కరోనావైరస్: లాక్‌డౌన్ కాలంలో రొమాంటిక్ జీవితం సాగేది ఎలా?

రొమాంటిక్ జీవితం

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, విలియం పార్క్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

కరోనావైరస్ వ్యాప్తి సద్దుమణిగేందుకు ఎంత సమయం పడుతుందో ఇంకా తెలియదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇంటి గడప దాటకుండా ఉండాల్సిందే. ఇలా ఇళ్లకే పరిమితమవ్వడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి.

ఇప్పటివరకూ మన అందరివీ ఉరుకులు పరుగుల జీవితాలే. ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకునే తీరికే లేదు.

వయసు మీద పడ్డ తల్లిదండ్రులు... పిల్లలకు తమ కోసం సమయమే ఉండట్లేదని బాధపడేవారు. ఇప్పుడు వారి బాధను దూరం చేసే అవకాశం పిల్లలకు దొరికింది.

ఈ లాక్‌డౌన్‌లో ఇంకో పెద్ద సమస్య ఏంటంటే... ఇంట్లో ఎప్పుడూ అందరూ ఉంటారు. జంటలకు కాస్త ప్రైవేటు సమయం గడిపేందుకు అవకాశం చిక్కదు. కలిసి కాసేపు బయటకు ఎక్కడికైనా షికారుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఇలాంటి సమయాల్లో రొమాంటిక్‌ జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవడం ఎలా?

రొమాంటిక్ జీవితం

ఫొటో సోర్స్, GETTY IMAGES

స్పర్శ కోసం తహతహ

భాగస్వామికి దూరంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిది మరొక రకమైన బాధ.

టెక్నాలజీ సాయంతో స్కైప్ లాంటి వీడియో కాలింగ్ యాప్‌ల ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే వీలున్నా, చేతిలో చేయి వేసుకుని చెప్పుకునే ఊసుల స్థానాన్ని అది భర్తీ చేయలేదు.

పరిశోధకులు దీన్నే ‘స్కిన్ హంగర్’ అంటారు. స్పర్శ కోసం తహతహ అన్నమాట.

ఈ తహతహను సాంకేతికత కొంత మేర మాత్రమే తగ్గించగలుగుతుంది.

ఇదివరకు ఉత్తరాలు, పుస్తకాల తరంలో జనాలు ప్రేమ లేఖలు రాసుకునేవారు. ఆ లేఖలను పదిలంగా దాచుకునేవారు. ఆ కాగితం ముక్క మనిషి మనతో ఉన్నట్లు భావన కలిగించేది. అది లేఖల ద్వారా మాత్రమే సాధ్యం.

ఒంటరిగా ఉండటం కూడా మంచిదేనని నిపుణులు అంటున్నారు. కొన్నిసార్లు మనకు ఇష్టమైనవాళ్లకు దూరం కావడం బంధాల్లో మాధుర్యాన్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు.

ఈ సంక్షోభ సమయం అన్ని విషయాలను సంక్లిష్టంగా మార్చేసింది. ఉన్న చోటనే ఉంటూ పనులను, బంధాలను చూసుకోవడం కాస్త కష్టమే. ఆఫీసు పని ఎప్పుడు ముగుస్తుందో, బంధాలకు సమయం ఎప్పుడు మొదలవుతోందో స్పష్టత ఉండదు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

లోపాలను పట్టించుకోరు

దూరంగా ఉంటూ, ఒకరు లేని లోటును మరొకరు అనుభవించడం, వారి మధ్య బంధం ఎంత బలంగా ఉందనడానికి సంకేతమని నిపుణులు అంటున్నారు. కొన్ని రోజుల ఎడబాటు తర్వాత మళ్లీ కలిసినప్పుడు, మళ్లీ బంధంలో కొత్త తాజాదనం వస్తుంది. కొత్త ఉత్తేజం, ఉత్సాహంతో ఒకరినొకరు చూస్తారు. భాగస్వామిలోని చిన్న చిన్న లోపాలు, వారు చేసే చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోరు.

కలిసి ఉన్నప్పుడు ఒకరి ప్రవర్తన ఇంకొకరికి చికాకు తెప్పిస్తూ ఉంటుంది. వ్యక్తిగత సమయమే దొరకట్లేదని అనుకుంటుంటాం. ఎప్పుడూ కలిసే ఉండేవారికి, ఒకరికి ఒకరు ఎంత ముఖ్యమో ఒకసారి దూరమైతే గానీ తెలియదు.

ఒకరికొకరు దూరమవ్వడమే కాదు, దూరమైన తర్వాత కలవడం కూడా ఒక సవాలే. ఉద్యోగ విరమణ చేశాక ఇంట్లో ఉండే జంటలు ఇందుకు మంచి ఉదాహరణ.

ఉద్యోగం చేసేటప్పుడు మనం మన ఇష్టప్రకారం జీవిస్తాం. ఆఫీసు సమయంలో మన విషయాల్లో ఇంట్లో వాళ్ల జోక్యం ఉండదు.

కానీ, ఉద్యోగ విరమణ చేసి, పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాక పరిస్థితి వేరు. సమయం గడవడం కూడా కష్టమవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి.

కానీ, తెలివిగా వ్యవహరిస్తే ఈ సమస్యను లేకుండా చేసుకోవచ్చు.

రొమాంటిక్ జీవితం

ఫొటో సోర్స్, GETTY IMAGES

క్వారంటీన్ ప్రభావం

క్వారంటీన్ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. అసలు ఈ సమయం మన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

బోరు కొట్టడం, చికాకు, కోపం లాంటివి క్వారంటీన్‌లో పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా కాలం పాటు దీని ప్రభావం మనపై ఉంటుందని పేర్కొంటున్నాయి.

ప్రేమ బంధాల్లో ఉన్నవారిపై దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒకరికొకరు దూరమైనవారికి మరింత కష్టం.

అప్పటికే కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నవాళ్లైతే, క్వారంటీన్ సమయంలో మరింత ఒత్తిడికి గురికావొచ్చు.

దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతాయి. స్నేహితులు, సన్నిహితుల్లో ఎవరికైనా ఫోన్ చేసి తమ బాధను చెప్పుకోవడానికి బాధితులకు ఈ క్వారంటీన్ కారణంగా వీలు దొరక్కపోవచ్చు.

లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయి ఇళ్లలో ఉంటున్నవాళ్లు చాలా మంది ఉంటున్నారు. జీవితం ఎలా ముందుకు సాగుతుందన్న చింత వారికి మరింత చికాకు పుట్టిస్తూ ఉంటుంది.

రొమాంటిక్ జీవితం

ఫొటో సోర్స్, GETTY IMAGES

పెరుగుతున్న గృహ హింస

అమెరికాలో పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది.

భాగస్వాముల్లో ఇద్దరి ఉద్యోగాలూ పోయి, వాళ్లు ఒకే ఇంట్లో సమయమంతా గడపాల్సి వస్తే గృహ హింస చోటుచేసుకునే అవకాశాలు వంద శాతం పెరుగుతాయి.

లాక్‌డౌన్ సమయంలో చాలా దేశాల్లో గృహహింస కేసులు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

బ్రిటన్‌లో ఐదు రెట్లు, ఫ్రాన్స్‌లో మూడు రెట్లు పెరిగాయి. అమెరికా, చైనాల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అదే సమయంలో విడాకుల కోసం గానీ, ఇతరత్రా సలహాల కోసం గానీ వచ్చే అభ్యర్థనలు తగ్గిపోయాయని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో గృహ హింస బాధితుల కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నారు. భాగస్వామికి దూరంగా ఉండేలా వారికి హోటల్ గదులు అద్దెకు ఇస్తున్నారు.

గృహ హింస బాధితులు సాయం కోసం బయటకు రావాలని బ్రిటన్‌ ప్రభుత్వం సూచించింది.

ఈ లాక్‌డౌన్, ఐసోలేషన్‌ల తర్వాత సాధారణ జీవితం మొదలుపెట్టడం అంత సులభం కాదు. అందుకే, ఆంక్షలను ఎత్తివేశాక జీవితం ఎలా గడపాలనేదాని గురించి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి.

భాగస్వాములు ఒకరితో ఒకరు వీలైనంత ఎక్కువ సమయం తోడుగా గడపండి. గొడవలు లేకుండా జాగ్రత్త పడండి.

ఎప్పుడూ కలిసే ఉండటం, లేదా పూర్తిగా విడిపోయి ఉండటం మంచివి కాదని ఐసోలేషన్ మనకు పాఠాలు చెబుతోంది. రెండింటి వల్ల కొన్ని ప్రయోజనాలు, కొన్ని సమస్యలు ఉన్నాయి.

ఇది కష్టకాలమే. కానీ, త్వరలోనే దీన్ని మనం దాటేస్తాం. మన జీవితాలు, బంధాల్లో కొత్త ఆరంభాలు వస్తాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)