ఈ పండ్లకు వయసు కనిపించకుండా చేసే గుణం ఉందని నమ్ముతారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్లైర్ టర్రెల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మూడో శతాబ్దం నుంచి చైనా సంస్కృతిలో గోజీ బెర్రీ పండ్లు భాగంగా ఉన్నాయి. సూఫర్ ఫుడ్‌గా వీటికి ఇప్పుడు ఆదరణ పెరిగింది.
ఈ పండ్లను 'ఎర్ర వజ్రాలు' అని కూడా పిలుస్తుంటారు. వయసు పైబడటాన్ని నెమ్మదింపజేసే గుణం వీటికి ఉందని భావిస్తుంటారు.
గోజీ బెర్రీలకు ఇప్పుడు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది.
వీటిని చైనా ప్రజలు వైద్య అవసరాల కోసం మూడో శతాబ్దం నుంచి వాడుతున్నారు.


చైనా వ్యాప్తంగా గోజీ పండ్లు పండుతాయి.
కానీ, నింగ్షియాలో పండేవి మాత్రం మేలు రకంగా గుర్తింపు పొందాయి. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉండటం అందుకు కారణం.
''చల్లటి పర్వత పవనాలు, సారవంతమైన మట్టి, యెల్లో రివర్ నుంచి వచ్చే సాగునీరు నింగ్షియా పండ్లను ప్రత్యేకంగా మార్చుతున్నాయి'' అని నింగ్షియా బైషీ హెంగ్‌క్సింగ్ ఫుడ్ టెక్నాలజీ కో-సేల్స్ మేనేజర్ ఎవాన్ గువో చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Xinhua/Alamy
నింగ్షియాలో పురాతన కాలంలో గోజీ పండ్ల సాగు పద్ధతి ఎలా ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది.
ఏటా జులై-సెప్టెంబర్ మధ్య నడుం ఎత్తువరకు పెరిగిన గోజీ పొదల్లో నుంచి పండ్లను కూలీలు తెంపి, బుట్టల్లో వేసుకుంటారు.
గోజీలపై చైనీయులకు మక్కువ వందల ఏళ్ల క్రితమే మొదలైంది.
వీటికి ఔషధ శక్తులున్నాయని భావిస్తుంటారు. సంప్రదాయ చైనీస్ వైద్యులు వీటిని వైద్యంలో ఉపయోగించారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.
ప్రముఖ మూలికల నిపుణుడు లి షింజెన్ 16వ శతాబ్దంలో రాసిన వైద్య పుస్తకంలోనూ గోజీల గురించి రాశారు.
చైనీయులు గోజీని పండుగానూ, మూలికగానూ చూస్తారు. వీటిలో సీ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, మినరల్స్ మెండుగా ఉంటాయి.
గోజీలు కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తాయని చైనా సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు.
''చైనాలో తల్లులు గోజీలు కళ్లకు మంచివని చెబుతూ పిల్లలతో తినిపిస్తుంటారు. గోజీల్లో కెరోటిన్ ఉంటుంది. అయితే, దానికున్న చాలా ప్రయోజనాల్లో ఇది కూడా ఒకటి. కాలేయం, మూత్ర పిండాలకూ ఇది మంచి చేస్తుంది'' అని జాంగ్ రూఫెన్ అనే చైనీస్ సంప్రదాయ వైద్యురాలు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చికెన్, అందులో రెడ్ డేట్లు, అల్లంతో చేసే సూప్‌లో ఎండబెట్టిన గోజీలను కలుపుకుని చైనీయులు తీసుకుంటారు. చామంతులతో చేసే టీలోనూ వాటిని వేసుకుంటారు.
జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, డయేరియా లాంటివి ఉన్నవాళ్లకు మాత్రం తాను గోజీలు తీసుకోమని సూచించనని జాంగ్ చెప్పారు. గోజీలను వేడి చేసే పదార్థాలుగా తాము చూస్తామని అన్నారు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు, గోజీలు ఎవరైనా తీసుకోవచ్చని ఆమె చెప్పారు.
గోజీల గురించి చైనాలో ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం... 2 వేల ఏళ్ల క్రితం ఓ వైద్యుడు చైనాలోని ఓ గ్రామానికి వచ్చాడట. అక్కడ అందరూ వందేళ్లు పైబడ్డవాళ్లే ఉన్నారట. చుట్టూ గోజీ పండ్ల చెట్లు ఉన్న బావిలోని నీళ్లు తాగడం వల్లే వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని ఆ వైద్యుడు గుర్తించాడట.
17వ శతాబ్దానికి చెందిన మూలికల నిపుణుడు లి ఖింగ్ యువెన్ రోజూ గోజీ పండ్లను తిని 252 ఏళ్లు బతికాడని కూడా ఇంకో కథ ప్రచారంలో ఉంది.

ఫొటో సోర్స్, Xinhua/Alamy
సూపర్ ఫుడ్ అన్న గుర్తింపు రావడంతో ఆధునిక తరాలు కూడా గోజీ పండ్లను తీసుకోవడం మొదలుపెట్టాయి.
ఆసియాతో పోలిస్తే పాశ్చాత్య దేశాల్లో గోజీ పండ్ల ధర మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సూపర్ మార్కెట్లలోనూ, ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలు సాగుతున్నాయి.
నింగ్షియాలో ఏటా 1.8 లక్షల టన్నుల గోజీలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇవి తొందరగా పండిపోతాయి. అందుకే రైతులు వీటిని తెంపడంలో ఆలస్యం చేయరు.
ఎక్కువగా వీటిని ఎండపెట్టే అమ్ముతారు. పచ్చి గోజీలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు.

ఇవి కూడా చదవండి
- పేద దేశాల్లో ప్రజలకు ఊబకాయం ఎందుకు వస్తోంది...
- దిల్లీ హింస: ఈ ఫొటోలోని వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు?
- చక్కెర తినడం మంచిదా, కాదా? ప్రపంచంలో చక్కెర ఎక్కువగా తినే ప్రజలు ఎవరు?
- లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది? దీని అవసరం ఏంటి?
- విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు.. ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- మీకు కొన్ని కూరగాయలు, ఆకు కూరలు అంటే అయిష్టమా? దానికి కారణమేంటో తెలుసా...
- దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









