కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ

ఫొటో సోర్స్, Reuters
కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో డెటాల్, లైజోల్ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ క్రిమిసంహారకాలు ఉపయోగపడతాయని చాలామంది భావించడమే అందుకు కారణం. అయితే, కరోనాపై వీటి ప్రభావం శాస్త్రీయంగా ఇంకా నిరూపితం కాలేదు.
చేతి శుభ్రతకు ఉద్దేశించిన డెటాల్ బ్రాండ్ ఉత్పత్తులకు చైనాలో సరఫరా కంటే డిమాండ్ అధికంగా ఎక్కువగా ఉందని డెటాల్ తయారీ సంస్థ రెకిట్ బెంకిజర్ తెలిపింది.


మరోవైపు, కరోనావైరస్ భయంతో అంతర్జాతీయ మార్కెట్లు వరుసగా నష్టాలను చవి చూస్తున్నాయి.
తమ వ్యాపారాలపై కరోనా వైరస్ ప్రభావం పడుతోందని లగ్జరీ కార్ల సంస్థ ఆస్టన్ మార్టిన్, బెల్జియంగ్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి పానీయాల దిగ్గజం ఏబీ ఇన్‌బెవ్ తాజాగా తెలిపాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ అయిన ఏబీ ఇన్‌బెవ్ 2020లో వృద్ధిరేటు అంచనాలను తగ్గించుకుంది. అందుకు కరోనావైరస్ కొంతమేర కారణమని పేర్కొంది. దాంతో ఆ సంస్థ షేర్ల విలువ ఒక్కసారిగా 9 శాతం పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
104 మిలియన్ డాలర్ల వార్షిక నష్టాన్ని నమోదు చేయడంతో పాటు, కరోనావైరస్ ప్రభావంతో డిమాండ్ తగ్గిపోయిందని ఆస్టన్ మార్టిన్ ప్రకటిచింది. దాంతో, ఈ సంస్థ షేర్ విలువ ఎన్నడూ లేనంత స్థాయిలో దిగజారింది.
"డెటాల్, లైజోల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. విరాళాలు ఇవ్వడంతో పాటు, అవగాహన కార్యక్రమాల ద్వారా వైద్య ఆరోగ్య సంస్థలు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాం. చైనాలో మా ఉత్పత్తులకు ఆన్‌లైన్‌లో గిరాకీ పెరిగింది" అని రెకిట్ బెంకిజర్ గురువారం తెలిపింది.
"ప్రస్తుతం చైనాలో దుకాణాలకు వెళ్లి సరుకులు కొనేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. అందుకే, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరిగాయి" అని ఆ సంస్థ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ చెప్పారు.
కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు అందరూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలనే సందేశాన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దాంతో, ఇళ్లలో వాడే క్రిమిసంహారకాల విభాగంలో పేరున్న డెటాల్, లైజోల్‌లకు గిరాకీ పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోనూ హ్యాండ్ శానిటైజర్, ఫేస్ మాస్కులకు డిమాండ్ భారీగా పెరిగిందని ఆల్ ఫుడ్ అండ్ డ్రగ్ లైసెన్స్ హోల్డర్ ఫౌండేషన్ (ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్) ఇటీవల వెల్లడించింది.
"ఇంతకుముందు నెలకు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల దాకా ఫేస్ మాస్కులు అమ్ముడుపోయేవి. ఇప్పుడు పది నుంచి 12 లక్షల దాకా అమ్ముడుపోతున్నాయి" అని ఏఎఫ్‌డీఎల్‌హెచ్‌ఎఫ్ తెలిపింది.
ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో హ్యాండ్ శానిటైజర్లకు, సబ్బులకు, మాస్కులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ పెరిగిందని ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.
ఫిబ్రవరి ఆరంభం నుంచి యూకేలోనూ హ్యాండ్ శానిటైజర్‌లకు గిరాకీ ఒక్కసారిగా ఊపందుకుందని, కొన్ని తయారీ సంస్థలు డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నాయని ఆన్‌లైన్‌లో మందులు అమ్మే కంపెనీ మెడినో వెల్లడించింది.
"ఇప్పుడు మా వెబ్‌సైట్‌కు చాలామంది కొత్త వినియోగదారులు వస్తున్నారు. భారీ మొత్తంలో హ్యాండ్ శానిటైజర్లను కొనుగోలు చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే, కరోనా వైరస్ మరింత విజృంభిస్తే మున్ముందు వీటికి కొరత ఏర్పడుతుందేమోనని ముందస్తుగా ప్రజలు కొనిపెట్టుకుంటున్నారని అనిపిస్తోంది" అని ఆ సంస్థ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు, కరోనావైరస్ ప్రభావంతో ఈసారి చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బీర్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దాంతో, తొలి త్రైమాసికంలో లాభాలు 10 శాతం మేర తగ్గొచ్చని ఏబీ ఇన్‌బెవ్ అంచనా వేసింది.
ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లకు చైనా మార్కెట్ అత్యంత ఆశాజనకంగా ఉండేది. కానీ, తమ అమ్మకాలపై వైరస్ ప్రభావం పడిందని గురువారం ఆ సంస్థ తెలిపింది.
"కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెంది, ఎక్కువ కాలం కొనసాగే సూచనలు కనిపిస్తుండటంతో ప్రస్తుతం చాలా రంగాల్లోనూ స్వల్పకాలిక అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం గురించి మార్కెట్లు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది" అని లండన్‌లోని స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏజే బెల్ డైరెక్టర్ రస్ మౌల్డ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా?
- కరోనా వైరస్: తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది
- కరోనావైరస్: వన్య ప్రాణులను తినడాన్ని నిషేధించిన చైనా ప్రభుత్వం
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కరోనావైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారిందా? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









