నీరజ్ జాదౌన్: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో

ఫొటో సోర్స్, ANKIT SRINIVAS
దేశ రాజధాని దిల్లీలో మత హింస సాగిన రెండు రోజుల్లో కొన్ని కుటుంబాలను కాపాడటానికి అల్లరి మూకలను ఎదిరించిన ఒక దిల్లీ పోలీస్ అధికారి ఒకరు హీరో అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
దిల్లీ నగరంలో ఆదివారం నాడు చెలరేగిన అల్లర్లలో 38 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ సూపరింటెండెంట్ నీరజ్ జాదౌన్.. ఫిబ్రవరి 25న తాను సరిహద్దు చెక్‌పోస్ట్ దగ్గర పహరాలో ఉన్నానని, అప్పుడు తనకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న దిల్లీ కారావాల్ నగర్ నుంచి తుపాకీ కాల్పుల శబ్దం వినపడిందని బీబీసీ ప్రతినిధి వికాస్ పాండేతో చెప్పారు.
అక్కడ 40-50 మంది ఉన్న గుంపు వాహనాలకు నిప్పు పెట్టటం చూశానని.. అదే సమయంలో ఒక దుండగుడు పెట్రోల్ బాంబుతో ఒక ఇంట్లోకి దూకటం కనిపించిందని తెలిపారు. నీరజ్ పోలీస్ ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. రాష్ట్ర సరిహద్దును దాటి దిల్లీలోకి ప్రవేశించాలని అర క్షణంలోనే నిర్ణయం తీసుకున్నారు.
భారతదేశంలో పోలీస్ అధికారులు తాము విధుల్లో ఉన్న రాష్ట్ర సరిహద్దులు దాటాలంటే విస్పష్టమైన అనుమతి అవసరం.
''సరిహద్దు దాటాలని నేను నిర్ణయించుకున్నాను. అది నా విధుల పరిధిలోని ప్రాంతం కాకపోయినా, అక్కడికి వెళ్లటం ప్రమాదకరమని తెలిసినా ఒంటరిగా వెళ్లటానికి సిద్ధపడ్డాను. నా జీవితంలో అత్యంత భయానకమైన 15 క్షణాలు అవే. అయితే నా పోలీస్ బలగం కూడా నాతో పాటు వచ్చింది. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ తర్వాత నేను మా సీనియర్ అధికారులకు సమాచారం ఇచ్చినపుడు వారు కూడా నాకు మద్దతు తెలిపారు'' అని ఆయన వివరించారు.

''మా సంఖ్య చాలా తక్కువగా ఉంది.. అల్లరి మూక చేతుల్లో ఆయుధాలున్నాయి. అది చాలా ప్రమాదకరం. మేం మొదట వారితో చర్చలు జరపటానికి ప్రయత్నించాం. అది విఫలమైనపుడు పోలీసులు కాల్పులు జరుపుతారని హెచ్చరించాం. వాళ్లు వెనుదిరిగారు. కానీ కొన్ని సెకన్ల తర్వాత మా మీద రాళ్లు విసిరారు. తుపాకీ కాల్పులు కూడా వినిపించాయి'' అని చెప్పారు.
అయినప్పటికీ నీరజ్, ఆయన బలగం ఎదురునిలిచారు. అల్లరిమూక ఆ ప్రాంతం విడిచివెళ్లే వరకూ వారిని తరుముతూ ముందుకు సాగారు.
నీరజ్ తీసుకున్న నిర్ణయం తాను చూసిన అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా విలేకరి రిచీ కుమార్ అభివర్ణించారు.
''అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అల్లరి మూకలో అందరి దగ్గరా ఆయుధాలు ఉన్నాయి. వాళ్లు ఎవరి మాటా వినటానికి సిద్ధంగా లేరు. వాళ్లు రక్తదాహంతో ఉన్నారని నేను చెప్పగలను. వాళ్లు జనం మీద రాళ్లు విసురుతున్నారు. కానీ నీరజ్ వెనుకంజ వేయలేదు. అల్లరిమూక పోలీసుల మీద కాల్పులు జరిపే పెద్ద ప్రమాదం ఉంది'' అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.
వివాదాస్పద పౌరసత్వ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఈశాన్య దిల్లీలో ఆందోళనలు చేస్తున్న వారి మధ్య మొదట ఈ హింస చెలరేగింది.

ఫొటో సోర్స్, AFP
కానీ ఆ తర్వాత అది మత హింసగా మారింది.
తను చూసిన అల్లరిమూక విధ్వంసానికి పాల్పడటానికి సంసిద్ధంగా వచ్చిందని నీరజ్ చెప్పారు.
''ఆ ప్రాంతంలో చాలా వెదురు నిల్వల షాపులు ఉన్నాయి. అక్కడ మంట పెట్టినట్లయితే ఆ ప్రాంతం మొత్తం మంటలు చుట్టుముట్టి కాలిపోయేది. అదే జరిగితే దిల్లీలో మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండేది'' అన్నారు.
అయితే.. తనను హీరో అని ప్రశంసించటం నీరజ్‌కు ఇబ్బందికరంగా ఉంది.
''నేను హీరోని కాదు. ఏ భారతీయుడైనా ప్రమాదంలో ఉంటే రక్షిస్తానని నేను ప్రమాణం చేశాను. నేను కేవలం నా విధులు నిర్వర్తించాను. నేను విధుల్లో ఉండగా జనం చనిపోవటానికి వీలు లేదు. మేం జోక్యం చేసుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం.. అదే పని చేశాం'' అంటారాయన.
ఇటువంటి ధీరోధాత్త చర్యల ఉదంతాలు - హిందువులు, ముస్లింలు ఐక్యంగా నిలబడిన సంఘటనలు - ఇప్పుడిపుడే వెలుగులోకి వస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
అల్లర్లలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఒకటైన అశోక్ నగర్‌కి చెందిన శుభాష్ శర్మ.. అల్లరి మూక ఒక మసీదుకు నిప్పు పెట్టినపుడు సాయం కోసం తాను ఎలా ముందుకు ఉరికిందీ చెప్పారు.
''అల్లరి మూకలో వేలాది మంది ఉన్నారు. మసీదులో కేవలం పిడికెడు మందే ఉన్నారు. దానికి నిప్పు పెట్టటం గమనించిన వెంటనే.. మా ఇంట్లో నీటి పైపును స్విచాన్ చేసి పైపు పట్టుకుని మసీదు దగ్గరికి పరుగున వెళ్లాను'' అని ఆయన బీబీసీ హిందీకి వివరించారు.
అదే ప్రాంతానికి చెందిన ముర్తజా అనే వ్యక్తి.. అల్లర్ల సమయంలో తాము ఆ ప్రాంతం వదిలి పారిపోవాలని అనుకున్నానని, అయితే తమ పొరుగు వారైన హిందువులు పారిపోవద్దని చెప్పారని తెలిపారు.
''మాకు ఎటువంటి హానీ జరగనివ్వబోమని వారు మాకు భరోసా ఇచ్చారు'' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, AFP
తీవ్ర హింస ప్రభావిత ప్రాంతమైన మౌజీపూర్‌లోని విజయ్ పార్క్ ప్రాంతంలో నివసించే ఇరుగుపొరుగు వారైన ఇద్దరితో - ఒక హిందూ వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తితో - బీబీసీ హిందీ ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ మాట్లాడారు.
తమ సమీపంలో వాహనాలకు నిప్పుపెడుతూ, కిటికీలు పగులగొడుతున్న అల్లరిమూకను తరిమికొట్టేందుకు తమ ఇరుగుపొరుగువారిని ఎలా కదిలించినదీ వారు వివరించి చెప్పారు.
''మరుసటి రోజు మేం మెయిన్ రోడ్డును మూసివేశాం. ఇరుగుపొరుగు వారంతా ఒకచోట కలిసి.. బయట కూర్చున్నారు'' అని వారిలో ఒకరైన జమాలుద్దీన్ సైఫీ తెలిపారు.
ఇక్కడి నివాసులు ముస్లింలు, హిందువులు కలిసివున్న ఒక 'శాంతి కమిటీ'ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారు ఇంటింటికీ వెళ్లి.. వదంతులను నమ్మవద్దని, పిల్లలను ఇంట్లోనే ఉంచాలని చెప్పారు.
భారతదేశ రాజధాని హింస నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తోంటే.. దిల్లీ వాసులకు మళ్లీ సాధారణ జనజీవనానికి తిరిగివెళ్లగలమనే ఆశనిస్తోంది ఇటువంటి స్ఫూర్తిదాయక ఉదంతాలే.

ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: పోలీసుపై తుపాకీ గురిపెట్టిన ఈ వ్యక్తి ఎవరు?
- దిల్లీ హింస: ఆర్ఎస్ఎస్, అమిత్ షాల పేర్లు చెప్పవద్దన్న అజిత్ డోభాల్
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...
- బాలాకోట్ వైమానిక దాడి జరిగి ఏడాది.. ఈ ప్రశ్నలకు భారత్, పాక్ రెండు దేశాల దగ్గరా సమాధానాలు లేవు
- పాకిస్తాన్ ఎవరికి భయపడి భారత వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
- సింహాల సఫారీలో చిక్కిన టీనేజర్
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- మిడతల దండు: పోరాటానికి మరిన్ని నిధులు కావాలన్న ఐరాస
- కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ
- బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









