మిడతల దండు: పోరాటానికి మరిన్ని నిధులు కావాలన్న ఐక్యరాజ్యసమితి

ఫొటో సోర్స్, FAO/Petterik Wiggers
ఆఫ్రికాలో, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ముందెన్నడూ లేనంతగా మిడతలు దాడులు చేస్తున్నాయి. పంటలకు ముప్పు కలిగిస్తున్నాయి. మిడతలను ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు సమకూర్చాలంటూ ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. వీటి నియంత్రణకు కావాల్సినవి ఏమిటి? బాధిత దేశాలకు అందుకు తగినన్ని వనరులు ఉన్నాయా?
మిడతలను ఎదుర్కోవడానికి మరిన్ని వనరులు సత్వరం ఏర్పాటు కాకపోతే తూర్పు ఆఫ్రికాలో ఆహార సంక్షోభం తప్పకపోవచ్చని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) హెచ్చరించింది. మరో 6.2 కోట్ల డాలర్ల నిధులు అందించాలని దాతలను, దాతృత్వ సంస్థలను కోరింది.


మిడతలపై పోరాటంలో రానున్న కొన్ని వారాలు కీలకమని ఎఫ్‌ఏవో డైరెక్టర్ జనరల్ క్యూ డాంగ్యూ చెప్పారు. ఇప్పటికే ఆహార భద్రత కొరవడిన ప్రాంతంలో మిడతల దాడుల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోందని, క్షణం కూడా వృథా చేయకుండా వీటిని నియంత్రించాలని ఆయన తెలిపారు.
దక్షిణాసియాలో భారత్ మొదలుకొని పశ్చిమాఫ్రికాలో మారిటేనియా వరకు 13 దేశాల్లో మిడతలను నియంత్రించే చర్యలు కొనసాగుతున్నాయి. మిడతలు ప్రధానంగా తూర్పు ఆఫ్రికాలోని యెమెన్, గల్ఫ్ దేశాలు, ఇరాన్, పాకిస్తాన్, భారత్‌లలో పంటలకు ముప్పు కలిగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాజాగా కాంగోలో మిడతల దండ్లు కనిపించాయి. కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఇరాన్ తీర ప్రాంతాలకు ఈ కీటకాలు చేరుకున్నాయి.
మిడతలు కెన్యా, ఇథియోపియా, సొమాలియా దేశాల్లో అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపాయని ఎఫ్‌ఏవో బీబీసీతో చెప్పింది.
ఈ మూడింటిలో ప్రతి దేశంలో కనీసం లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాల్సి ఉందని ఎఫ్‌ఏవో అంచనా వేస్తోంది.
జనవరి చివరి నాటికి ఈ మూడు దేశాలు లక్ష్యానికి చాలా దూరంలో ఉన్నాయి. అప్పటికి ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పిచికారీ చేశారంటే..
- ఇథియోపియా: 22,550 హెక్టార్లు
- కెన్యా: 20 వేల హెక్టార్లు (అంచనా)
- సొమాలియా: 15 వేల హెక్టార్లు (అంచనా)

ఫొటో సోర్స్, Getty Images
డబ్బు ఎంత కావాలి?
ఎఫ్‌ఏవో జనవరిలో 7.6 కోట్ల డాలర్ల నిధుల కోసం పిలుపు ఇచ్చింది. ఇటీవలి అంచనా ప్రకారం 13.8 కోట్ల డాలర్లు అవసరమని చెప్పింది. ఇప్పటివరకు 3.3 కోట్ల డాలర్లు మాత్రమే అందాయి. ఇందులో కోటి డాలర్లను బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ వారంలోనే విరాళంగా అందించింది.
గాల్లోంచిగాని, నేరుగాగాని క్రిమిసంహారకాన్ని పిచికారీ చేసి మిడతలను నియంత్రించేందుకు, మిడతలపై పోరాటంలో సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయాన్ని మెరుగుపరచుకొనేందుకు బాధిత దేశాలకు ఈ డబ్బు అవసరమని ఐరాస చెబుతోంది.
మిడతల దాడులతో జీవనోపాధి దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు తక్షణ, దీర్ఘకాలిక సహాయాన్ని అందించేందుకు కూడా ఈ నిధులను వెచ్చిస్తున్నారు.
ఒక్కో మిడత రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుంది. వీటిలో సంతానోత్పత్తి చాలా వేగంగా జరుగుతోంది. జూన్‌లోగా వీటి సంఖ్య నాలుగు వందల రెట్లు పెరిగే ఆస్కారం ఉంది.

కావాల్సిన వనరులు?
మిడతల నియంత్రణ సిబ్బంది, వీటి కట్టడికి అవసరమైన సామగ్రి ఈ పోరాటంలో కీలకం. ప్రస్తుతం సిబ్బందితోపాటు సామగ్రి అవసరమైనంతగా అందుబాటులో లేదు.
వాహనాలు, విమానాలు, హెలికాప్టర్లు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, రేడియోలు, జీపీఎస్ పరికరాలు, ఇతర సామగ్రి అత్యవసరం.
గగనతలం నుంచి, నేలపై నుంచి పురుగుల మందు పిచికారీ చేయడంతోపాటు, మిడతల గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈ కీటకాలు ఒకే చోట ఉండిపోవు. నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి. క్రిమిసంహారకాన్ని రెండు మార్గాల్లో పిచికారీ చేయడంతోపాటు మిడతల గమనానికి అనుగుణంగా స్పందించడమే అత్యంత ప్రభావవంతమైన వ్యూహం.
విమానాలు, హెలికాప్టర్లు తగినన్ని లేవని, వీటి కొరతే తమకు పెద్ద అవరోధమని తూర్పు ఆఫ్రికా ఎడారి మిడతల నియంత్రణ సంస్థ సారథి స్టీఫెన్ ఎన్‌జోకా వ్యాఖ్యానించారు. క్రిమిసంహారక మందులు కూడా అవసరమైనంతగా సరఫరా కావడం లేదని విచారం వ్యక్తంచేశారు.

పిచికారీకి ఇథియోపియా ఐదు, కెన్యా ఆరు ఎయిర్‌క్రాఫ్ట్‌లు వాడుతున్నాయని, నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లను సర్వేయింగ్ కోసం వాడుతున్నాయని ఆయన తెలిపారు.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమకు 20 విమానాలు అవసరమని కెన్యా ప్రభుత్వం చెబుతోంది. పిచికారీ చేయడానికి ఫెనిట్రోథియోన్ అనే క్రిమిసంహారకం కెన్యాకు నిరంతరాయంగా సరఫరా కావాల్సి ఉంది.
పురుగుల మందులు జపాన్ నుంచి తెప్పించుకొంటున్నామని కెన్యా వ్యవసాయ శాఖ కేబినెట్ సెక్రటరీ పీటర్ మున్యా తెలిపారు.
ప్రభావిత ప్రాంతాలకు 4,700 లీటర్ల క్రిమిసంహారకాన్ని పంపిణీ చేశామని, ఇంకో 20 వేల లీటర్లు పంపిణీ చేయాల్సి ఉందని కెన్యా ప్రభుత్వం నెల క్రితం చెప్పింది.
విదేశాల నుంచి 7,500 లీటర్ల పురుగుల మందు ప్రభుత్వానికి అందిందని, తమకు అవసరమైన పరిమాణంలో ఇది మూడో వంతు కన్నా కాస్త ఎక్కువని మున్యా గత వారం తెలిపారు.
సొమాలియాలో ప్రస్తుతం పిచికారీ చేపట్టలేదు. దేశంలో మిడతల కదలిలకపై నిఘాను, వాటి నియంత్రణ చర్యలను తక్షణం పెంచాల్సి ఉందని సొమాలియా ప్రభుత్వం, ఎఫ్‌ఏవో చెప్పాయి.
యెమెన్‌లో సమస్యపై ఇప్పటివరకు పరిమితంగానే సర్వేలు జరిగాయని, నియంత్రణ చర్యలు చేపట్టలేకపోయారని ఎఫ్ఏవో తెలిపింది.

శిక్షణ కార్యక్రమాలు
సమస్య తీవ్రత దృష్ట్యా మిడదల నియంత్రణ చర్యలపై స్థానికంగా శిక్షణ ఇవ్వడం ఒక ముఖ్యమైన విషయమని ఎఫ్‌ఏవో చెబుతోంది.
ఈ సమస్య చాలా దేశాల్లో గత 25 ఏళ్లలో లేదా 70 ఏళ్లలో ఎప్పుడూ ఇంత తీవ్రంగా లేదని, అందువల్ల నియంత్రణ చర్యల్లో అనుభవం, నైపుణ్యం ఉన్న స్థానికులు పెద్దగా లేరని ఈ సంస్థ బీబీసీతో పేర్కొంది.
బాధిత దేశాల్లో ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మిడతల దండుల కదలికలను పర్యవేక్షించడంపై బాధిత దేశాలకు చెందిన 240 మందికి పైగా సిబ్బందికి కెన్యా శిక్షణ అందిస్తోంది.
ఒకవైపు నియంత్రణ ప్రయత్నాలు జరుగుతున్నా, ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


మిడతల దాడి ఏ స్థాయిలో జరుగుతోందో ఈ వీడియోలో చూడండి:


ఇవి కూడా చదవండి:
- అభినందన్ క్రాష్ ల్యాండింగ్ ఎలా జరిగింది? అప్పుడు అక్కడ ఉన్నవాళ్లు ఏమన్నారు...
- యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది
- దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది?
- మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్
- యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్
- కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










