భారతీయులు ఇంకా ఉమ్మడి కుటుంబాల్లోనే ఎందుకు జీవిస్తున్నారు?

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘భారతీయ కుటుంబం అనేది ఒక తెగ.. అది కుటుంబ సభ్యులకు రక్షణనిస్తుంది. గుర్తింపునిస్తుంది. శూన్యత నుంచి కాపాడుతుంది’’ అని ప్రఖ్యాత రచయిత వి.ఎస్. నయిపాల్ వర్ణించారు.

ఆ కుటుంబం పెద్దగా మారలేదని ఇటీవల జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. ఉదాహరణకు ఆర్థికవృద్ధి, పట్టణీకరణ, విద్య, సాంస్కృతిక మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబం వ్యవస్థ మెల్లగా విచ్ఛిన్నం అవుతోందని చాలామంది నిపుణులు భావించారు.

కానీ, జనాభా శాస్త్రవేత్త, కోర్నెల్ యూనివర్సిటీ విజిటింగ్ ఫెలో ఎటిన్నె బ్రెటన్ అధ్యయనం దీనికి పూర్తి భిన్నంగా కనిపించింది.

భారత్‌లో ఆధునికీకరణ, కుటుంబ మార్పుల మధ్య ఉన్న బంధంపై ఆయన అధ్యయనం చేశారు. అందరూ ఊహించిన దానికి విరుద్ధంగా భారత్‌లో చిన్న కుటుంబాలు తక్కువ స్థాయిలోనే పెరిగాయని చెప్పారు.

20వ శతాబ్దం ప్రారంభం నుంచి భారత్‌లోని సగటు కుటుంబం పరిమాణం గణనీయంగా తగ్గినట్లు ఆధారాలు కూడా లేవు. దేశంలో పెళ్లి సార్వజనీనం. విడాకుల రేటు చాలా తక్కువగా ఉంటుంది.

కొందరు వయోజనులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం, పిల్లలు లేకపోవటం వంటి కారణాలతో ఏక వ్యక్తి కుటుంబాలూ ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు కొనసాగే పరిస్థితులు ఇంకా బలంగానే ఉన్నాయి.

‘‘కుటుంబ మార్పు అనే అంశంపై అవగాహనను భారత్ తీవ్రంగా సవాల్ చేస్తోంది’’ అని డాక్టర్ బ్రెటన్ నాతో చెప్పారు.

ఆయన తాజా అధ్యయనంలో పెళ్లైన కొడుకులతో జీవించే తల్లిదండ్రులు అంశాన్ని పరిశీలించారు. భారతదేశంలో పెళ్లైన మహిళ.. తన భర్త నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కానీ.. తానుగా వేరే కుటుంబాన్ని ఏర్పాటు చేయటం అరుదు.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఒక చిన్న కుటుంబం అనేది సాధారణంగా తండ్రి మరణానికి ముందు ఒక కొడుకు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నప్పుడు జరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయాక.. సాధారణంగా తండ్రి చనిపోయాక..ఆ కొడుకు అంతకు ముందు తను చిన్న కుటుంబంలో ఉన్నా, వితంతువైన తల్లిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు.

నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని పురాతన కుటుంబాల శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం దేశంలో 65 ఏళ్లు, అంతకు పైబడినవారిలో 50 శాతం మంది వివాహితులని, వీరిలో దాదాపు 45 శాతం మంది, ప్రధానంగా మహిళలు వితంతువులని తేలింది. అత్యధికంగా 80 శాతం మంది వితంతువులు, భార్య చనిపోయిన వృద్ధులు తమ పిల్లలతో కలిసి జీవిస్తున్నారని తేలింది.

కానీ, పిల్లలు లేకుండా, లేదా ఇంకా పెళ్లి కాని పిల్లలతో కలిసి 40 శాతం వృద్ధ జంటలు మాత్రమే జీవిస్తున్నట్లు ఈ సర్వేలో బయటపడింది. ఇది నెమ్మదిగా అంటే 25 ఏళ్లలో ఆరు శాతమే పెరిగింది.

భారతదేశంలో చిన్న కుటుంబాలు పెద్దగా పెరగలేదని చెప్పడానికి ఇది మంచి ఆధారం అని డాక్టర్ బ్రెటన్ చెప్పారు. యువతీయువకులు తల్లిదండ్రులతోనే ఉండాలని అనుకోవడానికి ఆయుర్ధాయం కూడా మరో ప్రధాన కారణం.

ఒక 30 ఏళ్ల యవకుడు 1980లో కంటే 2020లో తల్లిదండ్రుల్లో కనీసం ఒకరితో అయినా కలిసి జీవించే అవకాశం ఉంది.

పట్టణీకరణ నెమ్మదిగా ఉండడం కూడా దీనికి మరో కారణం. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 60 శాతం మంది చైనీయులతో పోలిస్తే, దాదాపు 35 శాతం మంది భారతీయులు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు.

జనాభా లెక్కల్లో చాలా పట్టణ ప్రాంతాలను, గ్రామీణ ప్రాంతాలుగా వర్గీకరించినట్లు కొంతమంది పరిశోధకులు భావిస్తున్నా, గ్రామాల్లో కంటే నగరాల్లో చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఈ గణాంకాల్లో ఎక్కడా చెప్పలేదు.

బలమైన కుటుంబ బంధాలు కుటుంబ వ్యాపారాలను, మహిళలు ఇంటిపట్టునే ఉండడాన్ని ప్రోత్సహిస్తాయని, అది కుటుంబ బంధాలను పెంచుతుందని అందుకే భారతీయులు ఉమ్మడి కుటుంబాల్లో జీవించడానికి ఆసక్తి చూపుతున్నారని లింగ సమానత్వంపై ఒక పుస్తకం కోసం పరిశోధన చేస్తున్న లండన్ కింగ్స్ కాలేజీ సామాజిక శాస్త్రవేత్త అలిస్ ఎవన్స్ చెప్పారు.

దానితోపాటూ ఒంటరిగా జీవించడం వల్ల ఇంటి ఖర్చులు భరించడం కష్టంగా ఉంటుంది. భారత కుటుంబాలు దీనికి అతీతం కాదు.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో పేదలే అధికంగా ఒంటరి కుటుంబాలుగా జీవిస్తున్నారు

1900లో చైనీస్., జపనీస్, కొరియన్స్, తైవాన్ కుటుంబాలు అన్నీ భారతీయ కుటుంబాల్లాగే ఉండేవి. స్వతంత్రంగా జీవించాలని వారు చాలా అరుదుగా అనుకునేవారని డాక్టర్ ఎవాన్స్ చెప్పారు.

“భారత్‌ లాగే తూర్పు ఆసియాలోని కుటుంబాల్లో కూడా బలమైన కుటుంబ సంబంధాలు ఉంటాయి. కానీ 20 శతాబ్దం నాటికి అవన్నీ చిన్న కుటుంబాలు అయిపోయాయి. కుటుంబం అండ లేకుండా ఉపాధి పొందేందుకు, గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లడంతో వారంతా చిన్న కుటుంబాలుగా మారిపోయారు” అని ఎవాన్స్ నాకు చెప్పారు.

కొందరు పెళ్లిళ్లు అయ్యాక ఇప్పటికీ తమ తల్లిదండ్రులకు అండగా ఉంటున్నారు. కానీ, వారితో కలిసి ఉండడానికి బదులు వారికి కొంత డబ్బు పంపిస్తూ ఉంటారు.

కుటుంబాలు ఇంత చిన్నగా మారడానికి మహిళల ఉపాధి కూడా కీలకంగా నిలిచింది. ఇందులో మళ్లీ తూర్పు ఆసియాలో భిన్నంగా కనిపిస్తుంది. గత శతాబ్దంగా జపాన్, కొరియా, తైవాన్, చైనా మహిళలు భారీ సంఖ్యలో పనులకు వెళ్లారు. ఇద్దరూ సంపాదించే యువ జంటలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నాయి.

ఉదాహరణకు దక్షిణ కొరియా పెద్ద పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అక్కడ ఫ్యాక్టరీల్లో కలిసి పనిచేయడానికి, డార్మిటరీల్లో కలిసి జీవించడానికి, హక్కుల కోసం ఆందోళనలు చేసిన కార్మికులు తమలాంటి వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చారు, కుటుంబాలకు అవతల సంబంధాలు సృష్టించుకున్నారు అని ఎవాన్స్ చెప్పారు.

ఆర్థిక స్వాతంత్ర్యం ఉండడంతో మహిళలు తక్కువమంది పిల్లలను కంటున్నారు. అలా బయట పనులు చేసుకోవడం వారికి సులభంగా ఉంటోంది. కానీ, దక్షిణాసియాలో అధ్యయనం దీనికి పూర్తిగా భిన్నంగా ఉందని ఎవాన్స్ చెప్పారు.

ఇక్కడ మహిళలు పనిచేయడం అనేది వారి ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది. పనులు చేసే పరిస్థితి నుంచి బయటపడడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక హోదా లభిస్తుంది. పారిశ్రామిక విప్లవం ప్రారంభ దశల్లో ఇలాగే జరిగింది. గ్రామీణ మహిళలు పనిచేయాలని అనుకున్నా వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల వారికి అవకాశాలు తగ్గిపోయాయి. మహిళలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండడం అనేది యువ జంటల ఆర్థిక స్వాతంత్ర్యానికి బ్రేక్ లాంటిది.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వృద్ధులు వివాహితులైన తమ మగపిల్లలతో కలిసి నివసిస్తూ వారి పిల్లల బాగోగులు చూసుకుంటుంటారు

“మహిళలు పనుల కోసం బయటికి వెళ్లకపోతే, తమ నెట్‌వర్కును విస్తృతం చేసుకుంటూ వారు కుటుంబంలో మరింత ఎక్కువగా పాతుకుపోతారు” అంటారు డాక్టర్ ఎవాన్స్.

జీడీపీని బట్టి చూస్తే భారత్ కూడా దీనికి అతీతం కాదు. మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లో విస్తరించిన చాలా కుటుంబాల్లో ఇది సర్వ సాధారణం. తరతరాలుగా కలిసి జీవిస్తున్నప్పటికీ, కుటుంబ సంబంధాలు తగ్గలేదని 15 అభివృద్ధి చెందిన దేశాల జనాభాపై ఒక అధ్యయనం చేసిన స్టీవెన్ రగుల్స్, మిస్టీ హెక్కనెస్ గుర్తించారు.

అయినా, అభివృద్ధి చెందడమే కాదు, సంక్లిష్టమైన భారత కుటుంబాల కథను ఇది పూర్తిగా వివరించదు. భారతదేశంలో చిన్న కుటుంబాలను నిర్వచించడం కొన్నిసార్లు గమ్మత్తగా ఉంటుందని భారతీయ కుటుంబాలపై విస్తృత రచనలు చేసిన సామాజిక శాస్త్రవేత్త తులసి పటేల్ కూడా చెప్పారు.

“తల్లిదండ్రులు వృద్ధాప్యంలో సాధారణంగా తమ మనవలు, మనవరాళ్లతో కలిసి గడిపేందుకు ఒక కొడుకు ఇంటి నుంచి మరో కొడుకు ఇంటికి వెళ్తుంటారు. పిల్లలు విదేశాలకు వెళ్లిపోయినపుడు, వారు తమ కూతుళ్లు, కొడుకుల దగ్గరే ఉండి వారి పిల్లలను చూసుకుంటారు. ఇలాంటివి ఉమ్మడి కుటుంబాల్లోకి రావని ఎలా వర్గీకరిస్తారు” అంటారు డాక్టర్ పటేల్.

చాలామంది అనుకుంటున్నదానికి పూర్తి విరుద్ధంగా సంపన్న కుటుంబాల్లోకంటే, పేద భారతీయులే ఎక్కువగా చిన్న కుటుంబాల్లో నివసిస్తున్నారు.

ముప్పైల్లో ఉన్న పెళ్లి చేసుకున్న పురుషుల్లో.. చదువుకున్న, ఉద్యోగాలు చేసే వారికంటే చదువుకోని రైతులే ఎక్కువగా చిన్న కుటుంబాల్లో జీవిస్తున్నట్లు డాక్టర్ బ్రెటాన్ 2000 ప్రారంభంలోనే గుర్తించారు.

పేదలు చిన్న కుటుంబాలు ఏర్పరుచుకోవచ్చు. ఎందుకంటే వారికి అడ్డంకులు తక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకు పిల్లల కుటుంబాలను కూడా పోషించగలిగేలా ఆస్తులు ఉండవు. పేద కుటుంబాలు చిన్న ఇళ్లను కొనుక్కోవచ్చు. కుటుంబ వ్యవసాయం, చిన్న వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుండడం వల్ల కూడా వారికి కలిసి జీవించడానికి తక్కువ ప్రోత్సాహకాలు అందుతాయి.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బలమైన కుటుంబ బంధాలు కుటుంబ వ్యాపారాన్ని కూడా బలోపేతం చేస్తాయి

వృద్ధుల్లో, చదువుకోని కార్మికుల్లో చిన్న కుటుంబాలుగా ఎక్కువగా ఉన్నాయి. రైతుల్లో ఇది బాగా పెరిగిందని డాక్టర్ బ్రెటన్ అంటున్నారు.

“భారత్‌లో కుటుంబాలు చిన్నవిగా మారడానికి ఆధునిక ఉన్నతవర్గాలు కారణం కాదనే విషయాన్ని ఇది బలంగా చెబుతుంది. కానీ, ఆధునికీకరణ వల్ల జనాభాలోని బలహీనవర్గాలు ఆర్థిక స్తబ్దత, పేదరికంలో కూరుకుపోయారు” అని ఆయన చెప్పారు.

ఇంకా చెప్పాలంటే, భారత కుటుంబాలు చాలా కాలం నుంచీ మారకుండా అలాగే ఉన్నాయి.

పెద్దల కుదిర్చిన వివాహంలో తోడును ఎంచుకునే విషయంలో మహిళలు నెమ్మదిగా తమ అధికారం చూపించగలుగుతున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించిన వయసు మళ్లిన తల్లిదండ్రులు విడిగా నివసించాలని ఎక్కువగా కోరుకుంటున్నారు.

పిల్లల సంఖ్య తగ్గించుకోవడం, ఒక కొడుకు చాలు అని, లేదంటే అసలు కొడుకులే వద్దు అనుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబాలు వద్దు అనే ఒక బలమైన వర్గం ఏర్పడుతోందని బ్రెటన్ చెబుతున్నారు. కొంతమంది పరిశోధకులు చెబుతున్నట్లు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో.. పెళ్లైన కూతుళ్ల దగ్గరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

ఏదేమైనా, చివరికి డాక్టర్ బ్రెటన్ చెప్పినట్లు విద్యావంతులైన ఉన్నత వర్గాలకంటే పేదలు భారతీయ కుటుంబాల్లో నిజమైన మార్పులకు కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)