అఫ్గానిస్తాన్ సెక్స్ కుంభకోణం: "ఇక్కడున్న ప్రతి మగవాడు మీతో సెక్స్ కోరుకుంటాడు..."

- రచయిత, యోగిత లిమాయె
- హోదా, బీబీసీ న్యూస్, కాబూల్
అఫ్గానిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి చుట్టూ ముసురుకున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ ఆరోపణలను అధికారులు ఖండించినప్పటికీ 'బీబీసీ' చేసిన పరిశోధనలో మాత్రం విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
అక్కడి వేధింపుల సంస్కృతి కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై అక్కడి మహిళలు బీబీసీ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
కాబూల్ చుట్టూ ఉన్న పర్వత శ్రేణి దిగువ భాగంలోని ఓ ఇంట్లో మాజీ ఉద్యోగిని ఒకరిని నేను కలుసుకున్నాను. ఆమె తన పేరు బయటకు చెప్పొద్దని కోరారు.. కానీ, ఆమె విషాద గాథ మాత్రం ప్రపంచం మొత్తానికి తెలియాలని కోరుకున్నారు.
ఒకప్పుడు తన బాస్, అఫ్గాన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన వ్యక్తి తనను నిత్యం వేధించేవారని.. ఒక రోజు తాను ఆఫీసుకు వెళ్లగా లైంగిక దాడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
''పడక సుఖం అందించాలని ఆయన నన్ను నేరుగా అడిగారు. మీరలా అనడం తప్పని అన్నాను. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి లేచి నిల్చున్నాను. కానీ, ఆయన నా చేయి పట్టుకుని లాగి ఆయన ఆఫీసుకు అనుబంధంగా వెనుక వైపు ఉన్న గదిలోని లాక్కెళ్లారు. కొద్ది నిమిషాల్లోనే అంతా అయిపోతుంది.. కంగారు పడాల్సిందేమీ లేదని నాతో అన్నారు''
''వెంటనే నేను ఆయనను వెనక్కి నెట్టేసి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తరువాత మళ్లీ ఆయన్ను కలవలేదు. ఆ ఘటన నాకు చాలా కోపం, బాధ తెప్పించింది'' అని చెప్పారు.
ఆ ఘటన తరువాత ఆమె ఫిర్యాదు చేశారా?
''ఆ తరువాత నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఈ ప్రభుత్వాన్ని నేను నమ్మను. ఇలాంటివాటిపై ఫిర్యాదు చేయడానికి కోర్టుకో, పోలీసుల దగ్గరకో వెళ్లారనుకోండి, వారెంత అవినీతిపరులో మీకు అర్థమవుతుంది. ఫిర్యాదు చేయడానికి సురక్షితమైన చోటు ఈ దేశంలో ఎక్కడా లేదు. ఇలాంటివాటిని బయటకు చెప్పుకొంటే మహిళలనే అంతా నిందిస్తారు'' అని అన్నారామె.
ఆ మంత్రి తమను రేప్ చేశాడని ఇద్దరు మహిళలు చెప్పారంటూ ఈ మాజీ ఉద్యోగిని నాతో చెప్పారు. (బీబీసీ ఈ ఆరోపణలను స్వయంగా నిర్ధారించలేదు)
ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ఆ మంత్రి నిర్భీతిగా ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
మహిళలకు అఫ్గానిస్తాన్ ఏమాత్రం సురక్షితం కాదు
మహిళల విషయంలో ఏమాత్రం సురక్షితం కాని దేశాల జాబితాలో ఏటా అఫ్ఘానిస్తాన్ ఉంటోంది. మహిళలు లైంగిక హింసకు గురవుతున్న తీరు.. ఫిర్యాదు చేసినా వాటిని వెనక్కు తీసుకోవాలంటూ వారిపై వస్తున్న ఒత్తిళ్లను 2018లో ఐక్యరాజ్య సమితి వెలువరించిన ఓ నివేదిక సవివరంగా ప్రస్తావించింది.
ఇలాంటి వాతావరణంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, పలుకుబడిగల వ్యక్తుల దుష్ప్రవర్తన గురించి ఫిర్యాదు చేయడం మహిళలకు అంత సులభం కాదు.
మేం మాట్లాడిన ఆరుగురు మహిళల్లో ఎక్కువ మంది వారి పేర్లు బయటపెట్టడానికి కూడా భయపడడానికి కారణం ఇదే. బీబీసీ చేసిన పరిశోధనలో... ఈ లైంగిక వేధింపులు అఫ్గాన్ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క మంత్రిత్వ శాఖకో పరిమితం కాలేదని తేలింది.

'దీన్ని సంస్కృతిలో భాగంగా మార్చేస్తున్నారు'
ఒక చిన్న పార్క్ పక్కనున్న ఆఫీసులో నేను మరో మహిళను కలుసుకున్నాను. ఆమె తన వ్యధాభరిత గాథను నాతో పంచుకున్నారు. ఆమె ఒక ప్రభుత్వోద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమెను దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తిని కలవాల్సిందిగా సూచించారు. ఆ వ్యక్తి ఎప్పుడూ అధ్యక్షుడి పక్కనే ఉంటూ ప్రసార సాధనాల్లో కనిపిస్తుంటాడు. ఆయన తన ప్రైవేటు కార్యాలయానికి రావాలని ఆ మహిళకు సూచించాడు. అలా వెళ్లిన ఆమె ధ్రువపత్రాలను పరిశీలిస్తానని పిలిచి దగ్గరగా జరిగాడు.. 'ఇద్దరం కలిసి మద్యం తాగి ఆ తరువాత సెక్స్‌లో పాల్గొందామా అని ప్రతిపాదించాడు' అని ఆమె నాతో చెప్పారు.
''నా ముందున్నవి రెండే మార్గాలు. ఒకటి ఆయన చెప్పినట్లు చేయడం.. రెండోది ఉద్యోగం మీద ఆశను వదులుకోవడం. ఆయన చెప్పినట్లు చేస్తే అది అక్కడితో ఆగదు.. ఆయనలా మరింత మంది పురుషులు నాతో అలాగే చేస్తారు. అందుకే నేను ఆ ఉద్యోగాన్ని వదిలి వచ్చేశాను'' అన్నారామె.
ఇదంతా నాతో చెబుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
''ఇలాంటివాటిపై ఫిర్యాదు చేయడానికి న్యాయమూర్తి దగ్గరకో, పోలీసుల దగ్గరకో, న్యాయవాది దగ్గరకో వెళ్తే వారు కూడా తమతో శృంగారంలో పాల్గొనాలనే కోరుతారు. ఈ ధోరణి ఇక్కడ ఎక్కువైపోయింది. ఇక్కడ నీ చుట్టూ ఉన్న మగాళ్లంతా నీతో సెక్స్‌నే కోరుకుంటారు'' అన్నారామె.

ఆయన బయటపెట్టడంతో..
ఇలాంటి ఎందరో మహిళల కష్టాలు బయటకు రాకుండానే సమాధవుతున్నాయి. కానీ... అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ఒకప్పుడు సలహాదారుగా ఉండి అనంతరం రాజకీయ శత్రువుగా మారిన జనరల్ హబీబుల్లా అహ్మద్జీ ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి మే నెలలో ఈ వ్యవహారాలను బయటపెట్టారు.
సీనియర్ అధికారులు, నేతలు మహిళలను లోబరుచుకుంటున్నారని.. వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
దీనిపై అధ్యక్ష కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించగా మాట్లాడేందుకు నిరాకరించారు. బీబీసీ పంపిన ఈమెయిల్‌కు కూడా స్పందించలేదు.
అహ్మద్జీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అంతకుముందు చేసిన ప్రకటనలో వారు ఖండించారు.
నర్గీస్ నేహాన్ అనే మంత్రి ట్విటర్‌లో... ''కేబినెట్లో మహిళా మంత్రిగా చెబుతున్నాను. ఇవన్నీ నిరాధార ఆరోపణలు'' అంటూ ఖండించారు.
కానీ, అఫ్గానిస్తాన్‌లోని ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి ఫాజియా కూఫీ మాత్రం.. ప్రస్తుత ప్రభుత్వంలోని ఎందరిపైనో తనకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
''ఈ ప్రభుత్వం దీన్ని మహిళలకు సంబంధించిన అంశంగా చూడడం లేదు. కేవలం రాజకీయ అంశంగా చూస్తోంది' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, AFP
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఈ లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫ్గాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటార్నీజనరల్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ అధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.
అటార్నీ జనరల్ కార్యాలయ అధికార ప్రతినిధి జంషీద్ రసూలీని కాబూల్‌లోని ఆయన కార్యాలయంలో నేను కలిశాను. ఆయన సీటు వెనుక అధ్యక్షుడి చిత్రం గోడకు అమర్చి ఉంది.
'ప్రజలు మీ విచారణను ఎందుకు నమ్మాలి' అని ఆయన్ను అడిగాను. అందుకాయన.. ''అటార్నీ జనరల్ స్వతంత్రంగా వ్యవహరించే హక్కు రాజ్యాంగం కల్పించింది. మేం నిష్పాక్షికంగా విచారణ చేస్తాం. హక్కుల కార్యకర్తలు, ముస్లిం మతపెద్దలు, మానవ హక్కుల సంస్థలను కూడా విచారణలో భాగస్వాములు కావాలని కోరాం' అని ఆయన చెప్పారు.
మాతో మాట్లాడిన మహిళలంతా ఫిర్యాదు చేయడానికి కూడా తమకు భయమని, ప్రభుత్వ వ్యవస్థను తాము నమ్మబోమని చెప్పారని అన్నాను. అందుకాయన... ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతాం, వారికి రక్షణ కల్పిస్తామని చెప్పారు.
బాధిత మహిళ కష్టాలను అధ్యక్షుడు వినాలని.. దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని మాతో మాట్లాడిన మహిళల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.
''ప్రస్తుతానికి అది కలే కావొచ్చు కానీ, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది'' అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- నాయకుడెవరూ లేకపోయినా.. యాప్స్ ద్వారా భారీ ఉద్యమం ఎలా సాధ్యమైంది?
- క్రికెట్ వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్‌నే ఎందుకు ఎంచుకుంది...
- విరాట్ కోహ్లీ: "ఇదేం మైదానం, బౌండరీ అంత దగ్గరా..."
- ముస్లిం కుటుంబాల నుంచి పిల్లలను మేం వేరు చేయడం లేదు: చైనా
- యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో జైపూర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








