అనిక చేబ్రోలు: కరోనావైరస్‌‌కు మందు కనిపెట్టడంలో పనికొచ్చే కీలక అణువును కనుగొన్న 14 ఏళ్ల తెలుగమ్మాయి

అనిక చేబ్రోలు

ఫొటో సోర్స్, Courtesy of the Chebrolu family

ఫొటో క్యాప్షన్, అనిక చేబ్రోలు
    • రచయిత, ఎనలియా లియోరెంటే
    • హోదా, బీబీసీ న్యూస్ ముండో

తెలుగు బాలిక అనికా చేబ్రోలు.. అమెరికాలో టాప్ యంగ్ సైంటిస్ట్-2020 అవార్డుకు ఎంపికయ్యారు. మానవ కణాల్లోకి కరోనావైరస్ ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు తోడ్పడే ఓ అణువును కనుగొనడంతో ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు.

14ఏళ్ల అనిక కోవిడ్-19కు చికిత్స కనుగొనేందుకు కృషి చేస్తున్నారు.

టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఓ హైస్కూల్‌లో అనిక చదువుకుంటున్నారు. కరోనావైరస్‌కు అంటిపెట్టుకొని ఉంటూ.. మనుషులకు సంక్రమించకుండా అడ్డుకునే అణువును ఆమె కనిపెట్టారు.

ఈ ఆవిష్కరణకు గానూ ఆమెకు ‘‘ద 2020 యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌’’లో ‘‘టాప్ యంగ్ సైంటిస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్’’ టైటిల్ దక్కింది. దీనిలో భాగంగా మల్టీనేషనల్ కార్పొరేషన్ 3డీ ఆమెకు 25,000 డాలర్లను బహుమతిగా అందించనుంది.

ఏటా ఈ చాలెంజ్‌ను నిర్వహిస్తుంటారు. అమెరికాలో దీనికి మంచి పేరుంది. పది నుంచి 14ఏళ్ల వయసు పిల్లలు ఈ చాలెంజ్‌లో పాల్గొంటారు. తమ ఆవిష్కరణపై ఒక చిన్న వీడియోను వారు రూపొందిస్తారు.

ఇంతకీ ఆమె ఏం కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కీలకమైన ప్రోటీన్

కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్ పేరు సార్స్-కోవ్-2. దీని చుట్టూ కిరీటం లాంటి వలయం ఉంటుంది. అందుకే దీన్ని కరోనావైరస్ అని పిలుస్తుంటారు. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం.

ఈ చుట్టూ ఉండే వలయంలో మేకు ఆకారంలో ఒక ప్రోటీన్ (ప్రోటీన్ ఎస్) ఉంటుంది. ఇది మన శరీరంలోని కణాల గ్రాహకాలతో అనుసంధానమై వైరస్ సోకేలా చేస్తుంది.

అందుకే ఈ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకొని వ్యాక్సీన్‌ను కనిపెట్టేందుకు చాలా పరిశోధన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రోటీన్‌పై దాడి చేస్తే.. వైరస్ మన కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.

ప్రస్తుతం కీలకమైన ఈ ప్రోటీన్‌పైనే అనిక పరిశోధన చేసింది.

‘‘ఎస్ ప్రోటీన్‌తో అనుసంధానం కాగలిగే ఒక అణువును నేను కనుగొన్నాను. దీని సాయంతో వైరస్ స్పందనలు, పనితీరును మార్చవచ్చు’’అని బీబీసీకి అనిక తెలిపింది.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Sefa Karacan/Anadolu Agency via Getty Images

‘‘మానవ కణాలకు అంటి పెట్టుకోకుండా వైరస్‌ను అడ్డుకోవడంలో ఈ ఆవిష్కరణ చాలా కీలకమైనది. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా శరీరంలో ఇతర భాగాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. లేదా చికిత్సా మార్గాలూ కనిపెట్టొచ్చు’’అని ఆమె వివరించారు.

ఇన్-సిలికో కంప్యూటర్ సిమ్యులేషన్ విధానంలో ఆమె ఈ అణువును కనుగొన్నారు. దీని కోసం ఆమె కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లను ఉపయోగించారు.

కొన్ని లక్షల కొద్దీ అణువుల భౌతిక ధర్మాలు, జీవ క్రియా రేటు, పరిమాణం, అవి విడుదలచేసే పదార్థాలను సాఫ్ట్‌వేర్ సాయంతో ఆమె పరిశీలించారు.

అనంతరం సార్స్-కోవ్-2 వైరస్‌కు చెందిన ఎస్-ప్రోటీన్‌తో చక్కగా కలిసే అణువును ఆమె గుర్తించారు. కోవిడ్-19కు శక్తిమంతమైన ఔషధం తయారీలో దీన్ని ఉపయోగించొచ్చు.

అనిక చేబ్రోలు

ఫొటో సోర్స్, Courtesy Chebrolu family

కరోనావైరస్ మహమ్మారిగా మారకముందే ఫ్రిస్కోలోని ద నెల్సన్ స్కూల్‌లో అనిక తన పరిశోధనను మొదలుపెట్టారు.

‘‘కొన్ని సంవత్సరాల క్రితం, స్కూల్ ప్రాజెక్టులో భాగంగా 1918నాటి స్పానిష్ ఫ్లూ మహమ్మారి గురించి పరిశోధన చేశాను. అప్పుడే వైరస్‌లు, ఔషధాల ఆవిష్కరణల గురించి చాలా ఆసక్తి పెరిగింది’’అని ఆమె వివరించారు.

ఈ పరిశోధనలు చేస్తున్నప్పుడే ఇన్-సిలికో విధానం గురించి ఆమెకు తెలిసింది.

‘‘వ్యాధులపై పోరాడే ఔషధాల్లాంటి అణువులను కంప్యూటర్ విధానాల్లో కనిపెట్టవచ్చని తెలిసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది’’

కోవిడ్-19 వ్యాప్తి మొదలయ్యే సమయంలో.. ఇన్‌ఫ్ల్యూయెంజా వైరస్ హెమాగ్లూటిన్ ప్రోటీన్‌తో కలిసే అణువులను కనిపెట్టేందుకు తను ఇదే విధానాన్ని అనుసరించినట్లు అనిక వివరించింది.

‘‘మహమ్మారులు, వైరస్‌లు, ఔషధాల గురించి చాలా కాలం నుంచి పరిశోధన చేపడుతున్న సమయంలో ఒక మహమ్మారి విజృంభించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది’’.

కరోనావైరస్ వేగంగా విస్తరించడంతోపాటు ప్రపంచ దేశాలపై దీని ప్రభావాన్ని చూసిన ఆమె తన మార్గదర్శి, 3ఎం శాస్త్రవేత్త మెహ్‌ఫూజా అలీకి సాయం చేయాలని భావించారు. వెంటనే తన పరిశోధనను ఆమె సార్స్-కోవ్-2కు చెందిన ఎస్ ప్రోటీన్ వైపు మళ్లించారు.

అక్టోబరు 28నాటికి కోవిడ్-19తో 11 లక్షల మందికిపైనే మరణించారు. డిసెంబరు 2019లో చైనాలోని వూహాన్‌లో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది.

మృతుల విషయంలో మొదటి స్థానంలో అమెరికా ఉంది. అక్కడ 2,26,000 మందికిపైనే మరణించినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY

మరిన్ని పరిశోధనలు అవసరం

అనిక ఆవిష్కరణను శాస్త్రవేత్తలు స్వాగతిస్తున్నారు. అయితే కోవిడ్-19పై చికిత్సలో ఈ అణువు పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని వారు వివరించారు.

‘‘ఈ అణువును అనిక కనిపెట్టడం అద్భుతంగా అనిపిస్తోంది. నిజంగా ఆమె చేసిన కృషి ప్రశంసించదగినది. భవిష్యత్‌లో ఆమె మంచి శాస్త్రవేత్త అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు’’అని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైలమన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకురాలు ఏంజెలా రాస్‌మ్యూసెన్ తెలిపారు.

‘‘ఔషధ సమ్మేళనాలను గుర్తించడంలో ఈ విధానాలు చాలా బాగా పనిచేస్తాయి. అయితే, నిజంగా ప్రోటీన్ ఎస్‌తో ఈ అణువు జత కట్టగలదా? అని చెప్పడానికి ఎలాంటి పరిశోధన పూర్వక ఆధారాలులేవనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి’’.

‘‘వైరస్‌పై ఈ అణువు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయోగశాలల్లో పరిశోధనలు చేపట్టాలి’’అని ఏంజెలా వివరించారు.

మరోవైపు కోవిడ్-19కు చెందిన ప్రోటీన్ ఎస్‌తో ఈ అణువు జత కట్టగలదో లేదో తెలుసుకొనేందుకు ల్యాబొరేటరీ పరిశోధనలు తప్పనిసరని మరికొందరు నిపుణులు కూడా బీబీసీతో చెప్పారు.

అనిక చేబ్రోలు

ఫొటో సోర్స్, Courtesy Chebrolu family

ఫొటో క్యాప్షన్, అనిక భరతనాట్యం కూడా చేస్తుంది

భవిష్యత్ ప్రణాళికలు

అవార్డులో భాగంగా వచ్చే డబ్బులను పరిశోధనలకు పెట్టుబడిగా పెట్టాలని తను ప్రణాళికలు వేసుకున్నట్లు అనిక తెలిపింది.

‘‘ఈ 25,000 డాలర్లను నా పరిశోధన కోసం ఉపయోగిస్తా. అంతేకాదు నా స్వచ్ఛంద సంస్థ ‘‘అకాడమీఎయిడ్‌’’కూ కొంత కేటాయిస్తా. పిల్లలకు విద్యా సంబంధిత పరికరాలు ఇచ్చేందుకు. వారు కోరుకున్న కెరియర్‌లో ముందుకు వెళ్లేందుకు మా సంస్థ సహకరిస్తుంది’’

‘‘మిగతా డబ్బులను నా కాలేజీ చదువు కోసం దాచుకుంటా’’అని ఆమె వివరించింది.

సైన్స్‌పై అసక్తి ఉండే మిగతా పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా.. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలని సూచించింది.

‘‘ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండండి. ఆత్మ విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకండి. ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకండి. శక్తి వంచన లేకుండా కృషి చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు’’అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)