‘కఫాలా’ వ్యవస్థలో మార్పులు చేస్తున్న సౌదీ అరేబియా... వలస కార్మికులకు నిజంగా మేలు జరుగుతుందా?

ఫొటో సోర్స్, FAYEZ NURELDINE
వలస కార్మికులపై వారిని నియమించుకున్నవారికి నియంత్రణ ఉండేలా ఇప్పటివరకూ అమలవుతున్న ‘కఫాలా’ వ్యవస్థకు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
ఈ మార్పులు వల్ల దాదాపు కోటి మంది వలస కార్మికులకు ఊరట దక్కుతుందని భావిస్తున్నారు.
కఫాలా వ్యవస్థలో ఇదివరకు ఉన్న కొన్ని ఆంక్షలను తీసేస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా అక్కడ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులు ఉద్యోగం మారడానికి ఇకపై యజమాని అంగీకారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యజమాని అంగీకారం లేకుండా, దేశం విడిచి కూడా వారు వెళ్లొచ్చు.
పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అరేబియా చెబుతోంది.
సౌదీ ప్రకటనను మానవహక్కుల కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఈ ఆంక్షలు తొలిగితే, కార్మికులపై వేధింపులు తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే, కఫాలా వ్యవస్థలో కొన్ని భాగాలు అలాగే కొనసాగనున్నాయని, దీన్ని మొత్తంగానే ఎత్తివేయాల్సిన అవసరం ఉందని మానవ హక్కుల కార్యకర్త ఒకరు అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
మార్చి నుంచి అమలు
కఫాలా వ్యవస్థలో తెస్తున్న మార్పులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వర్తిస్తాయని, మార్చిలో ఇవి అమల్లోకి వస్తాయని సౌదీ మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలిపింది.
కఫాలా వ్యవస్థ ప్రకారం ఇదివరకు సౌదీలో పనిచేస్తున్న విదేశీయులు ఉద్యోగం మారాలన్నా, ఆ దేశం విడిచి వెళ్లిపోవాలన్నా యజమాని అంగీకారం తప్పనిసరి. ప్రధానంగా ఈ ఆంక్షనే ఇప్పుడు తీసేయబోతున్నారు.
ఇక ప్రభుత్వ సేవల కోసం వలస కార్మికులు నేరుగా ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టుకోవచ్చు. యాజమాన్యంతో ఉన్న వారి సర్వీసు కాంట్రాక్టులన్నీ ఆన్‌లైన్‌లో పెట్టబోతున్నారు.
''దేశంలో మెరుగైన శ్రామిక మార్కెట్ ఉండాలని మేం కోరుకుంటున్నాం. కార్మికులకు పని వాతావరణం మెరుగుపడాలి'' అని సౌదీ అరేబియా మానవవనరుల శాఖ ఉపమంత్రి అబ్దుల్లా బిన్ నసీర్ అబుధునాయన్ అన్నారు.
శ్రామిక చట్టాల్లో చేస్తున్న ఈ మార్పులు విజన్-2030లో భాగంగా తమ దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు.
చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, మిగతా రంగాల్లోనూ వృద్ధి చెందాలని విజన్-2030లో లక్ష్యంగా సౌదీ పెట్టుకుంది.

ఫొటో సోర్స్, AFP
‘ఇళ్లలో పనిచేసేవారికి వర్తించదు’
సౌదీ చెబుతున్న ఈ ఆంక్షలు తొలగినా, శ్రమ దోపిడీకి ఇంకా కఫాలా వ్యవస్థలో ఇంకా అవకాశాలు ఉంటాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సీనియర్ పరిశోధకురాలు రోథానా బేగమ్ అంటున్నారు.
''ఉద్యోగం వెతుక్కునేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాలంటే ఇకపైనా స్పాన్సర్ అవసరం ఉంటుంది. ఉద్యోగుల నివాస అనుమతిని కొనసాగించడమైనా, ఎప్పుడంటే అప్పుడు రద్దు చేయడమైనా నిర్ణయం యజమాని చేతుల్లోనే ఉంటుంది. అంటే, ఉద్యోగులు ఇంకా యజమాని నియంత్రణలోనే ఉంటారు'' అని ఆమె అన్నారు.
''విదేశాల నుంచి వచ్చి సౌదీలోని ఇళ్లలో పనిచేస్తున్నవారికి ఈ ఆంక్షల మినహాయింపు వర్తించదు. శ్రమ దోపిడీ, వేధింపుల ముప్పు వారికే చాలా ఎక్కువ'' అని రోథానా అన్నారు.
''ఇళ్లలో పనిచేసేవారికి కనీస విశ్రాంతి ఇవ్వకుండా గంటలు గంటలు ఎలా పనిచేయించుకుంటారో హ్యూమన్ రైట్స్ వాచ్ ఇదివరకు నివేదికలో వెల్లడించింది. సమయానికి వారికి వేతనాలు ఇవ్వరు. ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వరు. కొందరు ఉద్యోగులు శారీరక, లైంగిక హింస కూడా ఎదుర్కొంటున్నట్లు ఆ నివేదిక బయటపెట్టింది. సౌదీలో ప్రభుత్వం దగ్గర లెక్కకు రాని కార్మికులు లక్షల సంఖ్యలో పనిచేస్తున్నారు. ఆంక్షల్లో మార్పుల వల్ల వారికి ప్రయోజనం ఉంటుందా అన్నది చెప్పలేదు'' అని ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- జో బైడెన్, డోనల్డ్ ట్రంప్: ఏడు దశాబ్దాల వీరి జీవిత ప్రయాణాలు ఎలా సాగాయంటే...
- పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజేత ఎవరో కోర్టులు నిర్ణయించగలవా?
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- మూడుసార్లు ఉరికంబం వరకు తీసుకెళ్లినా ఆయన్ను ఉరి తీయలేకపోయారు
- ‘భారతదేశ ప్రజలు చక్కెర ఎక్కువగా తినాల’ని సుగర్ మిల్స్ సంఘం కోరుతోంది.. ఎందుకంటే...
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఆరిజోనాలో ముందంజలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిరాల్ తిపిర్నేని ఎవరు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








