అమెరికా ఎన్నికల ఫలితాలు: విజేత ఎవరో కోర్టులు నిర్ణయించగలవా?

మిచిగన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసన తెలుపుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిచిగన్‌లో ట్రంప్ మద్దతుదారులు నిరసన తెలుపుతున్నారు

అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు గెలుచుకోనున్నారో ఇంకా స్పష్టత లేదు. ఇంతలోనే ఈ మొత్తం ప్రక్రియ విషయంలో చట్టబద్దమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తుంటే డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు పథంలో వెళుతుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి, దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రాలలో జరుగుతున్న ఓట్ల లెక్కింపును సవాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం జరగవచ్చు?

ఎటువంటి ఆధారాలు లేకుండా ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, మిషిగన్ రాష్ట్రాలలో కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ పోటీ ఇలాగే కొనసాగితే ఏం జరుగుతుందనే అంశంపై బీబీసీ న్యాయ నిపుణులతో మాట్లాడింది.

Section divider

ఈపాటికే ఫలితాలు తేలాలి కదా?

సాధారణంగా ఎన్నికల ఫలితాలు ఎవరైనా అభ్యర్థి గెలుపు వైపు ఉన్నట్లు చూపిస్తే, చాలా వరకు అమెరికాలోని అగ్ర సంస్థలు విజేతను ప్రకటించేస్తాయి.

ఇది సాధారణంగా ఓటింగ్ జరిగిన మరుసటి రోజు తెల్లవారు జాము కల్లా తెలిసిపోతుంది.

అయితే, ఇవి అధికారిక ఫలితాలు కాదు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే. అధికారిక ఫలితాలు లెక్కించడానికి కొన్ని రోజులు పడుతుంది.

Vote counters round a desk

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చాలా ఓట్లు లెక్కించారు.. కానీ విజేతను తేల్చటానికి చాలా సమయం పట్టవచ్చు

అయితే, ఈ సంవత్సరం భారీగా జరిగిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ వలన లెక్కింపు ఆలస్యం అవుతోంది.

ముఖ్యంగా కీలక రాష్ట్రాలలో ఈ ఆలస్యం తలెత్తుతోంది. పోస్టల్ ఓటింగ్ లో ప్రతీ ఓటును అన్ని ఆధారాలతో సరి చూసిన తర్వాతే పరిగణనలోకి తీసుకుంటారు.

ఒకవేళ పోటీ హోరాహోరీగా ఉండి.. ఇద్దరిలో ఎవరూ ఓటమిని ఒప్పుకోకపోతే.. ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉండటం సాధారణమేనని ‘బైపార్టిసన్ పాలసీ రీసెర్చ్ సెంటర్’లో ఎలక్షన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాత్యు వీల్ చెప్పారు.

Section divider

ఓటింగ్ కంటే ముందే అవాంతరాలు

ఈసారి అమెరికా ఎన్నికలు ఇప్పటికే ఒక న్యాయవివాదాల ప్రక్రియగా మారాయి.

మంగళవారం ఎన్నికలు మొదలవ్వక ముందు నాటికే ఈ సంవత్సరం ఎన్నికలలో జరుగుతున్న ముందస్తు ఓటింగు, పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ, ఇతర ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి 44 రాష్ట్రాలలో 300 పైగా కేసులు నమోదయ్యాయి.

ఓటింగ్‌లో అక్రమాలను నిరోధించేందుకు కొన్ని నిబంధనలు అవసరమని రిపబ్లికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజలను తమ హక్కులు వినియోగించుకోకుండా చేసేందుకే ఈ ప్రయత్నాలని డెమోక్రాట్లు ఆరోపించారు.

Section divider

ట్రంప్ విసిరిన సవాళ్ళు ఏమిటి?

విస్కాన్సిన్

విస్కాన్సిన్‌లో ఓటింగ్ అక్రమాలు జరిగాయని, కాబట్టి అక్కడ ఓట్లను తిరిగి లెక్కించాలని ట్రంప్ వర్గం అభ్యర్థిస్తోంది. ఇది జరుగుతుందో లేదో తెలియదు. ఒక వేళ అలా జరగాలంటే నవంబరు 17 లోగా జరగాలి.

మిషిగన్

2016 ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ట్రంప్ కేవలం 10,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపును ఆపాలని కోర్టులో కేసు వేస్తామని ట్రంప్ వర్గం ప్రకటించింది. కానీ, అప్పటికే 96 శాతం లెక్కింపు పూర్తయింది.

రాష్ట్రంలో సంప్రదాయంగా డెమోక్రాట్లకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలలో ఓట్ల లెక్కింపు ఇంకా జరగాల్సి ఉంది. అయితే.. బైడెన్ విజయానికి దగ్గరగా ఉన్నారని కొన్ని అమెరికా సంస్థలు, బీబీసీ అంచనా వేస్తున్నాయి.

Election officials looking at absentee ballots

ఫొటో సోర్స్, Getty Images

పెన్సిల్వేనియా

ఈ రాష్ట్రంలో ఓటు వేసిన మూడు రోజుల తర్వాత కేంద్రానికి చేరే ఓట్ల లెక్కింపును చేపట్టాలా వద్దా అనే అంశం.. ఆ రాష్ట్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో రిపబ్లిక్ మద్దతుదారులు విన్నపాలు చేస్తున్నారు.

ఈ రాష్ట్రంలో ఏవైనా ఓట్లు శుక్రవారం వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరకపోతే వాటిని లెక్కింపులోకి తీసుకోకపోవచ్చునని వీల్ ఆందోలన వ్యక్తం చేశారు. అలా జరిగితే అక్కడ ఫలితం తప్పయ్యే అవకాశం ఉందన్నారాయన.

అయితే, ఇలా ఆలస్యంగా చేరే ఓట్లను వేరేగా లెక్కిస్తారని కొలంబియా యూనివర్సిటీలో న్యాయ శాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ బ్రిఫాల్ట్ చెప్పారు. కానీ, వీటి లెక్కింపు కన్నా ముందే బైడెన్ కనుక ఎక్కువ స్థానాలను సంపాదించుకోగలిగితే న్యాయపరంగా దీనిని ఎదుర్కోవల్సిన అవసరమే లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో ట్రంప్ వర్గీయులు విజయాన్ని ప్రకటించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షలకు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉంది. అయితే, ఇక్కడ విజేత ఎవరో అమెరికాలో అగ్ర సంస్థలేవీ ప్రకటించలేదు.

జార్జియా

జార్జియాలో ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని రిపబ్లికన్లు, ట్రంప్ వైపు ప్రచారం చేస్తున్న కార్యకర్తలు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపును ఆపాలని కోరుతూ న్యాయస్థానంలో కేసు వేశారు.

protesters holding signs saying every vote counts

ఫొటో సోర్స్, Getty Images

ఇది సుప్రీంకోర్టు వరకు వెళుతుందా?

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ కూడా బుధవారం వ్యాఖ్యానించారు.

ఇప్పటికే అమెరికాలో వోటింగ్ ప్రక్రియ ముగిసింది.

అయితే, చట్టబద్ధమైన ఓటింగ్ లెక్కింపును ఆపే ప్రత్యేక అధికారాలేవీ సుప్రీంకోర్టుకు లేవని వేల్ అంటారు.

ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టుకు తీసుకుని వెళ్లే నిర్ణీత విధానాలేవి లేవని ఇది చాలా అసాధారణమని ప్రొఫెసర్ బ్రిఫాల్ట్ అన్నారు.

ఒకవేళ ఎన్నికల ఫలితాలను సవాలు చేయవలసివస్తే ఆ ఫలితాలను న్యాయ నిపుణుల బృందం ఆయా రాష్ట్రాల కోర్టులలో తేల్చుకోవలసి ఉంటుంది.

దానిపై ఆయా రాష్ట్రాల కోర్టుల న్యాయమూర్తులు ఓట్లను తిరిగి లెక్కించటం మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయాన్ని కాదనే అధికారం తిరిగి సుప్రీంకోర్టు జడ్జీలకు ఉంటుంది.

Section divider

ఇది ఎన్ని రోజులు పట్టవచ్చు?

ఇది అధ్యక్ష పీఠానికి జరుగుతున్న పోటీ కావడం వలన ఈ ప్రక్రియ ముగియడానికి రాజ్యాంగపరంగా కొన్ని నిర్ణీత గడువులు ఉంటాయి.

  • రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థిని ప్రకటించడానికి నవంబరు మూడో తేదీ మొదలుకుని ఐదు వారాల సమయం ఉంటుంది. దీనినే సేఫ్ హార్బర్ డెడ్‌లైన్ అంటారు. ఈ సంవత్సరం ఆ గడువు డిసెంబరు 08తో ముగుస్తుంది.
  • ఈ తేదీ నాటికి రాష్ట్రాలు ఎవరిని ఎన్నుకుంటున్నారో నిర్ణయించుకోలేకపోతే, అధ్యక్షుడిని ఎలక్టరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.
  • డిసెంబరు 14వ తేదీన రాష్ట్రాల నుంచి ఎన్నికైన అభ్యర్థులు ఆ యా రాష్ట్రాలలో ఓటు వేసేందుకు కలుస్తారు.
  • జనవరి 06 నాటికి కూడా విజేత ఎవరో స్పష్టత లేని పక్షంలో ఫలితాన్ని కాంగ్రెస్ నిర్ణయిస్తుంది.
  • ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటే.. సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. దీనివలన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది.
  • ప్రతి రాష్ట్ర బృందానికి ఒక ఓటు ఉంటుంది. అందులో 26 బృందాలను గెలుచుకున్న వారు కొత్త అధ్యక్షుడిగా నియమితులవుతారు.

ఇలా అధ్యక్షుడిని ఎన్నుకునే పరిస్థితి రావాలంటే మొత్తం ప్రక్రియలో చాలా సమస్యలు తలెత్తాల్సి ఉంటుందని వేల్ అన్నారు.

ఇలా జరిగితే మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దు చేసినట్లే అర్ధమని ఆయన పేర్కొన్నారు.

Section divider

రాష్ట్రాలు విజేతను ఎందుకు ప్రకటించవు?

తమ ఎలక్టోరల్ ఓట్లు ఎవరికి చెందుతాయనే దాన్ని రాష్ట్రాలు అంగీకరించకపోతే ఏమవుతుంది?

లెక్కించిన ఓట్ల సంఖ్య తప్పు అని లేదా రిగ్గింగ్ జరిగిందని ఓ పార్టీ ఆరోపిస్తే, రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురుకావచ్చు.

కీలక రాష్ట్రాలైన నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్‌ లలో ప్రస్తుతం విభజిత ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో గవర్నర్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు ఉంటే శాసనసభల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులు ఎక్కువగా ఉన్నారు.

శాసన సభ్యులు, గవర్నర్లు తమకు ఇష్టమైన వారి పేర్లను ఎవరికి వారే విడిగా కాంగ్రెస్‌కి ఇవ్వవచ్చు. ఇలా 1876 లో జరిగింది. ఎవరి ఓట్లను లెక్కించాలో, పరిగణనలోకి తీసుకోవాలో కాంగ్రెస్ నిర్ణయించాల్సి ఉంటుంది.

ఈ అంశంపై హౌస్, సెనేట్ రెండూ అంగీకరిస్తే సమస్య ఉండదు. వీరిద్దరూ ఈ అంశంపై విభజితమయితే మళ్ళీ నడిసంద్రంలో చిక్కుకున్నట్లే ఉంటుంది. అయితే, ఫెడరల్ చట్టాలు మాత్రం గవర్నర్ ఎంపిక చేసిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.

Section divider

తుది గడువు

ఈ ఎన్నికల ప్రక్రియ ఎన్ని మలుపులు తిరిగినా జనవరి 20 వ తేదీకల్లా అమెరికా కొత్త అధ్యక్ష పదవీ కాలం మొదలవ్వాలని అమెరికా రాజ్యాంగం చెబుతోంది.

ఇలాంటి సమస్య గతంలో తలెత్తిందా?

2000 సంవత్సరంలో జార్జి బుష్, అల్ గోర్ మధ్య జరిగిన పోటీలో విజేతను సుప్రీంకోర్టు నిర్ణయించింది.

ఎన్నికల రోజు గోర్ ప్రజల ఓట్లను గెలుచుకున్నారు. కానీ, ఎలక్టరల్ కాలేజిలో పరిస్థితి పోటాపోటీగా ఉంది. ఫ్లోరిడాకు చెందిన 25 ఓట్లపై ఫలితం ఆధారపడింది.

ఆ రాష్ట్రంలో నాలుగు కౌంటీలలో ఓట్లను రీకౌంట్ చేయాలని గోర్ బృందం కోరింది. నాలుగు వారాల తర్వాత సుప్రీంకోర్టు బుష్‌కి అనుగుణంగా తీర్పు వెలువరించింది.

అల్ గోర్ ఒప్పుకున్నారు. బుష్ అధ్యక్షుడయ్యారు.

1876లో ఒకసారి 1824 లో మరొకసారి ఎన్నికల్లో ఫలితం తేలకపోతే రాజ్యాంగం ప్రకారం ఇతర పద్ధతుల్లో విజేతను నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)