పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్: ‘లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు’

ఫొటో సోర్స్, Akhil Karthikeyan
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అన్యోన్యంగా ఉంటూ ఫొటోషూట్ చేయించుకున్న ఒక భారతీయ యువ జంట ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.
కానీ, తాము ఆ ఫొటోలను తొలగించేది లేదని, తీసేస్తే వారి బెదిరింపులకు భయపడినట్లు అవుతుందని ఆ జంట బీబీసీకి చెప్పింది.
ఈ ఫొటోల్లో లక్ష్మి, హృషి కార్తిక్ పచ్చటి టీ తోటల్లో శరీరానికి తెల్లని వస్త్రాలు చుట్టుకుని నవ్వుతూ, హత్తుకుంటూ, ఒకరి వెనక ఒకరు పరిగెత్తుతూ కనిపిస్తారు.
ఈ జంట సెప్టెంబర్‌లో ఏ హడావుడీ లేకుండా పెళ్లి చేసుకుంది.
పెళ్లి ఘనంగా చేసుకోలేకపోయామనే లోటు తీర్చుకునేందుకు, ఎప్పటికీ నిలిచిపోయేలా ఒక మెమరబుల్ పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ జంట చెప్పింది.
"మాది అరేంజ్డ్ కమ్ లవ్ మారేజ్. మా కుటుంబాలు గత ఏడాదే పరిచయం అయ్యాయి. తర్వాత మేం కలిశాం, వెంటనే ప్రేమలో పడిపోయాం" అని లక్ష్మి నాకు ఫోన్లో చెప్పారు.
ఆమె కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉంటారు. లక్ష్మి ఇంజనీరింగ్ పూర్తి చేయగా, ఆమె భర్త హృషి ఒక టెలికాం కంపెనీలో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Akhil Karthikeyan
ఈ జంట మొదట ఏప్రిల్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్లు చల్లింది.
మార్చి చివర్లో భారత్‌లో కరోనా వ్యాపించకుండా దేశవ్యాప్తంగా కఠిన లాక్‌డౌన్ అమలు చేశారు. తర్వాత అన్- లాక్ మొదలవగానే తక్కువ మంది హాజరయ్యేలా వివాహాలకు అనుమతించారు.
హృషి, లక్ష్మి కూడా సెప్టెంబర్ 16న వధువు స్వస్థలం కొల్లంలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
"పెళ్లి చాలా సరదాగా, సంతోషంగా జరిగింది. కానీ మా కుటుంబాలు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే దానికి వచ్చారు. పోలీసులు 50 మందికే అనుమతి ఇచ్చారు. చాలా ఆంక్షలు పెట్టార"ని లక్ష్మి చెప్పారు.
పెళ్లి నిరాండబంరగా జరగడంతో, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్ అయినా చేయించుకోవాలని వాళ్లు అనుకున్నారు.
కేరళలో, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నో జంటలు సంప్రదాయ ఫొటోషూట్లకు మరింత వైవిధ్యాన్ని జోడిస్తూ తమ వివాహం గురించి ప్రపంచానికి చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Akhil Karthikeyan
హృషి తమ పోస్ట్ వెడ్డింగ్ ఫొటోషూట్ శృంగారభరితంగా, అన్యోన్యంగా ఉండాలనుకున్నారు. ఇంటర్నెట్‌లో వెతికిన ఆయన దానికి ఒక మంచి ఐడియా కూడా సిద్ధం చేసుకున్నారు. హృషి స్నేహితుడు, ఫొటోగ్రాఫర్ అఖిల్ కార్తికేయన్ ఈ ఫొటోలు తీశారు.
దానికి కొన్ని గంటలే పట్టిందని వారు నాకు చెప్పారు. తాము ఉంటున్న టీ తోటలోని హోటల్ రూం నుంచి వారు కొన్ని కంఫర్టర్స్ తీసుకున్నారు. ఆ పచ్చటి టీ తోటలే ఆ ఫొటోషూట్‌కు నేపథ్యంగా మారాయి.
"అది చాలా సరదాగా నడిచింది. ఆ సమయంలో హాయిగా నవ్వుకున్నాం. చాలా ఉద్వేగంగా కూడా అనిపించింది. అదంతా మా హనీమూన్‌లో భాగంగా జరిగింది. మేం అంతకు ముందే పెళ్లి చేసుకున్నాం. చాలా ఫ్రీగా అనిపించింది. కానీ, అది మాకు ఇన్ని సమస్యలు సృష్టిస్తుందని అనుకోలేదు" అన్నారు లక్ష్మి.
అఖిల్ ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన రెండు రోజులకే సమస్య మొదలైంది.
ఫొటోలు అసహ్యంగా, నీచంగా, సిగ్గుపడేలా ఉన్నాయని ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు ‘మీరు పోర్నోగ్రఫీకి, కండోమ్ ప్రకటనలకు సరిపోతార’ని కామెంట్ చేశారు. కొంతమంది ‘మీరు రూమ్ తీసుకోండ’ని వారికి సలహా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Akhil Karthikeyan
"మమ్మల్ని రెండు రోజులు దారుణంగా తిట్టారు. మేం నగ్నత్వాన్ని చూపిస్తున్నామన్నారు. లోపల అసలు బట్టలేసుకున్నారా అని అడిగారు. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నామని విమర్శించారు. అది నాకు చాలా భయంకరంగా అనిపించింది, వాళ్లు నన్ను దారుణంగా వేధించారు. పోర్న్ సినిమాల్లో నటించమని చెప్పారు. నన్ను బాడీ షేమ్ చేశారు " అన్నారు లక్ష్మి.
"ట్రోల్ చేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. వాళ్లు నేను మేకప్‌లో లేని నా పాత ఫొటోలు తీసుకుని, వీటితో పోల్చడం మొదలెట్టారు. ఈ ఫొటోల్లో తను ఎంత అసహ్యంగా ఉందో చూడండని కామెంట్లు పెట్టార"ని చెప్పారు.
కానీ, కొన్ని రోజుల తర్వాత ట్రోల్స్ తో పాటూ ఈ జంటకు మద్దతుగా నిలిచేవారి సంఖ్య కూడా పెరిగింది. వారిలో చాలా మంది ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని, వాటిని విమర్శిస్తూ వచ్చిన కామెంట్లను పట్టించుకోవద్దని పోస్టులు చేశారు.
ఒక పెళ్లైన జంట చేతులు పట్టుకున్నందుకే తిట్లు తినాల్సి వచ్చిందని ఒక ఘటనను గుర్తు చేసిన ఒక మహిళ ఈ ట్రోల్స్ పట్టించుకోవద్దని సంతోషంగా ఉండాలని సలహా ఇచ్చారు.
"ఎవరు తిడుతున్నారు, ఎవరు విమర్శిస్తున్నారో మనకు తెలీదు. మాకు మద్దతుగా మాట్లాడేవారు ఎవరనేది కూడా మాకు తెలీదు. కానీ, అది మాకు సంతోషం కలిగించింది" అంటారు లక్ష్మి.

ఫొటో సోర్స్, Akhil Karthikeyan
సోషల్ మీడియాలో తెలీని వారి నుంచే కాదు, ఈ జంట బంధువుల్లో కొందరికి కూడా వారి ఫొటోషూట్ నచ్చలేదు.
"మొదట మా అమ్మనాన్నలు కూడా షాక్ అయ్యారు. కానీ, మేం అలా ఎందుకు చేయాలనుకున్నామో వాళ్లకు వివరంగా చెప్పాం. వాళ్లు అర్థం చేసుకుని, మాకు అండగా నిలిచారు. కానీ మా బంధువుల్లో చాలామంది పాశ్చాత్య పోకడలని తిట్టారు. మాకు ఫోన్ చేసి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి, మన సంస్కృతిని మర్చిపోయారా అన్నార"ని లక్ష్మి చెప్పారు.
చాలా మంది ఈ జంటకు ఆ ఫొటోలు తొలగించాలని కూడా సలహా ఇచ్చారు. ఫామిలీ వాట్సప్ గ్రూపుల్లోంచి లక్ష్మి, హృషిలను తీసేశారు. కానీ, ఆ ఫొటోలను తొలగించకూడదని నిర్ణయించుకున్నట్లు ఆ జంట చెప్పింది.
"అలా చేస్తే, మేం ఏదో తప్పు చేశామని ఒప్పుకున్నట్టు అవుతుంది. కానీ, మేం ఏ తప్పూ చేయలేదు. మేం లోపల బట్టలు వేసుకున్నాం. ఈ విమర్శలు ఎదుర్కోవడం మొదట్లో కష్టంగా అనిపించింది. కానీ, ఇప్పుడు మేం వాటికి అలవాటు పడిపోయాం" అన్నారు లక్ష్మి.
"సమాజం ఎలా ఉంటుందో తెలిసింది. దానితో కలిసి జీవించడం మేం నేర్చుకున్నాం" అని కూడా చెప్పారు లక్ష్మి
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్కు మందు కనిపెట్టడంలో దారి చూపుతున్న 14 ఏళ్ల తెలుగమ్మాయి
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- "మేం దళితులం కాబట్టి.. మా శవాలకు కూడా దిక్కులేదు.. ఇతరులెవరికీ ఇలాంటి పరిస్థితి ఉండదేమో"
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులేమిటి? ఏయే చార్జ్షీట్లలో ఏముంది?
- అంబేడ్కర్, శివాజీ విగ్రహాల ఏర్పాటుపై వివాదం.. దళితులు, ముదిరాజ్‌ల మధ్య ఘర్షణ
- దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏది కర్ణాటకా.. తమిళనాడా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








