కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాచెల్ ష్రేయర్
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

కోవిడ్-19 పరీక్షల విషయంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం లేదన్న విమర్శలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యే.

అయితే, ఈ సమస్య కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. బ్రిటన్‌లోనూ అదే పరిస్థితి. దీంతో ఆదేశ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.

మరింత మందికి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించేందుకు సరికొత్త ప్రణాళికలను రచించింది.

అసలు ఇన్ని విమర్శలకు కారణమవుతున్న కోవిడ్-19 పరీక్ష ఎందుకంత ముఖ్యమైనది. ప్రస్తుతం యూకేలో పరిస్థితి ఎలా ఉంది? మిగిలిన దేశాలకు, బ్రిటన్‌కు ఉన్న తేడాలేంటి ?

అసలు ఏమిటీ పరీక్ష?

ఎవరికైనా కోవిడ్-19 సోకిందా..? లేదా..? అన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్ధేశం. అందులో భాగంగా ఓ వ్యక్తి గొంతు లేదా ముక్కు నుంచి కఫం నమూనాను తీసుకుంటారు.

ఆ నమూనాను ప్రయోగశాలకు పంపి వారిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా..? లేదా..? అన్న సంగతిని తెలుసుకుంటారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

నేను కూడా పరీక్షించుకోవచ్చా ?

ఇప్పటికీ ఈ పరిక్ష చాలా మందికి అందుబాటులో లేదు.

ప్రస్తుతానికి తీవ్రంగా జబ్బు పడి ఆస్పత్రిలో చేరేవారికి మాత్రమే ఈ పరీక్షను చేస్తున్నారు.

అంటే, దానర్థం చాలా మందికి ఆ లక్షణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం వారికి వైరస్ సోకిందా, లేదా అన్న సంగతిని శాస్త్రీయంగా తెలుసుకునే పరిస్థితి లేదు.

ప్రస్తుతం బ్రిటన్‌లో ఆ లక్షణాలున్న వైద్యులకు, నర్సులకు మాత్రమే ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పటికే వైరస్‌ సోకిందని తేలిన వ్యక్తి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ టెస్ట్ నిర్వహిస్తున్నారు. మిగిలిన ఆరోగ్య కార్యకర్తలకు త్వరలోనే నిర్వహిస్తారు.

ఇప్పటి వరకు బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న 5వేల మంది నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) సిబ్బందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హన్‌కాక్ తెలిపారు.

జనవరి నుంచి ఇప్పటి వరకు బ్రిటన్‌లో సుమారు 1.70 లక్షల మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు.

బ్రిటన్‌ మరింత మందికి పరీక్షలు ఎందుకు నిర్వహించలేక పోతోంది?

ఒకేసారి భారీ సంఖ్యలో జనానికి పరీక్షలు చేసేంత సామర్థ్యం ఈ దేశానికి లేదు.

“ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగశాలలు మా దగ్గర ఉన్నాయి. అయితే, అవి ఎక్కువ సంఖ్యలో లేవు. అదే పొరుగున ఉన్న జర్మనీ వంద ప్రయోగశాలలతో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధమయ్యింది.” అని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హన్‌కాక్ గురువారం మీడియాతో చెప్పారు.

ఏప్రిల్ నెల చివరి నాటికి రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది బ్రిటన్ ప్రభుత్వం. అయితే ఏప్రిల్ 2 నాటికి ఆ సంఖ్య కేవలం 10,200 మాత్రమే ఉండటం గమనించదగ్గ విషయం.

ప్రస్తుతం కరోనావైరస్ పరీక్షలు నిర్వహించేందుకు బ్రిటన్‌లో తగినన్ని కిట్లు అందుబాటులో లేవు. ఈ కారణంగానే పరిమిత సంఖ్యలో మాత్రమే పరీక్షలు నిర్వహించగల్గుతున్నామని కొందరు ఎన్‌హెచ్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

రీఏజెంట్స్ కొరత

వైరస్‌ జన్యు పదార్థాన్ని సేకరించడానికి రీఏజెంట్‌ను (పరీక్షకు ఉపయోగించే రసాయన మిశ్రమం) ఉపయోగిస్తారు. ఫలితంగా ఆ వైరస్‌కు సంబంధించి మరిన్ని విశేషాలను తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఆ రీఏజెంట్స్‌ కు ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన డిమాండ్ ఉంది. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించలేకపోవడానికి ప్రధాన కారణం అదే.

మొదట ఇంగ్లండ్‌ ప్రజారోగ్య విభాగం కేవలం తమ పరిధిలో ఉన్న 8 ప్రయోగశాలలను మాత్రమే కోవిడ్-19 పరీక్ష కోసం వినియోగిస్తూ వచ్చింది.

కానీ ప్రస్తుతం మరో40 లేబొరేటరీలకు కూడా అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 48 ప్రయోగశాలల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మరిన్ని ప్రైవేటు లేబొరేటరీలను, విశ్వవిద్యాలయాలను, పరిశోధన సంస్థలను కూడా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తామని బ్రిటన్ చెబుతోంది.

కోవిడ్-19 పరీక్షలను నిర్వహించేందుకు ఎన్‌హెచ్ఎస్ సిబ్బంది వాటిని వినియోగిస్తారు.

బ్రిటన్‌లో రోగ నిర్ధరణ సామర్ధ్యాన్ని పెంచేందుకు బూట్స్, అమెజాన్ వంటి వాణిజ్య భాగస్వాములతోనూ, అలాగే భారీ ఔషధ తయారీ సంస్థలతోనూ కలిసి పని చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

పరీక్ష నిర్వహించడం ఎందుకంత ముఖ్యం?

వైరస్‌ ఎవరికి సోకిందన్న పరీక్ష నిర్వహించడానికి రెండు కారణాలున్నాయి.

ప్రధానంగా పరీక్ష నిర్వహించడం వల్ల ఎంత మంది రోగులు ఉన్నారన్నసంగతిని గుర్తించి అందుకు తగినట్టు ఆ దేశ ఆరోగ్య విభాగం సిద్ధం కావచ్చు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లను కూడా సిద్ధం చేసుకోవచ్చు.

అంతేకాదు, పరీక్ష నిర్వహించడం వల్ల సామాజిక దూరం పాటించే విషయంలోనూ తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఉదాహరణకు, ఒక ప్రాంతంలో అధిక సంఖ్యలో వ్యక్తులకు ఈ వైరస్ ఉన్నట్టు గుర్తిస్తే... తక్షణం ఆ ప్రాంతాన్ని లాక్ డౌన్ చెయ్యడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించే అవకాశం ఉంటుంది.

అలాగే పరీక్షలను విస్తృతంగా నిర్వహించకపోవడం వల్ల చాలా మంది ఎటువంటి కారణం లేకుండానే స్వీయ నిర్బంధంలో ఉండాల్సి వస్తుంది.

ఓ వ్యక్తికి ఇప్పటికే వైరస్ సోకినట్టయితే వారిలో రోగ నిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు యాంటీబాడీ టెస్ట్ చేస్తారు.

గర్భ నిర్ధరణ పరీక్షలా ఒక్క చుక్క రక్తాన్ని నిర్దేశిత పరికరంపై ఉంచడం ద్వారా ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం 35 లక్షల మందికి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించింది. కానీ, ఆ పరీక్షల ఫలితాలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

అందుకు ప్రధాన కారణం ఆ పరీక్షలు ఏ మేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాకపోవడమే.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

మిగిలిన దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది ?

బ్రిటన్‌తో పోల్చితే ఈ విషయంలో దక్షిణ కొరియా మెరుగైన స్థితిలో ఉంది. కోవిడ్-19 విషయంలో చాలా వేగంగా స్పందించిన ఆ దేశం టెస్టింగ్ కిట్స్‌ భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి తగినన్ని అందుబాటులో ఉంచేందుకు తక్షణం అనుమతులు ఇచ్చింది.

బ్రిటన్‌తో పోల్చి చూసినప్పుడు అక్కడ అంతో ఇంతో తక్కువ జనాభా ఉన్నప్పటికీ రెట్టింపు సంఖ్యలో ప్రయోగశాలలు ఉన్నాయి. అలాగే వారానికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా యూకే కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ.

ఇక జర్మనీ బ్రిటన్‌ కన్నా మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో పరీక్షలను నిర్వహించింది.

మార్చి 27 నాటికి ప్రతి లక్ష మందిలో 1,096 మంది పౌరులకు పరీక్షలు నిర్వహించగా, ఏప్రిల్ 1 నాటికి యూకే ప్రతి లక్ష మందిలో కేవలం 346 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించగల్గింది.

ఇక ఇటలీ ప్రతి లక్ష మందిలో 895 మందికి, దక్షిణ కొరియా 842, అమెరికా 348, జపాన్‌ 27 మంది పౌరులకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)