండర్తల్స్‌ జీవితాలు ఎలా ఉండేవో పూర్తిగా తెలియకపోయినా శాంతియుతంగా మాత్రం లేవని పురావస్తు పరిశోధనలు ధ్రువీకరిస్తున్నాయి.

నియాండర్తల్స్‌ మంచి నైపుణ్యం కలిగిన వేటగాళ్లు. జింకలు, కొండ గొర్రెలు, కణుజులని పిలిచే పెద్ద పెద్ద దుప్పిలు, అడవి దున్నలు, ఖడ్గ మృగాలు, మామత్ ఏనుగులను వేటాడడానికి పదునైన ఈటెలను ఉపయోగించేవారు.

వారి కుటుంబాల మీద, నివసించే ప్రాంతాల మీద ఎవరైనా దాడికి దిగితే వారు తయారు చేసుకున్న పదునైన ఆయుధాలను ఉపయోగించకుండా ఉంటారని అనుకోలేం. ఇలాంటి సంఘర్షణలు ఆ కాలంలో తరచుగా జరుగుతుండేవని పురావస్తు శాస్త్రం చెబుతోంది.

చరిత్ర పూర్వ యుగంలో యుద్ధాలను గమనిస్తే దుడ్డు కర్రలతో బలంగా తలపై మోది చంపడం పరిపాటి అనే విషయం బోధపడుతుంది. హోమో సేపియన్స్ అదే చేసేవారు... కర్రలతో బలంగా తలపై బాది పుర్రె పగలగొట్టేవారు. నియాండర్తాల్స్‌ కూడా అదే పద్ధతిలో యుద్ధాలు చేసేవారని మనం భావించొచ్చు.

మరో పద్ధతి చేతులు విరగ్గొట్టడం. నియాండర్తాల్స్‌ అవశేషాల్లో చేతులు విరిగిన గుర్తులు అనేకం బయటపడ్డాయి. ఇరాక్‌లోని శనిదార్ గుహల్లో బయటపడిన కనీసం ఒక నియాండర్తల్స్‌ గుండెల్లో ఈటె బాగా లోతుగా గుచ్చుకోవడంతో చనిపోయినట్లు స్పష్టమవుతోంది.

తీవ్ర గాయాలు, మరణాలు నియాండర్తల్స్‌ జాతి మగవారిలో సర్వ సాధారణం. కొన్ని గాయాలను పరిశీలిస్తే వేటాడుతున్నప్పుడు తగిలి ఉండొచ్చు అనిపిస్తుంది. కానీ కొన్ని గాయాల ఆనవాళ్లు చూస్తే స్థానిక ఆదివాసీ జాతుల మధ్య హోరాహోరీగా, గెరిల్లా పద్ధతిలో మెరుపుదాడి చేస్తూ, దీర్ఘకాలం కొనసాగించిన యుద్ధాల్లో తగిలినట్లు స్పష్టమవుతోంది.

ఆయా సమూహాలు నివసించే ప్రదేశాల సరిహద్దులు విస్తరించిన లేదా కుంచించుకుపోయిన జాడలనుబట్టి అక్కడ యుద్ధాలు జరిగాయన్న విషయం మనకు తెలుస్తుంది.

నియాండర్తల్స్, ఆధునిక మానవులతో యుద్ధాలు చేయ్యడమే కాక అందులో రాణించారనడానికి ఒక ఉత్తమమైన సాక్ష్యం ఏమిటంటే... నియాండర్తల్స్‌ను ఆధునిక మానవులు కలిసిన వెంటనే, వారు ఓటమిని అంగీకరించలేదు.

సుమారు 1,00,000 సంవత్సరాలు ఆధునిక మానవుల విస్తరణను ప్రతిఘటిస్తూ వచ్చారు.

లేకపోతే, ఆఫ్రికా వదిలిపెట్టి మిగతా భూభాగానికి చేరడానికి ఆధునిక మానవులకు ఎందుకంత సమయం పట్టింది? వాతావరణం అనుకూలించపోవడం వలన కాక, ఆసియా, ఐరోపా ప్రాంతాల్లో నియాండర్తల్స్ ప్రతిఘటిస్తూ వస్తుండడం వలన జరిగింది అనుకోవచ్చు.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

నియాండర్తల్స్, ఆధునిక మానవులు కలిసిమెలిసి స్నేహంతో, శాంతియుతంగా జీవించారని భావించడం సత్యదూరమే అవుతుంది. ఏది చేసినా, చెయ్యకపోయినా పెరుగుతున్న జనాభా, మానవులను అనివార్యంగా ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకోడానికి పురికొల్పుతుంది.

వేటాడి, పిల్లాపాపలకు ఆహారాన్ని సమకూర్చడానికి సరిపోయినంత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికే ప్రయత్నించి ఉంటారు. అయితే దూకుడుగా యుద్ధాలు చేసి గెలవడం అనేది పరిణామక్రమంలో నేర్చుకున్న వ్యూహం అయి ఉంటుంది.

అయినప్పటికీ, కొన్నివేల ఏళ్లు ఆధునిక మానవులు, నియాండర్తాల్స్ యుద్ధవీరులకు పరీక్షగా నిలిచి ఉంటారు. మరి కొన్ని వేల ఏళ్లు వాళ్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోయి ఉంటారు. ఆయుధాలు, వ్యూహాలు, ఎత్తుగడల్లో రెండు జాతులూ సరిసమానమైన నైపుణ్యత కలిగి ఉన్నప్పటికీ కొన్నేళ్ళు గెలవడం, కొన్నేళ్లు ఓడిపోవడం జరిగి ఉంటుంది.

అయితే, నియాండర్తల్స్‌కు మనకన్నా మెరుగైన వ్యూహాత్మక ప్రయోజనాలు ఉండి ఉండవచ్చు. వాళ్లు మధ్యప్రాచ్యాన్ని కొన్ని వేల ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నారు.

అక్కడి వాతావరణ పరిస్థితులు, భూభాగం, సరిహాద్దులు, చెట్లు చేమలు, జంతువుల గురించి మనకన్నా వాళ్లకు బాగా తెలుసు. భీకరమైన ఆకారం, బలమైన శరీరాలతో యుద్ధాల్లో వాళ్లు విధ్వంసాన్ని సృష్టించి ఉండుండొచ్చు.

వారికి పెద్ద పెద్ద కళ్లు ఉండడంతో చీకటి సమయాల్లో కూడా స్పష్టంగా చూడగలుగుతూ, యుక్తితో మెరుపుదాడులు చేస్తూ ఉండేవారని భావించవచ్చు.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

చిట్టచివరికి, వారి శక్తియుక్తులు, ప్రతాపాలు ముగింపుకు వచ్చి, ఆధునిక మానవుల చేతిలో ఓడిపోయారనుకోవచ్చు. ఎందుకు అనేది మనకు తెలీదు.

బహుశా ఆధునిక మానవులు మెరుగైన ఆయుధాలను కనిపెట్టి ఉండడం వలన కావొచ్చు. బాణాలు, ఈటెలను దూరంగా విసిరి కొట్టగలిగే సాధనాలు, దూరంగా విసరగలిగే కర్రలు మొదలైనవాటితో శారీరకంగా బలహీనమైన ఆధునిక మానవులు... భీకరాకృతి కలిగిన నియాండర్తల్స్‌ను దూరంనుంచీ గురి చూసి కొట్టి మట్టుపెట్టి ఉండొచ్చు. ఢీ కొట్టి పారిపోవడంలాంటి వ్యూహాలను అమలుచేసి ఉండొచ్చు.

లేదా, ఆధునిక మానవులు వేటాడంలోనూ, సాంకేతికతను మెరుగుపరుచుకోవడంలో ఎక్కువ ప్రావీణ్యతను సాధించి తమ జాతిని వృద్ధి పరచుకుంటూ, సంఖ్యాపరంగా పైచేయి సాధించి ఉండవచ్చు.

నియాండర్తాల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఆదిమ మానవులు (హోమో సేపియన్స్) 2,00,000 సంవత్సరాలకు పూర్వమే ఆఫ్రికా నుంచి బయటకు వచ్చినా, నియాండర్తల్స్‌ నివసించిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి 1,50,000 సంవత్సరాలకి పైనే పట్టింది.

ఇజ్రాయెల్, గ్రీస్‌లలో పురాతన హోమో సేపియన్లు, నియాండర్తల్స్‌ యుద్ధ వ్యూహాలకు వెనక్కు తగ్గక తప్పలేదు. కానీ 1,25,000 సంవత్సరాలకు పూర్వం నుంచీ మొదలైన యుద్ధాల్లో ఆధునిక హోమో సేపియన్లు, నియాండర్తల్స్‌ను మెల్లిమెల్లిగా తుడిచిపెట్టేశారు.

నియాండర్తల్స్‌, ఆధునిక మానవులకన్నా బలహీనమైనవారని లేదా శాంతికాముకులని అనుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. కొన్ని లక్షల సంవత్సరాల కాలంగా జరిగిన యుద్ధాల్లో అంతిమంగా ఆధునిక మానవులు గెలిచారు. నియాండర్తాల్స్‌ అంతరించిపోయారు. బహుశా చివరికొచ్చేసరికి యుద్ధాల్లో ఆధునిక మానవులు, నియాండర్తల్స్‌కన్నా ఎక్కువ ప్రావీణ్యం సంపాదించడం వలన కావొచ్చు.

(ఈ వ్యాసం మొదటగా ‘ది కాన్వర్జేషన్‌’లో ప్రచురితమయ్యింది. క్రియేటివ్ కామన్ లైసెన్స్ కింద పునః ప్రచురితమైంది.)

(నికొలాస్ ఆర్. లాంగ్‌రిచ్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో జీవ పరిణామ శాస్త్రం, పాలియోంటాలజీ (శిలాజాల విశ్లేషణ శాస్త్రం)ల్లో సీనియర్ అధ్యాపకులు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)