అఫ్గాన్ శాంతి చర్చలు: తాలిబాన్లతో కాల్పుల విరమణకు ప్రభుత్వ ప్రతిపాదన

చర్చల కోసం అనేకమంది ప్రతినిధులను పంపిన తాలిబన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, చర్చల కోసం అనేకమంది ప్రతినిధులను పంపిన తాలిబన్

ఖతార్‌ కేంద్రంగా తాలిబాన్‌లతో జరుగుతున్న మొట్టమొదటి శాంతి చర్చల సందర్భంగా అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రతిపాదించింది. "యుద్ధం ద్వారా ఎవరూ గెలవలేరు'' అని ప్రభుత్వం తరఫున చర్చల్లో పాల్గొంటున్న అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

అయితే, తాలిబాన్ వర్గాలు దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయకపోగా, అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్‌ చట్టాలను అమలు చేయాలని పునరుద్ఘాటించాయి.

"ఈ శాంతి ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ప్రపంచమంతా కోరుకుంటోంది'' అంటూ ఇరువర్గాల మధ్య చర్చలను ప్రోత్సహించిన అమెరికా వ్యాఖ్యానించింది.

అఫ్గానిస్తాన్‌లో దశాబ్ధాలుగా సాగుతున్న సంక్షోభం కారణంగా ఇప్పటికి వేలమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

19 సంవత్సరాల కిందట అల్‌ఖైదా దాడి, ఆ వెంటనే అఫ్గానిస్తాన్‌పై అమెరికా దళాల ఆపరేషన్‌ మొదలు పెట్టిన సెప్టెంబర్‌ 11వ తేదీకి ఒక రోజు తర్వాత ఈ చర్చలు మొదలు కావడం విశేషం. అఫ్గానిస్తాన్‌ ఆపరేషన్‌ అమెరికా చరిత్రలో అతి సుదీర్ఘమైనదిగా నిలిచిపోయింది.

చర్చలు ఫలించాలని ప్రతి అఫ్ఘానీ కోరుకుంటున్నాడని ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా అబ్దుల్లా అన్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చర్చలు ఫలించాలని ప్రతి అఫ్ఘానీ కోరుకుంటున్నాడని ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా అబ్దుల్లా అన్నారు

ఈ చర్చలకంత ప్రాధాన్యం ఎందుకు?

అఫ్గానిస్తాన్‌ పాలకులకు, తాలిబాన్ ప్రతినిధులకు ముఖాముఖిగా జరుగుతున్న తొలి చర్చలివి. అయితే అఫ్గాన్‌ పాలకులు అమెరికా చేతిలో కీలుబొమ్మలని, వారితో చర్చలు జరిపేది లేదని ఇటీవలి కాలం వరకు తాలిబాన్లు ప్రకటనలు చేశారు.

ఇప్పుడు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇటీవలి కాలం వరకు రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ ఘర్షణల కారణంగా 12,000మంది సామాన్య పౌరులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.

శనివారం జరిగిన తొలి రోజు చర్చల సందర్బంగా అఫ్గానిస్తాన్‌ తరఫున చర్చల్లో పాల్గొంటున్న అబ్దుల్లా అబ్దుల్లా కాల్పుల విరమణను ప్రతిపాదించారు. రాయిటర్స్‌ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన "ఈ హింస పోవాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు'' అన్నారు.

"దేశంలోని వివిధ జాతులు, సంస్కృతులు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం తరఫున మేం ఈ చర్చల్లో పాల్గొంటున్నాం'' అన్నారు అబ్దుల్లా. "ఈ యుద్ధానికి ముగింపు లభిస్తుంది'' అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చర్చలు ముందుకు సాగుతాయని తాము ఆశిస్తున్నట్లు తాలిబాన్ నాయకుడు ముల్లా బరదార్‌ అఖుండ్‌ కూడా వ్యాఖ్యానించారు.

"ఇస్లామిక్‌ మత చట్టాల పాలనలో అన్ని సంస్కృతులు, జాతులను కలుపుకుని అఫ్గానిస్తాన్‌ స్వతంత్రంగా, ఐక్యంగా ముందుకు సాగాలని మేం కోరుకుంటున్నాం" అన్నారు బరదార్‌.

ఫిబ్రవరిలో తాలిబాన్‌లతో ఒక ఒప్పందానికి వచ్చిన అమెరికా, ఇప్పుడు అఫ్గాన్‌, తాలిబాన్‌ల మధ్య చర్చలను పరిణామంగా అభివర్ణించింది.

"ఇక్కడ ఇంతమంది కూర్చుని చర్చలు జరిపే పరిస్థితులు ఏర్పడటానికి చాలామంది త్యాగాలు చేశారు. ఈ చర్చలు విజయవంతం కావాలని, విజయవంతం చేయాలని ప్రపంచమంతా కోరుకుంటోంది" అన్నారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపేయో.

అఫ్గానిస్తాన్ సైనికుడు
Presentational grey line

ఉద్వేగ క్షణాలు

బీబీసీ చీఫ్‌ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్‌ లైస్‌ డాసెట్‌ విశ్లేషణ

ఈ చర్చలు ఒక ఉద్వేగభరిత వాతావరణంలో జరుగుతున్నాయని అఫ్గానిస్తాన్‌ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధం ముగింపుకు ఇది ఆరంభం కావాలని, దేశంలోని ప్రతి కుటుంబం కోరుకుంటోందని వారు చెబుతున్నారు.

తొలి రోజు చర్చలు అనుకున్నదానికన్నా మెరుగ్గా జరిగాయని, అయితే కాల్పుల విరమణ ఎప్పటి నుంచి, ఇస్లామిక్‌ చట్టాల అమలు సంగతేంటి, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఎంత వరకు అన్న అంశాలపై అభిప్రాయభేదాలు వినిపించాయి.

అయితే అన్నింటికన్నా ముఖ్యం ప్రపంచంలోనే అతి భయానకమైన ఈ యుద్ధానికి ముగింపు ఎలా అన్నది మాత్రమే.

Presentational grey line

ఒక అంగీకారానికి రావడం కష్టమా?

ఈ చర్చల్లో పాల్గొంటున్న వారంతా, ఇది ఒక సవాలని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు, మహిళలు హక్కులను త్యాగం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఈ విషయంలో పెద్దగా పురోగతిలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్‌ల తరఫున ఒక్క మహిళా ప్రతినిధి కూడా లేరని ఉమెన్‌ రైట్స్‌ కార్యకర్తలు వాదిస్తున్నారు.

తాలిబాన్‌లకు కూడా ఈ చర్చలు ఒక సవాలే. అఫ్గానిస్తాన్‌ కోసం వారు స్పష్టమైన రాజకీయ విధానాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇస్లామిక్‌ చట్టాలను అమలు చేయాలని, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడాలని మాత్రమే వారు డిమాండ్‌ చేశారు తప్ప స్పష్టమైన విధానం ప్రకటించ లేదు.

తాము పరిపాలించిన కాలంలో ఇస్లామిక్‌ చట్టాలను కఠినంగా అమలు చేసిన తాలిబాన్లలో ఏ మేరకు మార్పు వచ్చిందో తెలుసుకోడానికి ఈ చర్చలు ఉపయోగపడతాని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)